పాపం.. మెంటే పార్థసారథి
posted on Mar 29, 2014 @ 11:57AM
చేతిదాకా వచ్చిన ముద్ద నోటికి అందకపోవడం అంటే ఇలాగే ఉంటుంది. పశ్చిమగోదావరి జిల్లాలో మెంటే పార్థసారథి పేరు తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన అంత పెద్ద నాయకుడు. తెలుగుదేశం పార్టీతో ఆయన అనుబంధం మూడు దశాబ్దాలు. ప్రతి ఎన్నికల్లోనూ తనకు సీటొస్తుందనే ఆశతో ఉంటున్నారు. కానీ, ప్రతిసారీ అవకాశం దక్కినట్టే దక్కి.. చేజారిపోతోంది. ఈసారి కూడా అలాగే అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులును చంద్రబాబు టీడీపీలోకి ఆహ్వానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం సీటు రామాంజనేయులు (అంజిబాబు)కు ఇస్తామని హామీ కూడా ఇచ్చేశారు. ఈసారి ఎలాగైనా సరే టీడీపీ సీటు తనకే వస్తుందని.. ఖర్చుకు వెనుకాడబోనని పార్థసారథి ఎన్నికలకు సిద్ధమైన తరుణంలో అంజిబాబు రాక టీడీపీలో ముసలం రేపింది. ‘టీడీపీలో ఎప్పుడూ పల్లకి మోసే బోయీగానే ఉండిపోవాలా, పల్లకి ఎక్కే అవకాశం ఇవ్వరా’ అంటూ సారథి అనుచరులు, బంధుగణం అసహనంతో రగిలిపోతున్నారు. పార్టీ శ్రేణులు సైతం ఆవేదన చెందుతున్నాయి.
ఇటీవల పార్థసారథి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే అంజిబాబు వచ్చే ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరారు. ఇందుకు పార్థసారథి ససేమిరా అన్నట్టు సమాచారం. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నానని, తాను అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నానని.. ఈ విషయంలో నీ దారి నీదే.. నా దారి నాదే అని పార్థసారథి స్పష్టం చేసినట్టు చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక అంజిబాబు వెనుతిరిగినట్లు తెలిసింది. ఇంత జరిగినా, తనకు సీటు దాదాపు రాకపోవచ్చన్న విషయం తెలిసినా కూడా పార్థసారథి మాత్రం పార్టీ సేవ మానలేదు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం చెమటోడుస్తున్నారు.