రామ్‌చరణ్ రాజకీయం

      తండ్రి చిరంజీవి రాజకీయంగా చాలా పూర్ అని సాక్ష్యాధారాలతో నిరూపణ అయిపోయింది. ఈ విషయంలో చిరంజీవితోపాటు ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అయితే రామ్ చరణ్ మాత్రం రాజకీయాలు నడపడంలో తండ్రిలాంటి వాడు కాదన్న సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఒకసారి రామ్ చరణ్ టాలెంట్ బయటపడింది. సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణరావుకు ఎదురుతిరిగి మాట్లాడే సాహసం ఎవరూ చేయరు. ఆయన ఎవరిమీదైనా ఇన్‌డైరెక్ట్ గా కామెంట్లు చేస్తే, ఆ కామెంట్లు తగిలినవాళ్ళు కిక్కురుమనకుండా వుండటం తప్ప లేనిపోని తలనొప్పుడు ఎందుకని బయటపడరు.   అయితే రామ్ చరణ్ మాత్రం ఓ సందర్భంలో దాసరి మీద డైరెక్ట్ ఎటాక్ ఇచ్చాడు. ఆ విషయం అప్పట్లో చినికి చినికి గాలివానలా మారి మళ్ళీ తగ్గిపోయింది.  అప్పటి వరకూ రామ్ చరణ్ తండ్రిచాటు బిడ్డ అనుకున్నవాళ్ళు రామ్ చరణ్‌లోని దూకుడును చూసి ఆశ్చర్యపోయారు. అలాగే ఈమధ్యకాలంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు రామ్ చరణ్ తాను బాబాయితో లేనని స్పష్టంగా ప్రకటించి తనకి ఎలాంటి మొహమాటాలు లేవని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు లేటెస్ట్ గా గురువారం నాడు రామ్ చరణ్ పుట్టినరోజు వుందని తెలిసి కూడా పవన్ కళ్యాణ్ వైజాగ్‌లో రాజకీయ మీటింగ్ పెట్టాడు. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు వెళ్ళాలా.. పవన్ కళ్యాణ్ మీటింగ్‌కి వెళ్ళాలా అని అభిమానులు కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తన పుట్టిన రోజు వేడుకలకు రాకపోయినా పర్లేదు బాబాయి మీటింగ్‌కే వెళ్ళండని ఫ్యాన్స్ కి సందేశం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా సందేశం ఇవ్వడం ద్వారా రామ్ చరణ్ తనలో వున్న పరిణతిని ప్రదర్శించాడని పరిశీలకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ మీటింగ్‌కి భారీ సంఖ్యలో అభిమానులు హాజరైన పక్షంలో నేను చెప్పాను కాబట్టే అంతమంది వచ్చారని చరణ్ అనొచ్చు. ఒకవేళ్ళ పవన్ మీటింగ్‌కి అభిమానులు తక్కువగా వస్తే నా పుట్టిన రోజునే మీటింగ్ పెట్టడం వల్లే అభిమానులు హాజరు కాలేదని మరో కోణంలో మాట్లాడొచ్చు. తన కత్తికి రెండువైపులా పదును వుండేలా చూసుకున్న ‘మగధీర’ రామ్ చరణ్ భవిష్యత్తులో రాజకీయ రంగంలో రాణించడానికి అర్హతలు వున్న వ్యక్తిలా ఇప్పటి నుంచే ప్రూవ్ చేసుకుంటున్నాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  

చిరు ఫ్యాన్స్ కి దారేది?

      చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఫ్యాన్స్ కింగుల్లా తిరిగేవారు. చిరంజీవి ఫ్యాన్ అంటే సమాజంలో కాస్తంత క్రేజ్, ఇంకాస్త భయం వుండేది. ‘నేను చిరంజీవి ఫ్యాన్’ అని చెప్పుకోవడానికి ఫ్యాన్స్ ఉవ్విళ్లూరేవారు..గర్వపడేవారు. చిరంజీవిని ఎవరైనా పల్లెత్తు మాట అన్నా పళ్ళు రాలగొట్టడానికి రెడీగా వుండేవాళ్ళు. అయితే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంటరై అట్టర్ ఫెయిల్యూర్ అయిన తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ కి విలువ సంగతి దేవుడెరుగు.. జనాల్లో సాక్షాత్ చిరంజీవికే విలువ లేకుండా పోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అది మరింత అట్టడుగుకి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘నేను చిరంజీవి ఫ్యాన్‌ని’ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితిని ఆయన అభిమానులు ఎదుర్కొంటున్నారు. అందుకని అందరూ సేఫ్ సైడ్‌గా పవన్ కళ్యాణ్, రామ్‌చరణ్ వైపు షిఫ్టయ్యారు.   లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సొంతగా రాజకీయ కుంపటి పెట్టుకుని అన్నయ్యకి, ఆయన పార్టీకి వ్యతిరేకంగా వర్క్ చేస్తూ వుండటంతో  ఇప్పుడు చిరు ఫ్యాన్స్ కి చిరు, రామ్ చరణ్ వైపు వుండాలా? లేక పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్ ఫ్యాన్స్ లో పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్‌కి తమ మద్దతు లేదని చిరు కుటుంబం ప్రకటించడంతో, గురువారం నాడు పవన్ వైజాగ్‌లో నిర్వహించే సభకి వెళ్ళాలా లేక హైదరాబాద్‌లో వున్న రామ్‌చరణ్ బర్త్ డే వేడుకల్లో పాల్గొనాలా అని ఫ్యాన్స్ డోలాయమాన స్థితిలో వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో నిర్ణయించుకోవడానికి ఫ్యాన్స్ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. ఫ్యాన్స్ ఇబ్బందిని అర్థం చేసుకున్న రామ్ చరణ్ తానే ముందుకు వచ్చి ఈసారి తన బర్త్ డేకి రాకపోయినా పర్లేదుగానీ, బాబాయ్ మీటింగ్‌కి వెళ్ళండని ఫ్యాన్స్ కి చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే చరణ్ చెప్పారా లేదా అనే విషయంలో క్లారిటీ లేకపోవడంతో కొంతమంది ఫ్యాన్స్ హైదరాబాద్ బయల్దేరారని తెలుస్తోంది. పవన్ వైపే పూర్తిగా మొగ్గు చూపిన కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే వైజాగ్ చేరుకున్నారు. ఏం చేయాలో అర్థంకాని చాలామంది ఫ్యాన్స్ మాత్రం ఇంట్లోనే ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చోవాలని డిసైడైనట్టు తెలుస్తోంది. మొత్తంమీద పవన్ కళ్యాణ్ మీటింగ్ డే, రామ్ చరణ్ బర్త్ డే ఒకేరోజు రావడంతో ఫ్యాన్స్‌ అయోమయానికి గురయ్యారు.  

షర్మిల ప్రసంగంతో వైఎస్ఆర్ సీపీలో చీలిక

      సాధారణంగా ఎక్కడైనా ఒక పార్టీకి చెందిన అగ్రనాయకులు పర్యటిస్తే ఆ ప్రాంతంలో సదరు పార్టీ ఎంతోకొంత బలోపేతం అవుతుంది. అప్పటివరకు అభిమానులుగా మాత్రమే ఉన్నవారు కూడా పార్టీ సభ్యులుగా చేరే అవకాశం ఉంటుంది. కానీ, జగన్ పార్టీలో అందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లు.. నోటిఫికేషన్ వెలువడగానే జగన్ కుటుంబంలోని ముగ్గురు నాయకులు తలో మైకు పట్టుకుని మూడు ప్రాంతాలకు వెళ్లిపోయారు. వాళ్లలో జగనన్న వదిలేసిన బాణం షర్మిల మాటలు ఇప్పుడు ఆ పార్టీ చాపకిందకి నీళ్లు తెస్తున్నాయి. కృష్ణా జిల్లా నూజివీడులో షర్మిల చేసిన ప్రసంగం ఆ పార్టీకి చేటు తెచ్చింది. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడు అసెంబ్లీ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆమె బహిరంగంగా ప్రకటించారు. దీంతో ఇదే సీటు ఆశిస్తున్న మరో నాయకుడు లాకా వెంగళరావు యాదవ్ తీవ్ర ఆవేదనకు గురై.. అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇది ఏకంగా పార్టీలోనే చీలికకు కారణం అయ్యేలా ఉంది. ఉదయం 9.30 గంటలకే షర్మిల వస్తారని నాయకులు ప్రకటించడంతో రెండు గంటల పాటు జనం ఎండలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇక ప్రతాప్ పేరు ప్రకటించగానే వెంగళరావు యాదవ్ అనుచరులు, ఆయన అభిమానులు ఒక్కొక్కరుగా అక్కడినుంచి వెళ్లిపోయారు. పార్టీలో రాబోయే రోజుల్లో పరిస్థితికి ఇది అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానించారు.

మహిళా స్థానంలో పురుషుడి పోటీ?

      ఓ జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వేషన్ అయింది. పార్టీల్లో చాలా రోజుల నుంచి తిరుగుతున్న నేతలు తమ సతీమణులను బరిలోకి దింపుతారు. ఇది సాధారణంగా జరిగే సంగతి. అయితే.. మహిళా రిజర్వేషన్ స్థానంలో ఓ ఎస్టీ వ్యక్తి నామినేషన్ వేశాడు. స్వీకరించిన అధికారులు అన్నీ పరిశీలించి ఆటోరిక్షా గుర్తు సైతం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్‌ స్థానంలో పురుషుని నామినేషన్ ఎలా చెల్లుబాటు చేశారంటూ ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో తేరుకుని రాత్రికి రాత్రి హడావుడిగా ఫైనల్ జాబితా నుంచి తొలగించారు. వరంగల్ జిల్లా కొత్తగూడ జడ్పీటీసీ స్థానం జనరల్ మహిళకు రిజర్వు చేశారు. ఇక్కడ నుంచి టీడీపీ, కాంగ్రెస్‌తో సహా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు ఫైనల్ జాబితాలో బరిలో నిలిచినట్లు ప్రకటించారు. జనరల్ మహిళ స్థానంలో ఇదే మండలం పూనుగుండ్ల గ్రామానికి చెందిన పెనుక కృష్ణారావు (ఎస్టీ) నామినేషన్ దాఖలు చేశాడు. నామినేషన్ సమయంలో కుల ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో అధికారులు జనరల్ అభ్యర్థులకు తీసుకునే డిపాజిట్ రూ. 5000 తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలకు రూ. 2500 తీసుకుంటారు. నామినేషన్ల పరిశీలనలో పేజీని నాలుగుసార్లు చూసిన అధికారులు అన్నీ ఒకే చెప్పారు. ఉపసంహరణల తర్వాత రంగంలో ఉన్న అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అందులో కృష్ణారావుకు ఆటో గుర్తు ఇచ్చారు. చివరకు ఎవరో అభ్యంతరం వ్యక్తం చేయడంతో నాలుక కొరుక్కుని.. తూచ్ అంటూ కృష్ణారావు పేరు తీసేశారు.

ఒక్క సీటు.. వంద కోట్లు!!

      లోక్ సభ ఎన్నికల్లో గెలిచేందుకు మన రాష్ట్రంలో ఓ నాయకుడు పెడతానంటున్న ఖర్చు ఎంతో తెలుసా?.. అక్షరాలా వంద కోట్ల రూపాయలు!! మరొకాయన అంత కాకపోయినా, కనీసం 35 కోట్లు ఖర్చవుతుందని చెబుతున్నారట! ఇవన్నీ ఎవరో ఆషామాషీగా అన్న మాటలు కావు. సాక్షాత్తు కేంద్ర ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ వద్ద సదరు అభ్యర్థులే స్వయంగా చెప్పిన విషయాలు. వీటిని బ్రహ్మ ఓ సందర్భంలో చెప్పారు. ఎన్నికల సమయంలో తరలిస్తున్న డబ్బును పోలీసు తనిఖీలలో పట్టుకుంటున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇలా మొత్తం 80 కోట్లు పట్టుకుంటే, అందులో కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే దాదాపు 50 కోట్లు పట్టుకున్నారట. హైదరాబాద్ పాతబస్తీలోని టప్పాచబుత్రా ప్రాంతంలో కేవలం ఒక్క సంఘటనలోనే రెండు కోట్ల రూపాయల నగదు, రెండు కిలోల బంగారం దొరికాయంటే ఈ 50 కోట్లు ఓ లెక్కా?   త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం ఎన్నికల ఖర్చు సగటున రూ.10 కోట్ల రూపాయల దాకా ఉంటుందని ఈసీ పేర్కొంటోంది. లోక్‌సభ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, ఒడిసా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశాలున్నాయని బ్రహ్మ తెలిపారు. ఇటీవల తన వద్దకు వచ్చిన ఓ నేత.. అ భ్యర్థి ఎన్నికల ఖర్చును రూ.70 లక్షలకు పెంచినంత మాత్రాన ఏం సరిపోతుందని, ఆ కాస్త సొమ్ముతో తాము ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలని ప్రశ్నించారని, ఆ పరిమితిని కనీసం రూ.3 కోట్లు చేసి ఉంటే బాగుండేదని సూచించారని బ్రహ్మ చెప్పారు. గెలుపు కోసం తాను రూ.35 కోట్ల వరకూ ఖర్చు చేస్తానని ఆయనే చెప్పారని వెల్లడించారు. ఎన్నికలలో డబ్బు ప్రభావం ఎంత కీలకంగా మారిందో చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలని బ్రహ్మ అన్నారు.  

అన్నీ మాకే కావాలి

      ఆశకు అంతుండాలి అంటారు. కానీ, బోలెడంత ఆశిస్తే కొంతయినా దక్కకుండా పోతుందా అన్నది వీరి థియరీ. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఎంపీటీసీ ఎన్నికలలో జగన్ పార్టీ నాయకులు చిత్ర విచిత్రాలు చూపిస్తున్నారు. మాజీ జడ్పీటీసీ సభ్యుడు వలవల రాజా బొబ్బిల్లంక ఎంపీటీసీ స్థానం నుంచి బరిలోకి దిగితే.. ఆయన భార్య లక్ష్మీ వాగ్దేవి ఇనుగంటివారి పేట స్థానంలో పోటీలో ఉన్నారు. అలాగే, రఘుదేవపురం మాజీ సర్పంచి పట్టపగలు విష్ణుప్రసాద్ రఘుదేవపురం-1 స్థానం నుంచి పోటీ చేస్తుంటే, ఆయన భార్య పద్మావతి రఘుదేవపురం-3 స్థానం నుంచి బరిలోకి దిగారు. ఇంతకీ.. వీళ్లంతా పోటీ చేస్తున్నది ఏ పార్టీ నుంచో తెలుసా? ఇంకేది, జగన్ పార్టీ నుంచే.

వైజాగ్ చేరుకొన్న పవన్ కళ్యాణ్

  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం విశాఖపట్నంలో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొనేందుకు కొద్ది సేపటి క్రితమే చేరుకొన్నారు. ఆయనకు వైజాగ్ విమానాశ్రయం వద్ద అభిమానులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ మొదట తన అభిమానులతో, హైదరాబాదు నుండి వచ్చిన తన ప్రతినిధులతో సమావేశమవుతారు. తమ అభిమాన హీరోతో కలిసి మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొనాలని ఉవ్విళ్ళూరుతున్న అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం భోజనానంతరం సిటీలో జరుగబోయే ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. కానీ అందుకు పోలీసులు అనుమతించవలసి ఉంది. ఒకవేళ వారు అనుమతించినట్లయితే ఆయన ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉంది. లేకుంటే సాయంత్రం సభ మొదలయ్యే వరకు చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చిన అభిమానులతో పార్టీ నిర్మాణం గురించి, ఇతర విషయాల గురించి చర్చించి సాయంత్రం నేరుగా సభకు రావచ్చును.   ఇప్పటికే చుట్టుపక్కల జిల్లాల నుండి ఆయన అభిమానులు భారీ ఎత్తున సభాస్థలికి (ఇందిరా ప్రియదర్శిని స్టేడియం) చేరుకొంతున్నారు. వైజాగ్ నగరంలో అప్పుడే పవన్ కోలాహలం మొదలయిపోయింది. ఎక్కడ చూసినా కుర్రకారు, జనసేన లోగో ఉన్న టీ షర్టులు ధరించి, బైకులకు జనసేన జెండాలు తగిలించుకొని కేరింతలు కొడుతూ రివ్వు రివ్వున దూసుకుపోతూ చాలా హడావుడి చేస్తున్నారు.

బీ ఫారాలిస్తాం.. ‘లెక్క’ మీరే చూసుకోండి

  శాసనసభ, లోక సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫారాలు మాత్రమే ఇస్తామని నిధులు ఇవ్వలేమని కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, చిరంజీవి చెబుతున్నారట. చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి లోకసభ మినహా మిగిలిన 14 అసెంబ్లీ, చిత్తూరు, రాజంపేట లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.వేణుగోపాల్‌రెడ్డికి అప్పగించారు.   బస్సు యాత్రలో భాగంగా తిరుపతికి వచ్చిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారసారధి చిరంజీవి తిరుపతి శివార్లలోని ఒక హోటల్లో వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరికొందరు ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమై చర్చించారు. ప్రస్తుతం పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉందని, అయినా పనిచేయక తప్పదని ఉద్బోధించారు. అన్ని స్థానాలకు టికెట్లు ఆశించే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని, అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ పెద్ద ఎత్తున నిధులు అందజేస్తుందనే ప్రచారం తీసుకొచ్చారని, అటువంటిదేమీ ఉండదని ఆశావహులకు స్పష్టం చేయాలని కూడా వారు కుండబద్దలు కొట్టారు.   తిరుపతికి చెందిన ఇద్దరు ముగ్గురు నాయకులు టికెట్‌ను ఆశిస్తూ రఘువీరాతో భేటీ అయినప్పుడు కూడా నిధుల విషయం చర్చకు వచ్చినట్లు తెల్సింది. వారితో కూడా నిధుల విషయంలో పార్టీ నుంచి ఏమీ ఆశించకుండా పోటీ చేస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఇస్తామని మాత్రమే భరోసా ఇచ్చినట్లు తెల్సింది. తాను కష్టకాలంలో పార్టీ బాధ్యతలను స్వీకరించానని నిధులు ఆశించకుండా వస్తే బీ ఫారం మాత్ర ఇస్తానని తేల్చిచెప్పారు. దీంతో ఆ నాయకులు అసంతృప్తికి గురయ్యారు. తిరుమలలో కలిసిన ఒకరిద్దరి నాయకులకు కూడా రఘువీరారెడ్డి ఇదే విషయాన్ని చెప్పిట్లు తెలిసింది.

తూర్పు టీడీపీలో తోట మంట

  మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరగానే కాకినాడ పార్లమెంటు సీటు తనదేనంటూ పార్టీలో అన్నీ తానే అన్నట్టు ప్రకటించుకోవడం టీడీపీలో కొత్త చిచ్చురేపింది. తన మామ, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుతో దౌత్యం నడిపించి మరీ నరసింహం టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు ప్రచారమైంది. దాంతో అక్కడి టికెట్ ఆశిస్తున్న జ్యోతుల చంటిబాబు వర్గం కన్నెర్ర చేసింది. చంటిబాబు 24 గంటల అల్టిమేటమ్ ఇవ్వడంతో చంద్రబాబు ఆయనను చర్చలకు పిలిచి, జగ్గంపేట టిక్కెట్టు మరెవరికీ ఇచ్చేది లేదని చెప్పారు. దాంతో కొంతవరకు వివాదం సర్దుమణిగిందని అనుకుంటుంటే.. కాకినాడ ఎంపీ సీటు తనదేనని జిల్లా ముఖ్య నేతల సమక్షంలోనే తోట ప్రకటించుకున్నారు. దీంతో, కాకినాడ పార్లమెంటు సీటుపై ఆశలు పెంచుకుని, గడచిన ఆరేడు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విశ్వంను రేసు నుంచి తప్పించేందుకు మామా, అల్లుళ్లైన మెట్ల, తోట ఎత్తులు వేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. గతంలో తునిలో నిర్వహించిన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమావేశంలో విశ్వంను ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు నేతలకు పరిచయం చేశారు. అంతకంటే ముందు పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అని ప్రకటించారు. పెద్దాపురం టిక్కెట్టు కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలనే నిర్ణయంతో విశ్వం సీటు పెద్దాపురం నుంచి ఒకసారి పిఠాపురం అని, మరోసారి కాకినాడ రూరల్ అని..మార్చి, మార్చి ఇప్పుడు కాకినాడ ఎంపీ సీటుకు కూడా ఎసరు పెడుతున్నారని ఆయన అనుచరులు, కైట్ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాకు దిగారు. దీంతో ఏం చేయాలో తెలియక పార్టీ నాయకత్వం తల పట్టుకుంటోంది.

శ్రీకాకుళం ప్రజాగర్జనలో చంద్రబాబు ప్రసంగం

  ఈరోజు శ్రీకాకుళంలో తెదేపా నిర్వహించిన ప్రజాగర్జన సభకు ఊహించిన దానికంటే ఎక్కువగా జనం పోటెత్తారు. వారిని చూసి చంద్రబాబు కూడా చాలా ఉత్సహంగా ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఎండగట్టారు. గత పదేళ్ళ యూపీఏ పాలనలో దేశంలో అవినీతి, కుంభకోణాలు, అధిక ధరలు, బీదరికం తప్ప మరేమీ పెరగలేదని ఎద్దేవా చేసారు. ఈ పదేళ్ళ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టిందని, అందువల్ల ఇకపై ఇటలీ దొరసాని సోనియమ్మను, ఆమె నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీని కూడా బయటకు సాగానంపవలసిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.   తాను తెలంగాణా ఏర్పాటుకి అంగీకరిస్తూ లేఖ ఇవ్వడం నిజమే గానీ, ఇంత అన్యాయంగా విడదీయమని ఎన్నడూ సూచించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తన స్వలాభం కోసం తెలుగు ప్రజలనే కాక స్వంత పార్టీ నేతలకి కూడా తీరని ద్రోహం చేసిందని ఆరోపించారు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నపుడు ఏవిధంగా ఎన్డీయే ప్రభుత్వంతో సత్సంభందాలు నెరుపుతూ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చింది వివరించి, ఇప్పుడు కూడా తెదేపాకే అధికారం ఇస్తే అత్యంత దైన్యస్థితిలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టి ప్రగతి పధాన్న పయనింపజేస్తానని హామీ ఇచ్చారు.   శ్రీకాకుళానికి చెందిన తెదేపా నేత స్వర్గీయ ఎర్రం నాయుడు సేవలను ప్రజలకు గుర్తు చేసి, అదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏవిధంగా జిల్లాను, గిరిజనులు నివసించే కన్నెధార కొండను కూడా దోచుకోన్నాడో సవివరంగా తెలియజేస్తూ, సరయిన నాయకుడికి, పార్టీకి ఓటేయడం ఎంత అవసరమో చంద్రబాబు వివరించారు.   ఇక ఈసారి తన ప్రసంగంలో చంద్రబాబు ఒక ఆసక్తికరమయిన కొత్త పధకం ప్రకటించారు. తమిళనాడులో జయలలిత ప్రభుత్వానికి ఎంతో పేరు తెస్తున్న ‘అమ్మ క్యాంటీన్’ లాగే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రమంతటా యన్టీఆర్ క్యాంటీన్లు ప్రారంబించి అందులో పేదలకు కేవలం రూ.5కే భోజనం పెడతామని ప్రకటించారు.

కల్వకుంట్ల వారు మరీ ఇంత మాటకారులా..అబ్బో..

  పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ప్రకటించినపుడు కేసీఆర్ పై, కేసీఆర్ కుమార్తె కవితపై తీవ్ర విమర్శలు చేసారు. కవిత అధ్యక్షతన నడుస్తున్న తెలంగాణా జాగృతి సంస్థకు విదేశాల నుండి వచ్చిన భారీ విరాళాలకు లెక్క చెప్పగలరా? అని పవన్ ప్రశ్నించారు. సాధారణంగా ఇటువంటి విమర్శలకు కొంచెం సమయం తీసుకొని జవాబుచేప్పే అలవాటున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈసారి కూడా అదే విధంగా కొంచెం సమయం తీసుకొని ఈరోజు తాపీగా జవాబు చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం చాలా మాటకారులేనని మరో మారు ఋజువు చేస్తూ పవన్ కళ్యాణ్ అడిగిన నిధుల గురించి తప్ప మిగిలిన అన్ని విషయాల గురించి కవిత చాలా చక్కగా, నేర్పుగా వేరే విషయాలను ప్రస్తావిస్తూ అసలు సంగతి దాటవేశారు. ఆయన ప్రశ్నకు జవాబు చెప్పడానికి వారం రోజుల సమయం ఎందుకు తీసుకోన్నారంటే, ఈవారం రోజుల్లో పవన్ కళ్యాణ్ తప్పతడులు వేస్తే వాటిని ఉపయోగించుకొని దీటుగా జవాబీయవచ్చునని ఆగేరేమో! అందుకే ఆమె తన విమర్శలలో పవన్ మోడీకి మద్దతు తెలపడం గురించి కూడా ప్రస్తావించారు.   పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు తాను జవాబీయనవసరం లేదని చెపుతూనే ఆయనొక రాజకీయ కమెడియన్ అని, సినిమాలలో ఆయన పంచే వినోదం చూడాలంటే జేబులకు చిల్లు పడుతుందని, కానీ ఈసారి ఆయనే ప్రజలకు ఉచితంగా వినోదింపజేసేందుకు వచ్చారని ఆమె ఎద్దేవా చేసారు. నిరుడు ఎన్నికలలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఆయన సోదరుడు పవన్ స్థాపించిన జనసేన పార్టీ కూడా దానిలాగే మేకప్ & ప్యాకప్ పార్టీ అని విమర్శించారు. పవన్ తనకు గద్దర్ ఇష్టమని చెపుతూ అందుకు పూర్తి విరుద్దంగా మోడీ, చంద్రబాబులకు మద్దతు ఇస్తానని చెప్పడం చూస్తే ఆయనకు సరయిన రాజకీయ అవగాహన లేదని అర్ధమవుతోందని అన్నారు.   దాదాపు అర్ధ గంటసేపు పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించిన ఆమె, ఆయన అడిగిన ఒకే ఒక ప్రశ్న- విదేశాల నుండి అందుకొన్న నిధులకి లెక్కల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా తన ప్రసంగం ముగించగలగడం కల్వకుంట్ల వారి అనన్యసామాన్యమయిన వాగ్ధాటికి చిన్న మచ్చు తునక మాత్రమే.

మేకప్, ఫ్యాకప్..పవన్ పై కవిత సెటైర్

      జన సేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సెటైర్లు వేశారు. ఎన్నికల ముందు మేకప్... ఆ తర్వాత ఫ్యాకప్ చేసే వారి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. రెండువేల తొమ్మిది ఎన్నికల ముందు హడావుడి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు రంగంలోకి వచ్చారని..ఎన్నికల ముందు మేకప్ ..ఎన్నికల తరువాత ఫ్యాకప్ వాళ్లకు కామన్ అని ఎద్దేవా చేశారు. గద్దర్ అంటే అభిమానం అని చెబుతూనే నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. మరి రేపు విశాఖ సభలో పవన్ కవితకు ఏ సమాధానం ఇస్తారో ? వేచిచూడాలి.

చంద్రబాబు బ్రహ్మాస్త్రం తెరాసకి తగిలినట్లేనా?

  తెదేపా నేతలను తెరాసలోకి వలసలు వచ్చేలా ప్రోత్సహిస్తూ ఆ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసేసామని భావిస్తున్న తెరాసకు నిన్న మెహబూబ్ నగర్లో తెలుగుదేశం నిర్వహించిన ప్రజాగర్జన విజయవంతం అవడంతో కంగారు మొదలయింది. అది తెరాస నేత హరీష్ రావు మాటలలో స్పష్టంగా వ్యక్తమయింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ “చంద్రబాబు బీసీలకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇస్తున్నారు. ఆయన ఆ పదవేదో ఆంధ్రాలోనే ఇచ్చుకొని, దైర్యం ఉంటే తెలంగాణాలో పోటీచేసి గెలవగాలరా అని ప్రశ్నిస్తున్నాము. మేము దళిత ముఖ్యమంత్రి హామీపై వెనక్కు తగ్గామని తెదేపా ఒట్టొట్టి ప్రచారం చేస్తోంది. కానీ మేము నేటికీ మా హామీపై వెనక్కు తగ్గలేదు. మాకు ఇక ఆంధ్రా పార్టీల పెత్తనం అవసరం లేదు. ఈ ఎన్నికలలో తెరాస ఘనవిజయం సాధించి మొట్ట మొదటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తధ్యం,” అని అన్నారు.   చంద్రబాబు చెపుతునట్లు బీసీ ముఖ్యమంత్రి ఐడియా తెరాసపై బ్రహామాస్త్రంలా పనిచేసిందని హరీష్ రావు మాటలే స్పష్టం చేస్తున్నాయి. అందుకే ఆయన తాము దళిత ముఖ్యమంత్రి హామీపై వెనక్కు పోలేదని చెపుతున్నారు. కానీ మూడు రోజుల క్రితమే తెరాస అధ్యక్షుడు కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిపై తాను హామీ ఇచ్చిన పరిస్థితులు లేవని, తానే ఆ పదవి చెప్పట్టవచ్చని సూచన ప్రాయంగా తెలిపారు. మరి ఇప్పుడు హరీష్ రావు దళిత ముఖ్యమంత్రి హామీపై వెనక్కు తగ్గలేదని చెప్పడానికి అర్ధం తెరాస ఆలోచనలో మళ్ళీ మార్పు వచ్చిందనా లేక తనను పక్కన బెట్టి కొడుకు కేటీర్ ని ముందుకు తీసుకువెళుతున్న కేసీఆర్ ని ఇరుకున పెట్టె ప్రయత్నంలో అన్నమాటనుకోవాలా?   చంద్రబాబుని తెలంగాణాలో పోటీ చేయమనడం, ఆయన ముఖ్యమంత్రి అవుదామనుకొంటున్న ఆంధ్రాలో బీసీని ముఖ్యమంత్రిగా చేయమని హరీష్ రావు డిమాండ్ చేయడం దేనికంటే, బీసీ ముఖ్యమంత్రి అంశంతో తమకు అగ్నిపరీక్ష పెడుతున్న చంద్రబాబుని కూడా అదే విధంగా ఇరుకున పెడదామనే ఆలోచనేతోనే. హరీష్ రావు ఇప్పుడు తెరాసలో ఉన్నారు గనుక ఆ పార్టీని వెనకేసుకు రాక తప్పదు. కానీ రేపు కేసీఆర్ ఆయనను పక్కనబెట్టి తన కొడుకుకి ముఖ్యమంత్రిని చేయబోతున్నట్లు గ్రహిస్తే అప్పుడు ఆయన కూడా తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పై విమర్శలు చేస్తూ, తనకు ఆ పదవి ఆఫర్ చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీలోనో చేరకుండా ఉంటారా?

హరీష్ మీద కాంగ్రెస్ కన్ను!

      కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పోయిన చోటే వెతుక్కునే సిద్ధాంతాన్ని మరచిపోయింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం బెటర్ అని ఆలోచిస్తున్నట్టుంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఆరిపోయింది. దాంతో ఆ పార్టీలో వున్న వారు తెలుగుదేశం పార్టీలోకి పారిపోతున్నారు. కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళిన వారితో రోజుకో లిస్టు న్యూస్ పేపర్లలో కనిపిస్తోంది. సీమాంధ్రలో ఎలాగూ ఆరిపోతానని డిసైడైపోయిన కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో వ్రతం చెడ్డా తెలంగాణలో ఫలం దక్కాలని భావిస్తోంది.   అందుకే తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నాయకులను తనలోకి లాక్కునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా తనకు టెంకెజెల్ల కొట్టిన టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది. తెలంగాణ ఇచ్చిన క్రెడిట్ ఇప్పటికే తమ పార్టీ అకౌంట్లో వుంది. దీనికి తోడు కొంతమంది కీలక టీఆర్ఎస్ నాయకులను తమ పార్టీలోకి లాక్కుంటే రాజకీయంగా తనకు మరింత ప్లస్ అయ్యే అవకాశం వుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్‌లో అత్యంత కీలకంగా వుండే నాయకుడిని కాంగ్రెస్‌లోకి తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో చాలామంది టీ కాంగ్రెస్ నాయకులు తెరాసలో కీలకంగా వున్న హరీష్ రావు వైపు ఆశగా చూస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. హరీష్ రావు తలకిందులుగా తపస్సు చేసినా టీఆర్ఎస్‌లో ఆయన మూడో స్థానంలోనో, నాలుగో స్థానంలో నిలుస్తారు. మొదటి రెండు స్థానాలూ కేసీఆర్, కేటీఆర్ ఆక్రమించేశారు. హరీష్ మొదటి స్థానంలోకి రావడం అంత సులభంగా సాధ్యమయ్యే విషయం కాదు. రాష్ట్ర స్థాయిలో ప్రతి రాజకీయ నాయకుడూ కోరుకునే ముఖ్యమంత్రి పదవి కేసీఆర్‌కే ప్రస్తుతం ఆమడ దూరంలో వుంది. ఆ పదవి హరీష్ రావుకి చేరువ కావడం కలలోమాటగానే వుంది. అయితే తెలంగాణ స్టేట్‌కి ముఖ్యమంత్రి అయ్యే ఆఫర్ ఇచ్చి హరీష్ రావుని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే బాగుంటుందన్న అభిప్రాయం అనేకమంది టీ కాంగ్రెస్ నేతల్లో వున్నట్టు తెలుస్తోంది. వైఎస్సార్ బతికి వుండగా అప్పట్లో హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాలు చేశారు. అయితే వైఎస్సార్ మరణంతో ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ హరీష్ రావులో ‘ముఖ్యమంత్రి’ ఆశలు రేపడం ద్వారా కాంగ్రెస్‌లోకి తేవాలన్న ఆలోచనలు, సమాలోచనలు జరుగుతున్నట్టు సమాచారం.

పవన్ సమావేశానికి మళ్ళీ చిరు అడ్డంకులు

  కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటుంటే, అది గిట్టని ఆయన సోదరుడు చిరంజీవి ముందుగా తన కొడుకు రాం చరణ్ తేజ్ చేత తాను తన తండ్రి పక్షమే వహిస్తున్నాని చెప్పించి అభిమానులను తనవైపు త్రిప్పుకొనే ప్రయత్నం చేసారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ సమావేశం జరిగే ముందురోజున తన సోదరుడు నాగబాబుతో “తాను కూడా అన్నయ్య చిరంజీవి వెంటే నడుస్తున్నాని, అభిమానులు కూడా తమవెంటే వస్తారని ఆశిస్తున్నామంటూ” ఒక మీడియా ప్రకటన కూడా చేయించారు. అంతటితో ఆగకుండా చిరంజీవి స్వయంగా తన అభిమాన సంఘాల నేతలకు పోన్లు చేసి “తమ్ముడు పవన్ సమావేశానికి వెళ్ళవద్దని” కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే చిరంజీవి ఎంత ప్రయాసపడినప్పటికీ, పవన్ కళ్యాణ్ సమావేశానికి వేలాదిమంది అభిమానులు తరలి వచ్చారు. ఒక్క సీమాంద్రానుండే కాక తెలంగాణా నుండి కూడా చాలా మంది అభిమానులు పవన్ కళ్యాణ్ కి తమ మద్దతు ప్రకటించారు. కారణం వారు అతని మాటలలో నిజాయితీ ఉందని నమ్మడమే. ఇంత జరిగినా చిరంజీవి మాత్రం తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చేయడం మానుకోలేకపోతున్నారు.   పవన్ వంటి యువకులు రాజకీయాలలోకి వచ్చి పార్టీలు పెట్టడం తాను కూడా స్వాగతిస్తానని తన బస్సు యాత్రలో చెపుతూనే, మళ్ళీ అందరూ కేవలం కాంగ్రెస్ పార్టీకే ఓటేయాలని కోరడం విడ్డూరం. రేపు పవన్ కళ్యాణ్ వైజాగులో తన జనసేన పార్టీ మొట్టమొదటి సమావేశం నిర్వహించబోతుండటంతో చిరంజీవి మళ్ళీ తన కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు ప్రదర్శిస్తూ తన కుమారుడు రామ్ చరణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని అతనిచేత హైదరాబాదు ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో మెగాభిమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేయిస్తున్నారు.   మొన్న రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ తనకు సరయిన రాజకీయ అవగాహన లేదని అన్నారు. కానీ రేపు సాయంత్రం అభిమానులతో జరుపబోయే సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తారని వార్తలు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. రేపు సాయంత్రమే బాబాయ్ పవన్ కళ్యాణ్ తన మొదటి రాజకీయ సభను నిర్వహిస్తున్నారని తెలిసి కూడా రామ్ చరణ్ కూడా సరిగ్గా అదే సమయంలో సమాంతరంగా హైదరాబాదులో మరో సమావేశం నిర్వహించడంతో అభిమానులు బాబాయ్-అబ్బాయ్ లలో ఎవరినో ఒకరిని ఎంచుకోక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు.   ఇటువంటి ప్రయత్నాల వలన పవన్ కళ్యాణ్ కి వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, చిరంజీవి ప్రతిష్ట మాత్రం మరింత మసక బారడం ఖాయం.

బీజేపీలోకి సత్తిబాబు అండ్ కో?

      పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై రోజుకో రూమర్ వస్తోంది. ఈసారి పోటీ ఎక్కడోనని రకరకాల ప్రచారం జరగ్గా నేడు ఆయన ఏకంగా పార్టీయే మారిపోతున్నారన్న ప్రచారం చోటు చేసుకుంది. బీజేపీలో చేరుతారని, కుటుంబ ప్యాకేజీలో సీట్ల కోసం బేరసారాలు సాగిస్తున్నారని విజయనగరం జిల్లాలో ఒకటే చర్చ. ఇవన్నీ వదంతులేనని కొంతమంది తేలికగా తీసుకోగా, లోపాయికారీగా ఏదో జరుగుతోందని మరికొంతమంది చెబుతున్నారు. ప్రజాదరణ, అనుచరగణాన్ని కోల్పోయిన బొత్స సత్యనారాయణ పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉంది.   తనతో పాటు పదిహేనేళ్లుగా నడిచిన నాయకులు, కార్యకర్తలు కనీసం పట్టించుకోవడం లేదు. రోజుకొకరు జారిపోతున్నారు. చెప్పాలంటే కాంగ్రెస్ రాజకీయాల్లో ఒంటరైపోతున్నారు. తన కుటుంబానికి చెందిన ప్రజాప్రతినిధులు, మరో ఐదేళ్లు ఎమ్మెల్సీ పదవి ఉన్న కోలగట్ల వీరభద్రస్వామి తప్ప మరెవరూ ఆయనతో  ఉన్నట్టు కనిపించడం లేదు.  దీంతో  ఆయన దయనీయ పరిస్థితి  ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్‌పై రకరకాల ఊహాగానాలొస్తున్నాయి. శృంగవరపుకోటలో పోటీ చేస్తారని ఒకసారి, చీపురుపల్లిలో అని మరోసారి, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి  అని ఇంకోసారి ప్రచారం జరిగింది. విజయనగరం ఎంపీగా పోటీ చేస్తారని మరో వాదన వినిపించింది. కానీ ఆయన నోరు విప్పిన పాపన పోలేదు. తన రాజకీయ భవిష్యత్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ తరుణంలో  బీజేపీలో చేరుతున్నారని బొత్సపై కొత్త ప్రచారం మొదలైంది. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఇందుకు బలాన్నిచ్చాయి. బొత్స సత్యనారాయణ తమ పార్టీ నాయకులతో టచ్‌లో ఉన్న మాట ఆయన తెలిపారు. కొన్నికారణాల వల్ల సినీ నటుడు మోహన్‌బాబు పార్టీలోకి రాకుండా ఆగిపోయారని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

గుజరాత్‌ అల్లర్లపై మోడీ స్పందన

      గోద్రా అల్లర్లపై గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ స్పందించారు. గుజరాత్‌లో 2002లో జరిగిన మత ఘర్షణలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బ్రిటన్ కు చెందిన టీవి నిర్మాత, రచయిత ఆండీ మారినో రాసిన 'మోడీ రాజకీయ జీవిత చరిత్ర' పుస్తకంలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. గోద్రా అల్లర్లలో తన ప్రమేయం లేకపోయినా..తన ప్రమేయం వున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరిగిందని మోదీ వాపోయారు. అల్లర్లు జరిగినప్పటి నుండి పన్నెండేళ్ల పాటు తాను అన్ని వైపుల నుండి విమర్శలను ఎదుర్కొన్నానని, అయితే మీడియా తన పని తాను చేసుకోనివ్వాలని, ఎలాంటి ఘర్షణ పెట్టుకోకూడదని తాను ముందే నిర్ణయించుకున్నానని చెప్పారు. అల్లర్ల తర్వాత మోడీ ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవాలని అనుకున్నారని, అయితే పార్టీ, గుజరాత్ ప్రజలు ఒత్తిడి చేయడంతో పదవిలో కొనసాగినట్టు పుస్తకం వెల్లడించింది.

పశ్చిమ టీడీపీలో.. చేరికలతో తంటా

      పశ్చిమగోదావరి జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం పార్టీలోకి భారీస్థాయిలో వలసలైతే వస్తున్నారు గానీ, నాయకుల చేరికతో పార్టీ బలపడాల్సింది పోయి లేనిపోని కొత్త తలనొప్పులు వస్తున్నాయి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని, మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ముందు వరుసలో నిలబడి టీడీపీ తీర్థం పుచ్చుకోగా, భీమవ రం ఎమ్మెల్యే అంజిబాబు సోమవారం టీడీపీలో చేరారు. నేడో రేపో తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మంత్రి పితాని సత్యనారాయణ కూడా చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.   అయితే, వీరందరినీ సహృదయంతో ఆదరించే స్థానిక నేతలు కరువయ్యారు. పదేళ్లుగా అధికారానికి దూరమైనా పార్టీ జెండాలను మోస్తూ, పార్టీ తలపెట్టిన కార్యక్రమాలను విజయవంతం చేస్తు న్న తమకు కాకుండా ఇప్పటికిప్పుడు పార్టీలో చేరుతున్న నాయకులకు పెద్దపీట వేస్తూ టికెట్లు కేటాయిస్తే ఊరుకోమని పాత నాయకులు తెగేసి చెబుతున్నారు. కొట్టు సత్యనారాయణ, ఈలి నాని రాకవల్ల ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న ముళ్లపూడి బాపిరాజు వర్గానికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పటికీ, జెడ్పీ చైర్మన్ పదవిని ఆశచూపి ఆయనను తాత్కాలికంగా బుజ్జగించారు. భీమవరం సీటును అంజిబాబుకు కేటాయిస్తే గాదిరాజు బాబు, మెంటే పార్థసారథి వర్గాలను బుజ్జగించాల్సి ఉంది. కారుమూరి, పితాని సత్యనారాయణ పార్టీలోకొచ్చి ఆచంట టికెట్ కోరితే ఇప్పటికే అక్కడ పార్టీ కన్వీనర్‌గా కొనసాగుతున్న పెనుగొండ కాలేజి వ్యవస్థాపకుడు గుబ్బల తమ్మయ్య పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. పార్టీ వర్గాల్లో ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తోంది. వలస నేతలకు వీరతాడు వేయడం మంచి పద్ధతి కాదని, దీనివల్ల పార్టీలో నిస్వార్థంగా పనిచేసే కేడర్ దూరమయ్యే ప్రమాదముందని సీనియర్ కార్యకర్తలు చెబుతున్నారు.