నేడే చివరి రోజు...తెదేపా-బీజేపీ పొత్తులకి

  తెలుగులోకి డబ్బ్ చేసిన తమిళ టీవీ సీరియల్లాగ ఎంతకీ తెగకుండా సాగుతున్న తెదేపా-బీజేపీ పొత్తుల కబుర్లు వినీవినీ బహుశః ప్రజలకే కాదు చంద్రబాబుకి కూడా బోర్ కొట్టేసినట్లుంది. అందుకే నిన్న అర్ధరాత్రి వరకు సాగిన పోలిట్ బ్యూరో సమావేశం అనంతరం తమ తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్దమయిపోతున్నట్లు ఆయన మీడియాకు లీకులిచ్చేసారు.   డిల్లీలో కాంగ్రెస్ పార్టీని తిట్టుకొంటూ బిజీగా ఉన్న బీజేపీ నేతలు టీవీలలో లీకవుతున్న ఆ వార్తలను చూసి వెంటనే డయల్-యువర్-ఫ్రెండ్ ఆప్షన్ ఎంచుకొని చంద్రబాబుని లైన్లోకి తీసుకువచ్చి ఆయనని తెల్లారే వరకు ఆగమని, అప్పటికి తామే రెక్కలు కట్టుకొని ఆయన ముందు వాలిపోతామని హామీ ఇవ్వడంతో చంద్రబాబు లిస్టు మళ్ళీ జేబులో పెట్టేసుకొన్నారు. కానీ కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు ఆయన జేబులో నుండి పడిపోయిన ఆ లిస్టు తమ చేతిలో చిక్కిందని చెప్పుకొంటూ స్క్రోలింగులో వరుసపెట్టి తెదేపా అభ్యర్ధుల పేర్లను చూపించేస్తున్నాయి. మరి ఇది కూడా మరోకరకమయిన లీకీజి సమస్యా అన్నది ఇంకా తేలవలసి ఉంది.   ఇక కమలనాధులు అంతకు ముందు చంద్రబాబుకి మొన్న సాయంత్రం వరకు గడువు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు చంద్రబాబే వారికి ఈరోజు సాయంత్రం వరకు గడువు పెట్టి ఈ క్లైమక్స్ సీన్లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఈసారయినా సీరియల్ సుఖాంతం అవుతుందని ఆశిస్తూ, ఇంతకాలంగా తెదేపాతో చర్చలు సాగిస్తున్న బీజేపీ నేత ప్రకాష్ జవదేకర్ తో బాటు గ్రూప్ ఫోటో కోసం అరుణ్ జైట్లీ కూడా విమానంలో దిగుతున్నారుట. ఒకవేళ పొత్తులు ఆ రెండు పార్టీల మధ్య కుదిరితే ‘జై రామ్ జీ’కి అనుకొంటూ ఒకరి భుజాల మీద మరొకరు చేతులు వేసుకొని ఫొటోలకి ఫోజులివ్వచ్చును. లేకుంటే రేపటి నుండి ఆ రెండు పార్టీల నేతల మధ్య రామరావణ యుద్ధం మొదలయిపోతుంది. దానిని బట్టే మిగిలిన పార్టీల సౌండ్ క్వాలిటీ కూడా మారిపోవడం తధ్యం.

పితాని కూడా జంప్

  కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకిలో కార్యకర్తలెవరయినా ఉన్నారో లేదో ఖచ్చితంగా తెలియదు, కానీ ఒక అరడజను మంది నేతలు మాత్రం ఇంకా పార్టీలో మిగిలి ఉన్నారు. అయితే వారిలో కూడా ఒకరొకరుగా మెల్లగా వేరే పార్టీలలోకి జారుకొంటున్నారు. తాజాగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పితాని సత్యనారాయణ తెదేపాలోకి జంపైపోయారు.ఆయన చంద్రబాబు చేతులతో పసుపు కండువా కప్పించుకొని తెదేపా తీర్ధం కూడా సేవించారు.   శుక్రవారం తెనాలిలో జరిగిన సభలో ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి కనిపించిన హర్షకుమార్, రెండు రోజుల క్రిందటే తనకు డిల్లీ నుండి దిగ్విజయ్ సింగ్ ఫోన్ చేసి పార్టీలోకి తిరిగి రమ్మని ఆహ్వానించారని, కానీ పార్టీయే తమను బయటకు వెళ్ళగొట్టింది గనుక ముందు తనపై వేసిన ఆ పార్టీ బహిష్కరణ వేటుని ఎత్తేస్తే అప్పుడు పార్టీలోకి తిరిగి రావడం గురించి ఆలోచిద్దామని జవాబు చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దానితో ఆయన తాను జైసపాను వీడి వెళ్ళడం లేదని, ఆ పార్టీ టికెట్ పైనే తాను అమలాపురం నుండి లోక్ సభకు పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేసి అప్పటికి మంటలార్పగలిగారు. కానీ రేపు మళ్ళీ దిగ్విజయ్ నుండి డిల్లీకి రమ్మని కాల్ వస్తే, అప్పుడు కిరణ్ పెట్టుకొనే తరువాత సభలో ఆయన మరి కనిపిస్తారో లేదో అనుమానమే. ఈ మునిగిపోతున్న నావలో మరెవరూ లేరని రూడీ చేసుకొన్నాక ఆఖరుగా కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా బయటకు దూకుతారేమో!

లౌకికవాదాన్నికాపాడుకొనేందుకే కలిసారుట!

  కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రత్యర్ధి బీజేపీని రోజూ తిట్టిపోసే ముందు ఓం ప్రధమంగా అదొక మతతత్వపార్టీ అని మొదలుపెట్టి ఇతర అంశాలపై విమర్శలకు వెళుతుంది. లౌకికవాదానికి తామే పేటెంట్ హక్కులు తీసుకొన్నట్లు, బీజేపీకి మతాల పేరిట ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే పని అన్నట్లు కాంగ్రెస్ వాదిస్తుంటుంది. కానీ, ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచే అవకాశంలేదని క్రమంగా బోధపడుతుండటంతో, వరదలో కొట్టుకుపోతున్న మనిషికి గడ్డి పోచ దొరికినా సంతోషించినట్లు కాంగ్రెస్ పార్టీ కూడా గెలుపు కోసం ఉన్న అన్ని మార్గాలను ఆన్వేషిస్తోంది. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా తమ లౌకికవాదం కాసేపు పక్కనబెట్టి మొన్న మంగళవారంనాడు ఢిల్లీ జుమామసీద్ షాహి హిమామ్ బుఖారీతో సమావేశమయ్యి దేశంలో ముస్లిం ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకే ఓట్లువేసేలా చేయమని అభ్యర్దించారు. అయితే ఆలోచించవలసిన పాయింటు ఏమిటంటే బుకారీ సాబ్ దేశంలో ముస్లిం ప్రజలందరికీ ప్రతినిధి కాదు. ఆయన కేవలం ఒక మత గురువు మాత్రమే. గత అరవై ఏళ్లబట్టి దేశంలో అధికశాతం ముస్లిం ప్రజల దుర్బర దారిద్ర్యం అనుభవిస్తూనే ఉన్నారు. నాటి నుండి నేటి వరకు దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వారిని కేవలం ఒక ఓటు బ్యాంకుగానే చూసింది తప్ప వారిని కనీసం మనుషులుగా కూడా చూడలేదు. అందుకే వారి పరిస్థితిలో ఇంతవరకు కూడా మార్పు రాలేదు. పైగా నానాటికీ ఇంకా దారిద్ర్యంలో కూరుకుపోతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు సోనియాగాంధీ స్వయంగా బుకారీ సాబ్ ని కలిసి వచ్చినందున వారందరూ ఇంతకాలం కాంగ్రెస్ చేసిన నిర్వాకాలన్నిటినీ మరిచిపోయి కాంగ్రెస్ పార్టీకే గుడ్డిగా తమ ఓట్లు గుద్దేస్తారని అనుకోవడం అత్యాసే అవుతుంది. సోనియాగాంధీ ఒక మతగురువుని కలిసి ఆవిధంగా కోరడం ఏరకమయిన లౌకికవాదమో తెలియదు కానీ దేశంలో లౌకికవాదాన్ని అంటే దానికి మారు పేరయిన కాంగ్రెస్ పార్టీని మతతత్వ పార్టీ అయిన బీజేపీ నుండి, దానికి నాయకత్వం వహిస్తూ తన ముద్దుల యువరాజు రాజకీయ భవిష్యత్తుని మంట గలిపేద్దామని చూస్తున్న నరేంద్ర మోడీ నుండి రక్షించవలసిన ఆగత్యం గురించి ఆమె బుకారీ సాబ్ కి విన్నవించుకొన్నారు. దానిపై సహజంగానే బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. బుకారీ ద్వారా దేశంలో ముస్లిం ప్రజలందరి ఓట్లు రాబట్టుకొందామని ప్రయత్నించడం, అది కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అడగడం ఉల్లంఘన క్రిందకే వస్తుందని తీర్మానించేసిన బీజేపీ సోనియాగాంధీపై ఎన్నికల కమీషన్ కి నిన్న పిర్యాదు కూడా చేసింది. అటువంటి పిర్యాదు వస్తే పరిశీలిస్తామని కమీషనర్ సంపత్ ముందే చెప్పారు గనుక వెంటనే పిర్యాదు స్వీకరించి నేడో రేపో సోనియమ్మను సంజాయిషీ కోరుతూ నోటీసు పంపవచ్చును. అయితే సుప్రీం కోర్టు చేత మొట్టికాయలు వేయించుకొన్నపుడే అదరలేదు..బెదరలేదు, అందువల్ల ఎన్నికల కమీషన్ నోటీసులు చూసి కాంగ్రెస్ పార్టీ బెంబేలెత్తిపోదని ఖచ్చితంగా చెప్పవచ్చును.

శంకరమ్మకు టీడీపీ సపోర్ట్?

      కేసీఆర్ తనకి ప్రాధాన్యం లేని, ఓడిపోయే హుజూర్ నగర్ టిక్కెట్ కేటాయించడంతో ఆగ్రహంగా వున్న శంకరమ్మని టీఆర్ఎస్ నాయకత్వం ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. పోటీ చేస్తే చెయ్ లేకపోతే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. అమరవీరుల త్యాగ ఫలితంగా తెలంగాణ వస్తే, ఆ అమరవీరుల కుటుంబాలనే చిన్నచూపు చూస్తున్న కేసీఆర్ మీద శంకరమ్మతోపాటు అమరవీరుల కుటుంబాల వారు చాలా ఆగ్రహంగా ఉన్నారు.   శంకరమ్మ ఎంత వద్దని చెప్పినా హుజూర్ నగర్ టిక్కెట్‌నే ఆమెని కేటాయించడం అన్యాయమని వారు అంటున్నారు. ఇదిలా వుంటే, కేసీఆర్ మీద తీవ్ర ఆగ్రహంగా వున్న శంకరమ్మకి న్యాయం చేయాలని, అమరవీరుల త్యాగాలకు తగిన గుర్తింపు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. శంకరమ్మకి తెలుగుదేశం పార్టీ నుంచి టిక్కెట్ ఇవ్వాలని, అది కూడా ప్రస్తుతం తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే వుండగా, తప్పకుండా గెలిచే స్థానాన్ని శంకరమ్మకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే శంకరమ్మ పోటీ చేసే నియోజకవర్గంలో అభ్యర్థిని పోటీ పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పుడు శంకరమ్మ హుజూర్ నగర్ స్థానాన్ని వ్యతిరేకిస్తూ వుండటంతో ఆమెతో సంప్రదింపులు జరపాలని టీ టీడీపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.

ఇండియా మ్యాచ్ డౌటేనా?

      క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ 20 సెమీ ఫైనల్ లెక్క ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆరున్నర నుంచి ప్రారంభం కావలసి వుంది. ఇండియా – దక్షిణాఫ్రియా జట్ల మధ్య బంగ్లాదేశ్‌లోని ఢాకా స్టేడియంలో జరుగుతుంది. గురువారం నాడు వెస్టిండీస్ – శ్రీలంక మధ్య జరిగిన తొలి సెమీ ఫైనల్ వర్షం కారణంగా అంతరాయాన్ని ఎదుర్కొంది. వర్షం పెరిగిపోయి మ్యాచ్ ఆగిపోవడం వల్ల తలాతోకా లేని డక్‌వర్త్ లూయిస్ పద్ధతి కారణంగా వెస్టిండీస్ మ్యాచ్ ఓడిపోయింది. అలాంటి పరిస్థితి ఇండియా ఆడే మ్యాచ్‌కి కూడా వస్తుందేమోనని క్రికెట్ అభిమానులు భయపడుతున్నారు.   ఇప్పటికే ఢాకా స్టేడియం దగ్గర వర్షం వచ్చేదా వద్దా అన్నట్టుగా మబ్బులు కమ్మి వున్నాయి. మ్యాచ్‌కి ముందే గనుక వర్షం పడి మ్యాచ్ రద్దయితే రన్ రేట్ ఆధారంగా ఇండియా ఫైనల్‌కి చేరుకుంటుంది. అయితే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఇండియా బ్యాటింగ్ చేసే సమయంలో వర్షం పడితే మాత్రం ఇండియా డక్ వర్త్ లూయిస్ పద్ధతికి బలైపోయే ప్రమాదం వుందని ఇండియా క్రికెట్ అభిమానులు భయపడుతున్నారు.

కేసీఆర్ మీద శంకరమ్మ ఆగ్రహం!

      తెలంగాణవాదులు అమరవీరుడని కొనియాడే శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని బతిమాలో, బెదిరించో ఎమ్మెల్యే టిక్కెట్ పొందడానికి హామీ పొందింది. కేసీఆర్ ఆమెకి ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి గెలవని నల్లగొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీ టిక్కెట్ ఇస్తానని చెప్పారు. అయితే గెలవని సీటు తనకి ఎందుకు అని శంకరమ్మ నెత్తీనోరు బాదుకుంటున్నప్పటికీ శుక్రవారం నాడు కేసీఆర్ ప్రకటించిన తొలి విడత అభ్యర్థుల లిస్టులో శంకరమ్మకు హుజూర్ నగర్ టిక్కెట్ కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.   అయితే ఈ నిర్ణయం శంకరమ్మకి ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తోంది. తను వద్దు మొర్రో అంటున్నా తాను ఖచ్చితంగా ఓడిపోయే సీటుని కేటాయించడం అన్యాయమని ఆమె తన సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది.  కేసీఆర్ ప్రకటించినప్పటికీ తాను హుజూర్ నగర్ స్థానం నుంచి పోటీ చేయబోనని, తనకు గెలిచే స్థానం ఇస్తేనే పోటీ చేస్తానని శంకరమ్మ అంటున్నట్టు సమాచారం. అయితే శంకరమ్మ ఆక్రోశాన్ని టీఆర్ఎస్ నాయకులెవరూ పట్టించుకోవడంలేదు. పోనీలేపాపం అని ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే, ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటూ వుంటే ఇంకా కోరికలు కోరడం బాగాలేదని వారు అభిప్రాయ పడుతున్నారు. అయితే శంకరమ్మ మాత్రం తన పట్టు విడిచిపెట్టడం లేదని సమాచారం. తనకు గెలిచే టిక్కెట్ ఇవ్వకుంటే తాను మరో పార్టీ నుంచి గెలిచే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని శంకరమ్మ అంటున్నా ఆమెని కేసీఆర్ లైట్‌గా తీసుకుంటున్నారు. దాంతో కేసీఆర్ మీద తీవ్ర ఆగ్రహంగా వున్న శంకరమ్మ భవిష్యత్ కార్యాచరణ గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ విమానాన్ని మర్చిపోవాల్సిందేనా?

      మలేసియాకి చెందిన ఎంహెచ్ 370 విమానం హిందూ మహాసముద్రంలో అదృశ్యమై నెలరోజులు కావొస్తోంది. విమానంతోపాటు విమానంలో ప్రయాణిస్తున్న 239 ప్రయాణికుల జాద తెలియడం లేదు. మలేసియాతోపాటు అమెరికా, చైనా తదితర దేశాలు ఎంత వెతికినా విమానం ఎక్కడుందో, ఏమైందో ఎవరూ పసిగట్టలేకపోయారు. వచ్చే సోమవారం లోపు ఈ విమానం ఎక్కడుందో కనుక్కోలేకపోతే ఇక ఆ విమానాన్ని మరచిపోవాల్సిందేనని మలేసియాకి చెందిన ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆరోజుతో విమానంలోని బ్లాక్ బాక్స్ సిగ్నల్స్ పంపడం ఆపేస్తుంది. దాదాపు నెల రోజులుగా విమానాలు, హెలికాప్టర్లు, స్టీమర్లతో వెతికారు. మొన్నీమధ్య సబ్ మెరైన్లు కూడా రంగంలోకి దిగాయి. కానీ, ఇంతవరకు ఈ విమానం జాడ తెలియలేదు. అయితే, విమానం జాడ కనుక్కునేవరకూ తాము విశ్రాంతి తీసుకునే ప్రసక్తే లేదని మలేసియా ప్రధానమంత్రి ప్రకటించారు.

లక్ష్మీపార్వతి లబోదిబో!

      ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా జంప్ జిలానీల కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి నాయకులు మారుతూ వుండటం నేచురల్. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరు. ఏ నాయకుడు ఎప్పుడైనా ఏ పార్టీలో అయినా చేరొచ్చు. అయితే నందమూరి లక్ష్మీపార్వతి మేడమ్ విషయంలో మాత్రం ఈ సూత్రం వర్తించదు. ఆమె ఏ పార్టీలో అయినా చేరొచ్చుగానీ, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఎంతమాత్రం లేదు.. లేదు.. లేదు.. లేనేలేదు!   లక్ష్మీపార్వతి, చంద్రబాబు మధ్య ఎంతటి వైరం వుందో, చంద్రబాబు మీద ఆమెకి ఎంత పగ వుందో ఫ్లాష్ బ్యాక్ రాజకీయాలు తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. అలాంటి లక్ష్మీపార్వతి మేడమ్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు పుకార్లు వచ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ పుకారు విన్నవాళ్ళందరూ ఇది కలా, నిజమా అనుకున్నారు. తామసలు జీవించి ఈ భూమ్మీదే వున్నామా అనే సందేహాలు కూడా చాలామందికి వచ్చాయి.  ఈ పుకార్లు విని లబోదిబోమన్న లక్ష్మీ పార్వతి వెంటనే వాటిని ఖండించారు. తానేంటి.. తెలుగుదేశం పార్టీలో చేరడమేంటని విస్తుపోయారు. ఇలాంటి దారుణమైన పుకార్లను సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.

పాత చింతకాయ మేనిఫెస్టో!

      టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నుంచి పోటీ చేసే 69 అభ్యర్థుల లిస్టుతోపాటు పార్టీ మేనిఫెస్టో కూడా ప్రకటించారు. జనానికి ఆయన ప్రకటించే అభ్యర్థుల పేర్ల మీద ఇంట్రెస్టే తప్ప మేనిఫెస్టో మీద ఎంతమాత్రం ఇంట్రస్ట్ లేకుండా పోయింది. సాధారణంగా ఏ పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నా జనం అందులో ఏముంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే టీఆర్ఎస్ మేనిఫెస్టో విషయంలో మాత్రం అలాంటి ఇంట్రెస్ట్ కొంచెం కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే వంద మేనిఫెస్టోలకి సరిపోయేటన్ని వాగ్దానాలు ఆల్రెడీ చేసేశారు. నోటికొచ్చిన వాగ్దానాలు, అమలు అస్సలు సాధ్యం కాని వాగ్దానాలు, హామీలు ఇప్పటి వరకు ఆయన లెక్కలేనన్ని చేశారు. ఈ వాగ్దానాలే పార్టీ మేనిఫెస్టోలో కూడా వుంటాయి కాబట్టి దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. జనం అనుకున్నట్టే టీఆర్ఎస్ మేనిఫెస్టో నిండా గాలిమేడల వాగ్దానాలు వున్నాయి. కేసీఆర్ వాగ్దానాలు వినీ వినీ వుండటం వల్ల మేనిఫెస్టోలో విషయాలన్నీ పాత చింతకాయ పచ్చడిలా అనిపిస్తున్నాయని తెలంగాణవాదులే అంటున్నారు.

75 అన్నారు.. 69 ప్రకటించారు!

      శుక్రవారం నాడు టీఆర్ఎస్ అసెంబ్లీకి పోటీ చేసే 75 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని, ఆ లిస్టు ఆల్రెడీ తయారైందన్న వార్తలు వచ్చాయి. అయితే తీరా కేసీఆర్ 69 మందితో మాత్రమే లిస్టు ప్రకటించాడు. వాళ్ళలో పరకాల ఎమ్మెల్యే బిక్షపతి పేరు లేదు. పరకాల సీటును కొండా సురేఖ భర్త కొండా మురళికి ఇవ్వాలన్న ఉద్దేశంతో బిక్షపతికి కేసీఆర్ హేండిచ్చాడని, దీంతో బిక్షపతి బీజేపీ లేదా కాంగ్రెస్‌లో చేరాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మరో ఐదుగురి పేర్లు గల్లంతయ్యాయి. ఆల్రెడీ టిక్కెట్లు ఖరారైనప్పటికీ వాళ్ళ పేర్లు ఎందుకు ప్రకటించలేదని ఆరా తీస్తే, ఆ ఐదుగురూ కాంగ్రెస్‌లోకి జంప్ అయ్యే ఆలోచనలో వున్నారట. అందుకే లిస్టులో వాళ్ళ పేర్లు ప్రకటించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దాసరి చెప్పిన బ్రోకర్ ఎవరు?

      దర్శకుడు దాసరి నారాయణరావు సంచలనాత్మక ప్రకటన చేశారు. రాష్ట్రం విడిపోవడానికి ఒక బ్రోకర్ కారణమని, ఆ బ్రోకర్ ఎవరో త్వరలో వెల్లడిస్తానని దాసరి ప్రకటించారు. ఈ స్టేట్‌మెంట్ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. ఆ బ్రోకర్ ఎవరన్న ఆలోచనలు మొదలైయ్యాయి. అలా ఆలోచిస్తున్న కొద్దీ రకరకాల పేర్లు కళ్ళ ముందు కదులుతున్నాయి. దాసరి జగన్ గురించి అన్నాడా, కిరణ్ గురించి అన్నాడా, చిరంజీవి గురించి అన్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. రాష్ట్ర విభజనకు కారణం ఒక బ్రోకర్ కారణం అని చెప్పిన దాసరి ఆ బ్రోకర్ ఎవరో కూడా చెబితే బాగుండేది కదా. అయినా దాసరి స్టైలే అంత. ఎవర్ని తిట్టదలుచుకున్నాడో వాళ్ళని డైరెక్ట్ గా తిట్టడు. ఇలాగే డొంకతిరుగుడుగా తిడతాడు. జనాలు కన్‌ఫ్యూజ్ అయి ‘ఎవరా?’ అని జుట్టు పీక్కుంటారు. మీరు గమనిస్తూ వుండండి.. ఆ బ్రోకర్ ఎవరో, ఆ బ్రోకర్ పేరేమిటో దాసరి ఎప్పటికీ చెప్పడు.

కేసీఆర్‌ని జైల్లో పెడతారట!

      అవసరమైతే కేసీఆర్‌ని జైల్లో పెడతామని కేంద్ర మంత్రి జేడీ శీలం ప్రకటించడం సంచలనం సృష్టించింది. ఆయన ఈ కామెంట్ పోలవరం ప్రాజెక్టు విషయంలో చేశారు. పోలవరం ప్రాజెక్టు నూటికి నూరు శాతం చట్టబద్ధమైన ప్రాజెక్టు అని, పోలవరం ప్రాజెక్టుకు అడ్డు పడితే కేసీఆర్‌ని జైల్లో పెట్టి అయినా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని జేడీ శీలం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం వున్న జేడీ శీలం అమాయకత్వానికి మొదట అందరూ జాలిపడాలి. ఇదిలావుంటే, విభజన వల్ల ఎవరీకి నష్టం లేదని, సీమాంధ్రులు దోచుకుంటున్నారని మొత్తుకుంటున్న మారీచుల బారి నుంచి సీమాంధ్రులు విభజన పుణ్యమా అని తప్పించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్ధుల తొలిజాబితా

      త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో బరిలోకి దిగే టీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. 69 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయనున్నారు. తొలి జాబితలో 55 శాతం సీట్లు బలహీన వర్గాలకు కేటాయించామని కేసీఆర్ తెలిపారు. అలాగే ఏ పార్టీలతో పొత్తులు లేవని...వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోగి దిగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ 69 మంది అసెంబ్లీ అభ్యర్ధులు వీరే: గజ్వేల్- కేసీఆర్, హుజూరాబాద్- ఈటెలరాజేందర్, సిద్దిపేట-హరీశ్‌రావు, బాన్సువాడ- పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదిలాబాద్-జోగు రామన్న పరిగి- కొప్పుల ఈశ్వర్, బోథ్-జి. నగేశ్, కొల్లాపూర్- జూపల్లి కృష్ణారావు, ముథోల్- వేణుగోపాలచారి, తాండూర్-పి. మహేందర్‌రెడ్డి డోర్నకల్- సత్యవతి రాథోడ్, ధర్మపురి- కొప్పుల ఈశ్వర్, వరంగల్ (వెన్ట్)-దాస్యం వినయ్ భాస్కర్, వేములవాడ- సి.హెచ్ రమేశ్ బాబు కరీంనగర్ - గంగుల కమలాకర్ కోరుట్ల - విద్యాసాగర్ రావు చెన్నూరు- నల్లాల ఓదేలు ఎల్లారెడ్డి- ఏనుగు రవీందర్ రెడ్డి జుక్కల్ - హన్మంత్ షిండే కామారెడ్డి- గంప గోవర్ధన్ రామగుండం- సోమారపు సత్యనారాయణ స్టేషన్ ఘన్ పూర్ - టీ. రాజయ్య సిర్పూర్ - కావేటి సమ్మయ్య చేవెళ్ల - కే. ఎస్ రత్నం సిరిసిల్ల- కే.టీ. రామారావు మక్తల్ - వై ఎల్లారెడ్డి కల్వకుర్తి- జైపాల్ యాదవ్ సికింద్రాబాద్- టి. పద్మారావు భూపాలపల్లి- ఎస్ మధుసుదానాచారి సూర్యాపేట-జగదీశ్వర్ రెడ్డి మహబూబ్ నగర్- వి. శ్రీనివాస్ గౌడ్ వనపర్తి- నిరంజన్ రెడ్డి సత్తుపల్లి- పిడమర్తి రవి నర్సంపేట- సుదర్శన్ రెడ్డి మలుగు- అజ్మీరా చందులాల్ జడ్చర్ల - సి. లక్ష్మారెడ్డి వరంగల్ ( ఈస్ట్)- కొండా సురేఖ బోధన్- షకీల్ అహ్మద్ ఆలేరు - గొంగడి సునీత అచ్చంపేట- గువ్వల బాలరాజు పాలకూర్తి- ఎన్ సుధాకర్ రావు దేవరకద్ర- ఎ. వెంకటేశ్వరరెడ్డి మానకొండూరు- రసమయి బాలకిషన్ హుస్నాబాద్ -వి. సతీష్ కుమార్ ఆలంపూర్ - ఎమ్ శ్రీనాథ్ జనగాం- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దేవరకొండ- లాలు నాయక్ పెద్దపల్లి- డి. మనోహర్ రెడ్డి, వికారాబాద్ -బి. సంజీవరావు గద్వాల- కృష్ణమోహన్ రెడ్డి నకిరేకల్ - వీరేశం మేడ్చల్ - సుధీర్ రెడ్డి జోగిపేట- బాబుమోహన్ మెదక్ - పద్మాదేవేందర్ రెడ్డి వర్ధన్నపేట- రమేశ్ నిర్మల్ - శ్రీహరిరావు బెల్లంపల్లి- చిన్నయ్య నాగర్ కర్నూల్ - మర్రి జనార్ధన్ రెడ్డి ఖానాపూర్ - రేఖానాయక్ ఆర్మూర్ - ఏ. జీవన్ రెడ్డి ఆసిఫాబాద్ - కోవా లక్ష్మీ బాల్కొండ - వి. ప్రశాంత్ రెడ్డి పటాన్‌చెరు - మహిపాల్‌రెడ్డి సంగారెడ్డి - చింతా ప్రభాకర్

టైటానియం కుంభకోణంలో జగన్ కు వాటా!

      టైటానియం కుంభకోణం కేసులో కేవీపీతో పాటు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి కూడా సంబంధం వుందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపి౦చారు. డబ్బుల కోసం అంతర్జాతీయ క్రిమినల్స్ తో చేతులు కలిపి దేశం పరువు తీశారని మండిపడ్డారు. బెయిల్ కోసం వెయ్యి కోట్లు చెల్లించిన వ్యక్తులతో బేరసారాలు చేసారని అన్నారు. క్రిమినల్స్‌తో కలిసి ప్రపంచమంతా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారని, ఆ డబ్బు తెచ్చి ఇక్కడ ఓటుకు రూ. వెయ్యి, రెండు వేలు పంచి పెడుతున్నారని, లక్ష కోట్లు సంపాదించి ఎన్నికల్లో ఐదు, పది వేల కోట్లు ఖర్చు చేయడం వీరికి ఒక లెక్క కాదని చెప్పారు. ఇలాంటి వ్యక్తులు దేశాన్ని కాపాడతారా లేక అమ్మేస్తారా అని ప్రశ్నించారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదని, ప్రజల సొమ్మును దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టామని హెచ్చరించారు.

తెరాస తొలి జాబితా విడుదల నేడే

  కాంగ్రెస్ పార్టీ తెరాసతో ఎన్నికల పొత్తుల కోసం చకోర పక్షిలా ఆశగా, బేలగా చూస్తూ నేటికీ తమ తలుపులు తెరిచియేయున్నవి అని చెపుతుంటే, నక్షత్రకుడిలా తనవెంట బడుతున్న కాంగ్రెస్ పార్టీని వదిలించుకోలేక తెరాస తిప్పలు పడుతోంది. అయితే తెదేపా-బీజేపీల పొత్తుల సీరియల్లో బ్రేక్ వస్తే బీజేపీతో కలిసి ఆడిపాడుకొందామనుకొన్న తెరాస నేత కేసీఆర్ కు ఎంతకీ ఆ బ్రేక్ రాకపోవడంతో ఈరోజు తన పార్టీ అభ్యర్ధుల మొదటి జాబితాను విడుదల చేసేందుకు సిద్దమయిపోతున్నారు. బహుశః బీజేపీ తెదేపాకే కమిట్ అయిపోయిందని ఆయనకు డిల్లీ నుండి హాట్ లైన్లో కబురు వచ్చెందేమో కూడా!   ఈరోజు మొత్తం 69మంది శాసనసభ అభ్యర్ధుల పేర్లతో కూడిన జాబితాను విడుదల చేయబోతున్నారు. దీనితో ఇక తెరాస కటీఫ్ చెప్పేసినట్లే అవుతుంది గనుక, కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్ధులను వెంటనే ప్రకటించేయవచ్చును. కాంగ్రెస్, తెరాసలు తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటించగానే, సహజంగానే తెదేపా, బీజేపీలపై మరింత ఒత్తిడి పెరుగుతుంది గనుక అవి కూడా తమ పొత్తుల ధారావాహికాన్ని తక్షణం ముగించి తమ అబ్యార్ధులను ప్రకటిస్తే, ఇక అన్ని పార్టీ అభ్యర్ధులు పార్టీ జెండాలు, మైలుకు పట్టుకొని ఊర్లమీద పడతారు.

బంతిని అమెరికా కోర్టులో పడేసిన కేవీపీ

  దొరికితే దొంగలు, లేకుంటే దొరలూ..అనే సామెత ఊరకనే పుట్టుకు రాలేదు. మన రాజకీయ నాయకులలో చాలా మందికి ఈ సూక్తి చక్కగా సరిపోతుంది. స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి జమానా ఒక స్వర్ణ యుగమని వైకాపా నేతలు ఎంతయినా టాంటాం చేసుకోవచ్చు గాక, కానీ ఆ జమానాలోనే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో, స్థాయిలో అనేక కుంభకోణాలు చాప క్రింద నీరులా పరుచుకుపోయాయి. కానీ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉన్నంతకాలం అవేమీ బయటకు పొక్కలేదు గనుక, ఆయన ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల కారణంగా ఆయన ప్రజల అభిమానం పొందగలిగారు. కానీ ఆయన అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుంభకోణాలను ఇక ఎంతమాత్రం కప్పిపుచ్చలేని పరిస్థితులు ఎదురువడంతో పాముల పుట్టలోనుండి పాములు బయటపడుతున్నట్లు ఆ కుంభకోణాలన్నీ ఒకటొకటిగా వెలుగు చూస్తుంటే, మంత్రులు, ప్రభుత్వాధికారులు, వ్యాపారవేత్తలు అనేకమంది జైలు పాలయ్యారు. చివరికి అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళాక తప్పలేదు.   కానీ ఏదో మంత్రం చదివిది మాయ జరిగినట్లుగా అకస్మాత్తుగా జగన్, అతనితో పాటు మిగిలిన ముద్దాయిలు అందరూ కూడా ఎలాగ లోపలకి వెళ్ళేరో అలాగే బయటకు కూడా రాగలిగారు. ఆయనపై సీబీఐ మోపిన అభియోగాలు కూడా ఎవరో మంత్రం వేసినట్లు అన్నీ అటకెక్కిపోయాయి. దానితో కధ కంచికి జగన్ ఎన్నికలకి సిద్దమయిపోయారు. కానీ, వైయస్సార్ జమానాలో జరిగిన కుంభకోణాలు రాష్ట్రాలు, సప్త సముద్రాలు దాటుకొని విదేశాలకు విస్తరించడంతో, ఇక్కడ అందరినీ మేనేజ్ చేయగలిగినా, బయట దేశాలలో మేనేజ్ చేయడం కుదరకపోవడంతో టైటానియం గనుల కుంభకోణం ఈరోజు బయటపడింది.   ఏడాదికి దాదాపు 500 మిలియన్ డాలర్ల విలువచేసే ఖనిజ సంపద త్రవ్వేసుకొని అమ్రెఇకాలొని ఒక సంస్థకు ఎగుమతి చేసుకోవడానికి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా చెప్పుకొనే కేవీపీ రామచంద్ర రావు డైరెక్షన్లో 2006లో వ్యవహారం మొదలయింది. ఈ లక్షల కోట్ల వ్యవహారంలో ఎక్కడా ఆటంకాలు కలగకుండా ఉండేందుకు ఏప్రిల్ 28, 2006 నుండి జూలై 13, 2010వరకు విదేశాల నుండి దాదాపు 10.59 మిలియన్ డాలర్ల సొమ్ము డిల్లీ నుండి గల్లీ వరకు వివిధ ప్రభుత్వాధికారుల, రాజకీయ నేతల ఖాతాలలోకి వరదలా వచ్చిచేరింది. ఈవిషయాన్ని స్వయంగా అమెరికా షికాగో కోర్టు, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న అమెరికా పోలీసు అధికారులే దృవీకరించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి కేవీపీ రామచంద్రరావని కూడా దృవీకరించారు.   అయితే, మన దేశంలో ఎటువంటి వ్యవహారం కోసమైనా లేదా ఏ అంశంపైనైనా రాజకీయ నేతలు ప్రతిస్పందించేందుకు కొన్ని పడికట్టు స్టేట్మెంట్లు తయారు చేసుకొన్నాము. కనుక కేవీపీ కూడా నీటుగా అదే ఫార్ములా ఫాలో అయిపోతూ “తనపై ఇలాంటి ఆరోపణలు రావడం చాలా దురదృష్టకరమని అన్నారు. ఇప్పటిదాకా తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. కేవలం పేపర్లలో వచ్చిన వార్తలను పట్టుకొని తనను దోషిగా తేల్చేయడం సబబు కాదని, తానే పాపం ఎరుగనని అన్నారు. అమెరికా న్యాయ స్థానం లేదా సదరు దర్యాప్తు సంస్థ ఏదయినా నివేదిక ఇస్తే అప్పుడు మాట్లాడతానని’ చెప్పవలసిన నాలుగు ముక్కలు పద్దతిగా చెప్పేశారు. అందువల్ల ఇపుడు బంతి అమెరికా కోర్టులో పడేసినట్లే. కానీ నిప్పులేనిదే పొగ రాదని, మన జనాలకే కాదు అమెరికా కోర్టులకి కూడా బాగానే తెలుసు.   అయితే మళ్ళీ ఆ బంతి అణుబాంబులా ఎప్పుడు, ఎవరి మీద పడుతుందో తెలియక, ఈ వ్యవహారంలో బ్యాంకులు నింపుకొన్న వారందరికీ ముచ్చెమటలు పడుతున్నాయి. వారి సంగతెలా ఉన్నపటికీ, సరిగ్గా ఎన్నికల సమయంలో బయటపడిన ఈ భారీ కుంభకోణం తెదేపా అధినేత చంద్రబాబు చేతికి ఏకే-47 రైఫిల్లా దొరికింది. అధిపట్టుకొని అటు కాంగ్రెస్ పార్టీని, ఇటు వైకాపాను, తన ప్రియ శత్రువు జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకేసారి చీల్చి చెండాడడం ఖాయం.

బీజేపీ-తెదేపా పొత్తుల కధ కొలిక్కి వచ్చేనా?

  రోజులు గడిచిపోతున్నాపార్టీల మధ్య పొత్తులు మాత్రం కుదరడం లేదు. కాంగ్రెస్ తో పొత్తులు పెట్టుకొందామని ఆత్రపడుతున్న సీపీఐ, బీజేపీతో పొత్తులు పెట్టుకొందామని ఉవ్విళ్ళూరుతున్న తెదేపాలకి సీట్ల బేరం ఎంతకీ తెగకపోవడంతో ఎన్నికల షెడ్యుల్ విడుదలయినప్పటికీ పార్టీలు తమ అభ్యర్ధుల పేర్లను కూడా ప్రకటించుకోలేని దుస్థితి ఏర్పడింది. ఇక తెదేపా-బీజేపీల పొత్తులు బెడిసికొడితే, బీజేపీతో చేతులు కలుపుదామని తెరాస ఆత్రంగా ఎదురుచూస్తుంటే, తెరాస కరుణిస్తే ఆపార్టీతో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎదురుచూస్తోంది. అదేవిధంగా వైకాపా కూడా బీజేపీ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. అంటే తెదేపా-బీజేపీల పొత్తులను బట్టి ఆంధ్ర తెలంగాణాలలో రాజకీయ సమీకరణాలు మారుతాయన్నమాట.   ఇక ఈమధ్య కాలంలో తెదేపా రెండు ప్రాంతాలలో కొంచెం బలం పుంజుకోవడంతో చంద్రబాబులో మళ్ళీ ఆత్మవిశ్వాసం పెరిగింది. అందువలన బీజేపీ గొంతెమ్మ కోరికలన్నిటినీ తాము అంగీకరించావలసిన అవసరం లేదన్నట్లు కొంచెం బెట్టు ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా బీజేపీ కూడా తెదేపాతో పొత్తు పెట్టుకోకపోతే తెరాస, వైకాపాలు ఉండనే ఉన్నాయనే ధీమాతో బిగుసుకొని కూర్చొంది. దానివలన రెండు పార్టీల మధ్య పొత్తుల ముచ్చట్లు టీవీ ధారావాహికంలాగ కొనసాగుతూనే ఉన్నాయి.   ఇక ఆ రెండు పార్టీలు ఏదో ఒకటి తేల్చుకొని తమ తమ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తే, దానిని బట్టి తమ అభ్యర్ధులను కూడా ప్రకటించుకొందామని మిగిలిన పార్టీలు ఓపికగా ఎదురుచూస్తున్నాయి. ముందుగా తమ అభ్యర్ధుల జాబితా విడుదలచేసినట్లయితే పార్టీలో టికెట్స్ దొరకనివారి అసమ్మతికి తోడు, తమ అభ్యర్ధులను బట్టి ప్రత్యర్ధులు బలమయిన అభ్యర్ధులు నిలబెడితే మొదటికే మోసం వస్తుందని అన్ని పార్టీలు అభ్యర్దుల పేర్లు ప్రకటించడానికి మీన మేషాలు లెక్కిస్తూ రోజులు దొర్లించేస్తున్నాయి. ఇక తమకు పార్టీ టికెట్ దొరకకపోతే వేరే పార్టీలోకి జంపైపోదామని ఎదురుచూస్తున్న వారికి కొదవలేదు. వారు కూడా ఆ సుమూహూర్తం కోసం ఆశానిరాశలమాధ్య ఊగిసలాడుతూ బీపీలు పెంచేసుకొంటున్నారు.   ఈవిదంగా అన్ని పార్టీలు కలిసి పొత్తులు, టికెట్స్ అంశాలు పట్టుకొని ఒకదానితో మరొకటి దాగుడు మూతలు ఆడుకొంటున్నాయి. అందువల్ల ఈసమస్యలన్నీ పరిష్కారం అవ్వాలంటే ముందుగా తెదేపా-బీజేపీల మధ్య వెంటనే పొత్తులయినా కుదరాలి, లేకుంటే పొత్తులు పెటాకులయినా అయిపోవాలి. అప్పుడు గానీ ఈ సమస్య ఒక కొలిక్కి రాదు. కానీ తెలంగాణాలో నామినేషన్స్ వేయడానికి ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమె మిగిలి ఉన్నాయి గనుక మహా అయితే మరో ఐదు రోజులు ఈ పొత్తుల సస్పెన్స్ ధారావాహికం కొనసాగవచ్చును. అంటే ఇక ఏ పార్టీ మరే పార్టీకి అంతకు మించి డెడ్ లైన్స్ ఇవ్వలేవన్నమాట. బహుశః ఇటువంటి పొత్తుల భాగోతం మునుపెన్నడూ చూడలేదేమో.