శంఖారావంలోనూ విలీనం మాటే!
posted on Oct 26, 2013 @ 4:46PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోదామా అని తహతహ ఎక్కువైనట్టుంది. అందుకే అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీతో తమకున్న అనుబంధం గురించి, కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వడం గురించి, కాంగ్రెస్ పార్టీలో కలసిపోవడం గురించి ప్రస్తావిస్తూ వుంటారు.
మొన్నటి వరకూ జగన్‌తో చెట్టపట్టాల్ వేసుకుని తిరిగిన సబ్బం హరి ఆమధ్య జగన్‌కీ, కాంగ్రెస్ పార్టీకి వున్న అనుబంధం గురించి నోరుజారి చెప్పేశారు. అలా నోరు జారడం వల్ల ఆయన జగన్‌కి దూరమైపోయారు. మొన్నీమధ్యే వైకాపా నాయకుడు దాడి వీరభద్రరావు మాట్లాడుతూ, కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తామని చెప్పినా సోనియా గాంధీ వినకుండా జగన్‌ని జైల్లో పెట్టించిందని చెప్పి, ఆ తర్వాత నాలుక్కరుచుకున్నారు. ఆ తర్వాత మీడియా తన మాటలని వక్రీకరించిందని వివరణ ఇచ్చారు.
తాజాగా వైకాపా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాటల్లో కాంగ్రెస్ పార్టీ మీద వైకాపా పార్టీకి వున్న అభిమానం నిందాస్తుతి రూపంలో బయటపడింది. సమైక్య శంఖారావ సభలో పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, దిగ్విజయ్‌సింగ్ చెబుతున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వైఎస్సార్ ఎప్పుడూ కోరుకోలేదని, దీన్ని దిగ్విజయ్ నిరూపిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తామని సవాల్ విసిరారు. దిగ్విజయ్‌కి సవాల్ విసరదలచుకుంటే మరేదైనా సవాల్ విసరవచ్చు కదా.. కాంగ్రెస్‌లో వైకాపా విలీనం సవాలే ఎందుకు విసిరారన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వస్తున్నాయి. వైకాపా మనసులో వున్న ఉద్దేశాలే ఆ పార్టీ నాయకుల మాటల్లో బయట పడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.