తెలుగు ప్రజలతో ఆడుకొంటున్నస్టార్ బ్యాట్స్ మ్యాన్
రాష్ట్ర విభజన ప్రక్రియ సజావుగా ముందుకు సాగడానికి తెలంగాణావాదులు ఒట్టి హడావుడి తప్పచేసిందేమీ లేదు. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మొదటి నుండి రాష్ట్ర విభజన తీవ్రంగా వ్యతిరేఖిస్తూ, తన అధిష్టానాన్ని సైతం ధిక్కరిస్తూనే, తెలంగాణా బిల్లు శాసనసభకు వచ్చేక అడ్డుకొందామని చెపుతూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరినీ నిలువరించి, రాష్ట్ర విభజన ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా ఇంతవరకు తీసుకు రాగలిగారు. ఈ స్టార్ బ్యాట్స్ మ్యాన్ సీమాంధ్ర తరపున ఆడుతూనే తెలంగాణా టీముని గెలిపించేందుకు శాయాశాక్తులా కృషిచేసారు. అందుకు తెలంగాణావాదులందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే.
తెలంగాణా బిల్లుపై చర్చను ఎప్పుడు, ఎన్ని రోజులు చెప్పట్టాలనే విషయం తేల్చేందుకు నిన్నశాసనసభ బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశమయినప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అదే ధోరణి ప్రదర్శిస్తూ సమావేశంలో మధ్యలోంచి లేచి వెళ్ళిపోయారు. ఓటింగే ఉండని బిల్లుని తాము ఓటింగులో ఓడించేస్తామని ఇంతవరకు సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతూ వచ్చిన ఆయన, ఆయన అనుచరులు ఇప్పుడు బిల్లుకి వ్యతిరేఖంగా అఫిడవిట్లు ప్రవేశపెడతామంటూ మరో కొత్త నాటకం మొదలుపెట్టారు.
ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనను అడ్డుకోలేకపోయినా సీమాంధ్ర ప్రజలు ఏమనుకొనేవారు కాదు. కానీ తమ తరపున పోరాడుతున్నట్లు నటిస్తూ నేటికీ ఈవిధంగా తమను మభ్యపెట్టాలని ప్రయత్నించడమే జీర్ణించుకోలేకపోతున్నారు. విభజనను అడ్డుకొంటానని అటు తెలంగాణా ప్రజలకు, అడ్డుకొంటునట్లు మభ్యపెట్టినందుకు సీమాంధ్ర ప్రజలకు ఆయన తీవ్ర ఆగ్రహం కలిగించారు. అందువల్ల ఆయన పరిస్థితి రెంటికీ చెడిన రేవడిగా మారడం ఖాయం. తను ఏ సమైక్యవాదంతో ప్రజల దృష్టిలో ఛాంపియన్ గా ఎదిగారో, ఇప్పుడు దానికారణంగానే పరువుపోగోట్టుకోవడం ఖాయం. మరి ఆయనకు వంతపాడుతూ నేటికీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న సీమాంధ్ర శాసనసభ్యులు, మంత్రులకు అదే దుస్థితి ఎదురవడం తధ్యం.
ప్రజలు బుద్ధి హీనులని భావించి, వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు డిల్లీలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని చీపురు కట్టతో ఊడ్చిపెట్టేసారు. అది చూసిన తరువాతయినా ఈ కాంగ్రెస్ నేతలకి జ్ఞానోదయం కలుగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక, రాష్ట్ర విభజన బిల్లు శాసనసభ గడప దాటే వరకు కూడా రోజుకొక కొత్త డ్రామా ఆడుతూ ఇరు ప్రాంతాల ప్రజలను మోసం చేయడం కంటే, కనీసం ఇప్పటి నుండయినా బిల్లుపై సభలో చర్చించి దానిలో లోటుపాట్లు కనుగొని వాటికి తగిన సూచనలు చేసి త్రిప్పి పంపిస్తే తెలుగు ప్రజలందరికీ మహోపకారం చేసిన వారవుతారు. లేకుంటే వారిని ఆ దేవుడు కూడా ఈసారి ప్రజల నుండి కాపాడలేడు. .