అమరావతికే జై.. లోకేష్ సమక్షంలో తెలుగుదేశంలోకి మూడు రాజధానుల ఉద్యమకారులు!
posted on Apr 4, 2024 @ 12:26PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అత్యంత ప్రభావమంతమైన ఆంశం ఏదైనా ఉందంటే అది అమరావతి రాజధాని మాత్రమే. అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానుల నాటకానికి తెరలేపిన జగన్ పై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ప్రచారానికి వెడుతున్న వైసీపీ నేతలు, అభ్యర్థులను ఈ అంశంపై జనం నిలదీస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి రాష్ట్ర మంతటా ఉంది.
అటువంటిది.. రాజధాని ప్రాంతంలోనే గత నాలుగేళ్లుగా జగన్ మూడు రాజధానుల నాటకానికి మద్దతుగా రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సిందే అంటూ కొందరు టెంటు వేసుకుని ఉద్యమం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారి ఆందోళనకు కర్త, కర్మ, క్రయ అంతా వైసీపీయేనని విమర్శలున్నాయనుకోండి అది వేరే సంగతి. జగన్ కోసం, జగన్ చేత, జగనే నడిపిస్తున్న ఉద్యమంగా మూడు రాజధానుల ఉద్యమాన్ని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆ ఉద్యమ కారులు మందడం గ్రామంలో టెంటు వేసుకుని మరీ గత నాలుగేళ్లుగా మూడు రాజధానులు కావాలంటూ ఆందోళన చేస్తున్నారు. ఆ మందడం గ్రామం మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నారా లోకేష్ 5, 337 ఓట్ల తేడాతో అప్పటి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అయితే ఆ క్షణం నుంచీ నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్నే తన కార్యక్షేత్రంగా మలచుకుని అక్కడి జనంతో మమేకమయ్యారు. రానున్న ఎన్నికలలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన దూసుకుపోతున్నారు. తన ప్రచారంలో భాగంగా అన్ని వర్గాల ప్రజల మన్ననలూ పొందుతున్నారు. అందరినీ కలుపుకుని పోతూ ముందుకు సాగుతున్నారు. తటస్థులు సైతం ఆయనకు మద్దతుగా బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారు.
అటువంటి లోకేష్ కు మద్దతుగా మూడు రాజధానుల కోసం గత నాలుగేళ్లుగా ఉద్యమం కొనసాగిస్తున్న రైతులు తమ ఉద్యమాన్ని విరమించారు. మందడంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఏర్పాటు చేసిన టెంట్ ను తొలగించారు. ఉద్యమ నిర్వాహకులందరూ లోకేష్ సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. సరిగ్గా ఎన్నికల వేళ.. జగన్ కు జగన్ సర్కార్ కు మద్దతుగా గత నాలు గేళ్లుగా మూడు రాజధానులకు అనుకూలంగా ఆందోళన చేస్తున్న వారు.. తెలుగుదేశం గూటికి చేరి అమరావతికి జై కోట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత ఎన్నికలలో లోకేష్ కు ప్రత్యర్థిగా నిలిచి విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణా రెడ్డికి విజయావకాశాలు లేవని భావించిన జగన్ లోకేష్ ను ఓడించడమే లక్ష్యంగా నియోజకవర్గంలో బీసీ మహిళలను వైసీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. అయితే సర్వేలన్నీ భారీ మెజారిటీతో లోకేష్ విజయం సాధించడం ఖాయమని చెబుతున్నాయి. తాజాగా మూడు రాజధానులంటూ ఉద్యమించిన వారంతా ఆ ఉద్యమానికి తెర దించి లోకేష్ కు మద్దతుగా ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడంతో ఆక్కడ వైసీపీ పనైపోయిందనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.