రాహుల్ నాన్సెన్స్ అంటే...

  రాహుల్ గాంధీ ‘నాన్సెన్స్’ అని ఒకమారు అంటే ప్రభుత్వామోదం పొందిన ఆర్డినెన్స్ కూడా చెత్త బుట్టలోకి వెళ్ళిపోతుంది. అదే ఆయన ‘ఓకే’ అంటే రెండేళ్ళ క్రితం అటక మీద పడేసిన లోక్ పాల్ బిల్లు కూడా దుమ్ము దులుపుకొని ఉభయసభలలో రేసుగుర్రంలా పరుగులు తీసి ఆమోదం పొందేస్తుంది. సమాజ్ వాదీ పార్టీ తప్ప పార్లమెంటులో అన్నిపార్టీలు లోక్ పాల్ బిల్లుని ఆమోదించడంతో బహుశః ఈరోజు రాజ్యసభ సమావేశాలు ముగిసేలోగానే లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందవచ్చును. అయితే, రాహుల్ గాంధీ ఎంతో ముచ్చట పడుతున్నమతనిరోధక బిల్లుకి మాత్రం బీజేపీ కాలు అడ్డం పెడుతోంది. అందువల్ల దానికోసం కాంగ్రెస్ పెద్దలు మరికొంత కసరత్తు చేయవలసి ఉంటుంది.   నాలుగు రాష్ట్రాలలో ఓడిపోయి నిరాశలో కూరుకుపోయిన మన రాహుల్ బాబు కనీసం లోక్ పాల్ బిల్లు దేశానికి మంజూరు చేసి కాస్త డప్పేసుకొందామని అనుకొంటే, ఎవరో అరవింద్ కేజ్రీవాల్ అనే ఆమాద్మీ అట, దానిని ఒక జోక్ పాల్ బిల్లు అని కుళ్ళు జోకులేస్తున్నాడు. పోనీ లోక్ పాల్ బిల్లు కోసం కడుపు మాడ్చుకొంటున్నఆ పెద్దాయన-అన్నా హజారే అయినా సంతృప్తిగా ఉన్నారంటే ఆయన కూడా ఎందుకో బరువుగా నిట్టూర్పులు విడుస్తున్నారు తప్ప ఈ బిల్లుని గురించి ఒక్క ముక్క మాట్లాడేందుకు ఇష్టపడటం లేదు.   అయితే ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా లోక్ పాల్ బిల్లు మన రాహుల్ బాబుకి బాగా నచ్చింది. గనుక ఇక పార్లమెంటు ఆమోదం పొందవలసిందే. రేపటి నుండి దాని గొప్పదనం గురించి, అటువంటి గొప్ప బిల్లును అటక మీద నుండి దింపించి, పార్లమెంటు చేత ఆమోదింపజేసిన ఘానాపాటి రాహుల్ గాంధీ గొప్పదనం, పట్టుదల, ప్రజల పట్ల నిబద్దత గురించి కాంగ్రెస్ భజన సంఘాలు హోరెత్తించేస్తుంటే జనాల చెవులు చిల్లులు పడిపోవలసిందే.

బిజినస్ అడ్వయిజరీ కమిటీ కుదరని ఏకాభిప్రాయం

  ఊహించినట్లుగానే కొద్ది సేపటి క్రితమే ముగిసిన శాసనమండలి-బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో తెలంగాణా బిల్లుపై సభలో ఎప్పటి నుండి చర్చ చెప్పట్టాలనే అన్శామపి సభ్యులమధ్య అంగీకారం కుదరలేదు. అందువల్ల శాసనసభలో బిల్లుపై ఏ సమయంలో చర్చ జరిగితే అదే సమయంలో శాసనమండలి కూడా చర్చించాలని నిర్ణయించడంతో సమావేశం ముగిసింది. ఈ సమావేశం ముగియగానే, శాసన సభ-బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం మొదలయింది. బహుశః ఇందులో కూడా ఇరు ప్రాంతాలకు చెందిన సభ్యుల సంఖ్యా సరి సమానంగా ఉంది గనుక సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం అసంభవమే. కనుక, ఈ సమావేశంలో కూడా ఎటువంటి నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసే అవకాశం ఉంది. ఈ వారంతో ముగియనున్న శాసనసభ శీతాకాల సమావేశాల తరువాత మళ్ళీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లుపై చర్చ చెప్పట్టాలని కమిటీలలో సీమాంధ్ర సభ్యులు గట్టిగా వాదిస్తున్నట్లు సమాచారం. ఏమయినప్పటికీ, మరి కొద్దిసేపటిలో ఆ సంగతీ తేలిపోతుంది.

అసెంబ్లీ వాయిదా..బీఏసీ తరువాతే

      శాసన సభలో మంగళవారం సీమాంధ్ర, తెలంగాణ శాసనసభ్యులు స్పీకర్ పొడియంను చుట్టుముట్టి పోటాపోటీగా సమైక్య, తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ఎమ్మెల్యేల చేతిలో ఉన్న ఫ్లకార్డులను తెలంగాణ నేతలు బలవంతంగా తీసుకోవడంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. సభాపతి ఎంత సర్ది చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు.   సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడడంతో స్పీకర్ సభను అరగంటపాటు వాయిదా వేస్తూ బీఏసీ సమావేశం అనంతరం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని సభాపతి ప్రకటించారు. కాగా సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎవరిసీట్లలో వారు ముభావంగా కూర్చున్నారు.

'తెలంగాణ బిల్లు' పై చర్చ ప్రారంభమైందా, లేదా..!!

      రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై సభలో చర్చ మొదలైందా? లేదా? అనే అంశంపై రచ్చ జరుగుతోంది. దీనిపై ఎవరేమన్నారంటే...   "ఈ నెల 11న జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు శాసనసభలో ముసాయిదా బిల్లు ప్రతులు ప్రవేశ పెట్టినందున చర్చ జరపాలా వద్దా అనే అంశంపై రాజకీయపక్షాల అభిప్రాయాల సేకరణకు సిద్ధమయ్యాను. ఇందులో భాగంగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హోదాలో దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభిస్తున్నట్ల్లుగా చెప్పారు. దానిపై ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాను. ఆయన స్పందించకపోవడంతో... ముసాయిదా బిల్లు చర్చకు వచ్చినట్లుగా భావించాల్సిందే! - ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క   చర్చను ప్రారంభించాలని మాత్రమే శ్రీధర్‌బాబు కోరారు. అందుకు పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క ప్రయత్నించారు. అంతే తప్ప చర్చ ప్రారంభం కాలేదు. చర్చ జరగాలంటే తప్పని సరిగా బీఏసీలో నిర్ణయం తీసుకోవాలి. - మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి "మల్లు భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించడంపై రాజకీయ పక్షాల అభిప్రాయాలు కోరినప్పుడు నేను చర్చను ప్రారంభిస్తున్నట్లుగా చెప్పాను. ప్రధాన ప్రతిపక్ష నేత అభిప్రాయాన్ని తీసుకునేందుకు ఉపసభాపతి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. బిల్లుపై చర్చ ప్రారంభమైనట్లేనని. దీనిపై పార్టీల వారీగా ఎవరెన్ని గంటలు మాట్లాడాలో తేలాల్సి ఉంది. - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మరోవైపు శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.    

దిగ్విజయ్ కొడుకు సెంటిమెంటుతో జగన్ బేజారు

  “కాంగ్రెస్ పార్టీకి మాకు ఎటువంటి సంబంధము లేదని” ప్రజలకు నచ్చజెప్పుకొనేందుకు పాపం నానా తిప్పలు పడుతున్నజగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తనపై ఒలకబోస్తున్నఅవ్యాజమయిన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఆయన ఘాటు ప్రేమను ఇక భరించలేక ‘అలా అన్నవాడిని చాచిపెట్టి చంపదెబ్బ కొట్టాలి’ అని కూడా అనవలసివచ్చింది.   కానీ, దిగ్విజయ్ సింగ్ మాత్రం అందుకు ఎంతమాత్రం నొచ్చుకోకుండా, గాంధీగారి సిద్దాంతాలు ఫాలో అయ్యే మనిషి గనుక ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపిస్తూ, “జగన్ తనను ఎన్నిమాటలన్నపటికీ అతని పట్ల తనకున్నపుత్రవాత్సల్యం చెరిగిపోదని, ఇప్పటికీ, ఎప్పటికీ కూడా అతను నా కొడుకు వంటి వాడేనని, తమ డీ.యన్.యే.లలో కూడా ఎటువంటి మార్పు చెందబోవని” నిన్ననే ఆయన తాజాగా మరోమారు డిల్లీలో కన్ఫర్మ్ చేసారు. వద్దంటే ఇంతటి ప్రేమ కురిపించే దిగ్విజయ్ వంటి పెంపుడు తండ్రి దొరికినందుకు జగన్ బాధపడుతుంటే, అటువంటి తండ్రి ప్రేమకు నోచుకోనందుకు లగడపాటి వంటి చాలామంది కాంగ్రెస్ నేతలు బాధపడుతున్నారు. పోనీ దిగ్విజయ్ తన తండ్రి ప్రేమను అవసరమయిన వారందరికీ పంచిపెడితే కనీసం వారయినా శుభ్రంగా వాడుకొనేవారు కదా!

నేడే ముఖ్యమంత్రి రంగప్రవేశం

  గత నాలుగయిదు నెలలుగా అధిష్టానాన్ని ధిక్కరిస్తూ గట్టిగా సమైక్యవాదం వినిపిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిన్నశాసనసభలో తెలంగాణా బిల్లు ప్రవేశపెడుతున్నసమయంలో అనారోగ్యకారణంతో సభకు డుమ్మాకొట్టడంతో ఆయన తీవ్ర విమర్షలకు గురయ్యారు. అయితే ఆయన నిన్నసాయంత్రం సమైక్యవాదం చేస్తున్న కొందరు సీమాంధ్ర శాసనసభ్యులు, మంత్రులతో సమావేశమయ్యారు. అయన తన వద్ద ఉన్న బిల్లుకాపీని వారికి చదివి వినిపించి, దానిని ఈ రోజు స్వయంగా సభలో ప్రవేశపెడతానని, అందులో ప్రతీ ఆర్టికల్ పై వోటింగ్ కోరుతానని తెలిపారు. ఆర్టికల్ 371(డీ) సవరించనిదే విభజన అసాధ్యమనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసారు. బిల్లుపై సభ ఎప్పుడు, ఎన్ని రోజుల పాటు చర్చించాలో బిజినస్ అడ్వయిజరీ కమిటీయే నిర్ణయం తీసుకొంటుందని ఆయన తన అనుచరులకు చెప్పినట్లు సమాచారం.   ఇప్పటికే తీవ్ర ఉద్రిక్తంగా సాగుతున్న సభాసమావేశాలు ముఖ్యమంత్రి రాకతో మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. నిన్న శాసనమండలి ప్రాంగణంలో మీడియా పాయింటు వద్ద తెదేపా, తెరాస యం.యల్.సీ.లు కొట్టుకొనేంత వరకు వెళ్ళారు. ఉభయ సభలు నినాదాలతో దద్దరిల్లిపోయాయి. ముఖ్యమంత్రిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నటీ-కాంగ్రెస్, తెరాస నేతలు ఈరోజు ఆయనపై మూకుమ్మడిగా విమర్శలకు దిగే అవకాశం ఉంది. అప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ ఆయనకు బాసటగా నిలిచి ఎదురుదాడికి దిగితే సభలో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు.

మోడీ కోసం దేశం పరుగు

  ఒకప్పుడు బస్టాండులో టీ అమ్ముకొన్న నరేంద్ర మోడీ తన తెలివి తేటలతో గుజరాత్ ముఖ్యమంత్రి కాగలిగాడు. అదే వ్యక్తి ఇప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా ఎదిగాడు. ఒకనాడు ఆయన అభ్యర్ధిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేఖించిన అద్వానీ వంటి వారు కూడా నేడు ఆయనను పొగుడుతున్నారు. ఎక్కడో గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండే ఆయన, బీజేపీ ఎన్నికల సారధ్య బాధ్యతలు చేప్పట్టి గట్టిగా మూడు నాలుగు నెలలు కూడా కాలేదు. అయినప్పటికీ, ఇటీవల మూడు రాష్ట్రాలలో బీజేపీ సాధించిన ఘన విజయం, డిల్లీలో కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టగలిగారు. ఇది నిజంగా ఆయన ఘనతేనని అంగీకరించక తప్పదు.   సరిగ్గా రాహుల్ గాంధీ కి పట్టాభిషేకం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో ఆయన అకస్మాత్తుగా బీజేపీ ప్రధానిగా ఊడిపడటంతో ఉలిక్కి పడిన కాంగ్రెస్ పార్టీ ఆయనను బూచిగా చూపించి రాహుల్ గాంధీకి అడ్డులేకుండా చూసుకోవాలని ప్రయత్నం చేసేది. కానీ  ఉగ్రవాదుల దాడులను, చైనా చొరబాట్లను, అధిక ధరలను, అరికట్టలేని కాంగ్రెస్ అసమర్దతను ఎండగడుతూ, అవినీతి వ్రేళ్ళూనుకుపోయిన కాంగ్రెస్ పార్టీనే ఆయన బూచిగా చూపెట్టి ఎన్నికలలో ఘన విజయం సాధించగలిగారు.   కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుండి డిల్లీ వరకు అందరి బేషరతు మద్దతు గల రాహుల్ గాంధీ ఈ ఎన్నికల ప్రచారంలో చతికిలపడిపోగా, మోడీ స్వయంగా దేశంలో మెజార్టీ ప్రజల వ్యతిరేఖతను ఎదుర్కొంటూ, మతతత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీని గెలిపించుకోవడం ఆయన సమర్ధతకు, రాజకీయ నైపుణ్యానికి అద్దంపడుతోంది.   పనిలోపనిగా ఆయన ప్రజలలో తనపట్ల ఉన్న వ్యతిరేఖతను కూడా క్రమంగా తగ్గించుకొనే ప్రయత్నాలు చాలా గట్టిగానే చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ‘యూనిటీ రన్’ పేరుతో ప్రజలకు తనకూ మధ్య దూరం తగ్గించుకొనే ప్రయత్నం చేసారు. దేశ ఐఖ్యత కోసం అనగానే సహజంగానే ప్రజలు అటువంటి కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతారు. పార్టీలకు, జెండాలకి అతీతంగా ప్రజలందరూ పాల్గొనేలా చేయడమే కాకుండా, దీనిపై కాంగ్రెస్ పార్టీ నోరెత్తలేని పరిస్థితి విధంగా చక్కటి వ్యూహం అమలు పరిచారు.   నిజానికి ఇది ఆయన తనను తాను ప్రజలలో ప్రమోట్ చేసుకోవడానికే ఉద్దేశ్యించబడిన కార్యక్రమమని అందరికీ తెలుసు. కానీ, ఆయన దేశ ఐఖ్యత కోసం పరుగు అంటూ దానికి మహనీయుడు సర్దార్ వల్లభభాయి పటేల్ పేరుని కూడా జోడించడంతో దానికి ఊహించినట్లే దేశవ్యాప్తంగా ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. ఆయన దీనిని ఒక బీజేపీ కార్యక్రమంగా రూపొందించి ఉంటే, ఇంత స్పందన ఉండేది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చును. కానీ, ఆయన ఎక్కడా తన పేరు, పార్టీ ప్రసక్తి తేకుండా ‘దేశంకోసం’ అంటూ అందరినీ తన మాట మీద పరుగులెత్తించగలిగారు. అంతే గాకుండా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తనని, తన పార్టీని స్మరించుకోనేలా చేసారు. ఆయనలో గల ఈ నేర్పే రేపు డిల్లీకి బాటలు పరుస్తుందేమో కూడా!

వ్యూహాత్మకంగానే బిల్లు పై చర్చ

      మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభ మళ్లీ మొదలయింది. తీవ్ర గందరగోళం మధ్యనే శ్రీధర్ బాబు ముసాయిదా బిల్లు పైన చర్చను ప్రారంభించాలని డిప్యూటీ స్పీకర్‌ను కోరారు. దీంతో డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క చర్చను ప్రారంభించాలని చంద్రబాబును కోరారు. చంద్రబాబు అందుకు నిరాకరించినట్లుగా తెరాస ఎమ్మెల్యేలు చెప్పారు. అయితే, చంద్రబాబు మాట్లాడేందుకు సిద్ధమవగా అసెంబ్లీ వాయిదా పడిందని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. చంద్రబాబు సభలో ఉన్నప్పటికీ లేరని అవాస్తవ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.   చర్చకు స్పీకర్ ఆమోదం తెలపడంతో సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు ముసాయిదా బిల్లు ప్రతులను చించి స్పీకర్ పోడియం వైపుకు విసిరేశారు. చించివేసిన విసిరేసిన ప్రతులు సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్కపై కూడా పడ్డాయి. సీమాంధ్ర శాసనసభ్యులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. ప్రతులు చించి వేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో స్పీకర్ స్థానంలో ఉన్న భట్టి సభను మంగళవారానికి వాయిదా వేశారు.

మన సోనియమ్మకే పాపం ఎందుకు ఇన్ని కష్టాలు?

    గల్లీ నుండి డిల్లీ వరకు కాంగ్రెస్ నేతలందరూ (సీమాంధ్రలో కొందరు తప్ప) సోనియమ్మకు గుళ్ళు గోపురాలు కట్టించి, దేవతలాగా పూజించుకొంటున్నారనే ఇంగితం కూడా లేని ప్రతిపక్షాలు ఆమెపై నీలాపనిందలు వేస్తున్నాయి. అంతటితో ఆగకుండా ఏవో కుంటి సాకులు వెతికి పట్టుకొని ఆమె దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. ఆమె ఎంతగా నచ్చజెప్పుతున్నపటికీ ప్రజలు కూడా ప్రతిపక్షాల చెప్పుడు మాటలకు చెవోగ్గి ఒక్కో రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీకి హ్యాండిచ్చేస్తున్నారు. ఇక పోనీ కదా అని పిలిచి యంపీ టికెట్స్ ఇస్తే కనీసం ఆ కృతజ్ఞతన్నది కూడా లేకుండా కొందరు కాంగ్రెస్ యంపీలు అవిశ్వాసం అంటూ డిల్లీలో చిందులేస్తున్నారు.   ఇక నిన్నగాక మొన్న పుట్టిన అమాద్మీ అయితే ఏకంగా తన చీపురు కట్టతో డిల్లీ నుండి కాంగ్రెస్ పార్టీని ఊడ్చిపారేసింది. అయినప్పటికీ పాపం ఆ తల్లి కొడుకులు పెద్దమనసుతో ఆ పార్టీకే మద్దతు ఇచ్చేందుకు సిద్దపడ్డారు. కానీ, వారి మంచి మనసులను, తేనె మనసులను ఏ మాత్రం అర్ధం చేసుకోలేని ఆమాద్మీ, “అయితే మేము కుర్చీలో కూర్చోన్నాక మీరు కప్పెట్టిన కుంభకోణాలను అన్నిటినీ త్రవ్వి తీస్తాము. మీకు ఓకేనా?” అంటూ తలతిక్క ప్రశ్న వేయడంతో వారి మనసులు ఎంత నొచ్చుకొన్నాయో ఎవరికి తెలుసు?   ఇక, ఈ నరేంద్ర మోడీ హటాత్తుగా ఎక్కడి నుండి ఊడిపడ్డాడో ఏమో గానీ, కాంగ్రెస్ పార్టీని దేశం నుండి తరిమి కొడతామని, అరేబియా సముద్రంలో విసిరేస్తామని అవాకులు చవాకులు మాట్లాడుతూ పాపం! ఏ పాపం ఎరుగని ఆ తల్లి కొడుకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. గుజరాత్ పక్కనే అరేబియా సముద్రం ఉంది గనుక తనకు సులువుగా ఉంటుందని ఆయన కాంగ్రెస్ పార్టీని అందులోకి విసిరేస్తానని శపథం చేస్తుంటే, ఇక్కడ నుండి అంత దూరం వెళ్ళడం కష్టం గనుక మా పక్కనే ఉన్నబంగాళాఖాతంలోనే నిమజ్జనం చేసేస్తామని చంద్రబాబు, జగన్ బెదిరిస్తున్నారు.   అయిపటికీ సోనియమ్మ మాత్రం ఎలాగయినా వచ్చే ఎన్నికలలో గెలిచి తన రాహుల్ బాబును ప్రధానిగా చేసి ఈ దేశాన్నిఎలాగయినా కాపాడేయాలనే సత్సంకల్పంతో ఈ అజ్ఞాన జనాలనందరినీ పెద్ద మనసుతో క్షమించుకొంటూ ముందుకు సాగిపోతోంది ఆ మహా ఇల్లాలు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్నఈ ధ్వని కాలుష్యంతో ప్రజలు బెదిరిపోకూడదనే ఆలోచనతో కాంగ్రెస్ నేతలు ఎంత బిగ్గరగా భజన చేస్తున్నపటికీ, వారి భజన కంటే ప్రతిపక్షాల సౌండే ఎక్కువ క్లారిటీగా వినిపిస్తోంది జనాలకి. ఇప్పుడు ఈ సౌండ్ అమెరికాలో కూడా ప్రతిధ్వనించడం మొదలయింది.   ఇండియాలో అనేక కుంభకోణాలను అవలీలగా కప్పిపెట్టిన ఘనత గల కాంగ్రెస్ పార్టీకి, మూడు దశాబ్దాల క్రితం ఇందిరమ్మ హత్య జరిగినప్పుడు డిల్లీలో సిక్కులను ఊచకోత కోసిన సంఘటనను మాత్రం ఇంకా పూర్తిగా కప్పిపెట్టలేకపోవడంతో అది బోఫోర్స్ భూతంలాగే నేటికీ కాంగ్రెస్ పార్టీని ఇంకా భయపెడుతూనే ఉంది. అయితే సోనియమ్మ సింహాసనం అధిరోహించక ముందు ఎప్పుడో జరిగిన సంఘటనలకు కూడా ఆమెనే తప్పు పట్టడం చాలా అన్యాయమని ఒప్పుకోకతప్పదు.   మన కోర్టులు, జనాలకయితే పోనీ ఎలాగోలా సర్ది చెప్పుకోవచ్చు. కానీ అమెరికా కోర్టులకి కూడా చెప్పుకోవడం అంత వీజీ కాదు. ఏ పాపం ఎరుగని సోనియమ్మే సంజాయిషీలు చెప్పకోవలసి రావడం, ఆమెకే కాదు ఆమె భక్తులకి కూడా చాలా నామోషీగా ఉంటుంది. అమెరికాలోని ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అనే పేరు పెట్టుకొన్నకొందరు దుర్మార్గులు పాపం! ఏ పాపం తెలియని దేవత వంటి మన సోనియమ్మపై అక్కడి యూ.యస్. ఫెడరల్ కోర్టులో కేసువేసి బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు.   ఆనాడు అంటే ఇందిరమ్మ హత్య తరువాత డిల్లీలో వేలాది మంది అమాయకులయిన సిక్కులను నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసిన కాంగ్రెస్ నేతలకు, అందుకు సహకరించిన పోలీసు అధికారులకు కాంగ్రెస్ పార్టీ నేటికీ పార్టీలో, ప్రభుత్వంలో పదవులు, పార్టీ టికెట్స్ ఉదారంగా పంచిపెడుతూ చట్టం తన పని తాను చేసుకు పోతుందని చిలక పలుకులు వల్లె వేయడం చాలా అన్యాయమని, రాహుల్ బాబు బాషలో చెప్పాలంటే ‘నాన్సెన్స్’ అంటూ ఏవేవో పిటిషనులో బరబరా గీకేసి ఆమెపై కేసు వేసి కక్ష సాధించాలని చూస్తున్నారు.   అమెరికా కోర్టులకి మనలాగా అసలు సెంటిమెంటులు ఉండవో ఏమో తెలియదు కానీ, ఆ మధ్య పాపం ఆమె క్యాన్సర్ వ్యాధికి ఆపరేషన్ చేయించుకోవడానికి అమెరికా వచ్చిందనే ఇంగితం కూడా లేకుండా, జనవరి రెండు లోగా సంజాయిషీ ఇచ్చుకోవలసిందే అంటూ ఆమె చేతిలో కోర్టు నోటీసులు పెట్టేసారు.   ఆమె మన దేశంలో ప్రధాని కుర్చీలో కూర్చోకపోయినా అటువంటిదే మరో కుర్చీ తన ఇంట్లో వేయించుకొని, ప్రధాన మంత్రిలాగ దేశాన్నిఎక్కడికో తీసుకుపోతున్నందుకు దేశంలో ప్రతిపక్ష పార్టీలకి అసూయపడుతున్నయంటే అర్ధం ఉంది. కానీ, ఎవరివో చెప్పుడు మాటలు విని అమెరికా కోర్టులు కూడా మన దేశానికి ప్రధానివంటి ఆ మహా ఇల్లాలుకి నోటీసులు జారీ చేయడం చాలా అన్యాయం. ఇక్కడ ఇల్లు కాలి ఆమె బాధపడుతుంటే, ఆమెపైకి ఈవిధంగా అమెరికా కోర్టులు కూడా నోటీసులు విసరడం ఏమయినా న్యాయంగా ఉందా? అదే మనం ఇరాక్ మీద బాంబుల వర్షం కురిపించిన జార్జ్ బుష్షు దొరమీదకో, నేటికీ పాకిస్తాన్ మీదకి ద్రోణులతో బాంబుల వర్షం కురిపిస్తున్న ఒబామాకో మనం నోటీసులు జారీ చేయగలమా? సంజాయిషీలు అడిగే సాహసం చేయగలమా? అటువంటప్పుడు పాపం! దేవత వంటి మన సోనియమ్మకే ఎందుకు ఇన్ని కష్టాలు? ఇన్ని నీలాపనిందలు? ప్చ్!

తెలంగాణ బిల్.. 65 పేజీలు, 13 షెడ్యూళ్ళు

      65 ఏజీలు, 13 షెడ్యూళ్లతో కూడిన ప్రత్యేక తెలంగాణ ముసాయిదా బిల్లును స్పీకర్ నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంతకు ముందు సభ ఈ ఉదయం ప్రారంభం కాగనే విపక్ష సభ్యుల నిరసనతో రెండు సార్లు వాయిదా పడింది. షెడ్యూల్ వివరాలు... 1.మొదటి షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల వివరాలు 2. రెండో షెడ్యూల్‌లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్‌విభజన వివరాలు 3. మూడో షెడ్యూల్‌లో శాసనమండలి స్థానాల వివరాలు 4. నాల్గో షెడ్యూల్‌లో మండలి సభ్యుల విభజన వివరాలు 5. ఐదో షెడ్యూల్‌లో తెలంగాణలోని దళిత వర్గాల వివరాలు 6. ఆరో షెడ్యూల్‌లో తెలంగాణలోని గిరిజన వర్గాల వివరాలు 7. ఏడో షెడ్యూల్‌లో నిధులు, 8వ షెడ్యూల్‌లో పింఛన్ల వివరాలు 9వ షెడ్యూల్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల వివరాలు 10వ షెడ్యూల్‌లో రాష్ట్రస్థాయి సంస్థలకు సంబంధించిన వివరాలు 11వ షెడ్యూల్‌లో నదీ జలాల నిర్వహణ బోర్డుల విధివిధానాలు 12వ షెడ్యూల్‌లో బొగ్గు, విద్యుత్‌ విధివిధానాలు 13వ షెడ్యూల్‌లో విద్య, మౌలిక సదుపాయాల వివరాలు

ఘర్షణ పై స్పీకర్ కు పిర్యాదు

      అసేంబ్లీ ఆవరణలో తెలంగాణ ముసాయిదా బిల్లు పత్రాలను చించేసిన సమయంలో తెలంగాణ ప్రాంత నేతలే కాకుండా..తెలంగాణ జర్నలిస్టులు కూడా తమ మీద దాడి చేశారని స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ రోజు శాసనసభలో తెలంగాణ బిల్లును ప్రవేశ పెట్టిన నేపథ్యంలో వారు ఆ ప్రతులను చించి తగులబెట్టారు. ఈ సంధర్భంగా అసేంబ్లీ మీడియా పాయింట్ వద్ద పెద్ద గందరగోళం చెలరేగింది.అయితే వీడియో ఫుటేజ్ ల ఆధారంగా తాను చర్యలు తీసుకుంటానని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. ఇక శాసనమండలిలోనూ తెలంగాణ బిల్లు ప్రతులు టీడీపీ ఎమ్మెల్సీలు చించడంతో తోపులాట జరిగింది. ఈ సంధర్భంగా నన్నపనేని రాజకుమారి కిందపడిపోయింది. శాసన మండలి ఆవరణలోనే తమకు రక్షణ లేకుంటే.. తెలంగాణ ఏర్పడ్డాక తమ ప్రాంత ప్రజలకు రక్షణ ఎలా ఉంటుందని కోరుతూ ఆమె మండలి చైర్మకు ఎమ్మెల్సీ స్వామిగౌడ్ మీద పిర్యాదు చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనలో టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి క్రింద పడిపోయారని, ఈ సంధర్భంగా నా నుండి ఇబ్బంది కలిగినట్లు భావిస్తే దానికి తాను పశ్చాత్తాప పడుతున్నట్లు ఆయన తెలిపారు.

ముఖ్యమంత్రి శాసనసభకు డుమ్మా!!!

  శాసనసభలో తెలంగాణా బిల్లును అడ్డుకొంటామని భీకర ప్రతిజ్ఞలు చేసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈ రోజు సభలో బిల్లు ప్రవేశ పెడుతున్నకీలక సమయంలో సభకు గైర్హాజరవడం విశేషం. ఆయన జలుబు, జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన సభకు రానప్పటికీ, స్పీకర్ నాదెండ్ల మనోహర్ తెలంగాణా బిల్లును సభలో ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు.   కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ నివాసంలో జరిగిన భోజన సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఒక ఒప్పందం జరిగిందని తాజా సమాచారం. ఆ ఒప్పందం ప్రకారం ముఖ్యమంత్రితో సహా బిల్లుపై ఎవరెన్నివాదనలు చేసినప్పటికీ దానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించకుండా సకాలంలో దానిని రాష్ట్రపతికి త్రిప్పి పంపేందుకు, అందుకు ప్రతిగా వచ్చేఎన్నికల వరకు కిరణ్ కుమార్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేందుకు ఇరువురు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. బహుశః ఆ కారణం చేతనే ముఖ్యమంత్రి ఇటువంటి కీలకమయిన సమయంలో సభకు మొహం చాటేసి ఉండవచ్చని అనుమానాలు కలుగుతున్నాయి.   అదే నిజమయితే నేడో రేపో ఆయన కూడా సభకు హాజరయి బిల్లుపై గట్టిగా వాదించినప్పటికీ, ముందు ఊహించినట్లుగా తన పదవికి రాజీనామా చేయకపోవచ్చును. ఆది నుండి ప్రతి అంశంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది గనుక, ఆయన వ్యవహారంపై కూడా సస్పెన్స్ అనివార్యమయింది. కానీ, ఇప్పుడు కధ క్లైమాక్స్ కు చేరుకొంది గనుక త్వరలోనే ఆ సస్పెన్స్ కూడా విడిపోతుంది.   ఆయన తన పదవికి రాజీనామా చేస్తారా? లేకపోతే ఎన్నికల వరకు తన పదవిలోనే కొనసాగుతారా? లేక రాజీనామా చేసి కొత్త పార్టీ పెడతారా లేదా? అసలు ఆయన నిజంగానే సమైక్యవాదా లేక రాష్ట్ర విభజన సజావుగా సాగేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఆడుతున్ననాటకంలో తన పాత్ర పోషిస్తున్నారా? వంటి ధర్మసందేహాలకు సమాధానాలు త్వరలోనే దొరకవచ్చును.   ఒకవేళ ఆయన తన ముఖ్యమంత్రి పదవికి అంటి పెట్టుకొని ఉంటే ఆయన అధిష్టానం ఆదేశాలను అక్షరాల అమలు చేస్తున్నట్లు భావించవలసి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన బిల్లు అన్ని అడ్డంకులను అధిగమించి శాసనసభ గడప దాటిపోయిన తరువాత కూడా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని సమైక్యవాదం గురించి ఎంత గొంతు చించుకొని అరిచినా అది ప్రజలను మభ్యపెట్టడానికే తప్పదానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.

శాసనసభలో తెలంగాణ బిల్లు

      తీవ్ర ఉత్కంఠ, ఉద్వేగాల నడుమ కొద్ది సేపటి క్రితం మొదలయిన శాసనసభ సమావేశాలలో స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్-2013 (తెలంగాణా బిల్లు)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించగానే తెలంగాణా ప్రాంత సభ్యులలో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. స్పీకర్ ప్రకటన చేయగానే ఆంగ్లంలో ఉన్న63 పేజీల బిల్లు కాపీలను సభలో సభ్యులందరికీ పంచిపెట్టారు. ఆ తరువాత సీమాంధ్ర సభ్యుల అందోళనల మధ్య, శాసనసభ ప్రధాన కార్యదర్శి సదాచారి రాష్ట్రపతి శాసనసభ సభ్యులకు వ్రాసిన లేఖను చదివి వినిపించారు. సీమాంధ్ర సభ్యుల ఆందోళన తీవ్రం అవడంతో సభను అరగంట సేపు వాయిదా వేసారు. మళ్ళీ సభ సమావేశమవగానే మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ తరపున బిల్లుపై చర్చ మొదలుపెట్టే అవకాశం ఉంది.

స్మగ్లర్‌ల ఘాతుకం

  రాష్ట్రంలో స్మగ్లర్‌లు ఎంతటి ఘాతుకానికైనా వెనుకాడటం లేదు. తమ పనులకి అడ్డు వస్తున్నారని పోలీసులను కిరాతకంగా చంపాడానికి కూడా సిద్దపడుతున్నారు. తిరుమల శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు ఇలాంటి ఘాతుకానికి తెగబడ్డారు. స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వెళ్లిన అటవీ అధికారుల బృందంపై ఆదివారం ఉదయం మూకుమ్మడిగా దాడి చేసి ఇద్దరు అధికారులను హతమార్చారు. ఈ ఘటనలో మరో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు వంద మంది కూలిలు ఒకేసారి గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి ఇద్దరు ఆఫీసర్‌లను పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడిలొ తిరుపతి వన్యప్రాణి అటవీ విభాగం తిరుమల శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్.ఆర్.శ్రీధర్ (50), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్(49) అక్కడికక్కడే మృతిచెందారు.

పాపం జగన్

  రాష్ట్రంలో దాదాపు అందరు కాంగ్రెస్ నేతలు తమ పార్టీకి జగన్మోహన్ రెడ్డితో రహస్య ఒప్పందం ఉందని భావిస్తున్నారు. ఈవిషయాన్ని సీమంధ్రలో నేతలు బహిరంగంగా ప్రకటిస్తుంటే, టీ-కాంగ్రెస్ నేతలు మాత్రం అంతరంగిక సంభాషణలలో అంగీకరిస్తున్నారు. అయితే వాటిని వైకాపా నేతలు ఎంత ఖండిస్తున్నపటికీ ప్రజలు కూడా అనుమానిస్తూనే ఉన్నారు. వారి అనుమానాలు నిజమని నిరూపిస్తూ మొన్నమీడియా సమావేశంలో సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ “జగన్మోహన్ రెడ్డిది తమ కాంగ్రెస్ డీ.యన్.యే.నే అని గతంలో అన్న మాటకు నేటికీ తాను కట్టుబడి ఉన్నానని, కాదని జగన్మోహన్ రెడ్డి అనగలడా? ఆయననే అడగండని” మీడియాతో అన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిగ్విజయ్ సింగ్ జగన్ గురించి ఈవిధమయిన అభిప్రాయం వ్యక్తం చేయడం ఆ రెండు పార్టీల మధ్య ఉన్న డీ.యన్.యే. అనుబందాన్ని ద్రువీకరిస్తోంది.   అందుకు జగన్ తీవ్రంగా స్పందిస్తూ ‘ఆమాట అన్న దిగ్విజయ్ చెంప మీద కొట్టాలి’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుంటే తాను దానిని కలిపి ఉంచాలని పోరాడుతున్నాని, అటువంటప్పుడు తమకీ వారికీ ఏవిధంగా అక్రమ సంబంధం అంటగడతారని ఆయన ప్రశ్నించారు. అయితే మరి దిగ్విజయ్ సింగ్ ఆవిధంగా ఎందుకు అన్నట్లు? ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సహా లగడపాటి, దివాకర్ రెడ్డి తదితరులు అందరూ జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానానికి దత్తపుత్రుడని ఎందుకు అభివర్ణిస్తున్నట్లు?   జగన్మోహన్ రెడ్డి, ఆయన వైకాపా నేతలు తమకు కాంగ్రెస్ పార్టీకి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదని ఎంత గట్టిగా వాదిస్తుంటే, నానాటికీ ప్రజలలో మరింత అనుమానం పెరుగోతోందే తప్ప తరగడం లేదు. ఆ అనుమానాలను దిగ్విజయ్ వంటి వారు అప్పుడప్పుడు ద్రువీకరిస్తుండటంతో ప్రజలకు ఏవిధంగా సర్ది చెప్పుకోవాలో జగన్ కి అర్ధం కావడం లేదు పాపం.    

బీజేపీతో టీడీపీ దోస్తీ ఖాయమైంది..!

      తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతాపార్టీ ఎన్నికల పొత్తు ఖాయమైందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబుకు బిజెపి అగ్రనేతలు ఇచ్చిన ప్రాధాన్యం చూస్తుంటే ఈ వార్తలకు ఇంకా బలం చేకూరుస్తున్నాయి. బిజెపి ముఖ్యమంత్రి చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన బాబును బీజేపీ అగ్ర నేతలు బాగా ఆదరంగా స్వాగతించారు. ప్రమాణ స్వీకారం ఆద్యంతం బాబు మోడీ పక్కనే ఉన్నారు. ఇతర నేతలతోపాటు బాబు, మోడీలు చేతులు పైకెత్తి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చారు. శివసేన, అలికాదళ్ లాంటి బిజెపి మిత్రపక్షాల నేతలు హాజరైన వారెవరికి లభించని ప్రాధాన్య౦ చంద్రబాబుకు బిజెపి నేతలిచ్చారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై వచ్చిన తర్వాత చంద్రబాబు...వచ్చే ఎన్నికల్లో మనం బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నామని తమ పార్టీ ఎమ్మెల్యేలతో అన్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దేశంలో అవినీతిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, కాంగ్రెస్‌ను ఓడించడానికి అనుసరించాల్సిన వ్యూహలు వంటి వాటిపై మోడీతో చర్చించినట్లు బాబు పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పారట. త్వరలో సరైన వేదికపై తెదేపాతో పొత్తుపై బిజెపి పార్టీ అధికారిక ప్రకటన కూడా చేయనుందట. దీంతో బాబు మళ్ళీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నారంటూ మీడియా సంస్థలు కూడా వార్తలను జోరుగా ప్రచారం చేస్తున్నాయి.     కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పుట్టి పోరాడుతున్న టిడిపి, నరేంద్రమోడీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభంజనం సృష్టిస్తున్న భారతీయ జనతాపార్టీ కలిసి ప్రయాణించడమే సరైన వైఖరని రాజకీయవిశ్లేషకులు కూడా భావిస్తున్నారు.