విభజన తరువాత ఏమిటి?
posted on Feb 21, 2014 9:09AM
రాష్ట్రవిభజన వ్యవహారం ఒక కొలిక్కి రావడంతో ఇప్పుడు తరువాత ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిలో ప్రధానంగా చర్చించబడుతున్నవి 1. రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విధిస్తారా లేక తెరాస, మజ్లిస్ తదితర పార్టీల మద్దతుతో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలు చేపడుతుందా? 2. చేపడితే ముఖ్యమంత్రి ఎవరు? 3. ఎన్నికలు సమైక్య రాష్ట్రంలో నిర్వహిస్తారా లేక ఎన్నికలలోగానే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసి వేర్వేరుగా నిర్వహిస్తారా? ఇటువంటి అనేక ప్రశ్నలు చాలానే ఉన్నపటికీ మొదట ఈ మూడు ప్రశ్నలకే సమాధానం తెలియవలసి ఉంది.
తాజా సమాచారం ప్రకారం నేడో రేపో రాష్ట్రపతి పాలన విదిస్తూ ప్రకటన వెలువడనుంది. అయితే, ప్రస్తుత శాసనసభను రద్దు చేయకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవరకు తాత్కాలికంగా నిద్రావస్థలో ఉంచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల ముందు ఏ పార్టీ అధికారం వదులుకోవాలని భావించదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ నయాన్నో భయాన్నో అందరి మద్దతు కూడగట్టి ప్రభుత్వ పగ్గాలు చెప్పట్టె ప్రయత్నాలు చేయవచ్చును.
ఎన్నికలలోగా మిగిలిన రాష్ట్రవిభజన ప్రక్రియ అంటే రాష్ట్రపతి ఆమోదం, కొత్త రాష్ట్రా ఏర్పాటుకి గజిట్ నోటిఫికేషన్ విడుదల వంటివి పూర్తి కావడం కష్టం గనుక, అంతవరకు రాష్ట్రం యధాతధ స్థితిలో ఉంటుంది గనుక కొత్త ముఖ్యమంత్రి నియమించవచ్చును. రానున్న ఎన్నికలలో తెలంగాణాలో అన్ని యంపీ, యం.యల్యే. సీట్లు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్, తెరాసలు భావిస్తున్నాయి గనుక, అందుకు మార్గం సుగమం చేసేందుకు తెలంగాణాకు చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రిగా నియమించవచ్చును. అదే ఎవరనేది కాంగ్రెస్-తెరాసల మధ్య ఏర్పడే అవగాహనపై ఆధారపడి ఉంటుంది.