నేరం మాది కాదు ప్రజలదే

      సమైక్యాంధ్ర ఉద్యమాల నుండి ప్రజలు వెనక్కి తగ్గారు. ఉద్యోగులు చేత చాకచక్యంగా సమ్మెవిరమింపజేయడం కూడా పూర్తయ్యింది. అందుకు దిగ్విజయ్ సింగ్ కృతజ్ఞతలు చెప్పారు కూడా. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా సమైక్యాంధ్ర కాడి పక్కన బెట్టినట్లే మాట్లాడుతున్నారు. కావాలంటే రాష్ట్ర విభజన కోసం ఏర్పాటు చేసిన కేంద్రమంత్రుల బృందంతో ఉద్యోగులకు సమావేశం కూడా ఏర్పాటు చేయగలనని ఆయన హామీ కూడా ఇచ్చారు. ఇంతవరకు సమైక్యాంధ్ర కోసం ఎంతో పోరాటం చేసి ఎంతో అలసిపోయినప్పటికీ పురందేశ్వరి వంటి కొందరు కాంగ్రెస్ నేతలు, ప్రజలు యదార్ధ పరిస్థితులను గ్రహించాలని ఒక ఉచిత సలహా ఇవ్వడమే కాకుండా, వారికి మంచి ప్యాకేజీ సాధించేందుకు మరో కొత్త పోరాటానికి నడుం బిగిస్తున్నారు.     ఇక, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్ర విభజన అంశం కారణంగా రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో బాగా దెబ్బ తిన్నకాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి, రెండు ప్రాంతాల నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఎన్నికలు వచ్చి మీద పడేలోగా జనాలని మరిపించి వారి నుండి ఓట్లు రాబట్టుకోవడం ఎలాగో ఆలోచించెందుకే ఈ సమావేశాలని ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పనవసరం లేదు. మరో పక్క తెలంగాణా రాష్ట్రం సాదించినందుకు సంబరాలు చేసుకొంటున్నటీ-కాంగ్రెస్ నేతలు సీమాంధ్రకి మంచి ప్యాకేజి వచ్చేలా తాము కూడా హైకమాండుకి గట్టిగా రికమెండ్ చేస్తామని అభయ హస్తం ఇస్తున్నారు. అదేవిధంగా సీమంధ్ర ప్రజలకి అన్నివిధాల అండగా నిలుస్తామని హామీ కూడా ఇస్తున్నారు. మరో పక్క డిల్లీలో కేంద్రమంత్రుల బృందం ఈ రోజు రెండో సమావేశం నిర్వహిస్తూ రాష్ట్రవిభజన ప్రక్రియని ముందుకు తీసుకు వెళుతోంది. అంటే కాంగ్రెస్ అధిష్టానం వ్రాసుకొన్న స్క్రిప్ట్ ప్రకారం అన్నీ సవ్యంగానే జరిగిపోతున్నాయని అర్ధం అవుతోంది. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రితో సహా నేతలందరూ తమకు అధిష్టానం కేటాయించిన పాత్రలు అద్భుతంగా పోషించి ఈ సమైక్యడ్రామాను మంచి రక్తి కట్టించారు. కానీ వారి పాత్రలను అర్ధం చేసుకోవడంలో ప్రజలే అపోహలకు లోనయ్యి పాపం! ఏ పాపం ఎరుగని కాంగ్రెస్ నేతలను నిందిస్తున్నారు. ప్రజలకెందుకు ఆ అవకాశం ఈయలని లగడపాటి వంటి వారు తమని తామే తిట్టుకొంటూ అదేనోటితో పార్టీని, పార్టీలో కొందరు నేతలని కూడా తిడుతున్నారు. సీమంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రజలలో రాజకీయ చైతన్యం తీసుకురావాలని చాలా ప్రయత్నాలు చేసినా, ప్రజలు చైతన్య వంతులుగాకపోతే పాపం! వారు మాత్రం ఏమిచేయగలరు? తప్పు ప్రజలదే తప్ప వారిది కాదు.   

శ్రీ రావురి భరద్వాజ గారు మృతి

    తెలుగు సాహితీ జగత్తులో కేవలం స్వయంకృషితో, ప్రతిభా పాటవాలతో ఎదిగిన  గొప్ప రచయిత, జ్ఞానపీట్‌ అవార్డు గ్రహీత శ్రీ రావురి భరద్వాజ గారు ఈ రోజు(18.10.13) మృతి చెందారు. రావురి భరద్వాజ గారు జులై 5, 1925నాడు శ్రీమతి మల్లికాంబ, శ్రీ కోటయ్య దంపతులకు జన్మించారు. శ్రీ రావూరిగారు తాను అనుభవించిన కష్టాలను, కన్నీళ్లను, అవమానాలను, అభిశంసలను, నిరాదరణలను, అనుభవాలను,  అనుభూతులను,కథా వస్తువులుగా మలుచుకున్నారు. జీవితమంతా, తెలుసుకుంటూ,తెలుసుకుంటూ ప్రయాణం సాగించాలి అనే భరద్వాజగారు అలానే ప్రయాణం సాగించారు. భరద్వాజగారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ఆయన ఆత్మకు శాంతి చెకురాలని కోరుకుంటోంది తెలుగువన్‌.కామ్‌.

మళ్ళీ కాంగ్రెస్, తెరాసల మధ్య యుద్ధం మొదలవుతుందా

  తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకి కాంగ్రెస్ పార్టీ అంగీకరించిన వెంటనే మొట్ట మొదట తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం గురించి తీవ్ర ప్రయత్నాలు చేసారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ అందుకు చాల కృషిచేసారు. అయితే అవి ఫలించకపోవడంతో ఆ తరువాత రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తుల స్టోరీ కొన్ని రోజులు నడిచింది. కానీ దానికి ఇంకా చాలా సమయం ఉండటంతో ఆ ప్రయత్నాలు కూడా పక్కనపడేసారు.   తెలంగాణా సాదించిన ఘనత తమదంటే తమదని ఆ రెండు పార్టీలు చాటింపు వేసుకొంటూ, రానున్న ఎన్నికలలో ప్రజల నుండి ఓట్లు పిండుకోవాలని రెండు పార్టీలు చాలా ఆరాటపడుతున్నాయి. అయితే ఇంత కాలం టీ-కాంగ్రెస్ నేతలు చేతులు ముడుచుకొని కూర్చోవడంతో ఇదే అదునుగా తెరాస నేతలు ఈ ఘనత అంతా తమకే చెందుతుందని గట్టిగా చెప్పుకోగలిగారు. ఇటీవల ఒక ప్రముఖ సంస్థ నిర్వహించి తాజా సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినట్లయితే తెరాస పూర్తి మెజార్టీ సాధిస్తుందని తేల్చి చెప్పింది.   ఈ సర్వే నివేదికపై తెరాస నేత ఈటెల రాజేందర్ స్పందిస్తూ, తెలంగాణాలో మొట్టమొదట తమ పార్టీయే ప్రభుత్వం ఏర్పరచబోతోందని, తమది భౌగోళిక తెలంగాణ ఎజెండా కాదని, తెలంగాణ పునర్నిర్మాణ ఎజెండా అని అన్నారు.   ఇది సహజంగానే టీ-కాంగ్రెస్ నేతలలోగుబులు పుట్టించింది. ఇంకా దీమాగా చేతులు ముడుచుకొని కూర్చొంటే ఇక ఆ తరువాత చేతులు కాలేక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఉండదని గ్రహించి ఈ రోజు నుండి పదిరోజుల పాటు పది తెలంగాణా జిల్లాలో జైత్రయాత్రలు మొదలుపెట్టారు. తెలంగాణా ఏర్పాటులో ఇక వెనకడుగు వేసే ఆలోచన లేదని కాంగ్రెస్ అధిష్టానం కూడా ధృడసంకల్పంతో ఉన్నందున వారి జైత్ర యాత్రకు అనుమతిచ్చేసింది.   ఈ రోజు నిజామాబాద్ జిల్లా భోధన్ పట్టణంలో జరిగిన కాంగ్రెస్ జైత్రయాత్రలో దాదాపు టీ-కాంగ్రెస్ నేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీ.శ్రీనివాస్ తెరాస నేతలను ఉద్దేశ్యించి కొన్ని ఆసక్తికరమయిన వ్యాక్యాలు చేసారు.   “తెలంగాణాలో చిన్నచిన్న పార్టీలు కూడా తామే తెలంగాణా రాష్ట్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయని చెపుతున్నాయి. కానీ తెలంగాణా రాష్ట్రం సాధించిన కాంగ్రెస్ పార్టీయే ఆ కీలక బాధ్యత కూడా చేపడుతుంది. ఆ సత్తా కేవలం జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకే ఉంది.” రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మ్రోగించి మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పరిచి, తెలంగాణా పునర్నిర్మాణం చేపడుతుందని ఆయన చెప్పకనే చెప్పారు.   మరి తెరాసను విలీనం చేసుకోవాలని, లేకపోతే కనీసం ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెరాస అవసరం లేకుండానే స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకొంటామని చెప్పడం చూస్తే, మళ్ళీ కేసీఆర్ కాంగ్రెస్ నేతలని తిట్లు లంఖించుకోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఇంతవరకు తెలంగాణా ఇస్తున్నందుకు సోనియాగాంధీని పొగుడుతున్న తెరాస నేతలు, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీయే మొదట ప్రభుత్వం ఏర్పాటుచేయాలని సిద్దపడితే ఇక మళ్ళీ తెరాస నేతలు తమ తిట్ల పురాణం తెరుస్తారేమో.

చంద్రబాబు ఎంట్రీతో ట్వీటర్ లో రాజకీయ యుద్ధం షురూ

  ఇంతవరకు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ట్వీటర్ లో తమ రాజకీయ ప్రత్యర్ధులపై మంచి సమయ స్పూర్తితో ఘాటయిన విమర్శలు చేస్తూ అందరినీ ఆకట్టుకొంటున్నారు. అయితే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడంలో ఎప్పుడు అందరి కంటే ముందుండే చంద్రబాబు మాత్రం, పని ఒత్తిడి కారణంగా ఇంతకాలం ఈ ట్వీటర్, ఫేస్ బుక్కులోకి ప్రవేశించలేదు. అయితే లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వస్తాడన్నట్లు ఇటీవలే ట్వీటర్లో ప్రవేశించిన ఆయన కూడా మంచి ఆసక్తికరమయిన ట్వీట్స్ చేస్తూ ఆకట్టుకొంటున్నారు.   రాష్ట్ర విభజనలో ప్రధాన పాత్ర పోషించిన దిగ్విజయ్ సింగ్ గురించి ఈ వ్దిహంగా వ్రాసారు: “మధ్యప్రదేశ్ నుండి తరిమివేయబడిన దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశ్రయం పొందాలని చూస్తూ విభజన రాజకీయాలు చేస్తున్నారు.”   చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలకి ఊహించినట్లుగానే మంచి స్పందనే వచ్చింది. అంతే గాక ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా సైతం ఆయన వ్యాఖ్యలపట్ల ఆసక్తి చూపడం విశేషం. అయితే దిగ్విజయ్ సింగ్ వంటి అనేక మంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఈ సోషల్ నెట్వర్క్ సైట్లలో తమ రాజకీయ ప్రత్యర్ధులతో పెద్ద యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వారికి చంద్రబాబు కూడా తోడవడంతో, ఇంతవరకు కాంగ్రెస్-బీజేపీల మధ్యనే జాతీయ స్థాయిలో జరుగుతున ఈ సైబర్ యుద్ధం, దిగ్విజయ్ సింగ్ చంద్రబాబుకి ఇచ్చే జవాబుతో ఇక రాష్ట్ర స్థాయిలో కూడా మొదలవవచ్చును. అయితే రాష్ట్రస్థాయి కాంగ్రెస్ నేతలలో దీనిపట్ల ఆసక్తి, అవగాహన కొరవడటంతో ప్రస్తుతానికి చంద్రబాబుకి ఎదురులేకపోవచ్చును.

13 సీమాంధ్ర ఎంపీల రాజీనామాలు తిరస్కరణ

      సమైక్య రాష్ట్ర డిమాండ్ కి మద్దతుగా రాజీనామా చేసిన 13 మంది సీమాంధ్ర ఎంపీల రాజీనామాలను స్పీకర్ మీరాకుమార్ తిరస్కరించారు. ఈ మేరకు 13 మంది ఎంపీలకు స్పీకర్ కార్యాలయం ఫోన్ ద్వారా వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒత్తిడుల కారణంగానే వీరు రాజీనామా చేసి ఉండవచ్చన్న అభిప్రాయానికి వచ్చి స్పీకర్ మీరా కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది.     తమ రాజీనామాల ఆమోదం కోసం కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అనుణ కుమార్, అంతనం వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్ స్పీకర్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. తక్షణమే తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ లగడపాటి ఈరోజు కేంద్రమంత్రి కమల్‌నాథ్‌ను కూడా కలిసారు. అయితే మళ్ళీ తమ పదువులకు రాజీనామాలు చేస్తామని 13 మంది ఎంపీలు చెబుతున్నారు.

అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది

  రాష్ట్రంలో రెండు లెఫ్ట్ పార్టీలు ప్రజా సమస్యల తరపున ఎన్ని పోరాటాలు చేసినా అవి నేటి వరకు ప్రభుత్వం ఏర్పరచగలిగే స్థాయికి మాత్రం ఎదగలేకపోయాయి. అందువల్ల తప్పనిసరిగా ఏదో ఒక ప్రధాన పార్టీకి అవి తోకపార్టీలుగానే కాలక్షేపం చేస్తున్నాయి. రెండు వేర్వేరు పార్టీలయినా ఇంతకాలంగా రైట్ టర్న్ తీసుకోకుండా రూల్స్ ప్రకారం లెఫ్ట్ సైడ్ నుండే కలిసి ముందుకు పోతుండటంతో ప్రజలకి కూడా వాటి మధ్య పెద్దగా తేడా కనబడలేదు. పైగా రాఘవులు, నారాయణ ఇద్దరూ కూడా చిలకా గోరింకల్లా ఎప్పుడు కువకువలాడుతూ రాసుకు పూసుకు తిరుగుతుండటంతో ఇంతకాలం వారి కాపురం ఎర్రెర్రగా బాగానే సాగిపోయింది.   కానీ రాష్ట్ర విభజన విషయంలో సీపీయం సమైక్యానికి, సీపీఐ విభజనకి మొగ్గు చూపడంతో ఆ రెండు పార్టీల మధ్య ఎడమొహం పెడమొహం తప్పలేదు. వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఇటీవల డిల్లీ వెళ్ళినప్పుడు సీపీయం నేతలకి లాల్ సలాం చెప్పి రావడంతో, ఆరెండు పార్టీల మధ్య పొత్తులు పొడవనున్నాయని మీడియాలో ఒకటే లొల్లి మొదలయింది. జగన్ మోహన్ రెడ్డి సీపీయం నేతలకి ఏదో బంపర్ ఆఫర్ ఇచ్చాడనే పుకార్లు కూడా మీడియాలో కనబడ్డాయి.   అసలే కొంచెం నోటి దురద ఉన్న నారాయణ, నలుగురితో నారాయణ అనుకొంటూ వైకాపా సీపీయంల మధ్య పొత్తులు కుదురుతున్నాయని చిన్న స్టేట్మెంట్ ఇవ్వడంతో, ఎప్పుడు చిరునవ్వులు చిందించే రాఘవులు కూడా భగ్గుమన్నారు. అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది. తోడి కోడలు నవ్వినందుకు అన్నట్లు, మిగిలిన పార్టీలు ఎన్నయినా అననీ, కానీ లెఫ్టో రైటో తెలియకుండా అగమ్యంగా ముందుకు సాగుతూ, చికెన్ కర్రీలో ఇడ్లీముంచుకొని తినే నారాయణ కూడా తమను విమర్శించడమా? అని చాలా బాధపడిపోయిన రాఘవులు, “దమ్ముంటే నీ ఆరోపణలు ఋజువు చేయి...నారాయణ! అంటూ సవాలు విసిరారు. “మేము ‘కలిసుందాము రా’ అంటే నీకు నామోషీగా ఉన్నపుడు, మేమేవరితో కలిసి తిరిగితే నీకెందుకు దురద?” అని కోపగించుకొన్నారు కూడా.   మొత్తం మీద రాష్ట్ర విభజనతో లెఫ్ట్ పార్టీల్లో కూడా ముసలం పుట్టినట్లే ఉంది. అయితే రెండు పార్టీలు మళ్ళీ ఏదయినా మెయిన్ పార్టీకి అటాచ్ కాగానే ఇదంతా మరిచిపోయి మళ్ళీ ఒకరికొకరు లాల్ సలాములు చెప్పుకొని తమ పోరాటాలు కొనసాగించవచ్చును.

వైకాపాలోకి విశ్వరూప్‌

      మాజీ మంత్రి పి. విశ్వరూప్‌ వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.రస్తుతం అమలాపురం శాసనసభకు ప్రాతినిద్యం వహిస్తున్న విశ్వరూప్ వై.ఎస్,రోశయ్య, కిరణ్ క్యాబినెట్ లలో మంత్రిగా ఉన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్‌కి కట్టుబడి తాను మంత్రి పదవికి రాజీనామా చేశాననీ, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోన్న వైఎస్‌ జగన్‌తో కలిసి పనిచేయాలనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరానన్నారు విశ్వరూప్‌. సమైక్య ఉద్యమంలో భాగంగా, కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పి పలువురు నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా వున్నారు.

బొగ్గు కుంభకోణం రోజుకో మలుపు

      బొగ్గు కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని సంతకం చేసిన ఫైళ్ళకు దిక్కులేదంటే దేశం ఎక్కడికేల్తోందని ఆయన ప్రశ్నించారు. బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పిసి ఫరేఖ్ చేసిన వ్యాఖ్యలపై ప్రదాని ఏమి సమాధానం చెబుతారని అన్నారు.   కాంగ్రెస్ కుట్రను జాతీయ స్థాయిలో బయటపెట్టేందుకే ఢిల్లీలో దీక్ష చేపట్టానని ఆయన తెలిపారు. దీక్షకు సహకరించిన వారందంకి కృతజ్ఞతలు తెలిపారు.  ఢిల్లీలో అంతా డీలర్లు, బ్రోకర్ల రాజ్యంగా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ధ్వజమెత్తారు. యూపీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత మొత్తం పదిహేను లక్షల కోట్లా అవీనితి జరిగిందన్నారు.           

హరికృష్ణకు టిడిపి షాక్..!

      తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ పార్టీ రాజకీయాల్లో దెబ్బ తిన్నారు. హరికృష్ణ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, అయితే అదే సమయంలో టిడిపి లోక్‌సభ సభ్యులు నలుగురు రాజీనామా చేసినట్టు ప్రకటించి హడావుడి చేసినా, స్పీకర్ వద్దకు ఒకే ఒక రాజీనామా లేఖ వెళ్లింది. ఇక రాజ్యసభ సభ్యుల్లో హరికృష్ణ ఒక్కరిదే ఆమోదం పొందింది. టిడిపి ఎంపీల్లో ఒక్కరి లేఖ మాత్రమే వచ్చినట్టు స్పీకర్ కార్యాలయం వెల్లడించడంతో టిడిపి ఎంపిలు ఇరకాటంలో పడ్డారు. వారి రాజీనామాల వ్యవహారం డ్రామా అని ఇతర పార్టీల వాళ్లు విమర్శించారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు సమైక్యాంధ్ర కోసం బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు హరికృష్ణ మళ్లీ యాత్ర ఊసెత్తడం లేదు. రాజీనామా తరువాత ఆయన ఉనికిని పార్టీ నాయకులెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

కాంగ్రెస్ కి దత్తపుత్రుడి అండ

      కాంగ్రెస్ అధిష్టానంపై విజయవాడ ఎంపీ లగడపాటి విమర్శలు చేస్తున్న తీరు ఆసక్తికరంగా ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దత్తత పుత్రుడని అని పరోక్షంగా వ్యాఖ్యానించారు. దత్తపుత్రుడి అండ చూసుకునే సొంతపార్టీ నాయకులను అరువు పుత్రులుగానూ, బరువు పుత్రులుగానూ భావిస్తోందని తప్పుపట్టారు.   ఇంక కాంగ్రెస్ నాయకులు ఎంత గొంతు చించుకున్నా, ఎంత గోల చేసినా, కాళ్లా వేళ్లా పడినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ దత్తపుత్రుడు ఎవరని ప్రశ్నించగా.. 'ఆ దత్తపుత్రుడు పాతపుత్రుడో.. కొత్త పుత్రుడో కానీ రాష్ట్రాన్నే పణంగా పెట్టి పదవుల్ని పొందాలని చూస్తున్న పుత్రుడు' అని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కనుక లాలూచీ పడితే కేంద్ర మంత్రి, గవర్నర్ వంటి పదవుల్ని పొందొచ్చని.. కానీ రాష్ట్రం సమై క్యత కోసం అధిష్ఠానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురిస్తూ ముందుకు సాగుతున్నాడని ప్రశంసించారు. పదవిని కూడా త్యాగం చేసేందుకు సిద్ధపడి సమై క్యం కోసం సీఎం పోరాడుతుంటే.. దత్తపుత్రుడు మాత్రం పదవి కోసం రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నాడని విమర్శించారు.

సీమాంధ్ర ఎన్జీవోల చేత సమ్మె విరమించిన కిరణ్

      రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ అరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా సీమాంధ్ర ఎన్.జి.ఓలు సమ్మెను విరమించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వద్ద జరిగిన చర్చల అనంతరం వారు సమ్మె విరమణకు అంగీకరించారు. అసెంబ్లీకి తీర్మానం వచ్చేదాకా తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.     'రాష్ట్ర విభజన జరగదని మీరు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశముందా?' అని ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. కేంద్రానికి సంబంధించి హామీ ఇవ్వలేనని, తాము మాత్రం సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టంగా చెప్పారు. శాసనసభలో సమైక్య తీర్మానానికే మద్దతునిస్తానని పేర్కొన్నారు. "రాజ్యాంగంలోని 371(డి) అధికరణ మేరకు ఉద్యోగులకు రక్షణ కావాలి. ఉద్యోగుల పక్షాన కేంద్రానికి నివేదిస్తాం. 371(డి) ఉన్నంత కాలం ఉద్యోగులకు రక్షణ ఉంటుంది. దానిని తొలగించే హక్కు ఎవరికీ లేదు. దీనిపై అధిష్ఠానానికి లేఖ రాస్తాను. ఉద్యోగులకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేను. విభజన తీర్మానాన్ని వ్యతిరేకించడం, 371(డి)పై నా మాటలకు కట్టుబడి ఉంటాను. సమ్మె విరమించండి'' అని సీఎం కోరారు.

సమైక్యాంధ్ర అనగా...కొత్త నిర్వచనం

  కాంగ్రెస్ పార్టీ కొద్ది నెలల క్రితం కేసీఆర్ చేతిలోంచి తెలంగాణా తన్నుకుపోయినట్లుగా, ఇప్పుడు జగన్ చేతిలోంచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎత్తుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి, చివరికి అతని తల్లి విజయమ్మ కూడా కడుపు మాడ్చుకొని, ఎండనక వాననక తిరుగుతూ, అపసోపాలుపడి మరీ సాగిస్తున్నసమైక్యాంధ్ర ఉద్యామాన్నికిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగుల సమ్మె విరమింపజేసేసి హైజాక్ చేసేసారు. దీనితో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు అత్యవసరంగా మరో కొత్త పాయింటు ఎత్తుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.   అందుకే తన సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆయన ఈ రోజు కొత్త నిర్వచనం ఇచ్చారు. సమైక్యంద్రా అంటే కేవలం సీమాంద్ర హక్కుల కోసం పోరాటం కాదని, తెలంగాణా, రాయలసీమ, కోస్తాంధ్రా మూడు ప్రాంతాల హక్కుల కోసం చేస్తున్నపోరాటమని ఆయన పునర్నిర్వచించారు. తను మూడు ప్రాంతాల ప్రజలకి న్యాయం జరిగేందుకు వారి తరపున పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. (ఇది చంద్రబాబు వాదనతో సరిపోలితే ఉదార హృదయంతో అర్ధం చేసుకోవలసిందిగా మనవి. చంద్రబాబు కూడా మూడు ప్రాంతాల ప్రజలకి సమన్యాయం చేయాలనే పాపం కడుపుమాడ్చుకొని ఆసుపత్రి పాలయ్యారు కదా?) అయితే ఇపుడు సమైక్యంద్రా అంటే తెలంగాణను అడ్డుకోవడం కాదని, కేవలం మూడు ప్రాంతాలకు న్యాయం జరగాలనే చిరుకోరిక మాత్రమేనని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ఈ కొత్త సిద్ధాంతం అమలు చేయాలంటే ముందుగా తెలంగాణాలో రోడ్డున పడ్డ వైకాపా నేతలకి మళ్ళీ లైన్ కలుపాలేమో? మరీ ఇన్నిట్విస్టులా?

జగన్ సభకు కిరణ్ గండి కొట్టారా

  సమైక్యాంధ్ర చాంపియన్ షిప్ రేసులో కిరణ్, జగన్ ల మధ్య తీవ్ర పోటీ సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే చాంపియన్ షిప్ కోసం జగన్ అష్టకష్టాలుపడుతుంటే కిరణ్ మాత్రం సింపుల్ గా వినాయకుడు పార్వతీ పరమేశ్వరులు చుట్టూ మూడు రవుండ్స్ తిరిగేసి కుమారస్వామిని ఓడించేసినట్లు, ఒంటి మీద ఖద్దరు చొక్కా మడత నలగకుండా, మీడియాను తన ఏసీ గదికే పిలిపించుకొని అమావాస్యకి పున్నానికి అధిష్టానానికి వ్యతిరేఖంగా మూడు ముక్కలు మాట్లాడేసి రేసుగుర్రంలా దూసుకెల్తున్నారు.   ఇంత కాలంగా ఉద్యోగులను సమ్మెలు, ప్రజలను ఉద్యమాలు చేసుకోనిచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వారిని దువ్వడం చూసి, వెంటనే అప్రమత్తమయి ఉద్యోగులతో చర్చల ప్రక్రియ మొదలుపెట్టేసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం సభకి కోర్టు అనుమతి కూడా ఇచ్చేయడంతో, ఉద్యోగులతో చర్చించి వారిచే సమ్మె విరమింపజేయడం ద్వారా అతని సభను చెవిటి వాడి ముందు శంఖారావంగా మార్చేసారు. ఉద్యోగులు ప్రజలు సమ్మెలు ఉద్యమాలు చేస్తున్నపుడే ఇటువంటి సమైక్య సభలకి ప్రాముఖ్యత ఉంటుంది గానీ, అందరూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమయి ఉన్నపుడు చేయడం వలన వైకాపాకు శ్రమ, ఖర్చు తప్ప పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చును.   బహుశః ఇది గ్రహించినందునేనేమో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యావత్ దేశ ప్రజలు మన ఉద్యోగుల సమ్మెను ఆసక్తిగా చూస్తున్నపుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను బెదిరించొ బయపెట్టో వారిచేత ఆకస్మాత్తుగ్గా సమ్మె విరమింపజేసారని ఆవేదన వ్యక్తం చేసారు. పాపం అతని ఆవేదన అర్ధం చేసుకోదగ్గదే. అదేవిధంగా  కిరణ్ కుమార్ రెడ్డి చూపిన టైం సెన్స్ (టైమింగ్) ను కూడా మెచ్చుకోవలసిందే.

లగడపాటిపై జగన్ హాట్ కామెంట్

      విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ పై వైకాపా అద్యక్షుడు తీవ్రంగా వ్యాఖ్యానించారు. లగడపాటి రాజగోపాల్ గురించి తాను మాట్లాడటం మొదలు పెడితే 'పెంట మీద రాయి వేసినట్లే' అని అన్నారు. సమైక్యానికి వైయస్సార్ కాంగ్రెసుతో పాటు మజ్లిస్, సిపిఎంలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయన్నారు. రేపు తమ పార్టీ ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ధర్నా చేస్తారని చెప్పారు. జైల్లో ఉన్నా నిజాయితీగా రాజకీయం చేశా ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో అందరికీ తెలుసునని జగన్ అభిప్రాయపడ్డారు. తాను పదహారు నెలలు జైల్లో ఉన్నప్పటికీ నిజాయితీగా రాజకీయం చేశానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి నిలబెట్టిన చంద్రబాబు కుమ్మక్కయ్యారా లేక మేమా అన్నది మీరే గుండె మీద చెయి పెట్టి ఆలోచించుకోవాలని జగన్ అన్నారు.

26న సమైక్య శంఖారావ౦

      ఈ నెల 26న హైదరాబాదులో సమైక్య శంఖారావానికి పోలీసులు అనుమతి ఇచ్చారని వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. సమైక్యమంటే... తెలంగాణ..కోస్తాంధ్ర.. రాయలసీమ' అని చెప్పారు. తనకు మూడు ప్రాంతాలు సమానమేనని..ఆ మూడు ప్రాంతాలకు న్యాయం జరిగేలా మైక్య శంఖారావ౦ ఉంటుందని తెలిపారు.   సమైక్యాంధ్ర కోసం తనతో పాటు తమ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తారని చెప్పారు. కోర్టు అడ్డంకుల వల్ల తనకు ఢిల్లీ వెళ్లే అవకాశం లేకుంటే తమ పార్టీ ఎంపీల ద్వారా తన రాజీనామా లేఖను పంపిస్తానని, రాజీనామా ఆమోదించాలని తాను స్పీకర్ మీరా కుమార్‌ను విజ్ఞప్తి చేస్తానని చెప్పారు.  

సీఎం కిరణ్ తో ఏపీ ఎన్జీవో నేతలు భేటి

      ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏపీ ఎన్జీవో ఉద్యోగ నేతలు సమావేశంమయ్యారు. చర్చల అనంతరం ఏపీ ఎన్జీవోలు సమ్మె విరమించేది, లేనిది మీడియా సమావేశంలో ప్రకటక చేయనున్నారు. గురువారం ఉదయం ఏపీఎన్జీవో భవన్‌లో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నేతలు సమావేశయ్యారు. ఈ సందర్భంగా సీఎంతో మాట్లాడాల్సిన అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చలు జరిపారు.   ఆర్టికల్ 371 డిని ఏ విధంగా పరిష్కరిస్తారో సీఎం నుంచి హామీ తీసుకుంటామని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చే హామీలపై నిర్ణయం తీసుకునేందుకు 15 మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు అశోక్‌బాబు తెలిపారు. ఉద్యమంలో చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయంఅందించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సీమాంధ్ర జిల్లాలలో సోనియా సమాధులు

      సోనియాగాంధీకి సమాధులు కడితే మా మీద కేసులు పెట్టాలని చిరంజీవి అంటున్నారు. ఇక ముందు ఆయనకు సమాధులు కట్టే రోజు ముందుంది. తెలంగాణ రాష్ట్ర విభజనతో సీమాంధ్ర విద్యార్థుల జీవితాలకు సమాధులు కడితే నోరు మెదపలేని వారు సోనియాగాంధీ చిత్రపటానికి సమాధి కడితే గగ్గోలు పెడుతున్నారు” అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సీమాంధ్రలోని అన్ని జిల్లాలలో సోనియా చిత్రపటాలకు సమాధులు కడతామని, ఏం చేస్తారో చేయండని సవాల్ విసిరారు.     టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిర్యాని కోసం ఆరాట పడుతున్నాడని, సీమాంధ్రులది రాగి ముద్దల కోసం సాగుతున్న పోరాటం అని అన్నారు. కేంద్రమంత్రులు, కాంగ్రెసు నేతలు విభజన జరుగుతుంటే, సీమాంధ్రకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు ? వీరంతా సీమాంధ్ర ప్రయోజనాలకు సమాధి కట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు ? సమాధులు కట్టినందుకు మా మీద కేసులు పెడతారా ? అప్పుడు సీమాంధ్ర సమాజం మా త్యాగాన్ని గుర్తిస్తుంది అని పయ్యావుల అన్నారు.