కాంగ్రెస్ మళ్ళీ గోతిలో పడిందా

  కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ అధిష్టానానికి ఈవారంలో గ్రహస్థితి అంత అనుకూలంగా ఉన్నట్లు కనబడటం లేదు. నాలుగు రాష్ట్రాలలో తుడిచిపెట్టుకు పోయి బాధపడుతున్న కాంగ్రెస్ అధిష్టానంపై మూలిగే ముసలి నక్కపై తాటిపండు పడినట్లు తన స్వంత పార్టీ యంపీలే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. ఒకవేళ అదికూడా దాని కుయుక్తులలో భాగమే అనుకొన్నప్పటికీ, వారిని చూసి తెదేపా,వైకాపాలు కూడా అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. ఒకవేళ ఈవిధంగా నాటకమాడి తన యంపీలపై వేటు వేసి సీమాంధ్రలో వారి రేటింగ్ మళ్ళీ పెంచి లాభపడాలని కాంగ్రెస్ అధిష్టానం దురాలోచన చేసి ఉండి ఉంటే, ఇప్పటికే పూర్తిగా కోల్పోయిన పార్టీ పరువును ఇంకా పోగొట్టుకోవడానికి అది సిద్దం అయినట్లే భావించవలసి ఉంటుంది.   ఏమయినప్పటికీ, కాంగ్రెస్ యంపీలను చూసి తెదేపా, వైకాపాలు కూడా పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టబోవడంతో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో మరో అగ్ని పరీక్ష ఎదుర్కోక తప్పదు. మంచి ఊపు మీద ఉన్నబీజేపీ, ఇదే సమయంలో మధ్యంతర ఎన్నికలకి వెళ్ళడం వలన తనకి ఎక్కువ లాభం ఉంటుందని భావిస్తే, ఇదే అదునుగా భావించి వారి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్నిపడగొట్టినా ఆశ్చర్యం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెసేతర పార్టీలను కలిసి మద్దతు కూడగడుతునందున, వారు కూడా ప్రభుత్వానికి పడగొట్టేందుకు ‘సై’ అంటే కాంగ్రెస్ పని అయిపోయినట్లే.   అయితే దీనివలన కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద నుండి ఒక పెద్ద సమస్య దింపుకొనే అవకాశం కూడా కలుగుతుంది. రాష్ట్ర విభజనపై ముందు నుయ్యి, వెనక గొయ్యి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆపార్టీ ఇదే అదునుగా ఈ సమస్య నుండి బయట పడవచ్చును. తమ పార్టీనే మళ్ళీ ఎన్నుకొంటే మిగిలిన ప్రక్రియను వేగంగా పూర్తిచేసి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అక్కడి ప్రజలకు, ఏదో ఒక సాకు చూపి మరో రెండు మూడేళ్ళయినా ఈ సమస్యను సాగాదీస్తామని తన సీమాంధ్ర నేతల చేత అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చి ఎన్నికలలో గెలిపించమని కోరే అవకాశం ఉంది.   కానీ దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేఖ పవనాలు వీస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఇది రాజకీయ ఆత్మహత్యతో సమానమే గనుక ఏ విధంగానయినా ఈ అవిశ్వాస గండం గట్టెక్కే ప్రయత్నం చేయకతప్పదు. కాంగ్రెస్ యంపీలు పెడుతున్న అవిశ్వాస తీర్మానం సంగతి ఎలా ఉన్నపటికీ, వైకాపా, తెదేపాల తీర్మానాల వలన మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండమే ఉండవచ్చును.

ఎవరి అవిశ్వాసం వారిదే

  రాష్ట్ర విభజన ప్రక్రియకి ముందు తెలంగాణాలో, తరువాత సీమాంధ్రలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉద్యమాలు, రాజీనామాలు, గర్జనలు, ఘీంకారాలు, ధర్నాలు, రాస్తా రోకోలు, మానవ హారాలు, (ఐదు రోజుల) ఆమరణ నిరాహార దీక్షలు, బందులు, రోడ్ షోలు, రాష్ట్రపతికి విజ్ఞప్తులు అన్నీదశలు చకచకా దాటిన తరువాత ఇక ఆఖరిగా అవిశ్వాస తీర్మానాల దశకు చేరుకొన్నాయి. ఓం ప్రధమంగా ముందు కాంగ్రెస్ నేతలే ఈ పోటీకి ఎర్ర జెండా ఊపి మొదలుపెట్టగానే, ఆ మాత్రం సైగ చాలు మేమూ అల్లుకుపోగలమంటూ తెదేపా, వైకాపాలు కూడా పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాల నోటీసుల మీద సంతకాలు గీకేసి స్పీకర్ టేబిల్ మీద పడేసి హడావుడిగా మీడియాను పిలిచి ఆసంగతి వారి చెవిన వేసేసిన తరువాత గుండెల మీద నుండి పెద్ద భారం దింపుకొన్నట్లు ‘హమ్మయ్యా!’ అని ఓ నిటూర్పు విడిచారు.   కాంగ్రెస్ పార్టీలో అవిశ్వాసులు: లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, సబ్బం హరి. వైకాపాలో జగన్మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి. తెదేపాలో నామా నాగేశ్వరరావు, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొణకళ్ల నారాయణరావు, రమేష్ రాథోడ్ మొత్తం అందరూ కలిపి 13 మంది ఉన్నారు.   అయితే వీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాసం పెట్టదలచినప్పుడు ఒకరు ప్రతిపాదిస్తే మిగిలిన వారు దానికి సభలో మద్దతు తెలిపినా అది కూడా అవిశ్వాసమే. కానీ ఆవిధంగా చేస్తే ఆ ‘అవిశ్వాస క్రెడిట్’ అంతా సదరు పార్టీ ఖాతాలోనే జమా అవుతుంది తప్ప తమ స్వంత ఖాతాలలో జమా అవదు. పైగా ఆవిధంగా చేస్తే మళ్ళీ దానిని సీమాంధ్రలో క్లైయిం చేసుకోవడానికి కూడా వీలుండదు గనుక ఎవరి అవిశ్వాసం వారిదే. దానిని ప్రజలు అపార్ధం చేసుకోకూడదు మరి. తెలంగాణాలో క్రెడిట్ కోసం ప్రస్తుతం తెలంగాణాలో అన్నిపార్టీలు ఏవిధంగా తిప్పలు పడుతున్నాయో ఇది కూడా అటువంటిదే నన్నమాట. ఇది వినేందుకు చాలా ఎబ్బెట్టుగా ఉన్నపటికీ నిజం మాత్రం ఇదే. వీరి అవిశ్వాసాలతో ప్రభుత్వం పడిపోకున్నా, ఆ ప్రయత్నం మేమే చేసామని చెప్పుకోవడానికయినా పనికి వస్తుంది కదా! అనే వారి ప్రధాన ఉద్దేశ్యం.

మిజోరాంలో కాంగ్రెస్ కి ఓదార్పు

      నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ పార్టీకి మిజోరంలో కొంత ఊరట లభించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 24 స్థానాలలో గెలవగా, మరో ఆరు స్థానాలలో ఆధిక్యంలో ఉంది.ముఖ్యమంత్రి లాల్ తన్హాల్వా తన సొంత నియోజకవర్గం సెర్చీఫ్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎంఎన్ఎఫ్ అభ్యర్థి సి లాల్ రామ్ జావాపై 734 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన్హాల్వాకు 5719, లాల్ రామ్ జావాకు 4985 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపై సీఎం లాల్ తన్హాల్వా హర్షం వ్యక్తం చేశారు. ఇది చిన్న రాష్ట్రం అయినా ,ఈ తరుణంలో ఇది కాంగ్రెస్ కు కొంత ఉపయోగపడేదే.

అవిశ్వాస౦పై సోనియా ఆగ్రహం

      యూపీఏ ప్రభుత్వంపై స్వంత పార్టీ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్ ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు ? అని ఆరాతీస్తున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు ఎంపీల మీద చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   అయితే అన్నింటికి సద్దపడే తాము అవిశ్వాస తీర్మానం స్పీకర్ కు ఇచ్చామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. సమైక్యాంధ్ర గురించి సీమాంధ్ర ప్రజల నుండి తమ మీద తీవ్ర వత్తిడి వస్తుందని, అందుకే కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెట్టామని ఆయన అన్నారు. తమకు ఊహించని రీతిలో తమ అవిశ్వాసానికి మద్దతు లభిస్తోందని ఎవరు ఎప్పుడు తమకు మద్దతు తెలుపుతారో చెప్పలేమని అన్నారు. అయితే అవిశ్వాస తీర్మానం సమర్ధంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు.

యూపిఎ పై సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస౦

      రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర టిడిపి ఎంపీలు యూపిఎ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ సభాపతి మీరా కుమార్‌కు నోటిసు ఇచ్చారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొణకళ్ల నారాయణ, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప స్పీకర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు.   సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీల అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభాపతి మీరా కుమార్‌కు సోమవారం అవిశ్వాస నోటీసులు అందజేసింది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలు వరుసగా అవిశ్వాస నోటీసులు ఇస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలు వైయస్ జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి ముగ్గురు సంతకాలు చేసిన నోటీసును స్పీకర్‌కు అందజేశారు.

సోనియా గుడికి శంకర్రావు శంకుస్థాపన

      ఇందిరాగాంధీ కుటుంబ౦పై వీరవిధేయత ప్రదర్శించే మాజీ మంత్రి శంకర్రావు తన స్వామి భక్తి ని మరోసారి చాటుకున్నారు. రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపిన యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి గుడి కట్టేందుకు పూనుకున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో కొత్తూరు మండలం నందిగామలో ఈ రోజు ఉదయం సోనియా గుడికి శంకుస్థాపన చేశారు. శంకర్రావు మాట్లాడుతూ సీమాంధ్రులు చరిత్ర హీనులుగా మారుతారని, సీమాంద్రులు రాజీవ్ విగ్రహాలు కూల్చడం దారుణమని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి స్థానిక నేతల వైఫల్యమే కారణమని ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఢోకాలేదని శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాస తీర్మానం

  నిన్నవెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా పూర్తిగా జీర్ణించుకోక ముందే, దానినెత్తిన మరో పిడుగు పడబోతోంది. ఈ రోజు డిల్లీలో సమావేశమయిన కాంగ్రెస్ యంపీలు లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, సాయి ప్రతాప్, హర్షకుమార్, యస్పీవై రెడ్డి, సబ్బంహరి తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెచ్చేందుకు లేఖపై సంతకాలు చేసారు. ఈ రోజు సాయంత్రంలోగా దానిని స్పీకర్ మీరా కుమార్ కి అందజేయనున్నారు. కానీ చిరంజీవి, పురందేశ్వరి, కిల్లి కృపా రాణీ, జేడీ శీలం, కావూరి, పళ్ళంరాజు తదితరులు మాత్రం వేనుకంజవేసినట్లు తెలుస్తోంది.   పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశ పెట్టాలంటే కనీసం 55 మంది సభ్యుల మద్దతు తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్ యంపీలు స్వయంగా తమ స్వంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నారు గనుక సభలో ఇతర పార్టీల సభ్యులు కూడా దానికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. స్పీకర్ కాంగ్రెస్ యంపీల అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి అంతకంటే అవమానం మరొకటి ఉండబోదు.   ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో ఓటమితో క్రుంగిపోతున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఇది జీర్ణించుకోవడం కష్టమే. గనుక వారిని బుజ్జగించే పని మొదలుపెడుతుందేమో! అప్పుడు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు వారు కోరినట్లు తెలంగాణా బిల్లులో ఏమయినా మార్పులు చేర్పులకి అంగీకరిస్తే అప్పుడు టీ-కాంగ్రెస్ నేతలు అవిశ్వాసం ప్రతిపాదిస్తారేమో చూడాలి. ఏమయినప్పటికీ సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలు ఆమె పుట్టిన రోజున చాలా అరుదయిన కానుక సమర్పించుకొంటున్నారని ఒప్పుకోక తప్పదు.

కాంగ్రెస్ శని వదిలింది: బాబు

      దేశానికి పట్టిన కాంగ్రెస్ శని వదిలింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దీనిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఫలితాలను కాంగ్రెస్ కూడా స్వాగతించాలి. భవిష్యత్‌లో అవినీతి పార్టీలకు ఇదే గతి పడుతుంది. దేశ ప్రజలు నరేంద్ర మోడీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. ప్రజలు నీతివంతమయిన పాలనకే పట్టం కట్టారు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు అన్నారు. తెలంగాణ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారం చూపిస్తానని చెప్పిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట తప్పారని ఆయన విమర్శించారు. సోనియాగాంధీ చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారని, ఆయన దేనికీ ఎదురు చెప్పడం లేదని తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మీద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశానని అన్నారు.  371 డీ ఆర్టికల్‌ను వర్రీకరించి మాట్లాడుతున్నారని, అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ఏ చట్టం కింద ఉమ్మడి రాజధాని చేస్తున్నారో చెప్పలేదని అన్నారు. నీటి మీద, హైదరాబాద్ మీద కేంద్రం తన పెత్తనం కోసం చూస్తుందని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించే హక్కు కోల్పోయిందని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఈయము, తీసుకోము: అరవింద్

  రాజకీయ దిగ్గజాలయిన కాంగ్రెస్, బీజేపీలకు ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ డిల్లీలో చుక్కలు చూపించింది. ఆమాద్మీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, బీజేపీ అధికారం చెప్పట్టేందుకు కేవలం నాలుగు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమాద్మీ మద్దతు ఇస్తే తప్ప డిల్లీ పీఠం ఎక్కాలనే బీజేపీ కల సాకారం కాదు. అందుకే ఆ పార్టీ తరపున ఎన్నికయిన అభ్యర్ధులతో అప్పుడే బీజేపీ బేరసారాలు మొదలుపెట్టింది. ఈవిషయాన్ని ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా దృవీకరించారు.   అయితే తమ పార్టీ తరపున గెలిచిన వారెవరూ కూడా బీజేపీ ప్రలోభాలకు లొంగేవారు కారని, వారు కూడా తనలాగే ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనే సంకల్పంతోనే రాజకీయాలలోకి వచ్చినందున, ఈ సంకీర్ణ బేరసార రాజకీయాలకు ఇష్టపడటం లేదని అన్నారు. తమ పార్టీ బీజేపీకి మద్దతు ఈయడం లేదా ఆ పార్టీ మద్దతు పుచ్చుకోవడం గానీ జరగదని అరవింద్ కేజ్రీవాల్ నిర్ద్వందంగా ప్రకటించారు. ఎందుకంటే భ్రష్టరాజకీయ సంస్కృతికి ఆలవాలమయిన కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేఖంగా పుట్టిన తమ పార్టీ, నిన్నటి వరకు వాటితో పోరాడి, మళ్ళీ ఇప్పుడు అవే పార్టీలతో జత కడితే, ఇక తమకు వాటికీ ఏమీ తేడా ఉండదని అన్నారు. కాంగ్రెస్ హయంలో లక్షల కోట్ల కుంభకోణాలు నిత్యం వెలుగు చూస్తున్నాయని, అటువంటప్పుడు స్వచ్చమయిన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొనేందుకు మరో 50 లేదా 100 కోట్లు ఖర్చుచేసి మళ్ళీ మరోమారు డిల్లీలో ఎన్నికలు నిర్వహించుకొంటే తప్పుకాదని అన్నారు.   అయితే సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిఈ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన ఆమాద్మీ పార్టీ శాసనసభ్యులు దేశముదురు బీజేపీ చేసే రాజకీయాలకు, ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా ఉండగలరా? వారిని ఆమాద్మీ బీజేపీ నుండి కాపాడుకోగలదా? అరవింద్ కేజ్రీవాల్ కి ఉన్న దృడ సంకల్పం, దృడ నిశ్చయం వారూ కూడా కనబరచగలరా?   ఒకవేళ ఆమాద్మీ పార్టీ తన సిద్దాంతాలను కొంత సడలింపు చేసుకొని, బీజేపీతో జత కట్టి ప్రభుత్వంలో చేరి మరింత బలపడే ప్రయత్నం చేస్తుందా? లేకుంటే నిక్కచ్చిగా తన మాట మీద నిలబడి మళ్ళీ ఎన్నికలు ఎదుర్కొనేందుకే సిద్దపడుతుందా? కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆమాద్మీని మళ్ళీ ఎన్నికలకే పురిగొల్పుతుందా? వంటి ధర్మసందేహాలకు జవాబులు రానున్నరెండు మూడు రోజుల్లోనే తేలిపోవచ్చును.

మంచు మనోజ్‌కు గాయాలు

  టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌కు ప్రమాదం తప్పింది.. ఆదివారం రాత్రి ఓ పెళ్లికి వెళ్తున్న మనోజ్‌ కారు జౌటర్‌ రింగ్‌ రోడ్‌లోని అప్పా జంక్షన్‌ వద్ద ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఓ పడి ఉన్న ఓ గేదె మృతదేహాన్ని డీకొన్న మనోజ్‌ కారు బోల్తాపడి దాదాపు 200 మీటర్ల దూరం రోడ్డుపై రాసుకుంటు వెళ్లింది. ఈ ప్రమాదంలో మనోజ్‌తో పాటు కారు డ్రైవర్‌, బాడీగార్డులు కూడా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఈ ముగ్గురిని బంజార్‌హిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మనోజ్‌ కుడిచేతిపై, కుడి కంటి సమీపంలో గాయలయ్యాని వైధ్యులు తెలిపారు. చికిత్స అనంతరం రాత్రి మనోజ్‌ను డిశ్చార్జ్‌ చేశారు.

ఈ ఫలితాలు కూడా ఆ లెగ్గు మహత్యమేనట!

  దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, అందుకు పార్టీని తప్పుపట్టకుండా,అది అభం శుభం తెలియని రాహుల్ గాంధీ ‘ఐరన్ లెగ్’ మహత్యమేనని జనాలు అవాకులు చవాకులు వాగుతుంటారు. ఏమంటే ఆయన బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీకి మంగళ హారతి ఇచ్చేయలేదా? గుజరాత్ లో పార్టీని పక్కనున్న అరేబియా సముద్రంలో ముంచేయలేదా? అంటూ ఏవో చెత్త చెత్త రికార్డులన్నీ తిరగేసి చూపుతుంటారు. కానీ, ఏ ఒక్కరూ కూడా ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో ఏవిధంగా గెలిపించారో మాత్రం ప్రస్తావించరు.   ఒకవేళ ఈ పామర జనాలకి అది గుర్తు చేసి ఆయన గొప్పదనం గురించి చెప్పబోయినా, “ఆ..అక్కడ గనుల గాలి జనార్ధన్ రెడ్డి, ఎడ్యురప్పల దెబ్బకి బీజేపీ ఓడిపోయిందని కానీ అదేమి ఆయన గొప్పదనం కాదని వితండ వాదనలు చేస్తారు. మరి ‘ఐరెన్ లెగ్గు.. ఐరెన్ లెగ్గు’ అని వెక్కిరించేవారు మరి కర్ణాటకలో ఆ లెగ్గు మహత్యం ఎందుకు కనబడలేదో చెప్పమంటే మాత్రం జవాబు చెప్పరు. కానీ “ఇదిగో ఇప్పుడు చూసారు కదా... నాలుగు రాష్ట్రాలలో లెగ్గు మహత్యం. ఆయన అడుగుపెట్టిన రాష్ట్రాలలో ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలోనయినా కాంగ్రెస్ గెలిచిందా?” అని ఎదురు ప్రశ్నిస్తారు.   “సరే! ఆయన లెగ్గుకే నిజంగా అంత మహత్యం ఉంటే మరి నిత్యం ఆయన పాదదూళితో పునీతమయిపోతున్నడిల్లీలో కాంగ్రెస్ పార్టీ గత 15సం.లుగా గెలుస్తూనే ఉంది కదా?” అని ప్రశ్నిస్తే, ఒక వెర్రి నవ్వు నవ్వి “చరిత్రలొద్దు..చెప్పింది విను” అంటూ 125సం.ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని నిన్నగాక మొన్న పుట్టిన ఒక అమ్ ఆద్మీ చీపురు పట్టుకొని బయటకి ఊడ్చిపడేసినా ఇంకా లెగ్గు మహత్యం అర్ధం కాకపోతే నీకీ రాజకీయాలేందుకు ఈ చర్చలు ఎందుకు?” అంటూ నిలదీస్తారు. అంతే తప్ప పాపం అభం శుభం తెలియని ఆ రాహుల్ బాబు లెగ్గుకి నిజంగా అంత పవర్ లేదంటే ఎవరూ వినిపించుకోరు, కనీసం నమ్మను కూడా నమ్మరు.   పైగా “ఇప్పుడే ఏమి చూసారు? 2014ఎన్నికలలో బాబు లెగ్గు మహత్యం మీరే చూద్దురు గాని” అంటూ వెర్రి వెర్రి కూతలు కూస్తుంటారు. “ప్రస్తుతం తెలుగు గడ్డకి ఆయన లెగ్గు సోకే భాగ్యం లేకపోయినా, కాంగ్రెస్ నేతలు తమ శిరస్సున పూసుకోస్తున్న ఆయన పాదధూళి తగిలినంత మాత్రాన్నేఎన్నికలకు ఇంకా ఆరు నెలల ముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎలా ఊడ్చుకుపోతోందో చూసారా?” అని వెక్కిరింపు ఒకటీ.   ఇక ఆయన ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో అడుగుపెట్టకబోతారా? మేము గెలవక పోతామా? అని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆయన మీదే గంపెడు ఆశలు పెట్టుకొని ఆయన పాదధూళి కోసం అహల్యా దేవిలా ఎదురుచూస్తున్నాయి. అయినా వచ్చేఎన్నికల తరువాత ఆయన ప్రధాని కుర్చీలో లెగ్గు మీద లెగ్గేసుకొని కూర్చొని దేశాన్నిపాలించేస్తుంటే చూడాలని సాక్షాత్ సోనియమ్మ, మన్మొహనులవారే ముచ్చట పడుతుంటే కాదనేనుందుకు ఈ వెర్రి జనాలెవరు?   కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాకపోయినా ఆంధ్రప్రదేశ్ నుండి డిల్లీ వరకు ఈ వీహెచ్, సర్వే,బొత్స,డీయస్, జానా వంటి అనేక మంది కాంగ్రెస్ నేతలున్నారు. వారందరూ ఎప్పుడూ రాహుల్, సోనియా అంటూ నిత్య పారాయణం, భజనలు చేయడమే తప్ప, వారిలో ఒక్కరు కూడా పాపం రాహుల్ బాబు లెగ్గు దోషం (మహత్యం) పోవడానికి చొరవ తీసుకొని ఏ రాహుకేతు పూజలో, నవగ్రహ పూజలో ఎప్పుడయినా చేసారా? అని పామర జనాలు నిలదీస్తున్నారు. అందుకే వారు ఏ మహాత్యమూ లేని పామరులయ్యారని జాలిపడటం తప్ప ఎవరు మాత్రం ఏమి చేయగలరు? అయినా ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఈ వెర్రి జనాలు ఆయన గురించి ఎన్ని అవాకులు చవాకులు వాగినా ఆయన లెగ్గు చాలా పవర్ ఫుల్ లెగ్ అని చచ్చినట్లు ఒప్పుకొంటున్నారు.

ఆమ్‌ఆద్మీ నుంచి పాఠాలు నేర్చుకుంటాం ; రాహుల్‌

  నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. కాంగ్రెస్‌ విజయం కొసం అందరం చాలా కష్టపడ్డామని, షీలా దీక్షిత్‌ కూడా చాలా ప్రయత్నించారని అయినా ఓటమి తప్పలేదన్నారు. ఓటమిని సమీక్షించుకుంటామని, కాంగ్రెస్‌కు తనను తాను సంస్కరించుకునే శక్తి ఉందని, ప్రజల మద్దతు తిరిగి పొందుతామన్నారు. ఆమ్‌ఆదర్మీ పార్టీ విజయంపై మాట్లాడిన ఆయన ఆ పార్టీ నుంచి పాఠాలు నేర్చుకోవటానికి సిద్దమని ప్రకటించారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన వారికి రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు.

కాంగ్రెస్‌కు గుణపాఠం ; జెపి

  ఈ రోజు ప్రకటించిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలకు నిదర్శనం అన్నారు లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ. రెండు సార్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే 4లక్షల 80 వేల కొట్ల విధ్యుత్‌ ప్రాజెక్ట్‌లు నిలిచిపోయాయన్నారు. దేశంలో పేదరికం తొలగిస్తామన్న కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందన్నారు. విద్య, వైధ్యరంగాలతొ పాటు దేశం అన్నిరంగాల్లో విఫలమవ్వటానికి కాంగ్రెస్‌ నిర్ణయాలే కారణం అన్నారు. దేశవ్యాప్తంగా వనరులు పుష్కలంగా ఉన్నా కాంగ్రెస్‌ వాటిని నాశనం చేసిందన్నారు జెపి.

ఇది చారిత్రాత్మక విజయం ; కేజ్రీవాల్‌

  ఢిల్లీలొ ఆమ్‌ఆర్మీ పార్టీ సాదించిన విజయంపై ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది అవినీతి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలలో ఆమ్‌ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ పార్టీని వెనక్కు నెట్టి రెండో స్థానం సాదించింది. కేజ్రీవాల్‌ కూడా షీలా దీక్షీత్‌పై ఘనవిజయం సాదించారు, ఈ ఫలితాలతో ఒక సామాన్యుడు కూడా అధికారం చెపట్టవచ్చని ప్రజలు నిర్ణయించారన్నారు కేజ్రీవాల్‌‌. ఈ ఎన్నికల పోరాటంలో తాము ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నామన్న కేజ్రీవాల్‌‌. అంతిమ విజయం న్యాయానిదే అని ప్రకటించారు.

షీలా దీక్షిత్ పై కేజ్రీవాల్ ఘనవిజయం

      అమ్ అద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై 8,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.ముఖ్యమంత్రి షీలా దీక్షిత్పైనే పోటీకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ మొదట కాస్త వెనకబడినట్లు కనిపించినా, మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. సామాన్య మానవుడే ఇక్కడ గెలిచాడని, కాంగ్రెస్ అరాచకాలకు సరైన సమాధానం చెప్పాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రతీకారం తీర్చుకున్నట్లే ఫలితాలు వచ్చాయి. మొత్తం 70 స్థానాల్లో 23 స్థానాల్లో అమ్ అద్మీ పార్టీ (ఏఏపీ) ఆధిక్యంలో కొనసాగుతోంది.