రాహుల్ గాంధీ పై ఆమ్ ఆద్మీ పోటీ?

      ఢిల్లీ ఎన్నికలలో సంచనాలు సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ రాహుల్ గాంధీ పై పోటీకి దిగనుంది. ఢిల్లీ లో అగ్రనేతగా ఎదిగిన ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పై పోటీ చేసి..ఆమెను ఓడించిన ఆమ్ ఆద్మీ పార్టీ త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో రాహూల్ గాంధీని టార్గెట్ చేయాలని చూస్తోంది.   లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ కి పోటీగా ఆమ్ ఆద్మీ పార్టీ  వ్యూహకర్తలో ఒకరైన కుమార్ విశ్వాస్ ను నిలబెట్టాలని  కేజ్రివాల్ నిర్ణయించారని వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్‌తో పాటు ఆయా పార్టీల అగ్రనేతల పైన తమ అభ్యర్థులను పోటీకి దింపేందుకు కేజ్రీవాల్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. షీలా దీక్షిత్ లాగే రాహూల్ కూడా ఓ సామాన్యుని చేతిలో పరాజయం పాలైతే ఆయన రాజకీయ జీవితానికే ఎసరు రావచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.   

హైదరాబాద్ లో జోరందుకున్న విభజన రాజకీయాలు

      రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపించడంతో హైదరాబాద్ లో విభజన రాజకీయాలు జోరందుకున్నాయి. రాష్ట్రానికి వచ్చిన డిగ్గీ బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన ఉదయం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను పరామర్శించారు. అనంతరం లేక్ వ్యూ గెస్టు హౌస్‌లో పలువురు నేతలను కలిశారు. ఆ తర్వాత కిరణ్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. ఆరు గంటల తర్వాత పిసిసి కార్యవర్గంతో భేటీ అవుతారు.   అటు తెలంగాణ, సీమాంధ్ర నాయకులు వరుస భేటీలతో బిజీగా గడుపుతున్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణా రెడ్డి నివాసంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో దిగ్విజయ్ ను మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి కలిశారు. విభజనపై అధిష్టానంకు సహకరించాలని సీఎ౦ కిరణ్ ను అడగగా... ససేమీరా అన్నారట. సమైక్యంపై తమ నిర్ణయంలో మార్పు ఉండదని, మీరే పునరాలోచించుకోవాలని కిరణ్ చెప్పగా.. డిగ్గీ కూడా ఈ సమయంలో టిపై వెనక్కి వెళ్లలేమని, పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సూచించారట.

గే సెక్స్‌: సుప్రీం తీర్పుపై సోనియా అసంతృప్తి

      స్వలింగ సంపర్కం నేరమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అసంతృప్తి వ్యక్త౦ చేశారు. అయితే ఈ గోడపై సోనియా గాంధీ స్పందించడం విశేషంగా ఉంది. స్వలింగ సంపర్కుల విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తనకు బాధ కలిగించిందని అన్నారు. దేశంలోని పౌరులందరికీ జీవించే హక్కును, స్వేచ్ఛను పార్లమెంటు గ్యారంటీ చేస్తందని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. గే సెక్స్‌పై హైకోర్టు తీర్పును పునరుద్ధరించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ గురువారంనాడు చెప్పారు. స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రధాని అభ్యర్థి నీలేకని!..కొట్టిపారేసిన కాంగ్రెస్

      రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రధాని అభ్యర్థి నందన్ నీలేకని వచ్చిన వార్తలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సందీప్‌దీక్షిత్ కొట్టిపారేశారు. రాహుల్‌గాంధీకి పార్టీలో అందరూ మద్దతిస్తున్నారని, ఆయన కాకపోతే మరెవరు ప్రధాని అభ్యర్థి అవుతారని ప్రశ్నించారు.   ప్రధాని అభ్యర్థి రేసులో నీలేకని కూడా ఉన్నారంటూ ఓ వార్తాపత్రిక కథనం పేర్కొంది. అయితే, 'ఇంతకన్నా చెత్తవార్త మరొకటి ఉండదు' అని సాక్షాత్తూ ఆయనే ఖండించినట్లు కూడా పేర్కొంది. దీనిపై కేంద్రమంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పందిస్తూ "మాకు మా పార్టీ నేతలున్నారు. నీలేకని కూడా మాతో పనిచేస్తున్నారని దాటవేశారు. జేడీయూ నాయకుడు శివానంద్ తివారీ కూడా 'ఎవరీ నిలేకని?' అని నొసలు చిట్లించారు. కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకోదలచుకుంటే ఇక చెప్పేదేముంది? అన్నారు.

ఏపీ 'ఆమ్ ఆద్మీ' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..!!

      పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రంగంలో ఆయనకున్న క్రేజ్..అభిమానించేవారు కోకొల్లలు.. అందులోనూ పవన్‌ మేనియాలో కొట్టుమిట్టాడేవారు కూడా ఎక్కువే. ఇప్పుడు రాజకీయాలలో కూడా పవర్ స్టార్ సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారనున్నారు. పవన్‌ చుట్టూ రాజకీయాలకు సంబంధించిన గాసిప్స్‌ పూటకొకటి బయటకి వస్తున్నాయి.   గతంలో పవన్ కళ్యాణ్ టిడిపిలో చేరబోతున్నారని అని వార్తలు కూడా వచ్చాయి. కాని వాటిని ఆయన ఖండించలేదు గాని, ఆయన సోదరుడు నాగబాబు మాత్రం దానిని ఖండించారు. ఇప్పుడని కాదు..ఎప్పుడూ పవన్ తనపై వచ్చిన విమర్శలు కు, గాసిప్స్‌ కు స్పందించిన  దాఖలాల్లేవు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  'ఆమ్ ఆద్మీ పార్టీ' లో చేరబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కి పవన్‌ ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని అంటున్నారు. దీనిపై రాష్ట్రంలో 'ఆమ్ ఆద్మీ పార్టీ' సర్వే కూడా చేసినట్టు సమాచారం. మొత్తమ్మీద, పవన్‌ రాజకీయాల్లోకి మళ్ళీ వస్తాడో రాడోగానీ, పవన్‌ పేరుతో గాసిప్స్‌ మాత్రం విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి.

టిడిపి టికెట్ కు డిమాండ్..కాంగ్రెస్ ఖాళీ..!!

      నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోల్పోయిందని ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. పార్టీలో ఉంటూ వివిధ పదవులు అనుభవించిన ముఖ్య నేతలే ఫిరాయింపుల బాట పట్టారు. ఈ క్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీలోకి చేరడానికి టిడిపి అధినేత చంద్రబాబును కలిసినట్లు సమాచారం. ఆయన నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.   ఇదే విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే మంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కూడా ఆయన మాతృసంస్థ అయిన తెలుగుదేశం వైపు చూస్తున్నారు. నెల్లూరు నగర టిడిపి టికెట్ ఇస్తేనే పార్టీలో చేరుతానని షరతుపెట్టినట్టు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ కూడా టిడిపిలో చేరడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా కాంగ్రెస్ వీడి టిడిపిలో చేరడానికి మంతనాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తనకు నెల్లూరు పార్లమెంట్ సీట్ కేటాయిస్తేనే పచ్చకండువా కప్పుకుంటానని టిడిపి అధినేతతో చెప్పినట్లు సమాచారం. వీరే కాక మరి కొందరు ముఖ్య నేతలు కూడా జంప్ జిలానీలుగా మారనున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుండడం కేడర్ కూడా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ కి అభ్యర్థులే కరువైనట్లు ప్రచారం సాగుతోంది.

మండేలా మృతి పట్ల శాసనసభ సంతాపం

      దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నల్ల సూరీడు నెల్సన్ మండేలా మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది. ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభంకాగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెల్సన్ మండేలా సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..జాతి వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు నెల్సన్ మండేలా అని, మానవజాతి చరిత్రలో నెల్సన్ మండేలా మహా శిఖరమని కొనియాడారు.తన జీవితాన్ని మండేలా ప్రజలకే అంకితం చేశారని అన్నారు. చంద్రబాబునాయుడు మాట్లాడుతూ..మండేలా త్యాగాల ఫలితంగానే సౌతాఫ్రికాకు స్వాతంత్య్రం లభించిందని అన్నారు. గాంధీ మహాత్ముడికి మండేలా ఏకలవ్య శిష్యుడవడం దేశానికి గర్వకారణమన్నారు. నెల్సన్ మండేలా యుగపురుషుడని చెప్పారు. అలాగే తెరాస, వైకపా, ఎంఐఎం సభ్యులు మండేలాకు సంతాపం తెలిపారు.

లోకేష్ రాజకీయ అజ్ఞాని: వైకాపా

      వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుని కుమారుడు నారా లోకేష్ నాయుడు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సీపీ 420 పార్టీ అని, సోనియా ముందు ధర్నా చేసే శక్తి ఆ పార్టీకి లేదని, కాంగ్రెస్ తో కుమ్మక్కై౦దని, జగన్ కు లాలూ కు పట్టిన గతి పడుతుందని తీవ్రంగా విమర్శించిన సంగతి విదితమే.   లోకేష్ విమర్శలపై స్పందించిన వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్ర రావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి, సత్తా కానీ లోకేష్ కు లేదంటూ ధ్వజమెత్తారు. లోకేష్ రాజకీయ అజ్ఞానివి అంటూ దుయ్యబట్టారు. మీనాన్న అవినీతి డబ్బుతో నిన్ను చదివించింది నిజం కాదా ? అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీలో నీవు, మీ నాన్న ఉన్నారు కానీ… మీకు సొంతంగా పార్టీ పెట్టే సత్తా ఉందా? అని గట్టు రాంచంద్రరావు ప్రశ్నించారు.    

రాష్ట్రంలో కాంగ్రెస్ చచ్చిపోలేదు!

      కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయే పరిస్థితి లేదని, కాంగ్రెస్ పార్టీ గరిక వంటిదని నెల్లూరుజిల్లా రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెసు పార్టీలో ఓ తప్పు జరిగినంత మాత్రాన అధిష్టానాన్ని తిట్టవద్దన్నారు. జేసీ దివాకర్‌రెడ్డి పార్టీపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన... పార్టీ అధ్యక్షురాలును తప్పు బట్టడం సరికాదని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ పార్టీ నాయకులు ఒక్కొక్కరు ఒక్కో పంథాలో వెళ్తుంటారన్నారు. ఏ పంథాలో వెళ్లినా సమైక్యం కోసం వారికి మద్దతిస్తామన్నారు. తాము కాంగ్రెసు పార్టీలో ఉంటూనే సమైక్యాంధ్ర కోసం పాటుపడుతామని చెప్పారు. తమ నినాదం సమైక్యవాదమేనని, తుది గెలుపు తమదేనని వివేకానంద పేర్కొన్నారు.

జగన్ పార్టీలోకి జేసీ కుమారుడు!!

      'ఆంధ్రా కేజ్రివాల్ వచ్చి కాంగ్రెస్ ను ఊడ్చేయబోతున్నాడని’ చెప్పి మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో చాలా సీరియస్ చర్చకే తెరలేపారు. ఆ నలభై ఏళ్ల కుర్రాడు ఎవరై ఉంటారని ఎవరిష్టం వచ్చినట్టు వారు అభిప్రాయాలు చెబుతున్నారు. కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప వేరేవారికి సాధ్యం కాదని, కొందరు పవన్ కళ్యాణ్ అని మీడియాలో చర్చించుకుంటున్నారు.   కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన జేసీ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీనే రాజీనామా చేయమని చెప్పి సంచలనం సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని, రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ చచ్చిపోయిందని తీవ్రంగా వ్యాఖ్యానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేసీ తన కుమారున్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి దించుతున్నట్టుగా అనంతపూర్ లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయానికి జేసీ పవన్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ సీపీ లో చేరే అవకాశముందని సమాచారం!

బాబుతో చర్చకు సిద్దం: కెసిఆర్

      టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పైన చేసిన విమర్శలకు ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రోజు మీడియా ముందుకొచ్చి, చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేసేశారు. ‘ఫామ్‌ హౌస్‌లో పడుకుంటే నీకేంటి.. ఎందుకంత బాధ.. నువ్వూ రావొచ్చు..’ అని ఎద్వేవా చేశారు కేసీఆర్‌. తన అధికారం పోయింది తెరాస వల్లేనని చంద్రబాబు బాధ అన్నారు. తాను పద్నాలుగేళ్లుగా తెలంగాణ ప్రజలకు ఏం చేశానో అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబులా హైదరాబాదులో ఉండి లక్షల కోట్ల విలువైన తెలంగాణ భూములను వైయస్, చంద్రబాబు అమ్మేశారన్నారు. బాబుతో తాను ఎప్పుడైనా చర్చకు సిద్ధమని, దమ్ముంటే బహిరంగ చర్చ పెట్టాలని, స్థలం ఆయనే చెప్పాలన్నారు.

కాంగ్రెస్ దొంగ పుత్రుడు..దత్తపుత్రుడు జగన్: లోకేష్

      టిడిపి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న నారా లోకేష్ యువతపై దృష్టి పెట్టారు. తిరుపతిలో టీఎన్ఎఫ్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ దొంగ పుత్రుడు, దత్తపుత్రుడిని నమ్ముకుందని, జగన్‌కు లాలూ గతి తప్పదని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఒక్క పైసా సంపాదించుకోకుండా,నీతి ,నిజాయితీగా చంద్రబాబు నాయుడు ఐటి రంగం అభివృద్ది కోసం పని చేశారని చెప్పారు. ఫైళ్లను చంకన పెట్టుకుని ప్రపంచం అంతా తిరిగి ఐటి పరిశ్రమను హైదరాబాద్ తీసుకువచ్చారని, ఇది యువత భవిష్యత్తు కోసమేనని ఆయన అన్నారు. యువత తలుచుకుంటే ప్రభంజనం ఖాయమన్నారు. అవినీతిపరులను తరమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి కాలేజికి వెళ్లి యువతలో చైతన్యం తెస్తామన్నారు.

సీమాంధ్ర ఎంపీలపై వేటు ఖాయం: చాకో

      అధికార పార్టీలో ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆరుగురిపై వేటు తప్పనిసరి అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. పార్టీలో ఉండి సమైక్యాంధ్ర గురించి పోరాడడం కాకుండా ఏకంగా పార్టీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలతో కలిసి అవిశ్వాసం పెట్టడం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. ఇప్పుడు దేశంలో ఎన్నికలు రావాలని ఏ పార్టీ కోరుకోవడం లేదని, అవిశ్వాసం చర్చకు వచ్చినా వీగిపోతుందని పీసీ చాకో తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీని వీడడానికి, సీమాంధ్ర ప్రజల ముందుకు రావడానికి కారణాలు వెతుకుతున్న ఎంపీలు కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్ర అన్నందుకు తమను వెళ్లగొట్టిందని చెప్పుకుని ఇక రెచ్చిపోనున్నారు.

అవిశ్వాస గండం: క్షణం క్షణం మారుతున్న రాజకీయాలు

      ఢిల్లీలో క్షణం,క్షణం రాజకీయాలు మారుతున్నాయి. కాంగ్రెస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పాలక పక్షంపై అదే పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రతినిధులు అవిశ్వాస తీర్మానం పెట్టిన అరుదైన ఘటన అధిష్టాన వర్గాన్ని ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పుడు దీనిపైన రాజకీయ వర్గాలలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. టిడిపి, కాంగ్రెస్, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్ మీరా కుమార్ పరిగణంలోకి తీసుకున్నారు. సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పెరిగె సూచనలు కనిపిస్తున్నాయి. అవిశ్వాసానికి మద్దతు ఇచ్చే అంశంపై బిజెపి నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. దీనిపై కాసేపట్లో ప్రకటన చేయనున్నారు.              ఈ రోజు లోక్ సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు సేవ్ ఆంధ్ర ప్రదేశ్ అంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను స్పీకర్ 12 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ కూడా వాయిదా పడింది.