తెలంగాణా బిల్లుపై చర్చజరుగుతుందా
posted on Dec 14, 2013 9:11AM
పార్లమెంటు, శాసనసభలలో ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నతీరు చూస్తే ప్రజలకు వారిపట్ల ఏహ్యభావం పెరుగుతోంది. అయినప్పటికీ వారు నిర్లజ్జగా తమ ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. తమ తమ పార్టీల వ్యూహాలకు అనుగుణంగా వారు చట్టసభలలో ఏదోఒక అంశం లేవనెత్తి దానిపై వెంటనే చర్చజరగాలని బిగ్గరగా అరుపులు కేకలు వేస్తూ అసలు ఏ చర్చజరగకుండా సభను స్థంభింపజేస్తూ విలువయిన ప్రజాధనాన్ని అంతకంటే విలువయిన కాలాన్నికావాలనే వృదా చేస్తున్నారు. ఈ ప్రక్రియనే చట్టసభల సమావేశాలుగా భావించవలసిన దుస్థితి ఏర్పడింది.
ఇక, రాష్ట్ర విభజన బిల్లుని శాసనసభలో వెంటనే ప్రవేశపెట్టాలని కొందరు, వద్దని మరి కొందరు, సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని మరికొందరూ అరుపులు కేకలు పెట్టుకొన్న తరువాత సభ సోమవారానికి వాయిదా పడింది. అయితే సోమవారంనాడు సభ మళ్ళీ సమావేశమయినపుడు కూడా పరిస్థితి ఇంతకంటే గొప్పగా ఉంటుందని భావించలేము. దానివల్ల కీలకమయిన రాష్ట్ర విభజన బిల్లుపై సభలో ఎటువంటి చర్చజరగకుండానే రాష్ట్రపతి ఇచ్చిన పుణ్యకాలం కూడ పూర్తయిపోయినా ఆశ్చర్యం లేదు.
రాష్ట్రంలో అన్ని రాజకీయపార్టీలు ఈ రాష్ట్ర విభజన అంశం ద్వారా లబ్దిపొందాలనో లేకపోతే నష్టపోకూడదనో లేకపోతే చర్చ జరగకుంటేనే తమకు మేలని భావించడం వలననో మొత్తం మీద సభలో రాద్దాంతం చేస్తూ రోజులు దొర్లించే ప్రయత్నం చేస్తున్నట్లున్నాయి. అందువల్ల రాష్ట్ర విభజన బిల్లుపై సభలో పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి.
కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న ఇటువంటి ఒక కీలకమయిన అంశం పట్ల కూడా ప్రజాప్రతినిధులు ఇంత నిర్లక్ష్య వైఖరి అవలంభించడం చాలా విచారకరం. వారు ఎంతసేపు సభలో తమ పార్టీ వ్యూహాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు తప్ప తమను ఎన్నుకొన్న ప్రజల మనోభావాలకు, అభిప్రాయాలకు అనుగుణంగా మాట్లాడాలని, వ్యవహరించాలని భావించకపోవడం (అటువంటి భాధ్యాతారహితులయిన నేతలను ఎన్నుకొన్న) ప్రజల దురదృష్టం.
సభల్లో కీచులాడుకొనే ఇటువంటి నేతల భద్రత కోసం కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి వేలాదిమంది పోలీసులను వినియోగించవలసి వస్తోంది. నగరంలో మహిళలకు, ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసు వ్యవస్థ విఫలమవచ్చునేమో గానీ, ప్రజలనుండి ప్రజాప్రతినిధులకి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా చూసుకోవడంలో మాత్రం ఆది ఎన్నడూ విఫలమవ్వదని చెప్పేందుకు నేడు శాసనసభ చుట్టూ మోహరించిన వేలాది పోలీసు బలగాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఇదంతా చూస్తుంటే ఇటువంటి నేతలను, రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నందుకు ప్రజలు ఈమాత్రం శిక్ష, మూల్యం చెల్లించుకోక తప్పదన్నట్లుంది.