సీమాంధ్రలో శాసనసభ ఎన్నికలు వాయిదా?
posted on Feb 21, 2014 7:06AM
రాజ్యసభ నిన్న తెలంగాణా ఏర్పాటుకి మార్గం సుగమం చేయడంతో, త్వరలో జరగనున్న ఎన్నికలు సమైక్య రాష్ట్రంలో నిర్వహిస్తారా? లేక వేర్పడిన రాష్ట్రాలలో విడివిడిగా నిర్వహిస్తారా?అనే ప్రశ్న తలెత్తింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినట్లయితే తెలంగాణాలో తెరాస-కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం ఖాయమే. కానీ, సీమాంధ్రలో మాత్రం కాంగ్రెస్ దారుణంగా దెబ్బ తింటుంది. గనుక, పరిస్థితులు చక్కబడే వరకు శాసనసభ ఎన్నికలు వాయిదా వేయమని కొందరు సీమాంధ్ర మంత్రులు కోరుతున్నట్లు సమాచారం. అయితే విజయోత్సాహంతో ఉన్న తెరాస, టీ-కాంగ్రెస్ నేతలు ఎంత మాత్రం ఒప్పుకోకపోవచ్చు గనుక, ఎలాగయినా ఎన్నికలలోగా తెలంగాణా ఏర్పాటు చేయగలిగినట్లయితే, అప్పుడు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కోరిన విధంగా పరిస్థితులు పూర్తిగా చక్కబడిన తరువాత సీమాంధ్రలో ఎన్నికలు నిర్వహించవచ్చును.
కాంగ్రెస్ అధిష్టానం తన రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర విభజన చేసింది గనుక, ఇప్పుడు కూడా బహుశః ఇదే విధంగా వ్యవహరించవచ్చును. ఎందుకంటే, ఆ పార్టీ కేంద్రంలో తిరిగి అధికారంలోకి రావాలంటే కేవలం యంపీ సీట్లే అవసరం కానీ శాసనసభ సీట్లు కాదు. అందువలన వీలయితే సీమాంధ్రలో శాసనసభ ఎన్నికలు వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు. అయితే, ఎన్నికలలోగా అది అధికారికంగా తెలంగాణా ఏర్పాటు చేయగలిగినప్పుడే ఈ ఆలోచన సాధ్యమవుతుంది. కానీ వీలుకాకపోతే సమైక్య రాష్ట్రంలోనే ఒకేసారి లోక్ సభ, శాసనసభ ఎన్నికలు నిర్వహించక తప్పదు.