హైదరాబాదులో నెలరోజుల-భార్యలతో అరబ్బుల వ్యభిచారం
కొన్ని సం.ల క్రితం హైదరాబాద్ జంటనగరాలలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న నిరుపేద ముస్లిం తల్లితండ్రులు డబ్బుకు ఆశపడి తమ కుమార్తెలను అరబ్ షేకుల ఇచ్చి బలవంతపు పెళ్ళిళ్ళు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దానికి ఇంకా అడ్డుకట్ట పడిందో లేదో తెలియదు కానీ, ఇప్పుడు కొత్తగా ‘నెల రోజుల కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు’ పేరిట అరబ్ షేకులకు తమ కుమార్తెలను ఇచ్చి బలవంతపు పెళ్ళిళ్ళు చేస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఇస్లాం మతంలో వ్యభిచారం నేరం కనుక, అరబ్ షేకులు దానికి పరిష్కార మార్గంగా ఈ నెల రోజుల ఉత్తుత్తి పెళ్ళిళ్ళు పేరుతో తమ కామదాహం తీర్చుకొని గడువు పూర్తయిన తరువాత ఆ బాలికలకు మతాచారం ప్రకారం ‘తలాక్’ చెప్పేసి విమానం ఎక్కేస్తున్నారు. కానీ, వ్యభిచారం నేరమని భావించేవారు అదే పనిని మరో పద్దతిలో చేయడం, అందుకు నీతి నియమాలు పక్కన పెట్టడం ఏవిధంగా సమర్ధనీయం? హైదరాబాద్ జంట నగరాలలో ఇటువంటి వ్యవహారాలూ గత కొన్నేళ్లుగా గుట్టుగా సాగుతున్నట్లు సమాచారం.
అటువంటి బలవంతపు వ్యభిచారం నుండి తప్పించుకొన్న 17 ఏళ్ల నౌషీన్ తోబస్సుం అనే బాలికను హైదరాబాద్ మోఘల్పురా పోలీసులు రక్షించడంతో ఈ కాంట్రాక్ట్-పెళ్ళిళ్ళ పేరిట సాగుతున్నవ్యభిచార వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆమెను సూడాన్ దేశానికి చెందిన ఉసామా ఇబ్రహీం మొహమ్మద్ (44) అనే వ్యక్తికిచ్చి ఆమె తల్లి తండ్రులు ఇటీవలే ‘నెలరోజుల కాంట్రాక్ట్ పెళ్లి’ చేసారు. అందుకు ప్రతిఫలంగా అతను లక్ష రూపాయలు ఇవ్వగా, దానిలో ఆ బాలిక బంధువు ముంతాజ్ బేగం రూ.70,౦౦౦ బాలిక తల్లితండ్రులకిచ్చి, మిగిలిన దానిలో రూ.5,౦౦౦ పెళ్ళికి ‘తలాక్ నమాతో కూడిన అగ్రిమెంటు’ పేపరు తయారు చేసిన ఖాజీకి రూ 5,౦౦౦, ఆ అగ్రిమెంటు పేపర్లను ఉర్దూ బాషలో అనువాదo చేసిన వ్యక్తికి రూ. 5,౦౦౦ ఇచ్చి, మిగిలినది తానూ ఉంచుకొన్నట్లు ఆమె తెలియజేసింది.
ఆమెతో కలిసి సుడాన్ వ్యక్తి బసచేసిన హోటల్ కి వెళ్ళిన తోబసం అతను బలవంతం చేయబోతే తప్పించుకొని ఇంటికి పారిపోయి వచ్చేసింది. కానీ, అతను కూడా ఆమెను వెంబడిస్తూ ఇంటికి రావడంతో, ఆమె తల్లితండ్రులు తమ కుమార్తెకు నచ్చజెప్పి త్వరలో అతని వద్దకు పంపుతామని హామీ ఇచ్చి పంపేసారు. తన కన్నతల్లితండ్రులే తనకు రక్షణ కల్పించకపోగా అతనికి అప్పజెప్పే ప్రయత్నం చేయడంతో, తోబసుం వారి నుండి తప్పించుకొని పోలీసుల ఆశ్రయంలో జేరడంతో ఈ వ్యవహారం అంతా బయట పడింది.
ఈ నెల రోజుల పెళ్లిళ్లకు వ్యతిరేఖంగా చాలా కాలంగా పోరాడుతున్న హైదరాబాదు మహిళా మరియు శిశు సంక్షేమ సంఘానికి చెందిన షిరాజ్ ఆమినా ఖాన్ కూడా ఒక్క హైదరాబాద్ జంట నగరాలోనే ఇటువంటి నెలరోజుల కాంట్రాక్ట్ పెళ్లి-వ్యభిచార వ్యవహారాలూ నెలకి కనీసం 15 వరకు జరుగుతున్నట్లు తెలిపారు. ప్రతీనెలా హైదరాబాద్ జంట నగరాలోనే ఇటువంటివి చాలా జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని విజయ్ కుమార్ అనే స్థానిక పోలీసు అధికారి కూడా చెప్పడం విశేషం. ఇక దేశం మొత్తం మీద ఇంకెన్ని జరుగుతున్నాయో లెక్క లేదు, ఎవరికీ తెలియదు.
ఈ వ్యవహారంలో కొందరు దురాశాపరులయిన ఖాజీలు, బ్రోకర్లు చేతులు కలిపి పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. గల్ఫ్ దేశాలలో కన్యా శుల్కం పద్దతి అమలులో ఉన్నందున అక్కడ అబ్బాయిలకు వధువులు దొరకక పెళ్ళిళ్ళు కాకపోవడం దీనికి ఒక కారణం అయితే, పెళ్ళిళ్ళు అయినప్పటికీ, ధనవంతులయిన అరబ్ షేకులు తమ కామవాంఛలు తీర్చుకోవడానికి భారత్, పాక్ వంటి దేశాలలో పేదరికంలో మగ్గుతున్న ముస్లిం సమాజంపై కన్నేశారు.
ఈ వ్యవహారంలో అన్నెం పున్నెం ఎరుగని నిరుపేద ముస్లిం చిన్నారులు బలయిపోతుంటే, సమజానికి సరయిన మార్గ దర్శనం చేయవలసిన కొందరు ఖాజీలే ఆ పాపానికి ఒడిగట్టడం చాలా దారుణం. ఇక మరో దయనీయమయిన విషయం ఏమిటంటే, నెలరోజుల తరువాత తలాక్ ఇవ్వబడిన బాలిక కష్టాలు దానితో తీరకపోగా, అప్పటి నుండే నిజమయిన కష్టాలు మొదలవుతాయి. నెలరోజుల పెళ్లి పేరిట వ్యభిచార కూపంలోకి నెట్టబడిన ఆ బాలికల పేర్లు బ్రోకర్స్ లిస్టులో చేరిపోవడంతో నాటి నుండి ఆమె ఇటువంటి కాంట్రాక్ట్ పెళ్ళిళ్ళు చాలానే చేసుకోవలసి వస్తుంది.
మరో దయనీయమయిన విషయం ఏమిటంటే, ఆవిధంగా సంపాదించిన డబ్బుతో ఆమె తన కుటుంబ అవసరాలు ఒక పక్క తీర్చుతూనే, ఆ తరువాత కాలంలో ఎప్పుడయినా సాద్యపడితే తన ‘నిజమయిన పెళ్లికోసం’ కూడా ఆమె డబ్బు కూడబెట్టుకోవలసిఉంటుందని ఆ బాలిక పోలీసులకి తెలిపింది. హృదయ విదారకమయిన ఇటువంటి వ్యవహారాలను చూసి సభ్య సమాజం సిగ్గుతో తల దించుకోవాలి.
యావత్ ముస్లిం సమాజానికి తామే ప్రాతినిద్యం వహిస్తున్నామనే కొందరు నేతలు ఇటువంటి వాటిని అరికట్టడానికి ఏమి చేసారని ప్రశ్నించాల్సిన ఆవసరం ఉంది. ఈ ఊబిలో చిక్కుకొన్న, చిక్కుకొంటున్న అనేక మంది అభం శుభం తెలియని చిన్నారులను, బాలికలను కాపాడేందుకు వారేమి ప్రయత్నాలు చేస్తున్నారో కూడా సమాధానం చెప్పాల్సి ఉంది.