తెలంగాణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
posted on Feb 20, 2014 @ 7:58PM
రాజ్యసభ తెలంగాణా బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదించింది. బిల్లుకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మద్దతు పలికాయి. ప్రొద్దున నుండి తీవ్ర గందరగోళం మధ్య అనేకసార్లు వాయిదాపడుతూ వచ్చిన రాజ్యసభ సమావేశాలలో ఊహించినట్లుగానే కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం చేసిన తరువాత అంతిమంగా రెండు పార్టీలు కూడా బిల్లుని మూజువాణి ఓటుతో ఆమోదింపజేసాయి. ఈ క్రమంలో బీజేపీ నేతలు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ బిల్లులో పలుసవరణలు సూచించినప్పటికీ, కొన్నిటిని సభ మూజువాణి ఓటుతో తిరస్కరించగా, మరికొన్నిటిని వారే స్వయంగా ఉపసంహరించుకొన్నారు. వెంకయ్య నాయుడు సీమాంధ్రకు న్యాయం చేయాలని గట్టిగా వాదిస్తూనే బిల్లుకి పూర్తి మద్దతు ఇస్తామని పదేపదే కాంగ్రెస్ పార్టీకి హామీ ఇవ్వడం విశేషం.
సీపీయం, తృణమూల్ కాంగ్రెస్, అన్నాడీఎంకే, డీయంకే, అసోం గణపరిషత్, శివసేన, సమాజ్ వాడీ పార్టీలు బిల్లుని వ్యతిరేఖించగా, కాంగ్రెస్, బీజేపీ,సీపీఐ, అకాలిదళ్, బీయస్పీ తదితర పార్టీలు బిల్లుని సమర్ధించాయి. బిల్లుపై క్లాజులవారిగా మూజువాణి ఓటింగ్ నిర్వహించిన రాజ్యసభ ఉపసభాపతి కురియన్ అంతిమంగా తెలంగాణా బిల్లుని మొత్తంగా సభ మూజువాణి ఓటుతో ఆమోదించినట్లు ప్రకటించారు. దీనితో ఇక రాష్ట్ర విభజన ప్రక్రియ దాదాపు పూర్తయిపోయినట్లే. రాష్ట్రపతి ఆమోదముద్రపడటం కేవలం సాంకేతికమే గనుక ఇక తెలంగాణా ప్రజల ప్రత్యేక రాష్ట్రం కల నేటితో సాకారమయినట్లే.