విజయానికి చేరువలో బీజేపీ: టైమ్స్ సర్వే రిపోర్ట్
కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేజికించుకొంటే రాహుల్ గాంధీ, బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారనే విషయం నిర్ధారణ అవడంతో ప్రజలకు, మీడియాకు కూడా ఎన్నికల పట్ల, ఆయా పార్టీల విజయావకాశాల పట్ల ఆసక్తి పెరిగింది. కాంగ్రెస్, బీజేపీలు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచార యుద్ధం కూడా పెద్ద ఎత్తున మొదలుపెట్టడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. అందుకే నిత్యం ఏదో ఒక మీడియా సంస్థ ఎన్నికలు సర్వేలు నిర్వహిస్తూ నివేదికలు ప్రకటిస్తున్నాయి. అయితే ఇంతవరకు వెలువడిన దాదాపు డజనుపైగా సర్వే నివేదికలలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ గెలుస్తుందని కానీ, కనీసం గెలిచే అవకాశముందని కానీ ద్రువీకరించకపోవడం విశేషం. తాజాగా టైమ్స్-సి ఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ఎన్నికలలో గెలిచే అవకాశం ఉందని మరోమారు ద్రువీకరించింది.
ఆ నివేదిక ప్రకారం త్వరలో జరుగనున్నఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కేవలం 89 సీట్లు, బీజేపీ 202 సాధించుకొనే అవకాశమున్నట్లు ప్రకటించింది. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న206 సీట్లలో సగానికి పైగా కోల్పోబోతుంటే, 112 సీట్లుగల బీజేపీ దాదాపు రెట్టింపు సీట్లు స్వంతంగా గెలుచుకోబోతోంది. ఇక ప్రస్తుతం 259 సీట్లున్న కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ కూటమి కేవలం 101 సీట్లతో సరి పెట్టుకోవలసి వస్తే, 159సీట్లుగల బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమికి 227 సీట్లు వరకు రావచ్చని సర్వే నివేదిక స్పష్టం చేసింది.
కానీ, 543 సీట్ల లోక్ సభలో కనీసం 272 సీట్లు సాధించగలిగినప్పుడే బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలదు. అంటే ఎన్డీయే కూటమికి ఇంకా మరో 45 సీట్లు అవసరముంటుంది. అయితే, ఎన్నికల సమయం దగ్గరపడేలోగా నరేంద్ర మోడీ ఈలోటుని కూడా క్రమంగా పూడ్చుకొనే విధంగా వ్యూహాలు అమలు చేస్తూ ప్రచారం చేయకపోరు. అదీగాక, ఇంతవరకు ఎన్డీయే కూటమిలో లేని తెదేపా, వైకాపా, తెరాస వంటి అనేక ఇతర పార్టీలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి గనుక బీజేపీ అవలీలగా మెజార్టీ సాధించగలదని భావించవచ్చును.
ఈ ఎన్నికలలో బీజేపీ ప్రధానంగా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, గుజరాత్, డిల్లీ, హర్యాన, ఛత్తీస్ ఘర్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఎక్కువ సీట్లు సాధించే అవకాశం ఉందని సర్వే నివేదిక తెలియజేస్తోంది. ఇక మన రాష్ట్రానికి సంబందించిన వరకు చూసుకొంటే, గత ఎన్నికలలో 33 సీట్లు గెలుచుకొన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి కేవలం 6సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేసింది. అందుకు కారణాలు అందరికీ తెలిసినవే.