పొన్నాల కుర్చీ క్రింద మంటలు

  తంతే బూర్లె గంపలో పడినట్లు ఎవరూ ఊహించని విధంగా తెలంగాణా పీసీసీ అధ్యక్ష కుర్చీలో పడిన పొన్నాల లక్ష్మయ్యకు అప్పుడే అసమ్మతి మొదలయింది. ఆ కుర్చీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకొన్న జానారెడ్డి, దామోదర, డీ.శ్రీనివాస్, షబ్బీర్ ఆలీ తదితరులు, ఆయన పార్టీని సరిగ్గా ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారని అధిష్టానానికి పిర్యాదులు చేయడంతో, పొన్నాలను వెంటనే డిల్లీ వచ్చి తనను కలవమంటూ దిగ్విజయ్ సింగ్ నుండి సమన్లు జారీ అయిపోయాయి.   ఆయన పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పట్టి పదిరోజులయినా ఇంతవరకు టీ-కాంగ్రెస్ నేతలతో సమావేశం ఏర్పాటు చేయలేదని, పార్టీ నేతలను కలుపుకు పోయేందుకు అసలు శ్రద్ధ చూపడం లేదని, తెరాసను డ్డీకొనడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ ఆయనపై డిల్లీకి పిర్యాదులు వెలువెత్తాయి. పైగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం చేస్తూ పార్టీని బలపరుస్తుంటే, పొన్నాల పార్టీని బలోపేతం చేసేందుకు ఏమాత్రం కృషి చేయకుండా తనకి, తన అనుచరులకు పార్టీ టికెట్స్ దక్కించుకొనేందుకు ఆపసోపాలు పడుతున్నారని పార్టీలో ఆయన ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తున్నారు.   కాంగ్రెస్ పార్టీయే తెలంగాణా ఇచ్చినపటికీ దానిని గట్టిగా ప్రచారం చేసుకోవడంలో విఫలమయిన టీ-కాంగ్రెస్ నేతలు, తెరాస ఆ క్రెడిట్ ని స్వంతం చేసుకొంటూ గట్టిగా ప్రచారం చేసుకొంటుంటే, తెరాసను గట్టిగా ఎదురించకపోగా, పొన్నాలపై యుద్ధం ప్రకటించడం విశేషం. ఊహించని విధంగా పీసీసీ అధ్యక్ష కుర్చీ దక్కిందని సంతోషిస్తున్న పొన్నాలకు ఊహించని విధంగానే తన కుర్చీ క్రింద పొగలు, మంటలు రావడంతో ఉక్కిరిబిక్కిరవుతూ కాపాడమని డిల్లీకి పరిగెత్తారు.

దుర్గాబాయిని ఓడించిన రాజమండ్రి !

      1952లో జరిగిన తొలి ఎన్నికల్లో రాజమండ్రి ద్విసభ్య సాధారణ లోక్‌సభ స్థానం నుంచి విలక్షణ తీర్పు నమోదైంది. ఈ స్థానం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్ధి ఎన్.రెడ్డి నాయుడు కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఆయన చేతిలో ఓటమి పాలైనది మరెవరో కాదు... ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశముఖ్ ! అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన కళా వెంకటరావు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన అమలాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘోరపరాజయం పాలయ్యారు. పోలైన ఓట్లలో ఆయనకు 12.5 శాతం మాత్రమే వచ్చాయి.   రాజమండ్రి నుంచి పోటీచేసిన సోషలిస్టు నేత, స్వాతంత్య్ర సమరయోధులు మద్దూరి అన్నపూర్ణయ్య కూడా కమ్యూనిస్టు అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అంతేకాక మూడోస్థానంలో నిలిచారు. అలాగే రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మల్లిపూడి పళ్లంరాజు ( కేంద్రమంత్రి పళ్లంరాజు తాత) ప్రజాపార్టీ అభ్యర్థి చేతిలో ఓడారు. ఆశ్చర్యం ఏమిటంటే స్వాతంత్య్రం తెచ్చానని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల్లో మూడు లోక్‌సభ స్థానాల్లోనూ ఓటమి పాలైంది.

దటీజ్ వెంకయ్య

  రాష్ట్రంలో సొంతంగా బలపడటంపై బీజేపీ వ్యూహం రచిస్తోంది. పలువురు ప్రముఖులు, నాయకులను కమలం దిశగా నడిపించడంలో పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నరు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ అంటూ.. ఆయనతో పలువురికి భేటీలు ఏర్పాటుచేయిస్తూ ఆకర్షిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు, తెలుగుదేశం పక్షాన ఉన్న ప్రముఖులను, తటస్థులనూ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నాలు బీజేపీ చేస్తోంది. 2012 డిసెంబర్‌లో తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలంటూ హీరో బాలకృష్ణకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అందుకు బాలయ్య కూడా సరే అన్నారు. కానీ వెళ్లొద్దని చంద్రబాబు చెప్పడంతో బాలయ్య వెనక్కి తగ్గారని అప్పట్లో వార్తలు వచ్చాయి. గత ఏడాది ఆగస్టులో మోడీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఆయనను కలిసిన కొద్దిమంది సినీ ప్రముఖుల్లో బాలకృష్ణ కూడా ఒకరు. ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరిని తమ పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీ విజయం సాధించింది. తాజాగా హరికృష్ణపైనా 'కమలం' కన్ను పడినట్లు తెలుస్తోంది.   "విభజనను వ్యతిరేకించడంలో హరికృష్ణ నిజాయితీగా వ్యవహరించారు. ఆయన ఒక్కరే రాజ్యసభ సభ్యత్వం వదులుకున్నారు'' అంటూ వెంకయ్యనాయుడు తరచూ ప్రశంసలు కురిపిస్తుండటం గమనార్హం. ఇక... మోడీని పవన్ కల్యాణ్, నాగార్జున కలవడం (కలిసేలా చేయడం) వెనుక కూడా సీమాంధ్రలో సొంతంగా బలపడాలనే ఎజెండా ఉన్నట్లు తెలుస్తోంది. వెంకయ్య నాయుడి ఆహ్వానం మేరకే మోడీని కలిసినట్లు నాగార్జున స్వయంగా అంగీకరించారు. బుధవారం నాడు మోహన్ బాబు కూడా మోడీని కలుస్తున్నారు. ఆయనను కూడా వెంకయ్యే తెరమీదకు తీసుకొస్తున్నట్లు సమాచారం.

కూకట్ పల్లి బరిలో సూరీడు?

  తెల్ల జుట్టు.. నల్లటి మీసాలతో వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎప్పుడూ వెనకే ఉంటూ పాదయాత్ర సమయంలో ఒక్కసారిగా తెరమీదకు వచ్చిన వ్యక్తి సూరీడు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా ఓ పదవి సృష్టించి మరీ సూరీడిని అందులో కూర్చోబెట్టారు. వైఎస్ ఉన్నన్నాళ్లూ సూరీడికి రాజభోగాలే. అలాంటిది, హెలికాప్టర్ ప్రమాదం తర్వాత అసలు సూరీడు ఏమైపోయారో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. అలాంటిది ఆ పేరు ఇప్పుడు మళ్లీ తెరమీదకు వస్తోంది. సూరీడుకు అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించేందుకు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు చక్రం తిప్పుతున్నారు. కూకట్పల్లి కాంగ్రెస్ టిక్కెట్ సూరీడుకు ఇప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ ను సూరీడు కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, తెలంగాణా పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను నియమించడం వెనుక కూడా కేవీపీ హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ-పీసీసీ అధ్యక్ష పదవికి ముందుగా జానారెడ్డి పేరు బలంగా వినిపించింది. అయితే ఆఖరి నిమిషంలో ఆయనకు మొండిచేయి చూపారు. ఊహించని విధంగా పొన్నాల తెరపైకి వచ్చారు. ఈ తతంగం వెనకాల కూడా కేవీపీ మంత్రాంగం ఉందని అంటున్నారు.

తన్నుకున్న కొత్త.. పాత తమ్ముళ్లు

  నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో పాతకాపులు, వలస నేతల మధ్య ఏకంగా దాడులే జరుగుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వర్గాలు బాహాబాహీ తలపడ్డాయి. నువ్వెంతంటే.. నువ్వెంతంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నాయి. వలస నేతల రాకను ఆహ్వానిస్తున్నట్లు నేతలు కడుపులో కత్తులు పెట్టుకొని గాంభీర్యాన్ని ప్రదర్శించినా కార్యకర్తలు దీనిని జీర్ణించుకోలేకున్నారు. ఇందుకూరుపేట మండలం కొత్తూరుకు చెందిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి వర్గీయుడు కైలాసం ఆదిశేషారెడ్డి తమ్ముడు కృష్ణారెడ్డి సతీమణి కైలాసం సుప్రియ కొత్తూరు-2 ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానానికి సోమిరెడ్డి వర్గీయుడైన మాజీ ఎంపీటీసీ సభ్యుడు మునగాల రంగారావు భార్య మునగాల సుజాత కూడా నామినేషన్ వేశారు. వీరిలో బీ ఫారం ఎవరికి ఇవ్వాలన్న విషయమై రెండు వర్గాల మధ్య గొడవ కాస్త ఎక్కువగానే జరిగింది. ఎన్నికల అధికారి వద్ద ఒకరికొకరు ఎదురు పడిన ఇరువర్గాలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రెచ్చిపోయారు. దూషణల పర్వానికి దిగారు. మీరెంత అంటే మీరెంత అంటూ దుర్భాషలాడుకున్నారు. మరింత రెచ్చిపోయిన ఇరువర్గాల వారు తోపులాటకు దిగి పిడిగుద్దులు గుద్దుకున్నారు. సై అంటే సై అంటూ సవాల్ విసురుకున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్సై నాగేశ్వరరావు పోలీసు బలగాలతో అక్కడి చేరుకున్నారు. సోమిరెడ్డి, ఆదాల వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపు తప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పరిస్థితి అదుపులోకి వచ్చింది. చివరకు పాతకాపైన సోమిరెడ్డి వర్గీయుడు రంగారావును కాదని కాదని ఆదాల వర్గీయుడైన ఆదిశేషారెడ్డి వర్గానికే టీడీపీ బీఫాం ఇచ్చారు.

ఏపీపీఎస్సీ సభ్యుడా.. జగన్ పార్టీ కార్యకర్తా?

  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కొందరు ఉద్యోగాలు అమ్ముకొని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినప్పుడే దాని పరువు గంగలో కలిసిపోయింది. అదొక రాజకీయ పునరావాస శిబిరంగా మారిపోయింది. ఇప్పుడు అదే విషయం మరోసారి రుజువైంది. కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక ఎన్నికల సమరంలో ఏపీపీఎస్సీ సభ్యుడు డాక్టర్ ఎస్ఎండీ నౌమాన్ వైసీపీ తరపున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డికి మద్దతుగా నౌమాన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆయనను ఏపీపీఎస్‌సీ సభ్యుడిగా నియమించారు. కాంగ్రెస్‌లో ఉన్న శిల్పామోహన్‌రెడ్డి టీడీపీ గూటికి చేరారు. శిల్పాతో విభేదాల కారణంగా నౌమాన్ రెండు వారాల క్రితం హైదరాబాద్‌లో జగన్‌తో కలిశారు. ఈ మేరకు మున్సిపల్ ఎన్నికల్లో మైనార్టీ ఓట్లు అత్యధికంగా ఉన్న పాతబస్తీలో ప్రచారానికి వైసీపీ నాయకులు నౌమాన్‌ను రంగంలోకి దించారు. ప్రస్తుతం రాష్ట్రపతి పాలన సాగుతున్నా ఏపీపీఎస్‌సీ పదవికి రాజీనామా చేయకుండానే వైసీపీ తరపున ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది.

రాహులయ్యా.. జరా భద్రమయ్యా!

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవరకూ కూడా ఆగేట్టులేడు. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా ప్రధాని పీఠం ఎక్కి కూర్చోవాలని ఆరాటపడిపోతున్నాడు. అందుకు అర్జెంటుగా ప్రజలకు చేరువయిపోవడం ఒక్కటే మార్గమని భావించి బారికేడ్లు దూకేసి మరీ జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. జనాలకి చేరువ కావడం అంటే ఫిజికల్‌గా వాళ్ళ దగ్గరకి వెళ్ళడం అని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడేమో. అందుకే జనం మధ్యలోకి దూరిపోతున్నాడు. జనానికి దగ్గర కావడం అంటే వాళ్ళ మనసులకు నచ్చడం అనే విషయాన్ని రాహుల్ గాంధీ ఎప్పటికి అర్థం చేసుకుంటాడో ఏంటో.   మొన్నీమధ్య ఓ ఎన్నికల మీటింగ్‌కి వెళ్ళిన రాహుల్ బారికేడ్లు దూకేసి అడ్డదారిలో ప్రజల దగ్గరకి వెళ్ళాడు. రాహుల్ గాంధీ ఇలా చెప్పాపెట్టకుండా చేస్తున్న సాహసాలకు సెక్యూరిటీ సిబ్బంది బిత్తరపోయి హడావిడి పడిపోతున్నారు. అసలే రాహుల్ గాంధీ “నాకు ప్రాణభయం వుంది దేవుడో.. మా నాయనమ్మ, మా నాన్నలాగా నా ప్రాణాలకు గ్యారంటీ లేదని” చెబుతూ వుంటాడు. మరోపక్క ఇలాంటి సాహసాలు కూడా చేస్తూ వుంటాడు. ఇది సెక్యూరిటీ సిబ్బందికి లేనిపోని తలనొప్పులను తెచ్చిపెడుతోంది. 1991లో రాజీవ్ గాంధీ కూడా ఇలాగే అతి చొరవ చూపించి జనాల్లో కలిసిపోవడం వల్ల ఎంత అనర్థం జరిగిందో తెలిసిందే.   అందువల్ల రాహుల్ గాంధీ కాస్త జాగ్రత్తగా వుంటే బెటర్. ఈసారి ఎన్నికలలో కాకపోతే వయసు వుంది కాబట్టి ఆపైసారో మరోసారో ఎన్నికలలో పోటీ చేసి గెలవగలిగితే ప్రధానమంత్రి అయినా అవ్వొచ్చును. ఈసారికి మాత్రం నరేంద్రమోడీ పుణ్యమా అని తనకు ప్రధాని కుర్చీలో కూర్చొనే భాగ్యం దక్కదని గ్రహించినా రాహుల్ గాంధీకి ఆ తహతహ మాత్రం తగ్గట్లేదు పాపం. అందుకే రిస్క్ తీసుకొని బారికేడ్లు దూకేస్తున్నారుట. కానీ రాహుల్ గాంధీ లేనిపోని సాహసాలు చేయకుండా, కొంచెం జాగ్రత్తగా మసులుకొంటే మంచిదని ఆయన్ని అభిమానించేవారు, అభిమానించని వారు కూడా అనుకుంటున్నారుట! అంటే బ్రతికుంటే బలిసాకు తినయినా బ్రతకొచ్చని వారి అభిప్రాయమో..ఏమో...

కేసిఆర్ కు మోత్కుపల్లి సవాల్

      తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కు సవాల్ విసిరారు. కేసిఆర్ మల్కాజ్ గిరి లోక్ సభకు పోటీ చేస్తే ఆయనపై పోటీ చేయడానికి సిద్దంగా వున్నానని తెలిపారు. మల్కాజిగిరి నుండి కెసిఆర్ బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయని.. అది నిజమా లేక లీకులా అన్నారు. ఆయన పోటీ చేసేది నిజమైతే.. తెలుగుదేశం పార్టీ అధిష్టానం అవకాశం ఇస్తే మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుండి తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వం దక్కలేదని అసంతృప్తిగా ఉన్న మోత్కుపల్లి తాజాగా మళ్లీ లైన్ లోకి వచ్చాడని చెప్పాలి. అయితే ఈ స్థానం నుండి టీడీపీ తరపున పోటీ చేసేందుకు ఇప్పటికే రేవంత్ రెడ్డి సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

చిరంజీవి అండ్ ట్రూప్ వారి ఉత్తర కుమార ప్రగల్భాలు

  చిరంజీవి వెండి తెర మీద ఆడిపాడితే అదొక రకమయిన వినోదం. అదే కాంగ్రెస్ కండువా కప్పుకొని బస్సుయాత్ర చేస్తూ ప్రజల ముందు పంచ్ లేని డైలాగ్స్ కొడితే అది మరొక రకమయిన కామెడీ. రెండూ వినోదం పంచేవే. మొదటి దానికి ప్రజలు డబ్బు చెల్లిస్తే, రెండో దానికి కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తోంది! చిరంజీవి అండ్ కో ట్రూప్ నెల్లూరు చేరుకొంది. యధాప్రకారం స్టేజి మీద ఉన్నంత మంది క్రిందన లేకపోయినా నిరుత్సాహపడకుండా ఇది రోడ్ షో కాదు, కార్యకర్తల సమావేశమని అందరికీ సర్దిచెప్పుకొని తన ప్రోగ్రాం షురూ చేసేసారు మెగా జీవిగారు.   ముందుగా సీమాంద్రాను సింగపూర్ చేస్తానంటున్న చంద్రబాబును ఎంచుకొని, మరి తొమ్మిదేళ్ళు అధికారంలో ఉన్నపుడు ఎందుకు చేయలేదని ‘లా పాయింటు’ లేవనెత్తారు. కానీ తన పక్కనున్న ‘రఘువీరుడు’ అంతక్రితం జరిగిన సమావేశంలోనే “గత అరవై ఏళ్లుగా తమ కాంగ్రెస్ చేయలేని అభివృద్ధిని వచ్చే పదేళ్ళలో చేసేస్తామని” చెప్పిన సంగతి మరిచిపోయారు. అటువంటప్పుడు కేవలం తొమ్మిదేళ్ళే పాలించిన చంద్రబాబు ఏదో ప్రజలను వినోదింపజేయడానికి సింగపూరు పిక్చరు వేసి చూపిస్తే తప్పేమిటి? అని గుప్పెడు ప్రేక్షకుల ప్రశ్న.   అసెంబ్లీలో నోరే విప్పని చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధి అంటారేమిటి? అని మరో ధర్మ సందేహం వ్యక్తం చేసాడు ఆ మెగాజీవి. నిజమే! చంద్రబాబు నోరు మెదపలేదు. సరే! కానీ రాష్ట్ర విభజనకు వ్యతిరేఖిస్తూ రాజీనామా కూడా చేసిన ఈ మెగాజీవి హైదరాబాదుని యూటీ ఎందుకు చేయమన్నట్లు? విభజన బిల్లుకి మద్దతు ఎందుకు ఇచ్చినట్లు? మరక మంచిదే అని ఏదో బట్టలసబ్బుల ప్రకటనలాగ విభజన మంచిదేనని ఇప్పుడు ఎందుకు వితండ వాదం చేస్తున్నట్లు? నేటికీ కేంద్రమంత్రి పదవిలో ఎందుకు కంటిన్యూ అయిపోతున్నట్లు? అని ప్రజలకు కూడా అనేక ధర్మసందేహాలు కలుగుతున్నాయి.   ఇక మెగాజీవి గారు జగన్ జైల్లో ఉన్నపుడే వైకాపా పరిస్థితి బాగా ఉందని వెటకారం చేసారు. కానీ తను బయట ఉండి కూడా ప్రజారాజ్యం పార్టీని  గట్టిగా రెండేళ్ళు నడపలేక చేతులెత్తేసి, కాంగ్రెస్ హస్తంలో పార్టీని పెట్టేసి కేంద్రమంత్రి పదవితో పునీతులయిన సంగతి మరిచిపోయి, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉండి కూడా పార్టీని బాగా నడపగలిగారని అంగీకరించడం చాలా గొప్ప విషయమే.   ఇక చంద్రబాబు రండి బాబు రండి అని పిలుస్తుంటే... జగన్ బాబు నిధులు తెండి బాబు తెండి అని అంటున్నారని ఎద్దేవా చేశారు. నిజమే..ఎవరి బాధలు వారివి. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేవారు లేకనే కదా.. ఇప్పుడు ఈ కాంగ్రెస్ జీవులన్నీ ఏసీ బస్సేసుకొని రోడ్డున పడవలసి వచ్చింది. జనాల మాట దేవుడెరుగు కనీసం తమ గోడు వినేందుకు పదిమంది కార్యకర్తలు వచ్చినా చాలని వారు ఆరాటపడటం లేదా? కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు చుట్టూ జనాలు తిరిగే పరిస్థితి నుండి జనాల చుట్టూ కాంగ్రెస్ నేతలు తిరిగే దుస్థితికి అద్దం పడుతూ సాగుతున్న ఈ బస్సుయాత్రలో కూడా మరి ఈ ఉత్తరకుమార ప్రగల్భాలు ఎందుకు?   విజయనగరంలో ఆయనతో బస్సెక్కిన బొత్స వారు అక్కడే దిగిపోవడమే కాకుండా త్వరలోనే వేరే బస్సేక్కేందుకు బ్యాగులు సర్దుకొంటున్నట్లు తాజా వార్త. అదే నిజమయితే ఆయన పేరును కూడా కాంగ్రెస్ ద్రోహుల జాబితాలో చేర్చి వారందరి గోత్రానామాలతో పాటు బొత్స పేరును కూడా తరువాత స్టేజి నుండి స్మరించు కొంటారేమో.. అందువల్ల కనీసం బస్సులో ఉన్నవారయినా యాత్ర పూర్తయ్యేలోగా మధ్యలో ఎక్కడా దిగిపోకుండా కాపాడుకోగలిగితే అదే పదివేలు. అలాకాదని బ్లడ్డ్ బ్యాంకులున్నాయి కదా అని పదే పదే కాంగ్రెస్ పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తానని అంటే జనాలు నవ్విపోతారు చిరంజీవి గారు.

అవనిగడ్డ ప్రజలకు అండగా ఉంటా: కంఠమనేని రవిశంకర్

      అవనిగడ్డ నియోజకవర్గంలో పార్టీలు, కులమతాలకతీతంగా పలు సేవాకార్యక్రమాలు, వైద్య సేవలు అందిస్తున్నారు తెలుగుదేశం నాయకులు, తెలుగువన్ ఫౌండేషన్ అధినేత కంఠమనేని రవిశంకర్. ప్రజలకు మరింత చేరువకావాలనే సంకల్పంతో గ్రామీణ ప్రాంత ప్రజలను పరిచయం చేసుకుంటూ, ఇంటింటికీ వెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పటి వరకు మోపిదేవి, చల్లపల్లి, కోడూరు, ఘంటాశాల, నాగాయలంక మ౦డలాలలో ఆయన పర్యటించి ఆ గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఓటు హక్కు చాలా అమూల్యమైనదని, రానున్న ఎన్నికలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడినే ఎన్నుకోవాలని సూచించారు. మీడియాతో మాట్లాడుతూ.. అవనిగడ్డ నియోజకవర్గంలో వలసవాదులకు చోటు లేదని, ప్రజలకు కావాల్సింది వారి సమస్యలను తీర్చి, కష్టాల్లో అండగా నిలిచే నాయకుడని.. ఆ నాయకుడు తానే అవుతాననే ధీమాను కంఠమనేని రవిశంకర్ వ్యక్తం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారు అవనిగడ్డ సీటును తనకు ఇస్తారనే నమ్మకం వుందని అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన పరిచయ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.      

కాంగ్రెస్ ‘సర్వే’నాశనం

  అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయిందన్న విషయం స్పష్టంగా తెలిసిపోతూనే వుంది. పార్లమెంట్ విషయంలో ఎవర్ని కదిలించినా ‘మోడీ’ అంటున్నారు. సీమాంధ్రలో ఎవర్ని అడిగినా ‘చంద్రబాబు’ అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం నిశ్శబ్ద విప్లవం సృష్టించబోతోందన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయ్యే అవకాశాలున్నాయని జాతీయ స్థాయిలో పలు ఛానెళ్ళు సర్వే సంస్థలతో కలసి నిర్వహించిన సర్వేల్లో తెలిసిపోతోంది. రెండు మూడు మీడియా సంస్థలు బయటకి వెల్లడించిన సర్వే ఫలితాలను గమనిస్తే కాంగ్రెస్ నాయకులు ఎన్నికల తర్వాత నెత్తిన తెల్లగుడ్డలు వేసుకోవడం ఖాయమని అర్థమవుతోంది.   మరికొన్ని మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ఫలితాలు త్వరలో బయటకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వేలన్నీ కూడా దేశంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ మటాషైపోవడం ఖాయమని చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం వాస్తవాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అన్ని సర్వేలూ తమకి వ్యతిరేకంగా వస్తున్నప్పటికి వాళ్ళకి జ్ఞానోదయం కలగటం లేదు. ఇవన్నీ డబ్బులిచ్చి చేయిస్తున్న సర్వేలంటూ గత ఎన్నికల సమయంలో తాము చేయించిన ‘పెయిడ్ సర్వే’లను గుర్తు చేసుకుంటూ చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గతి పట్టబోతోందో తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా సర్వేలు చేయాల్సిన అవసరం లేదని, మారుమూల పల్లెటూళ్ళో వున్న సామాన్య ఓటర్ని అడిగినా చెబుతాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

కేసీఆర్ మీడియా లీకులతో ప్రత్యర్ధులు తికమక

  తెరాస అభ్యర్ధుల మొదటి జాబితా ఇంకా విడుదల కానేలేదు. కానీ, కేసీఆర్ మల్కాజ్ గిరీ నుండి, కేటీఆర్ సిరిసిల్లా నుండి, కవిత నిజామాబాద్ నుండి మరొకరు మరొక చోటు నుండి పోటీ చేస్తారంటూ తెరాస మీడియాకి లీకులు ఇస్తూ తమ ప్రత్యర్దులను తికమక పరిచే ప్రయత్నం చేస్తోంది. ఊహించినట్లే కేసీఆర్ విసిరినా గేలానికి కొన్ని చేపలు చిక్కుకొని విలవిలలాడుతున్నాయి. వాటిలో మొదటి చేప తెదేపా తెలంగాణా ఎన్నికల కమిటీ కన్వీనర్ మోత్కుపల్లి నర్సింహులు. ప్రస్తుతం తెదేపాలో మల్కాజ్ గిరీ నుండి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న వారు చాలా మందే ఉన్నారు. వారిలో మోత్కుపల్లి కూడా ఒకరు.   ఇప్పుడు కేసీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తారని మీడియా గుప్పుమనడంతో, ఇదే అదునుగా “పార్టీ అదేశిస్తే తాను కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తానని” ప్రకటించేసారు. అయితే కేసీఆర్ అక్కడి నుండి పోటీ చేస్తారనే నమ్మకం ఏమీ లేకపోయినా, ఈ సాకుతో మోత్కుపల్లి కూడా మల్కాజ్ గిరీపై కన్నేయడాన్ని అక్కడి నుండి పోటీ చేయాలను కొంటున్న రేవంత్ రెడ్డి వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న మీడియా లీకుతో తెలుగు తమ్ముళ్ళ మధ్య చిచ్చుపెట్టగలిగిన కేసీఆర్ ని, నిజంగానే మోత్కుపల్లి డ్డీకొని ఓడించగలరా? అంటే అనుమానమే. కానీ, ఈ సాకుతో తాను కూడా మల్కాజ్ గిరీ నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మోత్కుపల్లి విస్పష్టంగా ప్రకటించగలిగారు.

పాపం కావూరి!

  కేంద్రమంత్రి కావూరి దిమాగ్ రాజకీయంగా ఖరాబైనట్టు కనిపిస్తోంది. నాలుగు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాల్లో ఓటమే ఎరుగని వ్యక్తిగా ఒక వెలుగు వెలిగిన కావూరి రాజకీయ జీవితం ప్రస్తుతం అత్యంత కనాకష్టంగా తయారైంది. కావూరి పోటీ చేస్తే చాలు గెలవటం ఖాయం అనే స్థితి నుంచి తాను పోటీ చేస్తే ఓడిపోవడం ఖాయమన్న మానసిక స్థితికి కావూరి చేరుకున్నారంటే పాపం…ఆయన పరిస్థితిని చూసి ఎవరికైనా జాలి కలుగుతుంది. అయితే కావూరి ఎంతమాత్రం జాలిపడటానికి అర్హుడు కాదన్నది సీమాంధ్రుల ఏకాభిప్రాయం. కేంద్రమంత్రి పదవి వచ్చేంత వరకూ సమైక్యవాదిగా కనిపించిన కావూరి కేంద్రమంత్రి అవగానే సమైక్యవాదాన్ని అటకెక్కించేసి పక్కా కాంగ్రెస్ విధేయుడు అయిపోయారు. రాష్ట్ర విభజన పాపాన్ని ఒక్క పిడికెడు కాకుండా నాలుగైదు పిడికిళ్ళు తన అకౌంట్‌లో వేసుకున్నారు. రాష్ట్ర విభజనకు ఏ దశలోనూ వ్యతిరేకత తెలుపకుండా మంత్రి పదవే పరమావధిగా భావించిన కావూరి ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయాక తీరిగ్గా విచారిస్తున్నారు.   ఏలూరు పార్లమెంట్ స్థానం నుంచి తనకు గెలిచే సీన్ లేదని అర్థమైపోయిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ జిలానీ అయిపోయే ప్రయత్నాలు మొదలెట్టారు. ఆరిపోయే దీపంలా వున్న మంత్రి పదవిని వదులుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. పదవి లేకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా గొంతులోంచి దిగని కావూరి సార్ మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆహ్వానం వస్తుందేమోనని ఎదురుచూశారు. సీమాంధ్రలో తెలుగుదేశానికి వున్న అభిమాన్ని అడ్డు పెట్టుకుని మరోసారి పార్లమెంట్‌కి వెళ్ళాలని భావించారు. అయితే అటు నుంచి పట్టించుకునేవాళ్ళు లేకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే అయ్యగారికి అంత ధైర్యం లేక ఇప్పడు బీజేపీతో రాయబారాలు నడుపుతున్నారు. కానీ అటు నుంచి కూడా కావూరికి ఇంతవరకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కావూరి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా, ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమన్నది తేలిపోయింది. అలాంటి కుంటి గుర్రాన్ని రేసులో నిలపడానికి ఏ పార్టీ ఇష్టపడటం లేదు. రాజకీయంగా తనకు వచ్చిన దురవస్థని చూసుకుని కావూరి మనశ్శాంతి లేకుండా వున్నారు. రాజకీయంగా దిమాగ్ ఖరాబ్ చేసుకుంటున్నారు.

మదనపల్లెలో బీజేపీ పోటీ?

      చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలి? టీడీపీనా.. లేక బీజేపీనా? ఈ విషయమై గందరగోళం నెలకొంటోంది. సీట్ల సర్దుబాటులో భాగంగా ఈ స్థానాన్ని కమలానికి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలియడంతో టీడీపీ వర్గాలు కాస్త డీలా పడ్డాయి. బీజేపీ తరఫున భారతీయ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి చల్లపల్లె నరసింహా రెడ్డికి మదనపల్లె టికెట్టు ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ నాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో దీనిని అంగీకరిస్తున్నారు. ఆ పార్టీ జాతీయ స్థాయి అగ్రనేతల్లో ఒకరైన ఎల్‌కే అద్వానీతో చల్లపల్లెకు మంచి అనుబంధం ఉంది.   దీంతో సీట్ల సర్దుబాటు అంటూ జరిగితే చల్లపల్లెకు మదనపల్లె కేటాయించడం ఖాయమని అంటున్నారు. దీనికి తోడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మదనపల్లె విషయంపై మౌనంగా ఉన్నారు. బీజేపీకి కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నందునే మదనపల్లె ప్రస్తావన తేవడం లేదనే అనుమానాలు దేశం నేతల్లో ఉన్నాయి.

సీపీఐ - టీ కాంగ్రెస్ పొత్తు ఓకే?

  భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు దాదాపు ఖరారైంది. స్థానాల కేటాయింపుపై ఒక స్పష్టత రావాల్సి ఉంది. వురోవైపు టీఆర్‌ఎస్‌తో సీపీఐ పొత్తుకు దాదాపుగా మార్గాలు మూసుకుపోయాయి. పొత్తు విషయంలో టీఆర్‌ఎస్ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు కూడా. సోమవారం సీపీఐ నేతలు ఇటు టీఆర్‌ఎస్, అటు కాంగ్రెస్ నేతలతో పొత్తులపై చర్చలు జరిపారు. అయితే టీఆర్ఎస్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన నారాయణ.. తెలంగాణా పీసీసీ చీఫ్ పొన్నాలతో ఓ హోటల్లో రహస్యంగా భేటీ అయ్యారు. తమకు రెండు ఎంపీ, 17 అసెంబ్లీ స్థానాలివ్వాలని కోరారు. ఒక ఎంపీ, 12 అసెంబ్లీ సీట్లను కేటాయించేందుకు పొన్నాల అంగీకారం తెలిపారు. అయితే, ఎంపీ సీట్ల వ్యవహారాన్ని అధిష్టానం చూస్తోందని, సీపీఐ కోరుతున్న అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు ఉండటంతో మరోసారి చర్చించుకుందామని సూచించారు.   రాష్ట్రవ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ తమకు అనుకూలంగా ఉన్న ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయని, రెండు సీట్లు ఎక్కువ ఇచ్చేందుకు వెనుకాడొద్దని నారాయణ ఆయనతో చెప్పినట్లు సమాచారం. ఒకటి రెండు అటూ ఇటూగా మొత్తమ్మీద హస్తంలో కంకి కొడవలి ఇమిడిపోయినట్లే భావించవచ్చును.

తెలంగాణా బరిలో రాహుల్?

    కాంగ్రెస్ యువరాజు రాహుల్‌ గాంధీ తెలంగాణాలో పోటీ చేయబోతున్నారు. ఇందుకోసం తెలంగాణాలో టీఆర్‌ఎస్ బలహీనంగా, కాంగ్రెస్ బలంగా ఉన్న స్థానాలేమున్నాయి, రాహుల్ పోటీ చేస్తే తెలంగాణా అంతటా దాని ప్రభావం పడే అవకాశముందా అనే ప్రశ్నలకు ఏఐసీసీ వేగులు సమాధానాలు వెదుకుతున్నారు. కచ్చితంగా గెలిచే అవకాశమున్న పార్లమెంట్ స్థానం ఏదనే దానిపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు. తెలంగాణా బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింపజేయడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు ప్రజాదరణ పెరిగిందని పలు సర్వేలు వెల్లడించడంతో రాహుల్‌ గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని కాంగ్రెస్ వర్గాలు పరిశీలిస్తున్నాయి. తాను పోటీ చేయడం ద్వారా తెలంగాణాలోని అన్ని సీట్లపైనా దాని ప్రభావం ఉంటుందని, తద్వారా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ అంశంపై యువరాజు కూడా దృష్టి సారించినట్టు తెలిసింది. అందుకే తన వేగులను పంపి తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి, కచ్చితంగా గెలిచే అవకాశాలున్న సీట్లు, టీఆర్‌ఎస్ బలంపై ఆరా తీయిస్తున్నారు. దక్షిణ తెలంగాణాలో టీఆర్‌ఎస్ బలం తక్కువగా ఉన్నందున, పోటీకి ఈ ప్రాంతమే మేలనే భావనకు వచ్చిన వేగులు, చేవెళ్ల, భువనగిరి, నల్లగొండ నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యులతో వారు ఫోన్లో మాట్లాడి, అగ్రనేతలకు ఆయా సీట్లు ఎంతవరకు సురక్షితం అనే అంశాన్ని విశ్లేషించినట్టు తెలిసింది. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కూడా రాహుల్ దూతలు మంతనాలు జరిపినట్టు సమాచారం.

ఒంగోలు గడ్డపై చిరంజీవి ఫ్లాప్ షో

  ‘కాశీకి వెళ్లానని..కాషాయం’ అంటూ ఇంద్ర సినిమా డైలాగుతో ప్రారంభమైన ప్రసంగం కాంగ్రెస్ కార్యకర్తల బుర్రను వేడెక్కించింది.నూనూగు మీసాల వయసులో ఒంగోలులో తాను తిరిగిన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని చెప్పిన ఆయన గుర్తులు వేదికపైనున్న కాంగ్రెస్ పెద్దలనే అయోమయానికి గురిచేశాయి. ‘కాంగ్రెస్ పార్టీ అనేది ప్రకృతి గద్ద.. రెక్కలు విప్పుకుని ఆకాశంలో ఎగిరిన పక్షిలా.. నేడు యువకులు రూపాంతరం చెందాలి.. కార్యోన్ముఖులు కావాలి..’ కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్ష బాధ్యత చేపట్టిన కేంద్రమంత్రి చిరంజీవి పొంతన లేకుండా చేసిన వ్యాఖ్యలివి.   ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇతర కాంగ్రెస్ పెద్దలతో కలిసి తాను చేపట్టిన కాస్తా అట్టర్ ఫ్లాప్ కావడంతో చిరంజీవికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడినట్లుంది అంటూ కొంతమంది కార్యకర్తలు వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పట్టింది. గుంటూరు జిల్లా నుంచి ఒంగోలులోకి ప్రవేశించిన కాంగ్రెస్ బస్సు యాత్ర ఆద్యంతం పెద్ద జోకులాగే సాగింది.   ఇక సభలో కేంద్రమంత్రి పనబాక మాట్లాడుతూ చిరంజీవిని సూపర్‌స్టార్ అని సంబోధించినప్పుడు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటాయి. పవర్‌స్టార్, జై జనసేన అంటూ పవన్‌ అభిమానులు పెద్దగా నినాదాలివ్వడంతో వేదికపై నేతలు డైలామాలో పడ్డారు. ఇక చిరంజీవి కూడా గతంలో తాను పీఆర్పీ అధినేతగా సమైక్యాంధ్ర కోసం పోరాడానంటూనే.. అప్పట్లో తనను ఎవరూ మెచ్చుకోనందున.. కాంగ్రెస్‌లో కలిశానని.. ఇప్పుడు తన హక్కులు, అధికారాలు పరిమితమయ్యాయని చెప్పుకోవడంపై అభిమానులు పెదవి విరిచారు.

ఆదాల వర్సెస్ ఆనం.. ఈసారి పార్లమెంటు బరిలో?

  ఒకే పార్టీలో ఉన్నా కూడా వైరి వర్గాలుగా ఎప్పటికప్పుడు తమ ఆధిపత్యాన్ని చూపించుకోడానికి ప్రయత్నించిన చరిత్ర ఆనం, ఆదాల వర్గాలకు ఉంది. నెల్లూరు జిల్లాలో ఆనం చెంచుసుబ్బారెడ్డి వారసులుగా ఈ తరంలో రాజకీయాలు నడిపిస్తున్న ఆనం సోదరుల్లో పెద్దవాడు, నిన్న మొన్నటి వరకు సమైక్య రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆనం రామనారాయణ రెడ్డి ఈసారి లోక్ సభ బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయానికి కారణం ఆయన చిరకాల ప్రత్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డేనని తెలుస్తోంది.   ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి, తెలుగుదేశం పార్టీలో చేరిన ఆదాల.. నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన ఆనం.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఆదాలను ఢీకొట్టాలని భావిస్తున్నారట. అయితే, అంతకుముందు వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ప్రస్తుతం వైఎస్ఆర్ సీపీలో కొనసాగుతున్న మేకపాటి రాజమోహనరెడ్డి ప్రస్తుతం నెల్లూరు ఎంపీ. ఆయన ఈసారి కూడా అదే పార్టీ తరఫున బరిలోకి దిగడం ఖాయం.   ఈ నేపథ్యంలో.. ఒకే పార్టీ నుంచి వచ్చిన ముగ్గురు నాయకులు మూడు వేర్వేరు పార్టీల నుంచి నెల్లూరు లోక్ సభ స్థానాన్ని చేజిక్కించుకోడానికి పందెం కోళ్లలా పోరాడబోతున్నారన్న మాట.

బీజేపీకి జస్వంత్ సింగ్ షాక్ ట్రీట్మెంట్

  రాజకీయ పార్టీలకి టికెట్స్ కేటాయింపు సమయంలో అసమ్మతి బెడద సర్వసాధారణమే అయినప్పటికీ, పార్టీలో అగ్రనేతలే తిరుగుబాటు చేస్తే, ఆ బాధ వర్ణనాతీతం. పార్టీలో చెలరేగిన అసమ్మతి కంటే తమ రాజకీయ ప్రత్యర్ధులకు, మీడియాకు జవాబు చెప్పుకోలేక అత్త కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాన్నట్లు ఉంటుంది పరిస్థితి. ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. పార్టీలో అత్యంత సీనియర్ నేత అయిన జశ్వంత్ సింగ్ కోరిన విధంగా రాజస్థాన్‌లోని బార్మర్ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీపై ఆగ్రహించిన ఆయన ఈరోజు స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయడంతో పార్టీ కంగు తింది. ఇదే అదునుగా కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్ వంటి వారు బీజేపీపై దాడి చేస్తుంటే, కాంగ్రెస్ అనుకూల మీడియా జస్వంత్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం మొదలు పెట్టేసింది. కానీ, జస్వంత్ సింగ్ తాను స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషాన్ వేసినప్పటికీ, పార్టీని వీడబోనని ప్రకటించారు.   జస్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీని బయట నుండి వచ్చిన వారు పూర్తిగా ఆక్రమించేసారని, దానితో పార్టీలో సీనియర్స్ కి కూడా విలువ, గౌరవం లేకుండా పోయిందని, అందుకు తానే ఒక ఉదాహరణ అని మీడియా ముందు వాపోయారు. పార్టీకి భీష్మ పితామహుడు వంటి లాల్ కృష్ణ అద్వానీ భోపాల్ నుండి పోటీ చేయాలని భావిస్తే ఆయనకు అక్కడ టికెట్ నిరాకరించి అహ్మదాబాద్ నుండి టికెట్ కేటాయించారు. అదేవిధంగా పార్టీలో మరో సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ వారణాసి నుండి పోటీ చేద్దామనుకొంటే, నరేంద్ర మోడీ అక్కడ నుండి పోటీ చేయాలని భావించడంతో జోషీని అక్కడి నుండి తప్పించారు. జరుగుతున్న పరిణామాలకి పార్టీలో సీనియర్లు అద్వానీ, సుష్మస్వరాజ్, శత్రుఘన్ సిన్హా వంటి వారు కూడా చాలా బాధపడ్డారు. కానీ, మోడీ అనుకూల వర్గానికి చెందిన అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు తదితరులు పార్టీ శ్రేయస్సు కోసం కొందరు కొన్ని సార్లు త్యాగాలు చేయవలసి ఉంటుందని తమ సీనియర్లకు హితవు పలకడం గమనిస్తే, జస్వంత్ సింగ్ ఆరోపణలు నిజమేనని నమ్మక తప్పదు. జస్వంత్ సింగ్ పార్టీ ప్రతిష్టకి భంగం కలిగిస్తూ నామినేషన్స్ వేసారు గనుక బహుశః నేడో రేపో ఆయనపై పార్టీ బహిష్కరణ వేటు వేసినా వేయవచ్చును.