మెగాస్టారుకి మెలుకువ వచ్చింది మళ్ళీ
posted on Oct 26, 2013 @ 2:01PM
తన మెగాస్టారు ఇమేజిని పణంగా పెట్టి మరీ, శుభమా అంటూ త్రీ..టూ..వన్..జీరో...అంటూ ప్రజారాజ్యం పార్టీని ‘జీరో’తో ఆరంభించినననాటి నుండి చిరంజీవి, హీరో నుండి పెద్ద జీరోగా మారిపోయారు. పట్టుమని ఏడాది కూడా పార్టీని నడుపలేని అయన మంత్రి పదవి కోసం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో జనాల దృష్టిలో ఆయన ‘జీరో టు పవర్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో’ అన్నట్లుగా మారిపోయారు. ఆయన రాన్రాను చిన్న జీరో నుండి మరింత పెద్ద జీరోగా ఎదుగుతున్నారు తప్ప, రాజకీయాలలో ఉండి సాధించేమి లేదు. దేశముదుర్లతో నిండిన కాంగ్రెస్ పార్టీలో జేరడమే ఒకపెద్ద తప్పు గనుక ఆయన తన చుట్టూ ఓ గిరిగీసుకొని ఆ జీరోలో జీరోగా ఉండిపోక తప్పలేదు.
అయితే ప్రతీ మనిషి జీవితంలో ఉత్థానపతనాలు (రైజ్ అండ్ ఫాల్) ఉన్నట్లే ఆయనకీ ఉంటాయి గనుక, కొన్ని రోజులు సోనియమ్మకు అంతరంగికుడిగా మరి కొన్ని రోజులు కేంద్రమంత్రిగా ఒకవెలుగు వెలిగారు. కానీ రాష్ట్ర విభజన ప్రకటనతో అవన్నీకూడా మూన్నాళ్ళ ముచ్చట్లే అవుతాయని ఆయన కూడా ఊహించలేకపోయారు. ఊహించి ఉంటే అసలు అమ్మ హస్తంలో పార్టీని పెట్టేవారు కారేమో.
తన పార్టీని, దానిని నమ్ముకొన్న వేలాది అభిమానులని, కార్యకర్తలని, చోటా మోటా నేతలని పణంగాబెట్టి సంపాదించుకొన్న కేంద్ర మంత్రి పదవి పోయింది. దానితోబాటే అధిష్టానంతో లింకులు తెగిపోయాయి. పైగా అధిష్టానం హ్యండిచ్చిన కారణంగా ఎన్నికలలో గెలుస్తామనే నమ్మకమూ లేదిప్పుడు.
ఇక సినీ పరిశ్రమలో ఆయన స్వయం కృషి గురించి అందరూ చెప్పుకొంటే, రాజకీయాలలో మాత్రం ఆయన స్వయంకృతాపరాధం గురించే ఎక్కువ చెప్పుకోవలసి ఉంటుంది. రాష్ట్ర విభజనపై ఓసారి సమైక్యం వైపు, రాజీనామా చేయనని మొండికేసి సోనియమ్మా కొంగు చాటున దాక్కొని మరి కొన్ని రోజులు, మళ్ళీ నలుగురితో నారాయణ అనుకొంటూ రాజీనామా చేసి సమైక్యం వైపు కప్పగంతులు వేసి చివరికి సమైక్యజీరోగా మిగిలిపోయారు. ఇక ఇప్పుడు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి.
ఇక తనకి సమైక్య కిరణమే దారి చూపాలనే ఆలోచన వచ్చిందో ఏమో మళ్ళీ చాలా రోజుల తరువాత నిద్రలోంచి మేల్కొన్నట్లు మీడియా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానికి, రాష్ట్రపతికి వ్రాసిన లేఖలతో తను కూడా ఏకీభవిస్తున్నానని ప్రకటించేశారు. అందువల్ల ఆయనకు కొత్తగా ఒరిగేదేమిటో ఆయనకే తెలియాలి.
ఆయన సినీ పరిశ్రమలో స్వయం కృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగి ఉండవచ్చు గాక, కానీ రాజకీయాలలో అదీ దేశ ముదుర్లతో నిండిన కాంగ్రెస్ పార్టీలో ఎంత స్వయం కృషి చేసేసినా, కాంగ్రెస్ మార్క్ రాజకీయాలను ఒంటబట్టించుకోనంత కాలం ఏ ప్రయోజనమూ ఉండదు. ఆయన తనకు, తన మనస్తత్వానికి సరిపడని రాజకీయాలను, కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మళ్ళీ మెగాస్టారుగా వస్తే జనాలు నెత్తినపెట్టుకొంటారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి ముందో చేతులు కట్టుకొని నిలబడటం కంటే, ఆయన మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి తన తన మెగాస్టార్ హోదా నిలబెట్టుకొంటే గౌరవప్రదంగా ఉంటుంది కదా.