బీజేపీ వైపు చంద్రబాబు అడుగులు
posted on Dec 14, 2013 8:04AM
ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బీజేపీ ఆహ్వానం మేరకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. మొన్నరాజస్తాన్ ముఖ్యమంత్రిగా వసుందర రాజే సింధియా ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా అయన వెళ్ళవలసి ఉన్నపటికీ రాష్ట్ర విభజన బిల్లు హైదరాబాద్ చేరుకోవడంతో మొదలయిన రాజకీయ హడావుడి కారణంగా ఆయన వెళ్లలేకపోయారు.
బీజేపీ అగ్రనేత అద్వానీకి శిష్యుడిగా పేరొందిన శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి అద్వానీతో సహా బీజేపీ అగ్రనేతలందరూ వస్తున్నారు. ఇప్పటికే, బీజేపే-తెదేపాల మధ్య కొంత సఖ్యత ఏర్పడి రెండు పార్టీల మధ్య ఎన్నికల పొత్తులకు అనుకూల వాతావరణం ఏర్పడింది గనుక, నేటి చంద్రబాబు పర్యటన ఆ దిశలో పడుతున్న మరొక అడుగుగా భావించవచ్చును.
ఈసందర్భంగా ఆయన బీజేపీ అగ్ర నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల పొత్తులకు ఇంకా చాలా సమయం ఉంది గనుక, ప్రస్తుతం వారు ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాల గురించి, పార్లమెంటులో తెలంగాణా బిల్లుపై అనుసరించవలసిన వ్యూహాలపై చర్చించవచ్చును. బీజేపీ తెలంగాణా బిల్లుకి బేషరతుగా మద్దతు ఇస్తామని ప్రకటిస్తున్నపటికీ, దానివల్ల ఆ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు గనుక, బిల్లుని వ్యతిరేఖించకుండా, అలాగని ఆమోదం పొందకుండా ఉండేలా బీజేపీ వ్యవహరించవచ్చును.
బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు కిషన్ రెడ్డి తెదేపాతో ఎన్నికల పొత్తులకు ఎంత వ్యతిరేఖత చూపుతున్నపటికీ, బీజేపీ అధిష్టానం మాత్రం రాష్ట్రంలో తెదేపా యొక్క ప్రాధాన్యత గుర్తించి ఆ పార్టీతో స్నేహ సంభందాలు మళ్ళీ పునరుద్దరించుకొనేందుకు ప్రయత్నిస్తుండటం, అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించడం విశేషం.