విభజన చేసింది కాంగ్రెస్ కాదట
posted on Feb 20, 2014 @ 11:57AM
రాష్ట్ర విభజన ప్రక్రియలో తన పాత్ర పూర్తయిపోగానే కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసి తప్పుకొన్నారు. పోతూపోతూ సోనియాగాంధీ తనను పదవిలో కొనసాగమని ఆదేశించినందునే ఇంతకాలం కొనసాగాననే చల్లటి కబురు కూడా తెలుగు ప్రజల చెవినవేసి మరీ పోయారు. ఆయన బ్యాటు, బాలు అన్ని పక్కన పడేసి మైదానం ఖాళీ చేసి వెళ్లిపోతుంటే, ఇంతకాలంగా ఆయనే వెనుకే ఫీల్డింగ్ చేస్తున్నఏపీయన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కూడా ఇక తాముమాత్రం ఇంకా మైదానంలో ఉండి చేసేదేముందని, మళ్ళీ ‘బ్యాక్ టూ పెవిలియన్’ అంటూ డ్యూటీలో చేరిపోయారు. సరయిన ఆటగాళ్ళను ఎంపిక చేసుకోక పోవడం వలనే ఓడిపోయామని ముక్తాయింపు కూడా ఇచ్చారు.
ఇంతకాలంగా లాస్ట్ బాల్ మిగిలే ఉంది, ద్వారము తెరిచే యున్నది అంటూ మురిపించి మురిపించిన కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి ఫౌల్ గేమ్ ఆడుతూ తమకి బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశం లేకుండా అన్నీ తానే ఆడేసి మోసం చేసేసాడని అనేక కాంగ్రెస్ జీవులు కూడా వాపోతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీలోకెల్లా అత్యంత శీలవంతుడయిన కేంద్ర మంత్రి జేడీ.శీలం అయితే , సోనియా, రాహుల్ గాంధీలు రాష్ట్ర విభజన చేసినప్పటికీ సీమాంధ్ర ప్రజల పట్ల అపారమయిన దయ జాలి కలిగినందునే ప్యాకేజీలు విదిలించారని అందుకు ప్రతిగా సీమాంధ్ర ప్రజలందరూ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకొని వారికి కృతజ్ఞతలు తెలపడం కర్తవ్యమని సూచించారు. మరి సోనియాగాంధీ దయతోనే ముఖ్యమంత్రి అయ్యాయని, ఆమె ఆదేశంతోనే పదవిలో కొనసాగానని ఆయనే స్వయంగాప్రకటించి తప్పుకొన్నారు గనుక, ఈ విభజన పాపం కూడా ఆయన అకౌంటు లోనే జమా చేయడం సముచితమని భావించిన కాంగ్రెస్ జీవులన్నీ రాష్ట్ర విభజన జరగడానికి కాంగ్రెస్ అధిష్టానం కానీ, తాము గానీ ఎవరూ కారణం కాదని కేవలం కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం, వైకాపాలే కారణమని తీర్మానించేసాయి. బహుశః కాంగ్రెస్ అధిష్టానం ఈస్క్రిప్ట్ అంతా చాలా ముందే తయారుచేసి కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో పెట్టినందునేనేమో, ఆయన కూడా తన పాత్ర ముగింపుకి సరిపోయేలా "శాసనసభ తిరస్కరించిన టీ-బిల్లుని కేంద్రం యధాతధంగా పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లయితే నేను రాజకీయ సన్యాసం తీసుకొంటానని" ముందే క్లూ ఇచ్చేసి పాపం! ఆ పాపం నెత్తిన బెట్టుకొని మౌనంగా నిష్క్రమించారు.