వామపక్షాలే ఎందుకు విఫలమవుతున్నాయి?
- డా. ఎబికె ప్రసాద్
[సీనియర్ సంపాదకులు]
"పెట్టుబడిదారీ ప్రభుత్వాలకు మనం ఒక సత్యాన్ని ప్రకటించాలి " మీది సాయుధులయి ఉన్న [ఆర్మడ్ పవర్] ప్రభుత్వం, మాది ఆయుధశక్తి. దాన్ని మీరు కష్టజీవులయిన కార్మికవర్గంపై ఎక్కుపెట్టి కూర్చున్నారు. మేం మాత్రం మీకు వ్యతిరేకంగా సాధ్యమైన చోట్లల్లా శాంతియుత పద్ధతుల ద్వారానే పోరాడుతాం, అవసమైనప్పుడు మీపైన మేము సాయుధపోరాటమూ చేయక తప్పదు''
ఈ మాటలు అన్నదెవరో, ఆ మాటలు అందిస్తున్న సందేశమేమిటో భారతదేశంలో 80 సంవత్సరాల ఉనికి చరిత్రగల కమ్యూనిస్టుపార్టీ, తదితర వామపక్షాలకూ తెలిఉఅనిది కాదు. "పిడుక్కీ, బిచ్చానికీ ఒకేమంత్రం'' వాడకూడదన్న సైద్ధాంతిక పరిజ్ఞాన సందేశంలో పాటు, ఆ సామెతలోని రెండో కోణాన్ని, చైతన్యాన్ని, విప్లవ సంసిద్ధతకు కూఒడా ఆ సందేశంలో గుర్తుచేయకనే గుర్తుచేస్తోంది. ఆ సందేశాన్ని కమూనిస్తూ ఇంటర్నేషనల్ లో పునశ్చారణ తరగతుల్లో పాల్గొన్న వామపక్ష రాజకీయ ప్రతినిధులనుద్దేశించి కారల్ మార్క్స్ అందజేశాడు!
అయితే నేడు భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పెట్టుబడీదారీ - భూస్వామ్య పాలనావ్యవస్థ ఏర్పడి క్రమంగా దేశప్రజల ఉమ్మడి సంపదను, వనరులను యథేచ్చగా దోచుకుని బలిసేందుకు అనుకూలమైన పాలనావ్యవస్థ స్థిరపడి జాతి మూలాలను గత 65 ఏళ్ళుగా పీల్చుకుతింటున్నప్పటికీ, నేటికీ భారతప్రజాతంత్ర విప్లవదశను, దిశనూ స్థిరపరచడంలో కమ్యూనిస్టులు సహా వామపక్షాలు విఫలమవుతూ వచ్చాయి. ఫలితంగా ఒకనాటి కమ్యూనిస్టుపార్టీ రెండుగా [సి.పి.ఐ. - సి.పి.ఎం.లుగా] చీలుబాతల్లో పయనిస్తూ ఉండటమేగాక, గత 55 ఏళ్ళలో ఒక్క త్రిపురలో తప్ప కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పరచికూడా వాటిని సంఘిటితం చేసుకోలేక క్రమంగా బలహీనపడుతూ వేగంగా చేజార్చుకుంటూ వచ్చాయి. వామపక్షశక్తుల్ని కూడగట్టడంలో ఒకమేర కొన్ని దశాబ్దాల క్రితం విజయం సాధించినట్టు కన్పించినా అధికార పదవీరాలస కొద్దీ కొన్ని సందర్భాల్లో అవినీతి పాలవుతూ కమ్యూనిస్టేతర వామపక్షశక్తుల విశ్వాసాన్ని కూడా క్రమంగా కోల్పోతూ వచ్చాయి - ఈ ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ.
అంతేగాదు, మొత్తం కమ్యూనిస్టు ఉద్యమమే ఒక్క "రెండుపార్టీలు''గానే కాకుండా మావోయిస్టు పార్టీ సహా ఎంతలేదన్నా 12 ముక్కలుగా విడిపోయి పనిచేస్తున్నాయి, దేశవ్యాపితంగా ఇవన్నీ సంఘితం కావడానికి ఎన్నాళ్ళు పడుతుందో ఎవరో కాదు, ఈ 'ముక్కలూ, చేక్కలే' చెప్పలేని పరిస్థితి. పైగా వీటి మధ్యనే - ఫలానా వాడు 'కోవర్టు' కాబట్టి ఫలానా వామపక్షీయుడు తమ 'పార్టీ'కి లేదా తమ గెలుపుకు వ్యతిరేకి కాబట్టి 'ఖతం' రాజకీయం ద్వారా పరస్పరం పరిమార్చుకోవడాలు జాస్తీగా సాగుతున్నాయి. సమీక్షలకు అతీతంగా ఓకే పంథాలో పెట్టుబడిదారీ-భూస్వామ్యవర్గ పాలనపై సాయుధ పోరాటంలో తప్పొప్పుల మధ్యనే ముందుకు సాగుఇతున్న పార్టీ ఒక్క మావోయిస్టు (మార్కిస్టు-లెనినిస్టు) పార్టీయేనని ప్రభుత్వం కూడా గుర్తించి, తీవ్రంగా ప్రతిఘటిస్తోంది.
ఈ పరిస్థితుల్లో గత 65 ఏళ్ళలో ఎన్నడూ లేనంతటి స్థాయిలో అవినీతిని, లంచగొండితనాన్నీ, సంపద దోపిడీని, స్వదేశీ విదేశీ గుత్తవర్గాల ప్రయోజనాలకు దేశాన్ని స్థావరంగా మార్చి, వేగంగా దుష్టపరిపాలనను సంఘిటిత పరుచుకుపోతున్న కాంగ్రెస్ - బిజెపి పక్షాలను తిరిగి అధికారంలోకి రాకుండా చేయగల వ్యూహరచనలు, ఆచరణలో వామపక్షశక్తులు విఫలమవడం విచారకరం. "అయ్యవార్లు ఏం చేస్తున్నారం''టే, చేసినతప్పులు దిద్దుకుంటున్నారన్న సామెతలాగా గత 80 ఏళ్ళుగానే ఈ వామపక్షాలు దిద్దుబాట్లతో, సవరణపట్టికలతోనే కాలక్షేపం చేస్తున్నారుగాని వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఒక్క తాటిపైకి తేవడంలో సతమతమవుతున్నట్టు కన్పిస్తున్నారుగాని, దేశ పేద, మధ్యతరగతి ప్రజాబాహుళ్యాన్ని విశాల ప్రాతిపదికపైన సంఘిటిత పరచడంలో విఫలమవుతున్నారు. ఎక్కడుంది లోపం? అసలు 'గాడు' ఎక్కడుంది? అసలు ఉభయ కమ్యూనిస్టుపార్టీల మధ్య ఉన్న వాస్తవ విభేదాలేమిటి? ప్రజలకు, మేధావులకు కూడా అంతుపట్టని పరిస్థితి ఏర్పడింది. రెండు పక్షాల మధ్య ఉన్న ఆ "విభేదాలు'' రాజకీయ సంబంధమైనవా? లేక వ్యక్తుల మధ్య వ్యక్తిగత తగాదాలు, కక్షలకు సంబంధించినవా? లేక రెండు పార్టీలూ కలిసి పూర్వపు ఏకైక పాట్టీగా పునరుజ్జీవం పండితే తమతమ నాయకత్వాలు, వేర్వేరు పదవులూ కోల్పోతామన్న బెంగా? వీటిలో ఏది అసలు కారణమని ప్రజలూ, ఉభయ కమ్యూనిస్టుపార్టీల శ్రేయోభిలాషులూ, చాలాకాలంగా "యాది'' కూడా రెండు పార్టీల నాయకత్వాలకూ కలగాకపోవటం, పునరాలోచాన చేసుకొనకపోవటం దురదృష్టకరమేగాదు, ఖండనార్హం కూడా.
ఉభయ పక్షాల ప్రజలూ, క్యాడరూ కూడా నాయకత్వాలను లోలోన, బాహాటంగానూ తిట్టుకుంటున్నారన్న స్పృహ కూడా ఈ నాయకత్వాలకు లేదు. కనీసం విప్లవపంథాను తిరస్కరించినప్పటికీ నేటి పరిస్థితుల్లో అవసరమూ, అవశ్యమూ అయిన వామపక్షాల మధ్య ఐక్య సంఘటన సుదృఢం కావడానికీ దేశంలో రెండు ప్రజాస్వామ్య వ్యతిరేక లేదా బూటకపు ప్రజాస్వామ్యానికి ప్రతీకలుగా నిలిచిన కాంగ్రెస్ - బిజెపి పక్షాల రెక్కలు కత్తిరించడానికీ ముందు షరతు ఒక్కటే - ముందుగా సాయుధపోరాటంతో నిమిత్తంలేని ప్రజాతంత్ర వామపక్షాలయిన ఏకోదరులుగానే ఉంటూ ఏ నిర్థిష్టలక్షమూ లేకుండా, ప్రజలకు వివరించి చెప్పగల విస్పష్టమైన విధాన ప్రకటన లేకుండా అర్థాంతరంగా విడిపోయిన కమ్యూనిస్టుపార్టీలోని రెండు పక్షాలు - కమ్యూనిస్టుపార్టీ (సిపీఐ), మార్కిస్టుపార్టీలు వెంటనే విలీనం కావాలి. అప్పుడు మాత్రమే వామపక్ష కూటమి బలం పుంజుకుంటుంది; అది ఆధారంగా వామపక్ష ఐక్యసంఘటన పునాదిగా (సోషలిస్టు, రివల్యూషనరీ పార్టీ, వగైరా పక్షాలుసహా) దేశంలో బలమైన తృతీయ ఫ్రంటును నిర్మించగలుగుతారు. అంతేగాని ఎవరికీ వారే యమునా తీరేగా ఎవరి ఎన్నికల మానిఫెస్టోను వారుగా వేరుగా ప్రకటించుకుంటే అది ఐక్యసంఘటన ప్రణాళిక కాజాలదు.
విశాల ఐక్యసంఘటనకు కూడా వామపక్ష ప్రజాతంత్ర శక్తులను సంఘటిత పరిచి దేశాభ్యున్నతికి విస్పష్టమైన ప్రణాళికను రూపొందించుకోవచ్చు; తద్వారా పెట్టుబడిదారీ-భూస్వామ్య పక్షాలుగా, కుహనా ప్రజాస్వామ్య శక్తులుగా, కుహనా లౌకినవాదంలోనే మతపరమైన ఏజెండాతోనూ, మతపరమైన ఎజెండాలోనే కుహనా లౌకికవాదంతో నాటకాలాడుతూ దేశాప్రజల్ని జయప్రదంగా వంచిస్తున్న కాంగ్రెస్-బిజెపి పక్షాలకు ప్రత్యామ్నాయంగా విశిష్ట ప్రజాస్వామ్య ప్రజాతంత్ర ఐక్యసంఘటన ప్రభుత్వాన్ని సుసాధ్యం చేసుకోవచ్చు. కాని ఇందుకు తొలిషరతు - రెండు పార్లమెంటరీ పక్షాలుగా అవతరించిన రెండు కమ్యూనిస్టుపార్టీలూ ముందు ఏకంకావాలి. అంతేగాని రెండు ధనికవర్గ పార్టీల మధ్య ఇచ్చకాలాడి నాలుగుసీట్ల కోసం పొత్తులు కుడిచే పార్టీలుగా వామపక్షాలు మనుగడ సాగించలేవు.
ఉదాహరణకు రేపటి జనరల్ ఎన్నికల పూర్వరంగంలో సి.పి.ఐ. నాయకులు కాంగ్రెస్ కూ, తెలుగుజాతిని నిట్టనిలువునా చీల్చడానికి కారకుడయినా వ్యక్తి పార్టీ టి.ఆర్.ఎస్.కూ మధ్య సయోధ్య నెరపడానికి పావులు కదపడాన్ని ప్రజలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలే 'ఛీ' కొట్టి ఏవగించుకోసాగారు. ఈ ప్రయత్నంలో మతలబు - ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొంతనా కుదిరితే కమ్యూనిస్టుపార్టీకి కూడా ఒకటో ఆరో స్థానాలు కేటాయింపు జేసుకోవచ్చని సి.పి.ఐ. నాయకుల ఆశ! ఆ మాటకొస్తే - కమ్యూనిస్టు, మార్కిస్టు పార్టీల దిగజారుడు రాజకీయాల ఫలితంగానే, ఆంధ్రప్రదేశ్ విభజనకు పునాదులు పడ్డాయని చెబితే ఎవరూ నొచ్చుకోనక్కరలేదు. తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం లక్ష్యం - తెలంగాణలో దొరల, భూస్వాముల పెత్తనాన్ని, నిజాం నిరంకుశ పాలనను ఏకకాలంలో వదిలించి తెలంగాణా ప్రజలకు విమోచన కల్పించడంతో పాటు యావత్తు తెలుగుజాతిని ఓకే భాషా రాష్ట్రంగా స్థిరపరచటం. ఈ లక్ష్యానికి చేజేతులా తూట్లు పొడిచింది ఉభయ కమ్యూనిస్టు పార్టీల అనైక్యత మాత్రమే. సోనియా భజనబృందంలో ఈ రెండు పార్టీలూ తాజాగా చేరటం [అటు నారాయణ, ఇటు తమ్మినేని వీరభద్రం] పార్టీ కార్యకర్తలలో ఏవగింపుకు కారణమయింది! ఇలాంటి బాపతు వల్ల మూడవ కూటమిగానీ, ఫెడరల్ ఫ్రంట్ గానీ పగటి కలగానే ఉండిపోతుంది!