వలసలతో కాంగ్రెస్ ప్రక్షాళనం
కాంగ్రెస్ యంపీ మందా జగన్నాధం తెరాసా అధినేత కేసీఆర్ తో నిన్న 3గంటలు మంతనాలు చేశారు. ఆయన త్వరలో తెరాసాలో జేరబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆయనతో బాటు మరో ముగ్గురు కాంగ్రెస్ యంపీలు వివేక్, రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి మరికొందరు శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే వారెవరూ ఆ వార్తలను ఇంత వరకు ఖండించకపోవడంతో వారు తెరాసాలోకి మారడం దాదాపు ఖాయమయినట్లే అనుకోవచ్చును. ఈ వార్తల పట్ల కాంగ్రెస్ పార్టీలో కొంత కలవరం మొదలయినప్పటికీ, అది తాత్కాలికమే. త్వరలోనే వారందిరిపైనా కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పిస్తూ మీడియా ముందుకి రావడం కూడా మనం చూడబోతున్నాము.
రాహుల్ గాంధీ పార్టీలోకి కొత్తరక్తం ఎక్కించాలని ప్రయత్నిస్తున్నఈతరుణంలో, తెలంగాణా అంశంతో పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తున్నమందా, కేశవ్ రావు,గుత్తా, రాజయ్య వంటివారు తమంతట తామే పార్టీ వీడుతున్నపుడు దానిని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందే తప్ప అటువంటి వారికోసం ప్రాకులాడకపోవచ్చును. ఈ విషయంలో అందరికంటే ముందే జ్ఞానోదయం పొందిన మధు యాష్కీ, పొన్నం ప్రభాకర్ ఇద్దరూ కూడా బహుశః అందుకే అకస్మాత్తుగా అధిష్టానానికి అనుకూలంగా తమ తెలంగణా పల్లవిలో కూడా మార్పులు చేసుకొన్నారు. ఇక ముందు కూడా, కాంగ్రెస్ తమ పార్టీ నుండి తెరాసాలోకి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లదలచిన వారిని అడ్డుకొనే ప్రయత్నం చేయకపోవచ్చును.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ చెప్పినట్లు పార్టీను వీడుతున్నవారు తరువాత తీరికగా పశ్చాత్తాపపడతారని చెప్పిన మాటలు మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజమని చెప్పవచ్చును. ఎందుకంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోవారనుభవిస్తున్నస్వేచ్చాస్వాతంత్ర్యాలు వారికి మరే ఇతర పార్టీలోను లభించవని ఖచ్చితంగా చెప్పవచ్చును.
తెరాసలో చేరిన వారు కేసీఆర్ మరియు అతని కుటుంబ సభ్యులకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినవారు జగన్ మరియు అతని కుటుంబ సభ్యులకు సలాములు చేస్తూ, వారి ముందు చేతులుకట్టుకొని అణిమణిగిఉండక తప్పదు. కాంగ్రెస్ పార్టీలో అవధులు లేని స్వేచ్చా స్వాతంత్రాలు అనుభవించి, తమకంటూ ఒక ప్రత్యేక గౌరవం, ప్రత్యేక వర్గాలు కలిగిఉండే కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు సరికొత్త రాజకీయవ్యవస్థలో, సరి కొత్త వాతావరణంలో తప్పనిసరిగా ఇమడవలసి ఉంటుంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోచేరే కాంగ్రెస్ నాయకులు, వివిదపార్టీల నుండి ఆ పార్టీలోకి వచ్చిచేరుతున్నతమ రాజకీయ ప్రత్యర్దులతోనే చేతులు కలిపి ముందుకు సాగడం చాలా ఇబ్బందికరమయినప్పటికీ తప్పనిసరి అవుతుంది.
ఏమయినప్పటికీ ఈ వలసలవల్ల కాంగ్రెస్ పార్టీ తాత్కాలికంగా కొంచెం ఇబ్బందులు పడినప్పటికీ, ఆ పార్టీ అంతర్గతంగా ప్రక్షాళన అవుతుంది. అంతే కాకుండా రాష్ట్రంలో ఆ పార్టీ తనను తానూ పునర్నిర్ముంచుకొనే అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ కార్యక్రమం ఎంత త్వరగా జరిగితే ఆ పార్టీకి అంత మేలు చేస్తుంది.