తెరాసలో కొండంత చిచ్చు
posted on Mar 29, 2014 6:55AM
వైకాపా నుండి వయా కాంగ్రెస్ తెరాస చేరుకొన్న కొండ సురేఖ దంపతులను పార్టీలో చేర్చుకొని వారికి టికెట్స్ కేటాయించడంపై తెరాసలోనే కాదు ఇతర పార్టీలలో నేతలు సైతం గుర్రుగా ఉన్నారు. కొండా దంపతులు జగన్మోహన్ రెడ్డి తెలంగాణా వ్యతిరేఖి అని తెలిసినప్పటికీ, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో వైకాపాలో కొనసాగడం వలన వారిరువురూ తెలంగాణా వ్యతిరేకులనే బలమయిన ముద్ర పడిపోయింది. అందుకే వారిని తెరాసలో చేర్చుకోవడంపై అనేకమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
తెరాస సీనియర్ నేత చెరకు సుధాకర్ ఇటీవల పార్టీని వీడుతూ కేసీఆర్ పైఇదే విషయమై తీవ్ర విమర్శలు చేసారు. నిజామాబాద్ యంపీ మధుయాష్కీ గౌడ్ కూడా ఇంతవరకు కొండా దంపతులు తమ పార్టీలోనే ఉన్నారనే సంగతి మరిచిపోయినట్లు, వారిని తెరాసలో చేర్చుకొని టికెట్స్ కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. నిన్న న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సమావేశమయిన టీ-జేఏసీ నేతలు కూడా ఇదే విషయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, తమ అభ్యంతరాల గురించి తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కు గట్టిగా చెప్పాలని ప్రొఫెసర్ కోదండ రామ్ పై వారు ఒత్తిడి చేసారు. ఈ సమావేశానికి హాజరయిన తెరాస సీనియర్ నేత శ్రవణ్ అందరూ తమ పార్టీనే తప్పుబట్టడంతో ఆయన సమావేశం మధ్యలోనే ఆగ్రహంతో లేచి వెళ్ళిపోయారు. ఈ చిచ్చు ఎప్పటికి ఆరుతుందో, దాని పర్యవసానాలు ఏవిధంగా ఉంటాయో చూడాలి మరి.