లగడపాటిపై కేంద్ర మంత్రుల బ్లేమ్ గేమ్

      తనను సభ నుంచి సస్పెండ్ చేయడంపై విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియంలోకి వచ్చినందుకే తనను సస్పెండ్ చేస్తే.. తనతోపాటు మరో వందమంది కాంగ్రెస్ ఎంపీలు కూడా వెల్‌లోకి వచ్చారని, మరి.. వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీల అంతు చూడండి అంటూ కేంద్ర మంత్రులే వీరిని వెల్‌లోకి పంపించారని ఆరోపించారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, లేకపోతే వందమందినీ సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టలేదని చెప్పారు. స్పీకర్ ఏకపక్షంగా అధికార పక్షంతో కలిసిపోయి దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో సీటు కోసం, టికెట్ కోసం, బీఫారం కోసం స్పీకర్ పని చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ విభజన వాదమే ఆమె వాదమని దుయ్యబట్టారు. ప్రాణ రక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడొచ్చని పార్లమెంటు సాక్షిగా రుజువు చేశానన్నారు. తనపై నింద మోపేలా కాంగ్రెస్‌కు చెందిన కేంద్ర మంత్రులే బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.

బిల్లుకి మద్దతు ఇస్తే తెదేపా-బీజేపీ దోస్తీ కటీఫ్

  పార్లమెంటు ఉభయసభలు సోమవారానికి వాయిదా పడటంతో ప్రళయం ముందు ప్రశాంతత నెలకొన్నట్లుగా, ఉంది. ఆంధ్ర, తెలంగాణా నేతలందరూ వారివారి శిబిరాలలో చేరి మిగిలిన ఐదు రోజుల్లో బిల్లుని ఏవిధంగా ఆమోదింపజేసుకోవాలా, అడ్డుకోవాలా? అని మంతనాలు చేస్తున్నారు. అయితే, ఈ రాజకీయ చదరంగం ఇప్పుడు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే జరుగబోతోంది. మిగిలినవారు వాటికి పావులుగా ముందుకు, వెనక్కి నడవవలసి ఉంటుంది.   బీజేపీ బిల్లుకి మద్దతు ఇస్తే క్షణాల మీద విభజన బిల్లు ఆమోదం పొందుతుంది. ఇవ్వకపోతే, ఆ రెండు పార్టీలు రాష్ట్రంలో తమ తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకొనేందుకు, ఒకదానిపై మరొకటి నెపం నెట్టి వేసే ప్రయత్నంలో ధాటిగా మాటల యుద్ధం చేయడం ఖాయం. రానున్న ఎన్నికలలో బీజేపీని ఓడిస్తేనే కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టగలదు. కనుక, బీజేపీ బిల్లుకి మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా దానిపై నిందలు మోపి అన్నివిధాల అభాసుపాలు చేయక మానదు. మరి ఇది తెలిసి కూడా కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న ఈ బిల్లుకి బీజేపీ మద్దతు ఇస్తుందని భావించలేము.   బిల్లుకి మద్దతు ఈయడం వలన ఆ పార్టీకి తెలంగాణాలో కొత్తగా ఒరిగేదేమీ లేకున్నా, తెదేపాతో ఎన్నికల పొత్తుల ప్రసక్తి ఇక మరిచిపోవలసి ఉంటుంది. ఒకవేళ బీజేపీ తెలంగాణా బిల్లుకి అనుకూలంగా ఓటు వేసినట్లయితే, రాష్ట్ర విభజనకు సహకరించిన కారణంగా ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవడం తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్యతో సమానమవుతుంది గనుక, ఇక చంద్రబాబు బీజేపీతో పొత్తులకు అంగీకరించకపోవచ్చును.   తెదేపాతో పొత్తులు పెట్టుకొంటే తప్ప బీజేపీ ఈసారి సీమాంధ్రలో ఒక్కసీటు కూడా దక్కించుకోలేదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే, ఈసారి తెదేపా, వైకాపాలకు జీవన్మరణ పోరాటంగా సాగబోతున్న ఎన్నికల కురుక్షేత్రంలో మధ్యలో ఎవరు దూరినా మిగలరు. అదీగాక, బీజేపీకి సీమాంధ్ర ప్రజలలో మంచి గుర్తింపు, పలుకుబడి ఉన్న నాయకుడు ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు కొత్తగా ఆ పార్టీలో చేరుతున్నకృష్ణంరాజు వంటివారయినా గెలవాలంటే తప్పనిసరిగా తెదేపాతో పొత్తులు పెట్టుకోవలసి ఉంటుంది. అందువల్ల బీజేపీ తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేయడమో లేక అది ఆమోదం పొందకుండా ఏదోవిధంగా అడ్డుపడటమో చేయవచ్చును.

సీమాంధ్ర నేతల మధ్య చిచ్చుకి కాంగ్రెస్ కొత్త ఐడియా

  లోక్ సభలో నిన్న జరిగిన గొడవ, ఏకంగా 18మంది సభ్యులను సస్పెండ్ చేయడం, తన సభ్యులను అదుపుచేయలేని కాంగ్రెస్ అధిష్టానం అసమర్ధతని ఎండగడుతూ బీజేపీతో సహా దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీల విమర్శలు, కాంగ్రెస్ (సభ్యులకి) వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా మీడియాలో విమర్శలు, కదనాలు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. రాష్ట్ర విభజన చేసి రాజకీయ లబ్ది పొందుదామని దురాశకు పోతే ఉన్న పరువు కూడా ఈవిధంగా పోతుండటంతో, ఈ సమస్య నుండి ఎలాగయినా గట్టేకేందుకు కాంగ్రెస్ అధిష్టానం మరో కొత్త ఆయుధం బయటకు తీసింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని అంశం. మొన్న ప్రధానిని కలిసిన బీజేపీ అగ్ర నేతలు కూడా రాజధాని గురించే ప్రశ్నించడంతో, ఇప్పుడు అదే అంశంతో ఇప్పటికే గ్రూపులుగా, పార్టీల వారిగా విడిపోయున్న సీమాంధ్ర నేతల మధ్య చిచ్చుపెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దపడుతోంది.   నిజానికి రాష్ట్ర విభజన ప్రకటన చేసినప్పుడే నిపుణుల కమిటీని వేసి 45రోజులలోగా కొత్త రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలి? దానికి ఎంత నిధులు కావాలి? తదితర అంశాలపై ఓ నిర్ణయం తీసుకొని బిల్లులో చేరుస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, ఆ తరువాత హామీని పక్కన పడేసి కధ ఇంతవరకు నడిపించింది. బహుశః రాష్ట్ర విభజన చేయగలనని కాంగ్రెస్ అధిష్టానానికి కూడా పూర్తిగా నమ్మకం లేనందునే, ఈవిషయం పట్టించుకోలేదేమో? ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానానికి నిజంగా తెలంగాణా ఏర్పాటుపై చిత్తశుద్ధి ఉండి ఉంటే, రాష్ట్ర విభజనకు మానసికంగా సిద్దపడి సీమాంధ్ర కోసం ప్యాకేజీలు కోరిన పురందేశ్వరి, చిరంజీవి వంటి వారికి పూర్తి భరోసా కల్పించి, వారిని ప్రోత్సహించి, వారి ద్వారా కొత్త రాజధాని ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లి ఉండేది. కానీ, ఎంతసేపు రాష్ట్ర విభజన చేసి ఏవిధంగా రాజకీయ లబ్ది పొందుదామా? అనే కుత్సిత ఆలోచనలు తప్ప, వేరే ధ్యాస లేకపోవడంతో చివరి నిమిషం వరకు కూడా అంతా అయోమయమే, అనుమానాస్పదమే!   ఇక పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, పరువు పోగొట్టుకొన్న తరువాతయినా కాంగ్రెస్ అధిష్టానానికి జ్ఞానోదయం కలగకపోగా, ఇప్పుడు రాజధాని అంశంతో సీమాంధ్ర నేతల మధ్య చిచ్చుపెట్టి ఎలాగయినా బిల్లుని ఆమోదింపజేసుకోవాలని యోచించడం చూస్తుంటే కాంగ్రెస్ కి పోయే కాలం దాపురించినట్లే కనబడుతోంది.

ఇంకా లాస్ట్ బాల్స్ మిగిలే ఉన్నాయి: కెప్టెన్ కిరణ్

  పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితే తన పదవి నుండి తప్పుకొంటానని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెపుతూ వచ్చినందున, ఆయన ఈరోజు తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ చేయలేదు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అయితే ఇక ఉండబట్టలేక “రాజీనామా చేస్తానన్నారు కదా? ఇంకా చేయలేదేమిటి?” అని మీడియా ద్వారా ప్రశ్నించారు కూడా. అయితే కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం లాస్ట్ బాల్స్ ఇంకా చాలా మిగిలే ఉన్నాయని టక్కున సమాధానం ఇచ్చారు.    రాజీనామా చేయడమనేది తన ముందున్న అనేక ఆప్షన్లలో ఒకటని, తన సహచరులతో చర్చించిన తరువాతనే ఏ నిర్ణయమయినా తీసుకొంటానని తెలిపారు. తనకు లాస్ట్ బాల్స్ చాలా మిగిలే ఉన్నాయని చెపుతూనే, పనిలోపనిగా తన అధిష్టానానికి మళ్ళీ గుగ్లీలు వేసారు. "   మతతత్వ పార్టీ అని మనం నిత్యం విమర్శించే బీజేపీతో ప్రధానమంత్రి లంచులు, డిన్నర్లు చేయడాన్ని ఏమనుకోవాలి? మన స్వంత పార్టీ నేతలని పక్కనపడేసి మన రాజకీయ ప్రత్యర్దులని సహాయం కోసం అర్దించడం ఏమిటి? స్వంత పార్టీనే నమ్మనివారు ప్రత్యర్ధి పార్టీని ఏవిధంగా నమ్ముతున్నారు? ఏవిదంగా సహాయం ఆశిస్తున్నారు? పార్లమెంటులో జరిగిన సంఘటనలకు ప్రధాని తన హృదయం రక్తం కారుస్తోందని అన్నారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం తీసుకొన్న తప్పుడు నిర్ణయానికి ఇక్కడ కోట్లాది ప్రజల హృదయాలు రక్తం స్రవిస్తున్న సంగతి ఆయనకి తెలియదా? తెలిసీ పట్టించుకోవడం లేదనుకోవాలా?” అని సమాధానాలు దొరకని అనేక యక్షప్రశ్నలు వేసారు.   కానీ, మళ్ళీ అంతలోనే తన మాటలతో సోనియమ్మ మనసు నొప్పించినందుకు బాధపడుతూ, “నేటికీ సోనియాగాంధీయే మా అధినేత. ఆమె అంటే నాకు అపారమయిన గౌరవం ఉంది. నేను రాష్ట్ర విభజన నిర్ణయాన్ని మాత్రమె వ్యతిరేఖిస్తున్నాను తప్ప ఆమెను, మా పార్టీని కాదు,” అని ముగించారు.   ఇక అటువైపు నుండి దిగ్విజయ్ సింగ్ కూడా అంతే ఇదిగా స్పందిస్తూ, “కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి విధేయుడయిన మంచి క్రమశిక్షణ గల నేత” అని కిరణ్ కాండక్ట్ సర్టిఫికేట్ ని ఈరోజు మరోమారు రెన్యువల్ చేసారు.   మరి తెదేపా, వైకాపా నేతలు ఆయనపై అనుమానం పడిపోతున్నారంటే ఎందుకు పడరూ? అందుకే “ఆయన సమైక్య ముసుగులో దాగిన విభజనవాదని” జగన్మోహన్ రెడ్డి కూడా సర్టిఫై చేసేసారు.

'పెప్పర్ స్టార్' లగడపాటి

  డ్రామా కింగ్ అని పేరుపొందిన కాంగ్రెస్ బహిష్కృత యంపీ లగడపాటి రాజగోపాల్ ఇంతకాలంగా రాష్ట్ర విభజన విషయంలో ఎంతగా గొంతు చించుకొన్నా, ఎక్కడ, ఎన్ని డ్రామాలు ఆడినా రాని గుర్తింపు, ఈ ఒక్క రోజులోనే సంపాదించుకొన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ మీడియాలో ఆయన చేసిన పని గురించే చర్చ జరగడంతో ఒకే ఒక్కరోజులో ఆయన పెద్ద ‘స్టార్ అట్రాక్షన్’గా మారిపోయారు. చివరికి ఆయన రాజకీయ ప్రత్యర్ధి జగన్ మోహన్ రెడ్డి సైతం లగడపాటి మంచిపనే చేసారని మెచ్చుకొన్నారు. ఇంతకీ ఆయన చేసిన ఘన కార్యం ఏమిటంటే ,ఈరోజు లోక్ సభలో తెలంగాణా కాంగ్రెస్ యంపీలను అడ్డుకొనేందుకు ఆయన వారిపై మిరియాల పొడి స్ప్రే చేయడమే. దానితో సభలో అందరూ ఉలిక్కిపడి భయంతో బయటకి పరుగులు తీయవలసి వచ్చింది. భాద్యతగల ఒక సభ్యుడిగా ఆయన ఆవిధంగా చేయడం ఎవరూ హర్షించరు. అందుకు ఆయనపై కేసులు పెట్టవచ్చును. తప్పనిసరి అయితే నిర్భందించవచ్చును కూడా. కానీ దానివల్ల ఆయనకు సీమాంధ్ర ప్రజలలో మరింత సానుభూతి పెరిగి మేలు చేస్తుందే తప్ప ఎటువంటి నష్టము లేదు. పైగా ఆయనకీ మరింత ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతునందుకు చాలా సంతోషిస్తారేమో కూడా!  

చంద్రబాబు సూటి ప్రశ్న

  ఈరోజు లోక్ సభలో కాంగ్రెస్ యంపీలు అనుచితంగా వ్యవహరించిన తీరుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ గట్టిగా ఖండించారు. అనుచితంగా ప్రవర్తించిన వారిపై పార్లమెంటు నియమ నిబంధనల ప్రకారం కటిన చర్యలు తీసుకోవాలని నొక్కి చెప్పారు కూడా. అయితే ఆయన మీడియాతో ఈ మాటలు చెప్పే కొద్దిసేపటి ముందు, లోక్ సభలో తీవ్ర అలజడి చేసి, సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలపై దాడికి పాల్పడ్డాడని ఆరోపింపబడుతున్న టీ-కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్ ను ఆప్యాయంగా కౌగలించుకొని భుజం తట్టడం చూస్తే, కాంగ్రెస్ అధిష్టానమే దగ్గరుండి ఈ కధంతా నడిపిస్తోందా అనే అనుమానం కలుగుతోంది. అంతేకాక, కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర, తెలంగాణా విషయంలో ఎటువంటి ద్వంద వైఖరి అవలంభిస్తోందో అర్ధమవుతోంది.   ఇక తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ "అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈరోజు లోక్ సభ లో జరిగిన దురదృష్టకర ఘటనలను గట్టిగా ఖండించారు. కానీ సోనియా, రాహుల్ గాంధీలు మాత్రం ఎందుకు పెదవి విప్పలేదు?" అని ప్రశ్నించారు.  బీజేపీ నేత సుష్మాస్వరాజ్ కూడా సోనియాగాంధీని తీవ్రంగా విమర్శించారు. “ఆమె సభలో ఉన్నపటికీ చోద్యం చూస్తూ కూర్చోన్నారే తప్ప, తన యంపీలను నియత్రించాలని అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ దేశంపై క్రమంగా తన పట్టు కోల్పోయింది. ఇప్పుడు పార్టీపై కూడా పట్టుకోల్పోయిందని ఈరోజు సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి,” అని విమర్శించారు.   రాహుల్ గాంధీ ఈ దేశాన్ని, ప్రభుత్వ పనితీరుని, ఈ రాజకీయ వ్యవస్థని పూర్తిగా మార్చేయాలని తరచూ లెక్చర్లు ఇస్తుంటారు. కానీ, ముందుగా తన స్వంత ఇంటిని కూడా చక్కబెట్టుకోలేరు. చక్కబెట్టుకోలేకపోతే పోయే, కనీసం ఇటువంటప్పుడయినా దైర్యం చేసి ఒక మాట మాట్లాడలేరు. కానీ ప్రధానమంత్రి పదవికి తాను అన్నివిధాల అర్హుడనని భావించడం విశేషం.

తెలంగాణ బిల్లు 'టైమ్' ఇదికాదు

      లోక్ సభలో తెలంగాణ బిల్లు పెట్టేందుకు ఇది సరైన సమయం కాదని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ అన్నారు. గందరగోళ పరిస్థితుల మధ్య సభలో బిల్లు పెట్టడం దురదృష్టకరమని... సభలో ఓటాన్ అకౌంట్ తప్ప మరేబిల్లు చేపట్టేందుకు సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ నేతలే హింసను సృష్టించారని, ఈరోజు జరిగిన సంఘటనలు పార్లమెంట్ చరిత్రకే చెరగని మచ్చని అద్వానీ అవేధన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందే కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు బిల్లు ప్రతులను చింపి గాలిలోకి విసిరేయడం, సభా ఆస్తులను ధ్వంసం చేయడం చాలా బాధకరమని ఆయన అన్నారు. ఇంత వివాదాస్పదమైన బిల్లు సమస్య కేవలం కాంగ్రెస్ ఎంపీలను, మంత్రులను సస్పెండ్ చేసినంత మాత్రాన పరిష్కారం కాదని ..అందుకు తాము అ౦గీకరించబోమని స్పష్టం చేశారు.

సీమాంధ్ర ఎంపీల డ్రామా..కాంగ్రెస్ కుట్ర!

  ఈరోజు లోక్ సభ సాక్షిగా రాష్ట్ర కాంగ్రెస్ యంపీలు తెలుగు ప్రజల పరువు పూర్తిగా తీశారు. విభజన బిల్లు ప్రవేశపెట్టకుండా హోంమంత్రి షిండేని అడ్డుకోవాలని సీమాంధ్ర యంపీలు, వారిని నిలువరించాలని తెలంగాణా యంపీలు వారి అధిష్టాన దేవత సోనియాగాంధీ కళ్ళ ముందే ఒకరినొకరు కొట్టుకొన్నంత పని చేసారు. ఆతరువాత అందరూ మీడియా ముందుకు వచ్చి ఒకరినొకరు నిందించుకొంటూ తెలుగు జాతి పరువుని పూర్తిగా గంగలో కలిపేసారు.   బీజేపీ సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మీడియాతో మాట్లాడుతూ, "ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో తెలంగాణా బిల్లుని ప్రవేశపెట్టవద్దని మేము ప్రధానమంత్రికి ముందే సూచించాము. కానీ, కాంగ్రెస్ పార్టీ మా సూచనను పట్టించుకోకుండా సభలో బిల్లు ప్రవేశపెట్టి, తన సభ్యులే ఒకరితో మరొకరు కలహించుకొంటుంటే సోనియాగాంధీ నిర్లిప్తంగా చూస్తూ కూర్చోన్నారు. స్వంత పార్టీ సభ్యులనే అదుపు చేయలేనివారు దేశాన్ని ఏవిధంగా పాలిస్తున్నారో వారికే తెలియాలి?" అని ఆమె ఎద్దేవా చేసారు.   ఏమయినప్పటికీ, ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు వ్యవహరించిన తీరు వలన బిల్లుకు వ్యతిరేఖంగా ఓటు వేద్దామనుకొన్నవారు సైతం అనుకూలంగా వేసేందుకు సిద్దపడినట్లయితే, ఆవిధంగా వారిచేత ఓటు వేయించేందుకే కాంగ్రెస్ అధిష్టానం తన యంపీల చేత ఈ నాటకం ఆడించిందని భావించవలసి ఉంటుంది. బిల్లుని ఆమోదించడానికి సభలో సాధారణ మెజారిటీ సరిపోతుందని న్యాయశాఖ స్పష్టం చేసింది గనుక, సభలో తన సభ్యులచేతనే ఈవిధంగా రాద్ధాంతం చేయించి, వారిని సభ నుండి సస్పెండ్ చేసి, సభలో మిగిలినవారి సహకారంతో మూజువాణి ఓటు ద్వారా బిల్లుని ఆమోదింపజేయాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నట్లు ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. "కాంగ్రెస్ యంపీలందరూ ఒకరితో ఒకరు కుమ్ములాడుకోవడం కాంగ్రెస్ కుట్రగానే మేము భావిస్తున్నామని" సుష్మా స్వరాజ్ చెప్పడం చూస్తే ఈ అనుమానం నిజమేననిపిస్తుంది. విభజన బిల్లుని తమ వోటు ద్వారా కాక మంద బలంతో అడ్డుకొందామని వారు భావించడం వలన బిల్లుకి అనుకూలంగా పరిస్థితులు మారవచ్చుననే గ్రహింపు వారికి లేదని భావించలేము. కనుక సుష్మా స్వరాజ్ చెపుతున్నట్లు, వారు బిల్లుని అడ్డుకోవడానికి కాక దానిపై ఎటువంటి చర్చ జరగకుండా అడ్డుకొని ఆమోదింపజేసేందుకే సభలోఈ విధంగా గొడవ చేస్తూన్నారని అనుమానించక తప్పదు.  

సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్

      లోకసభలో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. రెండు గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ఆమె వారిపై సస్పెన్షన్ వేటు వేశారు. అనంతరం సభను మూడుగంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలోను ఎంపీలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన అనంతరం జరిగిన పరిణామాలపై స్పీకర్ మీరాకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై తాను చాలా బాధపడుతున్నా....విచారిస్తున్నాని స్పీకర్ అన్నారు. ఇప్పుడు మాట్లడలేని పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. సభలో ఈరోజు జరిగిన ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చ అని స్పీకర్ మీరాకుమార్ అన్నారు.

కాంగ్రెస్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

      కాంగ్రెస్ పార్టీకి మరో ముగ్గురు సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి, బండారు సత్యానందరావు ఉన్నారు. వీరు తమ రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఇక ఇప్పటికే రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించినందుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ తన పదవికి రాజీనామా చేశారు. గురువారం ఉదయం తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు లేఖను అందించారు. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఆత్మహత్యకు యత్నించిన టిడిపి మోదుగుల

      ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టగానే తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటు చేసుకున్నాయి. టి.బిల్లును షిండే సభలో ప్రవేశపెడుతున్న సమయంలో పేపర్లు లాక్కునేందుకు ఎంపీ సబ్బంహరి యత్నించగా, టీ.ఎంపీలు షిండేకు రక్షణగా నిలిచారు. మరోవైపు టి.బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ టీడీపీ ఎంపీ మోదుగుల సభలో హల్‌చల్ చేశారు. మైకులను పగుల గొట్టారు, లోక్ సభ సెక్రటరీ జనరల్ వద్ద టేబుల్ అద్దాలు పగులగొట్టి పొడుచుకునేందుకు యత్నించిన మోదుగులను తెలంగాణ ఎంపీలు అడ్డుకున్నారు. అటు లగడపాటిపై ఎంపీలు గుత్తా, మందా జగన్నాథం చేయిచేసుకున్నారు. లగడపాటిని ఎంపీ మందా కిందేసి తొక్కేందుకు యత్నించగా కేంద్ర మంత్రి పళ్లంరాజు అడ్డుకున్నారు.

లోక్‌సభలో పెప్పర్ స్ప్రే...లగడపాటికి అస్వస్థత

    లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లును షిండే ప్రవేశపెట్టిన వెంటనే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీమాంధ్ర ఎంపీల వైఖరితో లోక్‌సభ మరోసారి రణరంగంగా మారింది. లోక్‌సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఎంపీ లగడపాటి సభలో పెప్పర్ స్ప్రే చల్లడంతో పలువురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గు, కళ్ల మంటలతో అస్వస్థతకు గురైన ముగ్గురు ఎంపీలను అధికారులు ఆస్పత్రికి తరలించారు. తెలంగాణ సభ్యులు లగడపాటిని పక్కకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆయన మిరియాల పొడిని తన పైనే ప్రయోగించుకున్నారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది.

లోక్ సభలో తెలంగాణ బిల్లు పెట్టిన కాంగ్రెస్

      తెలంగాణ బిల్లుపై దేశ రాజధానిలో నెలకొన్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టాన౦ తెరదించింది. లోక్ సభలో గంధరగోళ పరిస్థితుల మధ్య నాటకీయంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును 12గంటలకు సుశీల్ కుమార్ షిండే సభలో ప్రవేశపెట్టారు. దీంతో సభలో తీవ్ర ఉద్రిక్త వాతావారణం నెలకొంది. సీమాంధ్ర ఎంపీలు సమైక్యనినాదాలు చేస్తూ బల్లలపైకి ఎక్కి మైకులు విరకొట్టి, దస్త్రాలు పడేశారు. లోకసభ లో సీమాంధ్ర ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడంతో దాని ఘాటుకి దగ్గు, కళ్ళ నుంచి నీళ్ళు రావడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో ఎంపీలు బయటకు పరుగులు తీశారు. లోక్ సభను స్పీకర్ వాయిదా వేశారు.   Watch This Video A musical tribute to Mahatma Gandhi on his death anniversary

టి బిల్లుపై కమల్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

      లోకసభలో రాష్ట్ర విభజన బిల్లుని ఈరోజే ప్రవేశపెట్టనున్నారని సర్వత్రా వార్తలు వస్తున్న సమయంలో పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి కమల్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లును ఈరోజు ప్రవేశపెట్టడమా....లేక సోమవారం ప్రవేశపెట్టడమా అన్న దానిపై చర్చిస్తున్నామని తెలిపారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రైల్వే బడ్జెట్, ఓటాన్ అకౌంట్‌పైనా దృష్టి పెట్టాల్సి ఉందని కమల్‌నాథ్ పేర్కొన్నారు.   మరోవైపు రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి సవరణలు, మార్పులు చేయనవసరం లేదని, బిల్లుని యధాతధంగా లోక్ సభలో ప్రవేశపెట్టవచ్చని, బిల్లుని ఆమోదించడానికి సాధారణ మెజార్టీ సరిపోతుందని న్యాయశాఖ చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏనుగంత బలం చేకూరినట్లయింది. అందుకే ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ముఖ్యమంత్రి రాజీనామా వార్తలను అధిష్టానం పట్టించుకోలేదేమిటి?

  ఈ రోజు రాష్ట్ర శాసనసభ చిట్ట చివరి సమావేశాలు ముగియగానే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయచ్చని వార్తలు వెలువడుతున్న సమయంలో, రాష్ట్ర విభజన బిల్లు వ్యవహారంతో తలమునకలయి ఉన్న కారణంగానో, లేక ఆయన రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన విదించాలని భావిస్తుందో తెలియదు కానీ కాంగ్రెస్ అధిష్టానం మొత్తం మీద ఆ సంగతి అసలు తెలియనట్లు, అసలు పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఆయన రాజీనామా ఆమోదం పొందినట్లయితే, దానితోబాటు ఆయన మంత్రివర్గం కూడా పూర్తిగా రద్దయిపోతుంది. ఒకవేళ ఆయన శాసనసభ రద్దుకు కూడా సిఫారసు చేసినట్లయితే, దానిని గవర్నర్ ఆమోదిస్తే రాష్ట్రపతి పాలన అనివార్యమవుతుంది. కానీ, ఆయన ముఖ్యమంత్రి రాజినామాను ఆమోదించకుండా పెండింగులో పెట్టిన్నట్లయితే, ఈ సమస్యకు వేరే పరిష్కారాలు ఆలోచించే వెసులుబాటు కేంద్రానికి దొరుకుతుంది. పైగా ఆవిధంగా చేసినట్లయితే ఆయనను కొత్తపార్టీ పెట్టకుండా మరికొంత కాలం నిలువరించవచ్చును. ఈలోగా మరికొందరు శాసనసభ్యులు, మంత్రులు వేరే పార్టీలలోకి మారిపోతే, ఇక ఆయన కొత్త పార్టీ ఆలోచన అటకెక్కక తప్పదు. పైగా అయన రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారుతుంది.   కానీ, ఆవిధంగా జరగడం వలన కాంగ్రెస్ పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండదు. సీమాంధ్రలో తెదేపాను అధికారంలోకి రాకుండా అడ్డుకొంటూనే, కాంగ్రెస్ వ్యతిరేఖతను ఓట్లుగా మలుచుకోవడానికే కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యూహం అమలుచేస్తోంది గనుక ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించి, రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందేలోగా ఆయన ప్రజలలోకి వెళ్లి మరికొంత మైలేజీ పొందేలా చేయవచ్చును.

టుడేస్ స్పెషల్స్

  ఈరోజు రాష్ట్రంలో, డిల్లీలో అనేక ఆసక్తికర సంఘటనలు జరుగబోతున్నాయి. 1.లోక్ సభలో రాష్ట్ర విభజన ప్రవేశపెట్టడం.   2. సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు మళ్ళీ తమ స్వంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం.   3.రాష్ట్ర శాసనసభ చిట్ట చివరి సమావేశాలు ముగింపు.   4. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, పార్టీకి రాజీనామా.   5. డిల్లీలో ఆమాద్మీ ప్రభుత్వం జనలోక్ పాల్ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టడం. ఆమోదం పొందకపోతే డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదవికి రాజీనామా.   ఈరోజు మధ్యాహ్నం ప్రశ్నోత్తరాల సమయం తరువాత రాష్ట్ర విభజన బిల్లుని కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టబోతోంది. అయితే అంతకంటే ముందుగానే దానిని అడ్డుకొనే ప్రయత్నంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరింపబడ్డ సీమాంధ్ర కాంగ్రెస్ యంపీలు, తమ ప్రభుత్వానికి వ్యతిరేఖంగా మరో మారు అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. అయితే దానిని సభలో చర్చకు ప్రవేశపెట్టాలంటే కనీసం 50మంది యంపీల మద్దతు అవసరం కాగా, ఇంతవరకు కేవలం 37 మంది యంపీలు మాత్రమే సంతకాలు చేసారు. కనుక మిగిలిన 13మంది మద్దతు కూడగట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.   ఇక రాష్ట్ర శాసనసభచిట్టచివరి సమావేశాలు ఈరోజుతోనే ముగుస్తాయి. ఈరోజే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవికి, పార్టీకి కూడా రాజీనామా చేయవచ్చని తెలుస్తోంది.   బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేఖిస్తున్న జనలోక్ పాల్ బిల్లుని ఇక ఈరోజే డిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమాద్మీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ బిల్లు ఆమోదం కోసం అవసరమయితే తను రాజీనామాకు కూడా సిద్దమేనని డిల్లీ ముఖ్యమంత్రి పదే పదే చెపుతున్నారు గనుక బహుశః ఆయన కూడా ఈరోజే తన పదవి నుండి తప్పుకొంటారేమో! అదే జరిగితే ఆమాద్మీ రెండు నెలల ముచ్చటగా మిగిలిపోతుంది.

నేడు లోక్ సభకి తెలంగాణ బిల్లు

  రాష్ట్ర విభజన బిల్లుని మొదట రాజ్యసభలో ప్రవేశపెడదామని ప్రయత్నించి భంగపడిన కాంగ్రెస్ అధిష్టానం, అధికార ప్రతిపక్ష పార్టీ నేతలనేకమంది రాష్ట్ర విభజన బిల్లు లోపభూయిష్టంగా, రాజ్యాంగ విరుద్దంగా ఉందని గట్టిగా వాదిస్తుండటంతో, మరోమారు అటువంటి చేదు అనుభవం ఎదుర్కోకూడదనే ఆలోచనతో బిల్లుపై కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ సలహా కోరింది. రాష్ట్ర విభజన బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎటువంటి సవరణలు, మార్పులు చేయనవసరం లేదని, బిల్లుని యధాతధంగా లోక్ సభలో ప్రవేశపెట్టవచ్చని, బిల్లుని ఆమోదించడానికి సాధారణ మెజార్టీ సరిపోతుందని న్యాయశాఖ చెప్పడంతో కాంగ్రెస్ అధిష్టానానికి ఏనుగంత బలం చేకూరినట్లయింది. అందుకే ఈరోజు మధ్యాహ్నం 12.30గంటలకు బిల్లుని లోక్ సభలో ప్రవేశపెట్టేందుకు హోంమంత్రి సుషీల్ కుమార్ షిండే సిద్దమవుతున్నారు.   అదేవిధంగా సీమాంధ్ర యంపీలు, మంత్రులు ఎట్టిపరిస్థితుల్లోనూ బిల్లుని సభలో ప్రవేశపెట్టకుండా అడ్డుకొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నారు. అందువలన ఈరోజు పార్లమెంటు రణరంగంగా మారే అవకాశముంది గనుక, కాంగ్రెస్ అధిష్టానం వారందరినీ సభ నుండి సస్పెండ్ చేయమని స్పీకర్ మీరాకుమార్ కి ముందే సూచించి ఉండవచ్చును. ఇంతవరకు జరిగిన వ్యవహారమంతా కాంగ్రెస్ అధిష్టానానికి అనుకూలంగా ఏకపక్షంగానే సాగుతోంది గనుక, ఈరోజు స్పీకర్ కూడా అధిష్టానం మాట మన్నించి వారిని సభ నుండి సస్పెండ్ చేసి బిల్లుని ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమం చేయవచ్చును.

పురందేశ్వరి కాంగ్రెస్ కి గుడ్ బై?

  ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ శాసనసభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తమ పార్టీ తరపున పోటీ చేసిన ముగ్గురు అభ్యర్ధులను ఓటేయకుండా తిరస్కరించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేఖంగా తమ అధిష్టానం రాష్ట్ర విభజన చేస్తునందుకు నిరసనగా వారికి ఓటేయకుండా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. కానీ, వైజాగ్ యంపీ మరియు కేంద్రమంత్రి అయిన ఆయన భార్య పురందేశ్వరి రాష్ట్ర విభజన అనివార్యమని, అందువలన సీమాంధ్ర ప్రాంతానికి న్యాయంగా రావలసిన ప్యాకేజీ కోసం పోరాడుతానని చెప్పడమే కాక, జీ.ఓ.యం.కు లేఖలు కూడా వ్రాసారు. కానీ, అదే సమయంలో తాను రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తున్నందున పార్లమెంటులో టీ-బిల్లుకి వ్యతిరేఖంగా ఓటు వేస్తానని కూడా విస్పష్టంగా ప్రకటించారు. ఆమె ఈరోజు మిగిలిన సీమాంధ్ర కేంద్రమంత్రులు, యంపీలతో కలిసి లోక్ సభ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఆందోళన చేయడంతో సోనియాగాంధీ కూడా కంగు తిన్నారు. రేపు తమ పార్టీ లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టినట్లయితే, తన మంత్రి పదవికి, పార్టీకి కూడా రాజినామా చేసేందుకు ఆమె సిద్దమవుతున్నట్లు సమాచారం.  ఒకవేళ ఆమె కాంగ్రెస్ పార్టీ వీడదలిస్తే, ఆమెను చేర్చుకోనేందుకు బీజేపీ, వైకాపాలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ రెండు పార్టీలలో చేరేందుకు ఆసక్తి లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి లేదా మరొకరు స్థాపించబోయే కొత్త పార్టీలో చేరినాచేరవచ్చును. ఆమె తన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుందని నందమూరి అభిమానులు కోరుకొంటున్నారు. కానీ ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, చంద్రబాబుకి మధ్య గతంలో కొన్ని విభేదాలు ఏర్పడ్డాయి గనుక ఆమె తెదేపాలో చేరడం అనుమానమే. ఆమె పార్టీ వీడుతారా లేదా? వీడితే ఏ పార్టీలో చేరుతారు? అనే విషయాలు త్వరలోనే తేలిపోతాయి.