బీజేపీ పాలిట సైంధవుడిలా తయారయిన నితీష్ కుమార్
posted on Apr 17, 2013 @ 9:06PM
దేశంలో స్పష్టంగా కనిపిస్తున్న కాంగ్రెస్ వ్యతిరేఖతను, అదే సమయంలో తమ పార్టీ నాయకుడు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని చూసి రాబోయే ఎన్నికలలో ఆయనను ముందు పెట్టుకొని అవలీలగా విజయం సాదించి కేంద్రంలో అధికారం కైవసం చేసుకోవచ్చునని బీజేపీ ఆవేశపడిపోతుంటే, తమ ఎన్డీయే భాగస్వామి జేడీయు పార్టీ నాయకుడు మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైంధవుడిలా అడ్డుపడుతుండటంతో, తన నోటికాడ కూడు లాగేసుకొన్నట్లు బీజేపీ విలవిలలాడుతోంది.
ఇటు నరేంద్ర మోడీని వదులుకోలేక, అటు 40మంది లోక్ సభ సభ్యుల మద్దతు అందించే నితీష్ కుమార్ ను వదులుకోలేక దిక్కుతోచని స్థితిలో ఉంది. వచ్చేనెల కర్ణాటక శాసన సభ ఎన్నికలలో నరేంద్ర మోడీ ప్రధాన పాత్ర పోషించి తన సత్తా ఏమిటో దేశప్రజలకు మరో మారు చాటిచెపుతారని అందరూ ఊహిస్తున్న తరుణంలో, జేడీయు హెచ్చరికలకు జడిసిన బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ మీడియా ప్రశ్నకు బదులిస్తూ నరేంద్రమోడీ ఒక్క కర్ణాటకలోనే కాదు లోక్ సభ ఎన్నికలను పురస్కరించుకుని దేశమంతటా కూడా ప్రచారంలో
పాల్గొంటారని చెప్పారు. ఆయనకు కర్ణాటక ఎన్నికల బాధ్యతను పూర్తిగా అప్పగించేస్తున్నట్లు ప్రకటిస్తే, అది మిత్రపక్షమయిన జేడీయును ఇప్పటి నుంచే దూరం చేస్తుందనే భయంతోనే ఆవిధంగా చెప్పుకోవలసి వచ్చింది. అంటే కర్ణాటక ఎన్నికలు మోడీకి ప్రత్యేక బాధ్యత కాదని మిగిలిన ఎన్నికలలాగే ఇక్కడా ఆయన ప్రచారం చేస్తారని చెప్పుకోవలసిన దుస్థితిలో బీజేపీ ఉందిప్పుడు. అదేవిధంగా మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎప్పుడు ప్రకటిస్తారు అనే మీడియా ప్రశ్నలకు చిరుబుర్రులాడుతూ ‘నేను పార్టీ అధ్యక్షుడిని’ అంటూ అసందర్భం సమాధానం చెప్పారు.
ఇక మోడీ ప్రధాని అభ్యర్థిత్వానికి తీవ్ర అభ్యంతరం చెపుతున్న నితీష్ కుమార్ ఎన్డీయే నుంచి జారిపోకుండా కాపాడుకోవాలని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తుంటే, ఆయనకి ఎలాగయినా వలవేసి పట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పనిలో పనిగా నితీష్ కుమార్ ను తీవ్రంగా వ్యతిరేఖించే లాలూ ప్రసాద్ ను కూడా దువ్వుతోనే ఉంది.
తమను ఈ విధంగా ఇబ్బందిపెడుతున్నందున బీహార్ రాష్ట్రంలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించాలని అక్కడి స్థానిక నేతలు కోరుతున్నారు. కానీ, ఆయనతో తమకున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని బీజేపీ ఆ సాహసం చేయలేకపోతోంది. ఒకవేళ తాము మద్దతు ఉపసంహరించుకొంటే వెంటనే ఆయన ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి కాంగ్రెస్ కాసుకొని కూర్చొని ఉండటంకూడా దాని భయానికి మరోకారణం. ఏది ఏమయినప్పటికీ, బహుశః ఎన్నికల ప్రకటన వెలువడే వరకు బీజేపీలో ఈ సందిగ్ధత తప్పదు. అప్పటికయినా ఆ పార్టీ దైర్యంగా నిర్ణయం తీసుకొంటుందో లేదో చూడాలి.
ఇటువంటి సందిగ్ధ పరిస్థితికి కారణమయిన నరేంద్రమోడీకే ఈ సమస్య పరిష్కరించే బాధ్యత కూడా అప్పగించితే ఆయన తన సామర్ధ్యం నిరూపించుకొనే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయన ప్రధాని పదవికి అర్హుడో కాదో స్వయంగా నిరూపించుకోవచ్చును.