ఆరు నెలలు గరిడి సాము నేర్చుకొని
posted on Oct 26, 2013 @ 9:27PM
ఆరు నెలలు గరిడి సాము నేర్చుకొని మూల ముక్కుతున్న ముసలమ్మని ఒకే ఒక్క పెట్టుతో పడగొట్టేసాన్ననాడుట వెనకటికెవడో! అలాగే ఉంది వైకాపా నిర్వహించిన సమైక్యశంఖారావం సభ. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్వహించిన అంత భారీ సభలో ఇంతవరకు రోజూ చెపుతున్న విషయాలే తప్ప కొత్తగా చెప్పిన ముక్క ఒక్కటి లేదు. పైగా అందరూ చెప్పిందే చెప్పడం వలన కంఠ శోష, ఆయాసం తప్పపార్టీకి కానీ సమైక్య ఉద్యమానికి గానీ కొత్తగా ఒరిగిందేమీ లేదు.
అసలు అటువంటి సభ నిర్వహిస్తున్నపుడు దాని ద్వారా ఒక బలమయిన సందేశం, ఒక బలమయిన నిర్ణయం లేదా కనీసం పార్టీ శ్రేణులకు సరయిన దిశా నిర్దేశ్యం అయినా చేసి ఉంటే సభ ప్రయోజనం దక్కేది. కానీ సభలో ప్రసంగించిన వక్తలు ఒకరో ఇద్దరో తప్ప మిగిలినవారు ఏదో అందరూ, రోజూ జనాలందరూ మాట్లాడుకొనే ఆ నాలుగు ముక్కలే మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తూ ఒక మంచి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకొన్నారు. ఇది సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న సభ అని చెప్పుకొంటూనే వక్తలు ‘జగన్మోహన్ రెడ్డి భావి ముఖ్యమంత్రి,’ ‘రాష్ట్రాన్ని కాపాడాలంటే జగనే ముఖ్యమంత్రి అవ్వాలి’ అంటూ అప్రస్తుత ప్రసంగం చేస్తూ సమైక్యంగా జగన్ భజనలో తరించిపోయారు.
ఇక జగన్ ప్రసంగం కూడా చాలా నాటకీయంగా, కృతకంగా సాగింది. ఏదయినా ఒక ముఖ్య విషయాన్ని చెప్పదలచుకొంటే దానిని జనాల మనసులకు హత్తుకొనేలా చెప్పదానికి కొంత నాటకీయత జోడించవచ్చు. గతంలో స్వర్గీయ యన్టీఆర్ కూడా చాలా నాటకీయంగా ప్రసంగించేవారు. కానీ బాషాపై ఆయనకున్న పట్టు, ఆయన మాటలలో విరుపులు అవీ చూసి జనాలు మంత్రం ముగ్దులయ్యేవారు. అదేవిధంగా ఇప్పుడు నరేంద్ర మోడీ తన ప్రసంగాలతో ప్రజలని ఏవిధంగా ఉర్రూతలూగిస్తున్నారో అందరూ చూస్తూనే ఉన్నారు.
జగన్ ఆ స్థాయిలో ప్రసంగించలేకపోవచ్చును. కానీ సభలో ఏవిధంగా ప్రసంగం సాగాలనే విషయమయినా జగన్ ఆయనను చూసి నేర్చుకొని ఉంటే సభలు రక్తి కట్టే అవకాశం ఉంటుంది.గానీ జగన్ అసలు విషయన్ని వదిలేసి ‘ప్రశ్నిస్తున్నాను’, ‘అడగదలుచుకొన్నాను’, ‘చ్చాలా’ బాధ కలుగుతోంది’ వంటివి ఆయన ప్రసంగంలో మరీ ఎక్కువయిపోవడంతో అవి అసలు విషయాన్నీ పూర్తిగా మింగేసాయి. ఆయన ప్రస్తావించిన నీటి సమస్యలు, విద్యాఉద్యోగ సమస్యల వంటి వాటిని ఆయన క్రుతకమయిన బాష, నాటకీయత మింగేసింది. దానికి పార్టీ పోగేసుకువచ్చిన జనాలు చప్పట్లు ఈలలు అని స్వంత డబ్బాకొట్టుకోవడం మరో ఎక్స్ ట్రా.
ఇక ఊళ్ళో ఉన్నఅక్కలు, చెల్లెళ్ళూ,అవ్వలు అంటూ సాగదీస్తూ చేంతాడంత తెలుగు చుట్టరికాల గురించి చెప్పి వారికి పేరుపేరునా దండాలు చెప్పుకొంటూ జనాల చేత చప్పట్లు కొట్టించుకొనే ఆనవాయితీ కూడా ఇక్కడ ఆయన తూచా తప్పకుండా చక్కగా పాటించారు. బలమయిన మీడియాను చేతిలో ఉంచుకొన్న ఆయన కనీసం వారి సలహాలు తీసుకొని ఉంటే ఆయన ప్రసంగం మరీ ఇంత పేలవంగా ఉండేది కాదని చెప్పవచ్చును.