పులిని చూసి వాతలు పెట్టుకోనేల
posted on Oct 27, 2013 @ 12:28PM
ఏపీ ఎన్జీవోల సభకు దీటుగా సమైఖ్య శంఖారావం సభను నిర్వహించి, సీమాంద్రాలో కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల కంటే సమైక్య రేసులో తామే ముందున్నామని చాటుకోవాలనే యావే తప్ప, సమైక్యాంధ్ర పట్ల ఏమాత్రం చిత్తశుద్దిలేని వైకాపా చాలా సాంప్రదాయబద్ధంగా ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని సభను ఆరంభించింది. అయితే మధ్యలో వందేమాతరం గీతం కూడా అందుకొంటామని, తెలుగుజాతిని విడగొడుతున్నవారిని బంగాళాఖాతంలోకి విసిరేస్తామని భీకర ప్రతిజ్ఞలు కూడా చేసారు.
ఇంతకీ మధ్యలో వందేమాతరం గీతం అందుకొంటామని హెచ్చరించవలసిన అవసరంమేమిటో వారికే తెలియాలి. బహుశః వందేమాతరం పాడటానికి తమకు అభ్యంతరం లేదని చెప్పి బీజేపీ వాళ్ళని మంచి ప్రయత్నం ఉందేమో మరి. ఎందుకంటే దేశంలో కొందరు నేతలు వందేమాతరం పాడేందుకు బాహాటంగానే నిరాకరిస్తున్నందున వారిపై బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
కానీ వైకాపా మహోదయులు వందేమాతరం గేయాన్నిసభలో ఆలపించకుండా దాని పరువు నిలిపారు. ఎందుకంటే సభ ముగింపులో వాళ్ళు జనగణమణ జాతీయ గీతాన్ని ఎంత కూనీ చేసారో చూస్తే ఎవరికయినా హృదయం కలుక్కుమానక మానదు. అసలు జాతీయ గీతాన్నిపాడకపోయినా ఎవరూ అడిగేవారు ఉండరు. కానీ, పులిని చూసి నక్క వాతలు పెట్టుకొన్నట్లు ఏపీ ఎన్జీవోలు తమ ‘సేవ్ ఆంద్రప్రదేశ్’ సభని జనగణమణ జాతీయ గీతాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో ఆలపించి ముగించి అందరి మన్ననలు పొందడంతో, పోరాడితే పోయేదేముంది విభజన చిచ్చుతప్ప అని జనాలను ఊదరగొట్టినట్లుగానే పాడితే పోయేదేముంది పరువు తప్పఅని తప్పుల తడకలతో జనగణమణ జాతీయ గీతాన్నిపాడి ‘మమ’ అనిపించేసారు.
చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా అని పెద్దలు ఊరకనే అనలేదు. అది అక్షరాల వైకాపాకి వర్తిస్తుంది. జాతీయ గీతాన్నితప్పుగా, ఆశ్రద్దగా పాడినందుకు తెలంగాణా న్యాయవాదుల జేఏసీ పోలీసులకి పిర్యాదు చేసింది. అయితే కొమ్ములు తిరిగిన సీబీఐ వాళ్ళే జగన్ కాలిగోరు కూడా తాకలేకపోయింది పోలీసులు మాత్రం ఏమి చేయగలరు పాపం!