Read more!

చిత్తూరులో ష్... గప్ చుప్

 

ఇన్నాళ్లుగా జోరుగా పాడిన మైకులన్నీ ఒక్కసారి మూగబోయాయి. ఎక్కడ చూసినా గుసగుసలే తప్ప గట్టి మాటలే వినిపించడంలేదు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మార్చి 15వ తేదీ నుంచి సాగిన రెండు వారాల మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, పలమనేరు, నగరి మున్సిపాల్టీలకు మార్చి 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రీఫైనల్ ఎలక్షన్స్ కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఆయా మున్సిపాల్టీల పరిధిలోని వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా వార్డుల్లో అభ్యర్థుల గెలుపు బాధ్యత భుజానికెత్తుకుని నియోజకవర్గస్థాయి నాయకులు రంగంలోకి దిగారు. హోరాహోరీగా ప్రచారం సాగిం చారు.

 

అన్ని ప్రాంతాల్లో వైఎస్‌ఆర్ సీపీ, టీడీపీ మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. శ్రీకాళహస్తి మున్సిపాల్టీలో మాత్రమే అన్ని వార్డులకు కాంగ్రెస్ తరఫున అభ్యర్థులను నిలబెట్టారు. మిగిలిన మున్సిపాల్టీల్లో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. దాంతో మిగిలిన రెండు పార్టీల మధ్యే ఇప్పుడు జిల్లాలో ప్రధాన పోరు కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి తెలుగు తమ్ముళ్లు హోరా హోరీగా పోరాడుతున్నారు.