నీతి నిజాయితీలకు కేరాఫ్ ఎడ్రస్
posted on Oct 26, 2013 @ 10:33PM
తన వెనుక పది చార్జ్ షీట్స్ పోగేసుకొని, ప్రతీ చార్జ్ షీట్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దేశంలో తనంత నిజాయితీ పరుడు, తన పార్టీ అంత నీతిగల పార్టీ మరొకటి లేదనడం నిజంగా గొప్ప విషయమే. తను ఇప్పుడు దూషిస్తున్నఇతర పార్టీలలో నేతలు వైకాపాలోకి రాగానే ఒక్కసారిగా మంచి వారెలా అయిపోతారనే ధర్మ సందేహం ఉంది. ఉదాహరణకు దాడి వీర భద్రరావు, మైసూరా రెడ్డి వంటి వారు ఒకప్పుడు ఆయనని అయన పార్టీని దొంగల మూటా అని అభివర్ణించినవారే. మరి అటువంటి వారు మళ్ళీ అదే దొంగల ముటాలో చేరి ఇప్పుడు తమ పాత పార్టీలను దూషించడం చూస్తే ఎవరెటువంటి వారో అర్ధం అవుతూనే ఉంది. మరి అటువంటి వారిని పోగేసుకొని తమ పార్టీ అంత గొప్ప నీతి నిజాయితీ గల పార్టీ మరొకటి లేదని, మిగిలిన పార్టీలు నమ్మదగినవి కావని జగన్ కాండక్ట్ సర్టిఫికెట్స్ జారీ చేయడం విడ్డూరం. అలాగని రేపు అదే పార్టీల నుండి వచ్చేనేతలను జేర్చుకోకుండా ఉంటారా? అంటే అదీ తప్పదు.
నిన్న గాక మొన్న రాజకీయాలలోకి వచ్చిన ఆయన, తన బ్యాక్ గ్రౌండ్ సంగతి మరిచి ఎదుట పార్టీలను నేతలను నిందించడం విశేషం. ఇక సోనియాగాంధీ తన కొడుకుని ప్రధాని చేయాలనే తాపత్రయంతోనే రాష్ట్ర విభజన చేస్తోందని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి, మరి తను రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే ఆరాటంతోనే ఈ సమైక్యరాగం ఆలపిస్తున్నసంగతి మరిచిపోయినట్లున్నారు. సోనియాగాంధీ తన కొడుకుని ప్రధానిని చేయాలనుకొంటే, విజయమ్మ తన కొడుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయలనుకొంటున్న విషయం నిజం కాదా?
ఇక కాంగ్రెస్ అధిష్టానానికి వైకాపాకి మధ్య రహస్య అవగాహన ఉందన్న ఆరోపణలను ఎదుర్కోవడానికే సోనియాను విమర్శించారనుకొన్నా, రాష్ట్ర విభజనకి ముఖ్యకారకుడయిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ప్రసక్తి ఎక్కడా తేకుండా జాగ్రత్తపడుతూ, చంద్రబాబుపైనే విమర్శలు ఎందుకు గుప్పిస్తున్నట్లు? అంటే కేసీఆర్ చేసిన ఉద్యమాల వలన గాక కేవలం చంద్రబాబు ఇచ్చిన లేఖ వల్లనే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆయన ఉద్దేశ్యమా? అలాగయితే వైకాపా ఇచ్చిన లేఖ సంగతేమిటి?
కేసీఆర్కి తెలంగాణా, జగన్కి ఆంధ్రా పంపకాలు అయినందున, సీమాంద్రాలో తనకి పోటీగా ఉన్న చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు తప్ప జగన్ ఎక్కడా తన ప్రసంగంలో కేసీఆర్ జోలికి పోలేదు. ఇదే కాంగ్రెస్-వైకాపా-తెరాసల మధ్య ఉన్నబంధం గురించి వివరిస్తోంది.మరి వెనక ఇంత కధ పెట్టుకొని నీతి నిజాయితీలకు తను, తన పార్టీయే కేరాఫ్ అడ్రెస్స్ అంటే ఎలా?