Read more!

చేవెళ్ల బరిలో వీరులెవరు?

 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్‌లో సస్పెన్స్ కొనసాగుతోంది. సిట్టింగ్ ఎంపీ, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి పాలమూరు సీటుకు మారడం దాదాపు ఖాయం కావడం.. ఆయన స్థానంలో రంగంలో దిగే గెలుపు గుర్రం ఎవరనేది తేలకపోవడం హస్తం పార్టీ ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది. కుటుంబంలో ఒకరికి మాత్రమే టికెట్ అన్న కాంగ్రెస్ హైకమాండ్ నిబంధన.. ఈ సీటుపై ఆశ పెట్టుకున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుటుంబసభ్యుల ముందరికాళ్లకు బంధం వేసింది. తన రాజకీయ వారసుడిగా తనయుడు కార్తీక్‌రెడ్డిని చేవెళ్ల బరిలోకి దించాలని చేవెళ్ల చెల్లెమ్మ భావించారు. కార్తీక్ పార్లమెంట్‌కు... తాను అసెంబ్లీకి పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో రాజేంద్రనగర్ శాసనసభా స్థానం నుంచి పోటీకి సబిత సన్నాహాలు చేసుకున్నారు. అయితే కుటుంబసభ్యుల్లో ఒకరికి మాత్రమే టికెట్ పక్కా అన్న ప్రకటన వీరికి ప్రతికూలంగా మారింది.

 

పార్లమెంటు రేసులో సబిత అభ్యర్థిత్వానికే అధిష్టానం మొగ్గు చూపుతోంది. ఇదే విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సైతం సబితతో చర్చించారు. తనకు జాతీయ రాజకీయాలపై అంతగా ఆసక్తి లేదని, ఎంపీ సీటుకు తన కుమారుడి అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఆమె కోరారు. అదే సమయంలో రాజేంద్రనగర్ అసెంబ్లీ టికెట్ తనకు ఖరారు చేయాలని అభ్యర్థించారు. సబిత విన్నపంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని డిగ్గీరాజా ఈ అంశంపై మరోసారి చర్చిద్దామని దాటవేసినట్లు తెలిసింది.