నాడు సానుకూలం.. నేడు ప్రతికూలం.. జగన్ లో ఓటమి భయం
posted on Apr 4, 2024 @ 9:45AM
సరిగ్గా ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి అన్నీ మంచి శకునములే కనిపిస్తున్నాయి. విజయం వరించే దీవెనలే లభిస్తున్నాయి. 2019 ఎన్నికల వేళ పరిస్థితికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. నాటి ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ఒంటరిగా బరిలోకి దిగింది. ప్రధాని మోడీ సర్కార్ ఏపీ అభివృద్ధి విషయంలో ఇసుమంతైనా సహకారం అందించడం లేదని ఆరోపిస్తూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో తెలుగుదేశం రాష్ట్ర విభజన హామీలు సాధించడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైందంటూ అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఊరూ వాడా ఏకం చేసేలా ప్రచారం సాగించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తో చంద్రబాబు విభేదించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధీనంలో ఉన్న అప్పటి అధికార యంత్రాంగం అంతా చంద్రబాబు ఆపద్ధర్మ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేసింది. వైసీపీ ఫిర్యాదులపై ఆఘమేఘాల మీద స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం అప్పటి సీఎస్ ను విధుల నుంచి తప్పించి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నేరుగా నియమించింది. ఆయన అప్పట్లో వైసీపీకి ఎంత అనుకూలంగా వ్యవహరించారో అందరికీ తెలిసినదే. ఆయన సమన్ చేసి పిలిపించుకోవలసిన డీజీపీ వద్దకు స్వయంగా వెళ్లి మరీ దిశా నిర్దేశం చేశారంటే.. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏ స్థాయిలో కుట్ర జరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
అప్పట్లో మీడియా మొత్తం చంద్రబాబుకు అన్నీ అపశకునాలే ఎదురౌతున్నాయంటూ కథనాలు ప్రచురించింది. ప్రసారం చేసింది. ఏది ఏమైనా అప్పటి ఎన్నికలలో చంద్రబాబు ఎదుర్కొన్న పరిస్థితులన్నీ పద్మవ్యూహంలో ఇరుక్కున్న అభిమన్యుడిని తలపించాయి. దాంతో అప్పడు తెలుగుదేశం పరాజయం పాలై విపక్షానికి పరిమితం కావలసి వచ్చింది. ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి తెలుగుదేశం అనూహ్యం, అద్భుతం అనదగ్గరీతిలో పుంజుకుంది.
జగన్ అస్తవ్యస్థ విధానాలు, ప్రజా వ్యతిరేక పాలన, కక్ష సాధింపు ధోరణి కారణంగా ప్రజలలో తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత కనబడుతోంది. నాడు అంటే 2019 ఎన్నికల ముందు జగన్ కు కలిసి వచ్చిన ప్రతి అంశమూ ఇప్పుడు వ్యతిరేకంగా మారింది. నాను సానుభూతి వెల్లువెత్తడానికి కారణమైన సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య, విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కోడి కత్తి దాడి ఇప్పుడు జగన్ కు ప్రతికూలంగా మారడమే కాకుండా ఈ రెండు సంఘటనలూ కూడా నాడు చంద్రబాబును ప్రజలలో బదనాం చేయడానికి జగన్ చేత, జగన్ కొరకు జగనే చేయించారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఆ రెండు సంఘటనల దర్యాపు, కోర్టులలో జరిగిన, జరుగుతున్న విచారణలో వెల్లడౌతున్న అంశాలన్నీ జగన్ వైపే వేలెత్తి చూపుతున్నాయి. అలాగే స్వయంగా వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి, జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా వివేకా హత్య కేసులో జగన్ తీరునే తప్పుపడుతున్నారు. సునీత అయితే అసలు విలన్ జగనేనా అన్న అనుమానాలు వస్తున్నాయని మీడియా సమావేశంలోనే చెప్పేశారు. వివేహా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికే మళ్లీ కడప టికెట్ ఇచ్చి పక్కన పెట్టుకుని ప్రచారం చేయడంతో జగన్ పట్ల ప్రజలలో కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. వివేకా హంతకులను కాపాడేందుకు జగన్ ప్రయత్నిస్తున్నాడని జనం విశ్వసించడానికి దోహదకారిగా మారింది.
ఇక ఎన్నికల సమయంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఈసీ కొరడా ఝుళిపించడంతో ఆయన దిక్కు తోచని స్థితిలో పడినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మేమందరం సిద్దం అని చాటుతూ జగన్ ప్రారంభించిన బస్సుయాత్ర తుస్సు మనడమే కాకుండా, ఆ యాత్ర ప్రారంభించిన నాటి నుంచీ జగన్ కు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. జగన్ బస్సుయాత్ర కడప దాటిందో లేదో కడన లోక్ సభ బరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తానే పోటీలో ఉంటానని జగన్ సోదరి వైఎస్ షర్మిల ప్రకటించారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నేరుగా జగన్ ప్రభుత్వం మీద, ఆయన సొంత కుటుంబ సభ్యులను దూరం చేసిన తీరుపైనా నేరుగా విమర్శలు గుప్పిస్తూ.. ఇంత కాలం జగన్ కు అండగా ఉన్న కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును ఆయనకు దూరం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 111 అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించిన షర్మిల జగన్ కు గట్టి షాక్ ఇచ్చారు. దీంతో ఇంతకాలం వైసీపి వైపు ఉన్న కాంగ్రెస్ ఓటర్లు మళ్ళీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కాంగ్రెస్ పోటీ కచ్చితంగా జగన్ కంచుకోటలను బీటలు వారుస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మరోపక్క సునీత రెడ్డి తన తండ్రి హత్య కేసు గురించి సాక్షి మీడియాలోనే జగన్ తోముఖాముఖీకి సిద్ధమని విసిరిన సవాల్ ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తోందనడంలో సందేహం లేదు. ఆ సవాల్ ను స్వీకరించనూలేక, అలాగని సమాధానం చెప్పకుంటే సునీత ఆరోపిస్తున్నట్లుగా వైఎస్ వివేకా హంతకులతో తాను అంటకాగుతున్నట్లు జనం భావిస్తారన్న భయంతో జగన్ దిక్కు తోచని స్థితిలో పడ్డారని అంటున్నారు. అదే సమయంలో పుండుమీద కారం చల్లిన చందంగా జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఒక ఐజీ సహా ఐదుగురు ఎస్పీలు, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ వేటు వేసింది. వారందరినీ ఎన్నికల విధులకు దూరం చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవి శంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ తరములేశ్వర్ రెడ్డిలను సరిగ్గా ఎన్నికలకు ముందు విధుల నుంచి తప్పించడం జగన్ ప్రభుత్వానికి నిస్సందేహంగా మింగుడుపడని విషయమే.
చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ నుంచి లేదా కేంద్రంలోని మోడీ సర్కార్ నుంచి కోరుకున్నది కూడా ఇదే. జగన్ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఎన్నికలలో గెలవాలనే ప్రయత్నిస్తారన్న ఉద్దేశంతోనే దానికి చెక్ పెట్టేందుకే చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని పరిశీలకులు ఎప్పుడో విశ్లేషించారు. ఇప్పుడు ఆ విశ్లేషణలన్నీ సరైనవేనని తెలుతోంది. ఈ ఐదుగురు ఐపీఎస్ లు, ముగ్గురు ఐఏఎస్ లపై వేటుతోనే ఈసీ ఆగుతుందని భావించలేమని పరిశీలకులు అంటున్నారు. ఇది ప్రారంభం మాత్రమేననీ, రాష్ట్రంలో ఇంకా పలువురు అధికారులు ఇప్పటికీ జగన్ సేవలో తరిస్తున్నారనీ, వారిపై కూడా రానున్న రోజులలో వేటు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ అంటున్నారు. ఇక అన్నిటికీ మించి వాలంటీర్లను పింఛన్ పంపిణీ నుంచి దూరంగా ఉంచాలన్న ఈసీ నిర్ణయం వెనుక చంద్రబాబు ఉన్నారనీ, కుట్రతో వృద్ధులు, వికలాంగులకు పించన్లు అందకుండా చేస్తున్నారనీ ప్రచారం చేసిన వైసీపీకి సచివాలయ సిబ్బంది ద్వారా వారి ఇళ్ళవద్దే పింఛన్లు చెల్లించాలని ఈసీ ఆదేశించడం పెద్ద షాక్ అనడంలో సందేహం లేదు. ఈసీ ఈ నెల 6వ తేదీలోగా అందరికీ పింఛన్లు అందించాలని ఉత్తర్వులు జారీ చేయక తప్పని పరిస్థితిలో జగన్ సర్కార్ పడింది.
సచివాలయ సిబ్బంది మూడు రోజులలో అందరికీ పింఛన్లు చెల్లించగలిగితే, మరి ఇంతకాలం లక్షల మంది వాలంటీర్లను ఎందుకు ప్రభుత్వం ఎందుకు పోషించింది అన్న ప్రశ్న జనంలో ఉత్పన్నం అవుతుందన్న భయం కూడా జగన్ ను వెంటాడుతోంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి సానుకూలాంశాలుగా మారుతాయని జగన్ వణికి పోతున్నారు. గత ఎన్నికలలో కలిసి వచ్చిన అంశాలే ఇప్పుడు ప్రతికూలంగా మారి ముంచేస్తాయని ఆందోళనలో ఉన్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో ప్రతికూలంగా ఉన్న అంశాలన్నీ ఇప్పుడు సానుకూలంగా మారి విజయమే తరువాయి అన్న భరోసాను కల్పిస్తున్నాయి.