రాష్ట్ర విభజన బిల్లు రాకతో వేడెక్కిన రాజకీయాలు
posted on Dec 13, 2013 @ 11:58AM
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహంతీ చేతికి తెలంగాణా బిల్లు రావడంతోనే ఒక్కసారిగా హైదరాబాదులో రాజకీయాలు ఊపందుకొన్నాయి. దానికి తోడు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ లో మఖాం వేసి కాంగ్రెస్ నేతలతో ఎడతెగని చర్చలు చేస్తుండటం, మరో వైపు శాసన సభ సమావేశాలు కూడా జరుగుతుండటంతో రాష్ట్ర రాజధానిలో వాతావరణం చలిగా ఉన్నపటికీ రాజకీయ వాతవరణం మాత్రం చాల వేడిగా ఉంది.
శాసనసభ, మండలి సమావేశాలలో ఊహించినట్లే సమైక్యాంధ్ర, తెలంగాణా నినాదాలతో రసాభాసగా మారుతూ వాయిదాలు పడుతున్నాయి. ఇక చాలా కాలం తరువాత టీ-కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వెంటనే సభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసారు. అదేవిధంగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ ని కూడా కలిసి బిల్లుకోసం ఒత్తిడి తెస్తున్నారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అయితే నేరుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహంతీకే ఫోన్ చేసి బిల్లును వెంటనే సభకు పంపాలని కోరారు. ఈరోజు సాయంత్రంలోగా బిల్లుని సభలకు పంపకపోయినట్లయితే మొహంతీపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తామని తెరాస నేత హరీష్ రావు హెచ్చరించారు. అయితే ముఖ్యమంత్రి అనుమతి లేనిదే ప్రధాన కార్యదర్శి టీ-బిల్లును ఉభయ సభలకి పంపకపోవచ్చును.
తెలంగాణా నేతలు బిల్లుకోసం ఒకవైపు తొందరపడుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన అనుచరులు మాత్రం ఇప్పుడప్పుడే బిల్లును సభలో ప్రవేశపెట్టే ఉద్దేశ్యం లేరు. కొద్ది సేపటి క్రితమే దిగ్విజయ్ సింగ్ గవర్నర్ నరసింహన్ తో దాదాపు గంట సేపు సమావేశమయ్యారు. ఒకవేళ ముఖ్యమంత్రి వెంటనే అనుమతించకపోయినట్లయితే, సభాపతే చొరవ తీసుకొంటారా? లేక బిల్లును ప్రవేశపెట్టమని గవర్నర్ ఆదేశిస్తారా అనే సంగతి త్వరలోనే తేలిపోతుంది.