తెలంగాణ అభ్యుదయ కవి రావెళ్ల కన్నుమూత

      తెలంగాణ తొలి గేయ రచయిత, అభ్యుదయ కవి.. నిజాం వ్యతిరేక పోరాట యోధుడు.. రావెళ్ల వెంకట రామారావు ఇక లేరు. మంగళవారం తన స్వగ్రామం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య సుగుణమ్మ, నలుగురు కుమారులు ఉన్నారు. ఒకచేత తుపాకీతో సాయుధ పోరాటం చేస్తూనే.. మరోచేత కలంపట్టి నిజాం వ్యతిరేక రచనలు సాగించిన సాహితీ దిగ్గజం రావెళ్ల.   సంపన్న వ్యవసాయ కుటుంబంలో లక్ష్మయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించిన ఆయన, చిన్నతనం నుంచే అభ్యుదయతత్వం అలవడింది. కూలీలతో కలిసి పొలం పనులు చేసే ఈయనను ఊరిలోనివారు "ఉన్నత కుటుంబంలో పుట్టిన నీకు కూలిపనులెందుకు'' అని వారించేవారు. కానీ, "కలుపు మొక్కలు ఏరేస్తేనే చేనుకు బలం.. రజాకార్లను తరిమేస్తే తెలంగాణకు వరం'' అని బదులివ్వడమే ఆయన నోట వెలువడిన తొలి కవితగా మారింది. దేశ్‌ముఖ్‌లు రజాకార్లను ఎదిరించినందుకు జైలు జీవితం అనుభవించారు. జైలునే సాహిత్య పాఠశాలగా మార్చుకున్నారు. పద్య, వచన, గేయ కవిత్వంలో అనేక అవార్డులు, బిరుదులు పొందిన రావెళ్ల.. దాశరథి, ఆరుద్ర, శ్రీశ్రీ తదితర ప్రముఖుల సహచరుడు గా పేరొందారు. పల్లెభారతి, జీవనరాగం, అనల తల్పం, రాగజ్యోతులువంటి కవితా సంకలనాలు వెలువరించారు. తెలుగు, ఉర్దూల్లో అద్భుతంగా రాయడంతోపాటు అనర్గళంగా మాట్లాడగలగడం రావెళ్ల మరో ప్రత్యేకత. కాగా.. రావెళ్ల మృతికి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు.

'విభజన'లో ఎవరి కుట్ర ఎంత?

      "సత్యం నావద్ద చాలా ఉంది, చెప్పులు తేరా మగడా! ఇటే నిప్పుల్లో దూకేస్తాను'' అన్నాదట ఒకావిడ వెనకటికి. అలాగే, కొలదిరోజుల నాడు, అంటే చెడిపోయిన కాంగ్రెస్ అధిష్ఠానం, సోనియాగాంధీ తెలుగుజాతిపైన కత్తికట్టి మరీ కసికొద్దీ దేశంలో రెండవ పెద్ద భాషా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ను నిలువునా చీల్చుతూ కుట్ర ద్వారా ఆగమేఘాల మీద కేంద్ర మంత్రివర్గంతో రాష్ట్ర విభజనకు అడ్డగోలుగా నిర్ణయించింది. అంతకుముందు పదవీ ప్రయోజనాల కోసం వేర్పాటు ఉద్యమాన్ని తెలంగాణలో తిష్ఠవేసిన కోస్తాంధ్ర "బొబ్బిలిదొర'' కె.సి.ఆర్. ప్రారంభించినవాడు. కాగా, ఇంతకాలంగా (గత ఐదారేళ్ళుగా) ఆ స్వార్థపూరిత బాటలోనే కొనసాగుతూ అబద్ద ప్రచారాల ద్వారా, తెలుగుప్రజల మధ్య విద్వేష భావాలు రెచ్చగొట్టి భ్రమలద్వారా కొన్ని వందలమంది యువతను ఆత్మహత్యల వైపు ప్రేరేపించిన ఈ 'పెద్దమనిషి' విభజనకు తలొగ్గిన కేంద్రమంత్రివర్గం అందుకు ఆమోదముద్ర వేసిన తరువాత "టీ.వి.-9' చర్చలో పాల్గొంటూ ఒక 'బ్రహ్మసత్యాన్ని' దాచుకోనలేక బయటికి ప్రకటించేశాడు! ఎదుటిపక్షం వారి ప్రశ్నలకు సమాధానంగా కె.సి.ఆర్. "మన అందరి పాట్లూ ఓట్లూ, సీట్ల కోసమేగదా'' అని చాటాడు! ఈ ప్రకటన ద్వారా కృత్రిమంగా, అశాస్త్రీయంగా, అసంపూర్ణ రాజ్యాంగ ప్రక్రియ ద్వారా, రాష్ట్రంలోని ఎనిమిదిన్నర కోట్లమంది తెలుగువారి నిశ్చితాభిప్రాయంతో జనవాక్య సేకరణతో నిమిత్తం లేకుండా గుప్పిడు నాయకులతో "గుడిపూడి జంగాల'' గుసగుసలు జరిపి కేవలం ఎన్నికలలో రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజనకు "టి.వీ.-9'' చర్చ సందర్భంగా బయటపెట్టక తప్పలేదు! అంతకు కొన్నిరోజుల క్రితం - 'విభజన' కుట్రలో అవసానదశకు చేరిన కేంద్రమంత్రివర్గం 'తాతాచార్యుల ముద్ర'వేయకముండు - మంత్రి జైపాల్ రెడ్డి కూడా ఆణిముత్యంలాంటి ఒక ప్రకటన చేశారు : "మేము తప్పులు చేశాం, అబద్ధాలూ ఆడాము'' అన్న మేలుకొలుపులాంటి ఒప్పుకోలు! కాని ఆ "తప్పులేవో'', ఆ "అబద్ధాలు'' ఏవో ఆయన ఆరోజుకీ, ఈ రోజుకీ వెల్లడించనే లేదు.     "అయితే ఇంతకూ, కెసిఆర్ చెప్పిన "మన అందరి పాట్లూ ఓట్లు, సీట్లకోసమే'' అయితే ఆ పాట్లు ఏవో ఉమ్మడి శ్రమ ఫలితమైన విశాలాంధ్రలోనే పడొచ్చుగదా? మరి బంగారం లాంటి రాష్ట్రాన్ని తెలుగుప్రజల మధ్యనే విద్వేషాలు పెంచడంద్వారా విభజించుకోవలసిన అవసరం ఎందుకొచ్చింది? ఒకవేళ ఉమ్మడి రాష్ట్రం సాధిస్తున్న 'ప్రగతి' మార్గంలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయనుకుంటే అవి ఎందుకు తలెత్తుతున్నాయో ఆలోచించుకుని పరిష్కారాలు కనుగోనవలసిన అవసరాన్ని గుర్తించాలి గదా? "ఓట్లు, సీట్లు'' పదవుల కోసమే ఒక్కజాతిగా ఉన్న ప్రజలను, రాష్ట్రాలను ఎక్కడికక్కడ చీల్చి ఛిద్రం చేయడానికి పాలకపక్షాలు సిద్ధమైనప్పుడు, ఫెడరల్ వ్యవస్థ ప్రయోజనాలనూ తద్వారా జాతీయ సమైక్యతనూ, సమగ్రతనూ ఎలా పరిరక్షించడం సాధ్యమో ఈ విభజనవాదులు, వారి అవకాశవాద నాయకత్వం వివరించగలరా? వాళ్ళు ప్రాంతాల మధ్య అసమానతల గురించి పెడుతున్న "గావుకేకల''కు పరిష్కారం లేదా ఒకే ప్రాంతంలోని వివిధ మండలాల మధ్య లేదా స్థానిక ప్రదేశాల మధ్య అసమానతల నిర్మూలన అనేది గత 65 ఏళ్ళలోనూ దేశవ్యాప్తంగా సర్వరంగాల అల్లకుపోయిన పెట్టుబడిదారీ-భూస్వామ్య లేదా అర్థభూస్వామ్య వర్గ వ్యవస్థలో, ఆ వర్గ సమాజంలో సాధ్యపడుతుందన్న విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ లాంటి భాషాప్రయుక్త రాష్ట్రాన్ని బదాబాదాలు చేయడానికి సిద్ధంయ్యారా? అసలు మనం ఉంటున్న, కుందుతున్న ఈ వర్గవ్యవస్థ గురించిన ఒక అవగాహనా, స్పృహా, పాడూ ఈ వేర్పాటువాదుల్లో గానీ ఉందా? ఉంటే, శ్రీకృష్ణ కమిటీగానీ, అంతకుముందు రాష్ట్రాల తొల్లింటి పునర్వ్యవస్థీకరణ కమీషన్ గానీ సమైక్య రాష్ట్రంగా తెలుగుజాతి ఉంటేనే శ్రేయస్కరమని ఎందుకు భావించాల్సివచ్చిందో కేవలం పదవీకాంక్షాపరులయిన వీళ్ళకు ప్రాథమిక జ్ఞానమైనా ఉందా? "మా ప్రాంతం నాయకులుసన్నాసులు'' అని శ్రీకృష్ణకమిటీ ముందు సిగ్గువిడిచి అవమానకరంగా ప్రేలాపించి వచ్చిన 'గుప్పిడు' ప్రాంతీయ వేర్పాటువాదులకు అవగాహనపరంగానూ, జ్ఞానపరంగానూ ఉన్న సత్తా ఏపాటిది? ఆ సత్తా లేదుగనుకనే "అందరి పాట్లూ వోట్లు, సీట్లకోసమే గదా'' అని కాంగ్రెస్ టి.ఆర్.ఎస్. నాయకులు బాహాటంగా మీడియాచర్చలో బయటపడాల్సి వచ్చింది! అయితే తెలుగుజాతికి జరగవలసిన నష్టం కాస్తా జరిగిపోతోంది! "దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే''నన్నది మంచిమాట. కాని ఒకే జాతిగా ఉన్న ప్రజల్ని బలవంతంగా చీల్చడానికి సహితం పదవుల రంధిలో ఉన్న లజ్జాభిమానాలు లేని 'పెద్దలు' కాల్దువ్వడం దుస్సాహమైన పని! ఈ క్షణాన కొన్ని పార్టీలలో జరుగుతున్నా ఓ ప్రత్యేక 'యజ్ఞం' - ఎవడికి వాడు నాయకుడి హోదాలో ఈ 'విభజన' నా వల్లనే సాధ్యమైందని అంటే, కాదు, కాదు నా వల్లను మాత్రమే తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతోంద'ని మరొకడు జెండా ఎత్తడం! ఈ పోటాపోటీలో టి.ఆర్.ఎస్.(కె.సి.ఆర్.), కాంగ్రెస్, 'తెలుగుదేశం', బి.జెపీ.లు  ముందున్నాయి! విభజనకు "ఇండియా దేశీయ సొల్యూషన్'' మాని ఈసారి "ఇటాలియన్ విదేశీ పరిష్కారం'' ముందుకు రావటంతో గుడులూ, గోపురాలూ కూడా నిసిగ్గుగా ఒక ప్రాంతంలో వెలవడం మరొక వెర్రిబాగుల విశేషంగా మారింది; అంతేగాదు, కొన్ని మాసాల క్రితమే ఢిల్లీలో నెలరోజులపాటు కెసిఆర్ ను కాంగ్రెస్ "కట్టుగొయ్య''కు కట్టేసిపడేసిన అధిష్ఠానం అతని స్థానిక పార్టీని కాంగ్రెస్ రథచక్రపు ఇరుసులో చాకచక్యంతో పడేయడంతో అతను టి.ఆర్.ఎస్.ను 'కాంగ్రెస్ గంగ'లో కలపడానికి హామీపడి వచ్చాడు. ఆ తర్వాతి రాజకీయమంతా ముసుగులో మాత్రమే గుద్దులాటగా మారి, కొన్నాళ్ళు నాటకీయంగా మాత్రం అతను టి.ఆర్.ఎస్.ను అతడు కాంగ్రెస్ కు దూరంగా ఓ 'స్వతంత్ర'శక్తిగా అట్టిపెట్టినట్టు 'బిల్డప్' యిచ్చాడని జనాలకు తెలిసిపోయింది! ఈలోగా కాంగ్రెస్, మధ్యప్రదేశ్ ను రెండుసార్లుగా బిజెపికి పళ్లెరంలో పెట్టి అందించి ఇప్పుడు మూడోసారి కూడా బిజెపికే ధారాదత్తం చేయడానికి సిద్ధమై పంజరంలో చిక్కుకున్న దిగ్విజయ్ సింగ్ టి.ఆర్.ఎస్. నాయకుడితో అహోరాత్రులు సంప్రతింపులలోనే ఉన్నాడని మరచిపోరాదు! ఈ గుంపు చింపులలోనూ తడికె రాయబారాల్లోనూ దాగిన అసలు రహస్యం - కాంగ్రెస్ లో నీ పార్టీని కలిపేస్తే "తెలంగాణా యిస్తా''మని కె.సి.ఆర్.ను దువ్వడమూ, 'కాదు నీవు ముందు ఏదో రూపంలో రాష్ట్రాన్ని విడగొట్టేసి తెలంగాణాను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటిస్తే ఎలాగూ కలవాలనుకున్నాం కాబట్టి కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను కలిపేసి'' తానూ చేతులు దులుపుకుంటానని కాంగ్రెస్ కు చాల విధేయుడై ఉండటానికి సిద్ధంగా ఉన్నానని కెసిఆర్ హామీ పడటమూ ప్రజలకు తెలిసిపోయింది. అయితే ఈలోగా కెసిఆర్ పరిణామం ఎటుపోయి ఎటొచ్చినా మంచిదనుకుని సమాంతరంగా కాంగెస్ కు తెలియకుండా బిజెపితో కూడా రహస్యంగా సంప్రతింపులు జరుపుతూ వచ్చాడు! కనుకనే "సామాజిక తెలంగాణా సంయుక్త కార్యాచరణ సంఘం'' చైర్మన్ గాలి వినోద్ కుమార్ కూడా కెసిఆర్ అంతర్గత నాటకాన్ని కనిపెడుతూ వచ్చి, ఒక హెచ్చరిక కూడా చేశాడు : "కెసిఆర్ బిజెపితో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకోవడం వల్లనే కేంద్రం కెసిఆర్ కు కళ్ళెం వేసేందుకు 'రాయల తెలంగాణా' పేరిట ప్రకటన విడుదల చేయడం గమనార్హం!'' తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే కాంగ్రెస్ లో టి.ఆర్.ఎస్.ను కలిపేస్తానని మాట యిచ్చిన కెసిఆర్ తర్వాత మాట మార్చడం వల్లనే కేంద్రం "రాయల తెలంగాణా'' ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని వినోద్ కుమార్ బహిర్గతం చేశాడని వినోద్ కుమార్ చెప్పాడు! కాని ఇప్పుడు 'విభజన'కు కేంద్ర కాంగ్రెస్ మంత్రివర్గం ఆమోదించినందున రాష్ట్రంలో ఒక ప్రాంతంలో సంబరాలు జరుగుతూ, మరొక ప్రాంతంలో సమ్మెలు, బంద్ లూ, తీవ్ర నిరసనలు, సోనియా, రాహుల్ ల చిత్రాలు జనం తగలబెడుతున్నారు' సమ్మెలకు దిగుతున్నారు. కాగా సోనియా జన్మదినమైన "డిసెంబర్ 9''నాడు ఒకరు బాణాసంచాలు కాలవడానికి సిద్ధమవ్వగా, మరొక ప్రాంతంవారు సోనియా బొమ్మలు నిర్విరామంగా తగలబెడుతున్నారు! ఆ వరసలోనే "ఇటాలియన్ తల్లి''నే 'తెలుగుమాట' అనుకుని, నిరంకుశ నైజాము సమాధివద్ద ఓట్ల కోసం ఎంతగా కెసిఆర్ సాగిలపద్దాడో అంతగానూ సోనియాకూ మొక్కాడు! "ఇదే తెలుగుదనం, ఇదే తెలంగాణా తల్లి' అనుకుందామన్నాడు. కాని "డిసెంబర్ 9'' ఒకరి జన్మదినోత్సవదినం కాగా, మరొకరికి తెలుగుప్రజలకు ఏకకాలంలో అదే "విద్రోహదినం'' కాబోతున్నది! ఏ సమస్యనూ కూలంకుషంగా పరిష్కరించలేని సంక్షోభంలోకి కాంగ్రెస్ జారుకుని, మరిన్ని సమస్యలను తెలుగువారి మెడకు చుట్టబోతోంది! పైగా ప్రాజెక్టుల గురించి, సేద్యపునీతి సౌకర్యలందించే కృష్ణ-గోదావరులనుంచి అందవలసినంతగా నీరు అందేటట్లు చూస్తామని ఇప్పుడు చెబుతున్న కేంద్రం రేపు వూడిపోయిన తర్వాత ఈ హామీలను నెరవేర్చేనాధుడంటూ ఉండడుగాక ఉండదు. గాలిలో దీపంగానూ, గాలి కబుర్లగానూ మిగిలిపోతాయి! మన కాలంలోనే కాంగ్రెస్, బిజెపి పాలనలలో ఇలాంటి వింతలు చూశాం. కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ కూడా ఒకరి పథకాలను మరొకరు, ఒకరి హామీలను మరొకరూ తుంగలో తొక్కి, ప్రజలను ఇబ్బందులపాలు చేయడమూ చూశాం. అలాగే ఇటీవల కాలం తెలుగుదేశం, కాంగ్రెస్ పాలనలలో కూడా ఇలాంటి తమాషాలు, పథకాలు తారుమారు కావడాలు చూస్తున్నాం! ఈ పరస్పర హామీలను వాటి తర్వాత వచ్చే పాలకులు గౌరవించి, నేరవేర్చాలన్న [ప్రజా వ్యతిరేక పథకం కాకుండా ఉంటే] మాండేట్ కు రాజ్యాంగ నిబంధనలలో ఒక ధర్మసూత్రంగా చట్టబద్ధత కల్గించాలి!   కాని, పాలకులు కల్లుతాగిన కోతుల్లా వ్యవహరించినంత కాలం ఈ నైతిక పరిస్థితిని చూడలేము! "లాభం లేనిదే వ్యాపారి వరదనుపోడు'' అన్న సామెత ప్రకారం పెట్టుబడిదారీ - భూస్వామ్య ధనికవర్గ వ్యవస్థ దేశంలో కొనసాగినంత కాలం, తెలుగుజాతిని విడగొట్టాలన్న స్వార్థపూరిత ఆకాంక్షతో తలపెట్టిన కృత్రిమ విభజనవల్ల కూడా రెండుప్రాంతాల ప్రజలకు, ముఖ్యంగా అసంఖ్యాకంగా ఉన్న బహుజన, బడుగువర్గాల ప్రజలకు మేలు జరుగదు సరిగదా కీడు మాత్రమే జరుగుతుంది! ఆ ఒనగూడే మేలూ, మంచీ మాత్రం సంపన్న, మోతుబరి వర్గాలకు మాత్రమే యథాతధంగా అమరుతూవుంటాయి! నేటి దోపిడీవ్యవస్థ రద్దు కానంతకాలం రేపటి సత్యం కూడానని మరచిపోరాదు! ఎందుకంటే, మన తెలంగాణలో తిరిగి రాబోతున్నది కూడా - దొరల, ఇతర భూస్వామ్యవర్గాలదేగాని, దళితులదీ, కష్టజీవులదీ కాదు, కాబోదు! దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తాననేవాడు, ఆ దళితుడినుంచి ఎలా ప్రయోజనం పొందాలో చూస్తాడు. ఆ క్రమంలో దళితుడ్నీ అవినీతిలోకి దించగలడు! 

పీసీసీ బొత్సకు జేసీ కౌంటర్ అటాక్

      కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్షీణదశకు వచ్చిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని ఆయన అన్నారు. ముందుగా పార్టీ నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను సస్పెండ్ చేయాలని, తర్వాత కేంద్ర, రాష్ట్ర నేతలను సస్పెండ్ చేయాలని, అనంతరం తనను సస్పెండ్ చేయాలని జేపీ వ్యాఖ్యానించారు.   కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆరోగ్యం సరిగాలేదని, పార్టీలో మార్పు రావాలని, మంచి వ్యక్తికి బాధ్యతలు అప్పగించాలని కోరామని, ఇందులో ఏమైనా బూతులు ఉన్నాయా అంటూ జేసీ ప్రశ్నించారు. ప్రాంతీయ శక్తులు బలపడితే దేశానికి ప్రమాదమని, జాతీయ పార్టీలు బలంగా ఉండాలనే ఉద్దేశంతో పార్టీ బలోపేతానికి సూచనలు మాత్రమే చేశారని ఆయన పేర్కొన్నారు. తాను సమైక్యవాదినని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నానని, సమైక్యం వీలు కాకపోతే రాయల తెలంగాణ ఇవ్వాలని కోరానని జేసీ పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవి వదులుకోడానికి సిద్ధపడే సమైక్యవాదం వినిపిస్తున్నారని జేసీ పేర్కొన్నారు.

అవిశ్వాసం అందుకు కాదట!

  స్వయంగా కాంగ్రెస్ యంపీలే తమ యుపీయే ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రతిపాదిస్తున్నారు గనుక, ఇంకా ఘోర పరాభవం మూట కట్టుకోక ముందే కాంగ్రెస్ పార్టీ గద్దె దిగడం మంచిదని ఒక బీజేపీ నేత అభిప్రాయం వ్యక్తం చేసారు. తమ పార్టీ ఒక్క తెలంగాణా అంశంపై తప్ప ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ఏ పార్టీ ప్రతిపాదించే ఏ (అవిశ్వాస) తీర్మానానికయినా తాము మద్దతు ఇస్తామని తెలిపారు. అదేవిధంగా త్రిణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మరియు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తమ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతుందని ప్రకటించారు. అంటే ఒకవేళ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే కాంగ్రెస్ పార్టీకి గండం తప్పదని స్పష్టం అవుతోంది.   అయితే ఇటువంటి సమయంలో కాంగ్రెస్ మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వాన్నిపడగొట్టాలనే ఉద్దేశ్యంతో తాము అవిశ్వాస తీర్మానం పెట్టదంలేదని, కేవలం తెలంగాణా బిల్లుకి బ్రేకులు వేయడానికేనని ప్రకటించడంతో సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు మళ్ళీ మరో కొత్త నాటకం ఆడుతున్నారని ఆయన ప్రకటించినట్లయింది. రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి ఉన్నపటికీ, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే ఇటువంటి సమస్యలు తప్పవని ఆయన అన్నారు.

అవిశ్వాస నోటీసులపై స్పీకర్ ప్రకటన: వాయిదా

      సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తనకు అందిందని లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ సభలో ప్రకటించారు. సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ ఎంపీలు వెల్ లోకి పలు మార్లు దూసుకెళ్లి లోక్ సభ సమావేశాలకు ఆటంకం కలిగించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించే సరికి మరోసారి సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.   సభ్యులు ఆర్డర్ లో లేకపోవడం, సభలో నినాదాలు హోరెత్తుతున్న నేపథ్యంలో సభ వాయిదా వేశారు. స్పీకర్ ముందు ఇప్పుడు రెండు అవిశ్వాస తీర్మానాలున్నాయి. ఈ రెండింటిలో ఒకటి భారతీయ జనతాపార్టీ స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టారు. రెండోది సీమాంధ్ర ఎంపీలు పెట్టిన అవిశ్వాసం. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసానికి తగినంత సభ్యుల బలం లేని నేపథ్యంలో బీజేపీ పెట్టిన అవిశ్వాసమే మొదట చర్చకు వస్తుందని భావిస్తున్నారు.

సొంత పార్టీ పైన అవిశ్వాస౦ హస్యాస్పదం: చిరు

      యూపీఎ ప్రభుత్వం మీద సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం హస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర విభజన విషయంలో సరయిన సమయంలో ఎవ్వరూ స్పందించలేదు. ఈ సమయంలో ఇలా చేయడం తప్పు. లోక్ సభలో ఈ తీర్మానం పెట్టడం ఏ మాత్రం ఉపయోగకరం కాదు అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎంపీలు తీసుకున్న నిర్ణయం తప్పని అన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోయామని సోనియాగాంధీ రాజీనామాను కోరడం సరికాదు. గెలుపు..ఓటములు రాజకీయాలలో సహజం. తెలంగాణ విషయంలో అధిష్టానం మీద వత్తిడులు తేవడానికి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి అని చిరంజీవి అన్నారు.

ఆమాద్మీముందు ప్రజారాజ్యం దిగదుడుపే

  ఆమాద్మీపార్టీ స్థాపించి ఏడాది కూడా తిరగకుండానే డిల్లీలో కాంగ్రెస్, బీజేపీలకు చుక్కలు చూపించింది. ఇంచుమించు అటువంటి గొప్ప ఆశయాలతోనే మన రాష్ట్రంలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం, జయప్రకాశ్ నారయణ లోక్ సత్తా పార్టీలు స్థాపించారు. కానీ, రెండు పార్టీలు కూడా ఆమ్మాద్మీలాగ నిలద్రోక్కుకొని తమ సత్తా చూపలేకపోయాయి.   లోక్ సత్తా నామ మాత్రంగా ఇంకా రాష్ట్రంలో కనబడుతున్నపటికీ ప్రజారాజ్యం మాత్రం పదవుల కోసం తన ఆశయాలకు, సిద్దాంతాలకు తిలోదకాలు ఇచ్చేసి నిర్లజ్జగా కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయింది. పోనీ దానివల్ల చిరంజీవి, ఆయన అనుచరులు ఏమయినా బావుకొన్నారా? అంటే అదీ లేదు. రాష్ట్ర విభజన ఉచ్చులో చిక్కుకొని ఏడాది తిరగకుండానే మళ్ళీ వారందరి పరిస్థితి మొదటికి వచ్చేసింది. ప్రజారాజ్యం స్థాపించక ముందు రాష్ట్ర ప్రజలు, అభిమానులు ఆ పార్టీపై ముఖ్యంగా చిరంజీవిపై చాలా ఆశలు పెట్టుకొన్నారు. అయితే అడుగడుగునా పొరపాట్లు చేస్తూ ఎన్నికలు ముగిసేసరికే తన పరువు, పార్టీ పరువు రెండూ కూడా పూర్తిగా పోగోట్టుకొన్న ఏకైక జీవి చిరంజీవి.   గతంలో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ కేవలం తొమ్మిది నెలలలోనే రాష్ట్రంలో అధికార పగ్గాలు చెప్పటడం చూసి, చిరంజీవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనకున్నఅశేష ప్రజాభిమానంతో అధికారం కైవసం చేసుకొని ముఖ్యమంత్రి అయిపోదామనే లక్ష్యంతో పార్టీని పెట్టారు. కానీ ఆయన ఏ అభిమానుల అండ చూసుకొని పార్టీ పెట్టారో ఆ వీరాభిమానులను అందరినీ దూరంగా ఉంచడం, పార్టీలో వారికి ఎటువంటి పాత్ర లేకుండా చేయడం ఆయన చేసిన అతిపెద్ద పొరపాటు. అందువల్ల ఆయన ఎన్నికల ప్రచారంలో ఎన్ని గొప్ప ఆశయాలు, సిద్దాంతాలు వల్లె వేసినా ప్రజలు ఆయనను నమ్మలేదు.   ఆమాద్మీ పార్టీ, తెదేపా రెండూ కూడా కేవలం ప్రజాభిమానంతోనే అతి తక్కువ వ్యవధిలోనే అపూర్వ విజయాలు సాధించగా, ప్రజాభిమానం పుష్కలంగా ఉన్నపటికీ ప్రజారాజ్యం అతితక్కువ వ్యవధిలోనే దుఖాణం కట్టేసుకొని సరి కొత్త రికార్డు నెలకొల్పింది. ఎన్నికలలో ఓడిపోయినా తరువాతయినా చిరంజీవి తన తప్పు తెలుసుకోలేదు. కనీసం పశ్చాత్తాప పడలేదు. పద్దతులు కూడా మార్చుకోలేదని తదనంతర పరిణామాలు స్పష్టం చేసాయి. ఈరోజుకి కూడా ఆయన వ్యవహరిస్తున్నతీరుని ప్రజలందరూ ఆక్షేపిస్తూనే ఉన్నారు. ఆమాద్మీ పార్టీతో పోలిస్తే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా అశేష ప్రజాదారణ ఉండేది. కానీ దానిని సరిగ్గా ఉపయోగించుకోలేక ఒక గొప్ప అవకాశాన్ని పోగొట్టుకొంది.   ఇక గత ఎన్నికలలో కులం, డబ్బు, రాజకీయ సమీకరణాల ముందు లోక్ సత్తా పార్టీ కొట్టుకుపోయింది. ఆ తరువాత నుండి లోక్ సత్తా కూడా వాస్తవ పరిస్థితులకి అనుగుణంగా మాట్లాడుతూ వ్యవహరించడం మొదలుబెట్టింది. దానివల్ల ఆ పార్టీ ఎటువంటి లాభం పొందలేకపోయినా క్రమంగా ఉన్న పేరు కూడా పోగొట్టుకొంది. లోక్ సత్తా, ప్రజా రాజ్యం పార్టీలు రెండూ కూడా గొప్ప ఆశయాలతో ఆరంభమయినవే, కానీ ఆమాద్మీ పార్టీ లాగ ఎందుకు విజయవంతం కాలేకపోయాయి అని ప్రశ్నించుకొంటే, సరయిన ప్రణాళిక లేకపోవడం, వల్లె వేస్తున్న ఆశయాలు, సిద్దాంతాల పట్ల చిత్తశుద్ది లేకపోవడం, ప్రజలతో మమేకం కాలేకపోవడం ముఖ్యకారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ రెండు పార్టీల తీరు, వైఫల్యం చూసిన తరువాత ఇక ముందు పుట్టుకొచ్చేఏ పార్టీలని కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి లేకుండా పోయింది.  

స్పీకర్ పై బిజెపి అవిశ్వాస తీర్మానం

      భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాకుండా స్పీకర్ మీరా కుమార్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించడం ఆసక్తికరంగా ఉంది. సొంత పార్టీ ఎంపీలే కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాసం నోటీసు ఇచ్చిన నేపధ్యంలో భారతీయ జనతా పార్టీ ఏమి చేస్తుందన్న చర్చ మొదలైంది. కాని కేంద్ర ప్రభుత్వంపై కాకుండా,స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బిజెపి నిర్ణయించడం విశేషం. బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసిన అనంతరం 2జీ కేసులో జేపిసీ నివేదికపై, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయించింది. తెలంగాణపై తప్ప ఏ అంశంపై అవిశ్వాసం ఇచ్చినా మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

'కాంగ్రెస్' గోవిందా..గోవింద

      కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డి పార్టీ అధినాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, గోవిందా..గోవింద అని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవవికి రాజీనామా చేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వం పడిపోయే స్థితిలో ఉందని, తెలంగాణ బిల్లు ఆగిపోయే అవకాశాలున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సోనియా తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు. రాహుల్ కానీ, ప్రియాంక కానీ వస్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారుతుందని తాను చెప్పలేనని, అయితే పార్టీకి కొత్త నాయకత్వం రావాలన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీ రావలసిన అవసరం ఉందని, కొత్త పార్టీ రాకపోతే ఇపడు కాంగ్రెస్‌లో ఉన్న వారు ఎక్కడిపోతారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ మళ్ళీ గోతిలో పడిందా

  కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ అధిష్టానానికి ఈవారంలో గ్రహస్థితి అంత అనుకూలంగా ఉన్నట్లు కనబడటం లేదు. నాలుగు రాష్ట్రాలలో తుడిచిపెట్టుకు పోయి బాధపడుతున్న కాంగ్రెస్ అధిష్టానంపై మూలిగే ముసలి నక్కపై తాటిపండు పడినట్లు తన స్వంత పార్టీ యంపీలే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. ఒకవేళ అదికూడా దాని కుయుక్తులలో భాగమే అనుకొన్నప్పటికీ, వారిని చూసి తెదేపా,వైకాపాలు కూడా అవిశ్వాస తీర్మానాలకు నోటీసులు ఇవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయింది. ఒకవేళ ఈవిధంగా నాటకమాడి తన యంపీలపై వేటు వేసి సీమాంధ్రలో వారి రేటింగ్ మళ్ళీ పెంచి లాభపడాలని కాంగ్రెస్ అధిష్టానం దురాలోచన చేసి ఉండి ఉంటే, ఇప్పటికే పూర్తిగా కోల్పోయిన పార్టీ పరువును ఇంకా పోగొట్టుకోవడానికి అది సిద్దం అయినట్లే భావించవలసి ఉంటుంది.   ఏమయినప్పటికీ, కాంగ్రెస్ యంపీలను చూసి తెదేపా, వైకాపాలు కూడా పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టబోవడంతో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటులో మరో అగ్ని పరీక్ష ఎదుర్కోక తప్పదు. మంచి ఊపు మీద ఉన్నబీజేపీ, ఇదే సమయంలో మధ్యంతర ఎన్నికలకి వెళ్ళడం వలన తనకి ఎక్కువ లాభం ఉంటుందని భావిస్తే, ఇదే అదునుగా భావించి వారి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్నిపడగొట్టినా ఆశ్చర్యం లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెసేతర పార్టీలను కలిసి మద్దతు కూడగడుతునందున, వారు కూడా ప్రభుత్వానికి పడగొట్టేందుకు ‘సై’ అంటే కాంగ్రెస్ పని అయిపోయినట్లే.   అయితే దీనివలన కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద నుండి ఒక పెద్ద సమస్య దింపుకొనే అవకాశం కూడా కలుగుతుంది. రాష్ట్ర విభజనపై ముందు నుయ్యి, వెనక గొయ్యి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఆపార్టీ ఇదే అదునుగా ఈ సమస్య నుండి బయట పడవచ్చును. తమ పార్టీనే మళ్ళీ ఎన్నుకొంటే మిగిలిన ప్రక్రియను వేగంగా పూర్తిచేసి తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అక్కడి ప్రజలకు, ఏదో ఒక సాకు చూపి మరో రెండు మూడేళ్ళయినా ఈ సమస్యను సాగాదీస్తామని తన సీమాంధ్ర నేతల చేత అక్కడి ప్రజలకు భరోసా ఇచ్చి ఎన్నికలలో గెలిపించమని కోరే అవకాశం ఉంది.   కానీ దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేఖ పవనాలు వీస్తున్న ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఇది రాజకీయ ఆత్మహత్యతో సమానమే గనుక ఏ విధంగానయినా ఈ అవిశ్వాస గండం గట్టెక్కే ప్రయత్నం చేయకతప్పదు. కాంగ్రెస్ యంపీలు పెడుతున్న అవిశ్వాస తీర్మానం సంగతి ఎలా ఉన్నపటికీ, వైకాపా, తెదేపాల తీర్మానాల వలన మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండమే ఉండవచ్చును.

ఎవరి అవిశ్వాసం వారిదే

  రాష్ట్ర విభజన ప్రక్రియకి ముందు తెలంగాణాలో, తరువాత సీమాంధ్రలో రాజకీయ పార్టీలు పోటాపోటీగా ఉద్యమాలు, రాజీనామాలు, గర్జనలు, ఘీంకారాలు, ధర్నాలు, రాస్తా రోకోలు, మానవ హారాలు, (ఐదు రోజుల) ఆమరణ నిరాహార దీక్షలు, బందులు, రోడ్ షోలు, రాష్ట్రపతికి విజ్ఞప్తులు అన్నీదశలు చకచకా దాటిన తరువాత ఇక ఆఖరిగా అవిశ్వాస తీర్మానాల దశకు చేరుకొన్నాయి. ఓం ప్రధమంగా ముందు కాంగ్రెస్ నేతలే ఈ పోటీకి ఎర్ర జెండా ఊపి మొదలుపెట్టగానే, ఆ మాత్రం సైగ చాలు మేమూ అల్లుకుపోగలమంటూ తెదేపా, వైకాపాలు కూడా పోటాపోటీగా అవిశ్వాస తీర్మానాల నోటీసుల మీద సంతకాలు గీకేసి స్పీకర్ టేబిల్ మీద పడేసి హడావుడిగా మీడియాను పిలిచి ఆసంగతి వారి చెవిన వేసేసిన తరువాత గుండెల మీద నుండి పెద్ద భారం దింపుకొన్నట్లు ‘హమ్మయ్యా!’ అని ఓ నిటూర్పు విడిచారు.   కాంగ్రెస్ పార్టీలో అవిశ్వాసులు: లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, సబ్బం హరి. వైకాపాలో జగన్మోహన్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి. తెదేపాలో నామా నాగేశ్వరరావు, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొణకళ్ల నారాయణరావు, రమేష్ రాథోడ్ మొత్తం అందరూ కలిపి 13 మంది ఉన్నారు.   అయితే వీరందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా అవిశ్వాసం పెట్టదలచినప్పుడు ఒకరు ప్రతిపాదిస్తే మిగిలిన వారు దానికి సభలో మద్దతు తెలిపినా అది కూడా అవిశ్వాసమే. కానీ ఆవిధంగా చేస్తే ఆ ‘అవిశ్వాస క్రెడిట్’ అంతా సదరు పార్టీ ఖాతాలోనే జమా అవుతుంది తప్ప తమ స్వంత ఖాతాలలో జమా అవదు. పైగా ఆవిధంగా చేస్తే మళ్ళీ దానిని సీమాంధ్రలో క్లైయిం చేసుకోవడానికి కూడా వీలుండదు గనుక ఎవరి అవిశ్వాసం వారిదే. దానిని ప్రజలు అపార్ధం చేసుకోకూడదు మరి. తెలంగాణాలో క్రెడిట్ కోసం ప్రస్తుతం తెలంగాణాలో అన్నిపార్టీలు ఏవిధంగా తిప్పలు పడుతున్నాయో ఇది కూడా అటువంటిదే నన్నమాట. ఇది వినేందుకు చాలా ఎబ్బెట్టుగా ఉన్నపటికీ నిజం మాత్రం ఇదే. వీరి అవిశ్వాసాలతో ప్రభుత్వం పడిపోకున్నా, ఆ ప్రయత్నం మేమే చేసామని చెప్పుకోవడానికయినా పనికి వస్తుంది కదా! అనే వారి ప్రధాన ఉద్దేశ్యం.

మిజోరాంలో కాంగ్రెస్ కి ఓదార్పు

      నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఓటమితో కుంగిపోయిన కాంగ్రెస్ పార్టీకి మిజోరంలో కొంత ఊరట లభించింది. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 24 స్థానాలలో గెలవగా, మరో ఆరు స్థానాలలో ఆధిక్యంలో ఉంది.ముఖ్యమంత్రి లాల్ తన్హాల్వా తన సొంత నియోజకవర్గం సెర్చీఫ్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎంఎన్ఎఫ్ అభ్యర్థి సి లాల్ రామ్ జావాపై 734 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన్హాల్వాకు 5719, లాల్ రామ్ జావాకు 4985 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపై సీఎం లాల్ తన్హాల్వా హర్షం వ్యక్తం చేశారు. ఇది చిన్న రాష్ట్రం అయినా ,ఈ తరుణంలో ఇది కాంగ్రెస్ కు కొంత ఉపయోగపడేదే.

అవిశ్వాస౦పై సోనియా ఆగ్రహం

      యూపీఏ ప్రభుత్వంపై స్వంత పార్టీ ఎంపీలు స్పీకర్ మీరాకుమార్ ను కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు ? అని ఆరాతీస్తున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఆరుగురు ఎంపీల మీద చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.   అయితే అన్నింటికి సద్దపడే తాము అవిశ్వాస తీర్మానం స్పీకర్ కు ఇచ్చామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. సమైక్యాంధ్ర గురించి సీమాంధ్ర ప్రజల నుండి తమ మీద తీవ్ర వత్తిడి వస్తుందని, అందుకే కేంద్రం మీద అవిశ్వాస తీర్మానం పెట్టామని ఆయన అన్నారు. తమకు ఊహించని రీతిలో తమ అవిశ్వాసానికి మద్దతు లభిస్తోందని ఎవరు ఎప్పుడు తమకు మద్దతు తెలుపుతారో చెప్పలేమని అన్నారు. అయితే అవిశ్వాస తీర్మానం సమర్ధంగా ఎదుర్కొంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు.

యూపిఎ పై సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస౦

      రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీమాంధ్ర టిడిపి ఎంపీలు యూపిఎ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ సభాపతి మీరా కుమార్‌కు నోటిసు ఇచ్చారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కొణకళ్ల నారాయణ, శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప స్పీకర్‌కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు.   సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీల అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభాపతి మీరా కుమార్‌కు సోమవారం అవిశ్వాస నోటీసులు అందజేసింది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ఎంపీలు వరుసగా అవిశ్వాస నోటీసులు ఇస్తున్నారు. ఆ పార్టీ ఎంపీలు వైయస్ జగన్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన ఎస్పీవై రెడ్డి ముగ్గురు సంతకాలు చేసిన నోటీసును స్పీకర్‌కు అందజేశారు.

సోనియా గుడికి శంకర్రావు శంకుస్థాపన

      ఇందిరాగాంధీ కుటుంబ౦పై వీరవిధేయత ప్రదర్శించే మాజీ మంత్రి శంకర్రావు తన స్వామి భక్తి ని మరోసారి చాటుకున్నారు. రాష్ట్ర విభజనకు అంగీకారం తెలిపిన యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి గుడి కట్టేందుకు పూనుకున్నారు. షాద్ నగర్ నియోజకవర్గంలో కొత్తూరు మండలం నందిగామలో ఈ రోజు ఉదయం సోనియా గుడికి శంకుస్థాపన చేశారు. శంకర్రావు మాట్లాడుతూ సీమాంధ్రులు చరిత్ర హీనులుగా మారుతారని, సీమాంద్రులు రాజీవ్ విగ్రహాలు కూల్చడం దారుణమని విమర్శించారు. నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి స్థానిక నేతల వైఫల్యమే కారణమని ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు ఢోకాలేదని శంకర్రావు ధీమా వ్యక్తం చేశారు.

కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాస తీర్మానం

  నిన్నవెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా పూర్తిగా జీర్ణించుకోక ముందే, దానినెత్తిన మరో పిడుగు పడబోతోంది. ఈ రోజు డిల్లీలో సమావేశమయిన కాంగ్రెస్ యంపీలు లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, సాయి ప్రతాప్, హర్షకుమార్, యస్పీవై రెడ్డి, సబ్బంహరి తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెచ్చేందుకు లేఖపై సంతకాలు చేసారు. ఈ రోజు సాయంత్రంలోగా దానిని స్పీకర్ మీరా కుమార్ కి అందజేయనున్నారు. కానీ చిరంజీవి, పురందేశ్వరి, కిల్లి కృపా రాణీ, జేడీ శీలం, కావూరి, పళ్ళంరాజు తదితరులు మాత్రం వేనుకంజవేసినట్లు తెలుస్తోంది.   పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశ పెట్టాలంటే కనీసం 55 మంది సభ్యుల మద్దతు తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్ యంపీలు స్వయంగా తమ స్వంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నారు గనుక సభలో ఇతర పార్టీల సభ్యులు కూడా దానికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. స్పీకర్ కాంగ్రెస్ యంపీల అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి అంతకంటే అవమానం మరొకటి ఉండబోదు.   ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో ఓటమితో క్రుంగిపోతున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఇది జీర్ణించుకోవడం కష్టమే. గనుక వారిని బుజ్జగించే పని మొదలుపెడుతుందేమో! అప్పుడు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు వారు కోరినట్లు తెలంగాణా బిల్లులో ఏమయినా మార్పులు చేర్పులకి అంగీకరిస్తే అప్పుడు టీ-కాంగ్రెస్ నేతలు అవిశ్వాసం ప్రతిపాదిస్తారేమో చూడాలి. ఏమయినప్పటికీ సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలు ఆమె పుట్టిన రోజున చాలా అరుదయిన కానుక సమర్పించుకొంటున్నారని ఒప్పుకోక తప్పదు.