సీమాంధ్రకు ఐదేళ్ళు ప్రత్యేక హోదా: ప్రధాని మన్మోహన్
posted on Feb 20, 2014 @ 7:52PM
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రసంగించారు. సీమాంధ్రకు ఐదేళ్ళపాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తామని తెలిపారు. సీమాంధ్ర ప్రజల ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని తగిన ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని షిండే ఇంతకుముందే తెలిపారని గుర్తు చేశారు.
ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో తెలంగాణ బిల్లు ప్రతులని చింపి ప్రధానిపై తృణమాల్ కాంగ్రెస్ సభ్యులు విసిరారు. దీంతో కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని చుట్టూ రక్షణగా నిలిచారు. మధ్యలో కలుగచేసుకున్న బీజేపీ నేత వెంకయ్యనాయుడు సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తి పదేళ్ళు పెంచాలని డిమాండ్ చేశారు. రాజధాని విషయంలో కూడా ఇప్పడే స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే వెంకయ్య నాయుడు డిమాండ్‌కు స్పందిస్తూ ప్రత్యేక ప్రతిపత్తి పదేళ్ళు ఇవ్వడం కుదరదని హోంశాఖ మంత్రి షిండే సమాధానమిచ్చారు.
సీమాంధ్రలోని పదమూడు జిల్లాలకు ప్రత్యేక హోదా ఇస్తున్నామన్నారు. పారిశ్రామిక హోదా కోసం పన్ను రాయితీ ప్రకటించారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. సీమాంధ్ర ఆర్థికంగా ఎదగడానికే ప్రత్యేక హోదా ఉపకరిస్తుందన్నారు. పోలవరం నిర్మాణానికి యూపిఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీమాంధ్రకు తొలి ఏడాది ద్వారా ఏర్పడే లోటును కేంద్ర బడ్జెట్ ద్వారా పూడ్చుతామన్నారు. పారిశ్రామిక ప్రోత్సాహానికి పన్ను రాయితీ ఇస్తున్నట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పునరావాసంపై అవసరమైతే సవరణలు త్వరలో చేద్దామన్నారు.