ఆమాద్మీకి కాంగ్రెస్ బేషరతు మద్దతు
మొట్ట మొదటి ప్రయత్నంలోనే 28 సీట్లు గెలుచుకొని డిల్లీలో కాంగ్రెస్ పార్టీని తుడిచేపెట్టేసిన ఆమాద్మీపార్టీకి ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్దమయింది. కేవలం మాటలతో సరిబెట్టకుండా, ఆమాద్మీకి బేషరతుగా మద్దతు ఇస్తునట్లు డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి ఒక లేఖ కూడా వ్రాసింది. అయితే ఇంతవరకు అమాద్మీ పార్టీ నుండి ఎవరు స్పందించకపోవడం విశేషం.
ఇటీవల జరిగిన డిల్లీ శాసనసభ ఎన్నికలలో 32 సీట్లు గెలుచుకొని బీజేపీ ప్రధమ స్థానంలో నిలవగా, ఆమాద్మీ పార్టీ 28సీట్లు గెలుచుకొని రెండవ స్థానంలో, పదిహేనేళ్ళపాటు డిల్లీని పాలించిన కాంగ్రెస్ పార్టీకి కేవలం 8 సీట్లతో మూడవ స్థానానికి పరిమితమయింది. ఇతరులకు 2సీట్లు వచ్చాయి. 70సీట్లున్న శాసనసభలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 36సీట్లు ఉండాలి. కానీ, ఆమాద్మీ, బీజేపీ పార్టీలు ఇతరులకు మద్దతు ఈయబోము, తీసుకోము అని బిగుసుకు కూర్చోకొన్నాయి.
అమాద్మీ కాక వేరే ఏదయినా ఇతర పార్టీ అయిఉంటే, బీజేపీ ఈ పాటికి వారికి గాలం వేసి ప్రభుత్వం ఏర్పాటు చేసేసేదే. కానీ ఆమాద్మీకి ప్రజలలో ఉన్న విపరీతమయిన ఆదరణను చూసిన తరువాత ఆ పార్టీపై ఎటువంటి ఎత్తులు ప్రయోగించకుండా వేచి చూచే ధోరణి అవలంభిస్తోంది. తద్వారా రోజురోజుకి ఆమాద్మీపై ఒత్తిడి పెరిగిపోయి, చివరికి దిగివస్తుందని బీజేపీ అంచనా వేసింది. కానీ అది ఊహించని విధంగా కాంగ్రెస్ రంగంలోకి దూకి ఆమాద్మీకి బేషరతుగా బయట నుండి మద్దతు ఇస్తామని గవర్నర్ కు లేఖ కూడా పంపింది.
ఇటువంటి సంకీర్ణాలు తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని, అదే చేసినట్లయితే, తమకు ఇతర రాజకీయ పార్టీలకు మధ్య ఎటువంటి తేడా ఉండదని ఇంతవరకు గట్టిగా వాదిస్తున్నఆమాద్మీ, ఇప్పుడు కాంగ్రెస్ తనంతట తానే మద్దతు ప్రకటిస్తున్నపుడు కూడా వద్దంటే, ఇక డిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యం అవుతుంది. మరో నాలుగైదు నెలలలో సాధారణ ఎన్నికలు వస్తున్న కారణంగా వాటితో కలిపి అప్పుడే మరోసారి ఎన్నికలు జరిపించాలని గవర్నర్ భావిస్తే, డిల్లీలో రాష్ట్రపతి పాలన విధించమని రాష్ట్రపతిని కోరవచ్చును.
ఒకవేళ ఆమాద్మీతన మాటకే కట్టుబడి ప్రభుత్వ ఏర్పాటుకి నిరాకరిస్తే, విలువలకు కట్టుబడి ఉన్నపార్టీగా మంచి పేరు పొందవచ్చును. కానీ, ఆమాద్మీకి ఓటేస్తే ఇదేవిధంగా ఎందుకు పనికిరాకుండా పోతాయని వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచారం చేస్తే అమాద్మీకి ఇప్పుడు వచ్చినన్ని సిట్లు కూడా రాకపోవచ్చును. అందువల్ల కాంగ్రెస్ బేషరతుగా ఇస్తున్న మద్దతు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటు చేసి, తన పాలనతో డిల్లీ ప్రజలను ఆకట్టుకొనగలిగితే రానున్నఎన్నికల సమయానికి మరింత బలపడవచ్చును. అలాకాకుండా నీతి సూత్రాలు వల్లె వేస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా భీష్మించుకొని కూర్చొంటే నష్టపోయేది అమాద్మీపార్టీయే తప్ప కాంగ్రెస్, బీజేపీలు మాత్రం కాదని గ్రహించాలి.