ముఖ్యమంత్రిని దిగ్విజయ్ దారి తెచ్చుకొన్నట్లా కాదా
posted on Dec 14, 2013 8:34AM
రాష్ట్ర విభజన బిల్లుకు సీమాంధ్ర కాంగ్రెస్ శాసనసభ్యులందరి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో హైదరాబాద్ కి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆ ప్రయత్నంలో ఎంతవరకు సఫలమయ్యారో తెలియదు. కానీ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మాత్రం తన దారికి తెచ్చుకోలేకపోయారనే సంగతి మాత్రం స్పష్టం అయింది. ఒకవేళ దారికి తెచ్చుకొని ఉంటే నిన్నసాయంత్రం ఆయన నిర్వహించిన పత్రికా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడేవారు. ఆయన ఆ సాహసం చేయలేకపోయినా “ఇంతవరకు ముఖ్యమంత్రి తన వాదనలు వినిపించేందుకు పార్టీ ఆయనకు చాలా అవకాశం ఇచ్చిందని, కానీ ఇక ఆయన కూడా పార్టీ నిర్ణయాన్ని శిరసావహించక తప్పదని” మీడియా ముందు చెప్పుకొని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
నిన్న మధ్యాహ్నం దిగ్విజయ్ సింగ్, కిరణ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ తదితరులు బొత్ససత్యనారాయణ ఇంటిలో జరిగిన భోజన సమావేశంలో జరిగిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదని దిగ్విజయ్ మాటలే స్పష్టం చేస్తున్నాయి. అదే విషయం మీడియా ప్రశ్నించినప్పుడు మామధ్య జరిగిన అంతరంగిక చర్చల సారాంశాన్ని మీకు చెప్పలేను అంటూ సమాధానం దాటవేశారు.
ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి షరా మామూలుగా తెలంగాణా బిల్లులో ప్రతీ ఆర్టికల్ పై సభలో వోటింగ్ జరగాలని మీడియాతో చెప్పడం ఆయన వైఖరిలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం అవుతోంది. అయితే, ఈదశలో కూడా వారిద్దరూ ఒకరికొకరికి పొంతన లేని విధంగా మాట్లాడటం, భిన్న వైఖరులు ప్రదర్శించడం, అయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రిపై ఎటువంటి చర్యలు తీసుకొనే ఆలోచన కూడా చేయకపోవడం గమనిస్తే ఇదంతా కాంగ్రెస్ అధిష్టానం రచించి రక్తి కట్టిస్తున్నపెద్ద డ్రామాగా కనిపిస్తోంది. ఈవిధంగా అతితెలివి ప్రదర్శించి ప్రజలను మభ్యపెట్టగలమని కాంగ్రెస్ భావిస్తే అది ఆపార్టీకే చేటు కలిగించడం ఖాయం.