పాక్ బోనులో చిక్కుకొన్న ముషారఫ్
posted on Apr 18, 2013 @ 6:01PM
నాలుగేళ్ళ క్రితం దేశం విడిచి దుబాయ్ పారిపోయిన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తనపై కోర్టుల్లో అనేక కేసులున్నాయని తెలిసికూడా ఆ దేశంలో వచ్చేనెలలో జరగనున్నసాధారణ ఎన్నికలలో పాల్గొనేందుకు కొద్ది రోజుల క్రితమే పాకిస్తాన్ తిరిగి వచ్చారు. ఆయన దేశంలో అడుగుపెడితే చంపకుండా వదిలిపెట్టమని తాలిబాన్ ఉగ్రవాదులు తీవ్రహెచ్చరికలు జారీ చేశారు.
కానీ, అల్లకల్లోలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో, దైర్యం చేసి వచ్చి ఎన్నికలలో పోటీ చేస్తే అవలీలగా విజయం సాదించి తిరిగి పాకిస్తాన్ దేశాధ్యక్ష పదవి చేపట్టే అవకాశాలున్నట్లు భావించిన ముషారఫ్ దేశం కోసం అవసరమయితే ప్రాణ త్యాగాలకి కూడా వెనకాడనని భారీ డైలాగులు చెపుతూ బోనులోకి పులి ప్రవేశించినట్లు తిరిగి పాకిస్తాన్ లోకి అడుగుపెట్టారు.
ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశంలో న్యాయ వ్యవస్థపట్ల కనీస మర్యాద, గౌరవం చూపకపోగా, 2007 ఎమర్జన్సీ సమయంలో ఒకేసారి 60 మంది జడ్జీలను ఉద్యోగాల నుండి తొలగించడమే కాకుండా వారిలో చాలా మందిని ఆయన జైళ్ళలో నిర్బంధించారు కూడా. అందువల్ల అతనిపై న్యాయవ్యవస్థ సైతం కక్ష కట్టిందిప్పుడు.
ఆయన దేశంలో అడుగు పెట్టగానే, అందరూ ఊహించినట్లే, కోర్టులు ఆయనపై ఉన్న కేసులన్నిటినీ బయటకి తీసి అతని చుట్టూ ఉచ్చుబిగించడం మొదలుపెట్టాయి. మొదట హైకోర్టు ఆయనకి వారం రోజులు బెయిలు మంజూరు చేసింది. ఆ సమయంలో దేశంలో నాలుగు చోట్ల నుండి ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేయబోతే పోలింగ్ అధికారులు మూడు చోట్ల వివిధ కారణాలతో తిరస్కరించగా మరో చోట ఆయన నామినేషన్ వేయడానికి అనర్హుడని కోర్టు ప్రకటించడంతో అక్కడ కూడా ఆయన నామినేషన్ వేయలేకపోయారు.
ముషారఫ్ పాకిస్తాన్ లో అడుగు పెట్టిన మరునాటి నుండే జడ్జీలను నిర్బందించిన కేసు, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో పై హత్యా యత్నం కేసులలోకోర్టుల తిరుగుతున్న ఆయన ఈరోజు మళ్ళీ తన బెయిలు పొడిగింపు కోరుతూ ఇస్లామాబాద్ హైకోర్టుకు వచ్చినప్పుడు కోర్టు “ఆయన ఒక తప్పించుకొని పారిపోయిన ఖైదీ” అని, అటువంటి వ్యక్తికి బెయిలు మంజూరు చేయడం కుదరదని తేల్చి చెప్పి ఆయనని వెంటనే అరెస్ట్ చేయమని పోలీసులకి ఆదేశాలు ఇచ్చింది.
సాధారణంగా అటువంటప్పుడు ఎవరయినా పోలీసులకి లొంగిపోయి ఆ తరువాత పై కోర్టులో అప్పీలు చేసుకొంటారు. కానీ, కోర్టు అరెస్ట్ ఉత్తర్వులు జారీ చేయగానే ఆయన హడావుడిగా బయటకి వచ్చి, పోలీసులకు దొరక్కుండా తన అంగరక్షకుల సహాయంతో నగరం శివార్లలో ఉన్న చక్ షహాద్ అనే ప్రాంతంలో ఉన్న తన ఫాంహౌస్ కి తనకారులో పారిపోయారు.
ఆయన ఫాం హౌసులో ప్రవేశించిన కొద్దిసేపటికే పాకిస్తాన్ రెంజర్స్ ఆ ఇంటిని చుట్టుముట్టాయి. అయితే వారు ఇంతవరకు ముషారఫ్ ను అరెస్ట్ చేయలేదు. ప్రభుత్వం ఆయనను గృహనిర్బంధం చేయాలని ఆలోచిస్తునందున ఆయన అక్కడి నుండి తప్పించుకొని పారిపోకుండా ఈ ఏర్పాటు జరిగినట్లు సమాచారం.
ఇప్పుడు ఆయన పరిస్థితి మేకపిల్లను చూసి లొట్టలేసుకొంటూ వచ్చి బోనులో ఇరుకొన్న పులిలాగ ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలలో పోటీ చేయడం సంగతి మాటెలా ఉన్నా, అందరి కళ్ళు గప్పి మళ్ళీ దేశం నుండి పారిపోగలిగితే, బ్రతికుంటే బలిసాకు తినయినా బ్రతకొచ్చునని ఆయన కోరుకొంటున్నారు. కానీ,యావత్ దేశం ఆయనపై కక్ష కట్టి ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ సారి తప్పించుకోవడం కష్టమే.ఆయనకు కోర్టు ఉరి శిక్ష విధించినా ఆశ్చర్యం లేదు.తన నేతృత్వంలో భారత్ పై చేసిన కార్గిల్ దాడికి చాలా గర్వపడే ముష్కర్ ముషారఫ్ ఇప్పుడు తానూ తవ్వుకొన్న గోతిలో తానేపడి ప్రాణభయంతో విలవిలలాడుతున్నారు పాపం!