డిల్లీ సమావేశంలో తేల్చేదేమిటి
posted on Apr 18, 2013 @ 12:41PM
ఈ రోజు డిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. సబితా ఇంద్రరెడ్డిపై సీబీఐ చార్జ్ షీటు దాఖలు చేసినందున ఆమెను పదవి నుండి తొలగించాలనే విషయంపై ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ కి తలొగ్గబోమని మొన్ననే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ ఆజాద్ స్పష్టం చేసినందున ఆమెను హోంమంత్రి పదవినుండి వేరే శాఖకు మార్చి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభ్యంతరం చెప్పకపోతే బొత్ససత్యనారాయణకు ఆ పదవి కట్టబెట్టవచ్చును.
ఈ సమావేశంలో కేవలం పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ పదవి మార్పు విషయమే ప్రధాన చర్చాంశం కావచ్చును. ఇప్పటికే మాజీ పీసీసి అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ డిల్లీకి ఆహ్వానించబడ్డారు గనుక, బొత్స స్థానంలో ఆయనను నియామకం ఖరారు చేసి, బొత్సకు తగిన ఉపాధి చూపడమే ప్రధాన అజెండాగా సమావేశం జరుగవచ్చును. తద్వారా, ఒకేసారి మూడు అంశాలు పరిష్కరించినట్లవుతుంది. బొత్సకు మంత్రి పదవి, సబితకు శాఖా మార్పు, పీసీసీ కొత్త అధ్యక్షుని నియామకం జరుగుతాయి. నేరారోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డిని వెనకేసుకు వస్తూనే, తనను దిక్కరిస్తున్నాడనే కారణంతో ఆరోగ్య శాఖామంత్రి డా. డీ.యల్.రవీంద్రారెడ్డిని పదవి నుండి తొలగించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరనున్నట్లు వార్తలు రావడం విశేషం.
ఇక పార్టీ నుండి తెరాసలోకి వలసల గురించి, జగన్ మోహన్ రెడ్డితో, అతని పార్టీతో ఏవిధంగా వ్యవహరించాలనే విషయం కూడా ఈ సమావేశంలో చర్చించవచ్చును. అదే విధంగా తిరుగుబాటు యం.యల్.యేలపై అనర్హత వేటు వేయాలా వద్దా? వేస్తే ఎప్పుడు వేయాలి? అనే అంశం కూడా వారి మద్య చర్చకు రావచ్చును. అయితే, కాంగ్రెస్ పధ్ధతి ప్రకారం ముఖ్యమయిన అన్ని విషయాల గురించి కేవలం చర్చలు మాత్రమే చేసి నిర్ణయాలు మాత్రం తీసుకోకపోవచ్చును.