నోటిఫికేషన్ రిలీజ్: అంకెల్లో తెలంగాణ!

      తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని అంకెల్లో చూసుకుంటే..... ఏప్రిల్ 2న నోటిఫికేషన్ విడుదల. ఈనెల 9వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 12వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం వుంటుంది. ఈ ఎన్నికలకు 336 మంది పరిశీలకులను నియమించారు. 138 వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. పార్లమెంట్‌కి పోటీ చేసే అభ్యర్థి 25 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి 10 వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో సగమే చెల్లించాలి. పార్లమెంట్‌కి పోటీ చేసే అభ్యర్థి 70 లక్షల వరకు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి 28 లక్షల వరకు ఎన్నికల ఖర్చు చేయొచ్చు. 10 జిల్లాల్లోని 119 అసెంబ్లీ స్థానాల్లో, 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నిక జరుగుతుంది. ఏప్రిల్ 30న ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఫలితాలు విడుదలవుతాయి. తెలంగాణలో మొత్తం 2,71,54,339 ఓటర్లున్నారు.

‘సంపద’ చూపించిన రాఖీ సావంత్!

      బాలీవుడ్ సూపర్ హాట్ గర్ల్, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాఖీ సావంత్ ఈ ఎలక్షన్స్ లో వాయవ్య ముంబై లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తోంది. ఈ ఎన్నికలలో పోటీ చేయడం కోసం ‘రాష్ట్రీయ ఆమ్ పార్టీ’ (రేప్)ని స్థాపించింది. హాట్ గర్ల్ అయిన తన ఎన్నికల గుర్తు కూడా హాట్ హాట్‌గా వుండాలన్న ఉద్దేశంతో తనకి పచ్చి మిరపకాయని గుర్తుగా కేటాయించాలని ఎలక్షన్ కమిషన్‌కి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా వుంటే, ఎలక్షన్లలో పోటీ చేసేవారు తమ ఆస్తులను బహిర్గతం చేయాలన్న ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాఖీ సావంత్ తన ఆస్తులను బయటపెట్టింది.   రాఖీ సావంత్ ఆస్తి మొత్తం 14 కోట్ల 69 లక్షలు. వీటిలో 3 కోట్ల 57 లక్షలు చరాస్తులు, 11 కోట్లు 12 లక్షలు స్థిరాస్తులు. ఆమె దగ్గర ప్రస్తుతం చేతిలో వున్న డబ్బు 96,427 రూపాయలు. 39 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్ల రూపంలో వున్నాయి. 61 లక్షలు బాండ్స్, షేర్స్ రూపంలో వున్నాయి. 2 కోట్ల 12 లక్షలు ఇన్సూరెన్స్, పోస్టల్ సేవింగ్స్ వున్నాయి. 21 లక్షల విలువైన ఫోర్డ్ ఎండీవర్ కారు వుంది. ముంబైలో ఒక ఫ్లాట్ వుంది. ఆస్తుల వివరాలు ఇలా వుంటే, ఈ అమ్మడి మీద ఒక ఛీటింగ్ కేసు కూడా వుంది. అందాలు ఆరబోయడం ద్వారానే ఇన్ని కోట్లు సంపాదించిన రాఖీ సావంత్ అస్సలు చదువుకోలేదట. ఎన్నికల డిక్లరేషన్‌లో తాను నిరక్ష్యరాస్యురాలినని రాఖీ సావంత్ పేర్కొంది.  

సోనియా నామినేషన్

      రాయబరేలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేశారు. తన తనయుడు రాహుల్ గాంధీతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సోనియాగాంధీ కాంగ్రెస్ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. 2004, 2009 ఎన్నికలలో రాయబరేలీ నుంచి ఎన్నికలలో పోటీ చేసిన సోనియా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్న సోనియాగాంధీ ఆశల మీద నీళ్ళు జల్లాలని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుమారుడు, సుప్రీంకోర్టు నాయవాది అగర్వాల్‌ని సోనియా గాంధీ మీద పోటికి నిలబెట్టింది. ఈనెల 30న ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగబోతోంది.

అమాయకుల సంఖ్య!

      సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో అమాయకులు ఎంతమంది ఉన్నారో చెప్పగలరా అనే ప్రశ్నకు నిన్నటి వరకూ ఎవరూ సమాధానం చెప్పలేకపోయేవారు. కానీ ఈరోజు మాత్రం ఈ ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పొచ్చు. అమాయకత్వం పర్సెంటేజ్ ఎంతమందిలో ఎక్కువ వుంది.. ఎంతమందిలో తక్కువ వుందనే విషయాన్ని కూడా క్లియర్‌గా చెప్పేయొచ్చు. టోటల్‌గా సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో మొత్తం అమాయకుల సంఖ్య ఎంతంటే, 1335. అవును.. అక్షరాలా పదమూడు వందల ముప్పయి ఐదు. ఈ సంఖ్య నీకెలా తెలుసని ప్రశ్నిస్తే దానికీ సమాధానం వుంది.   ఈ సంఖ్యని సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డే స్వయంగా ప్రకటించాడు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌తో ఎన్నికలలో పోటీ చేయడానికి మొత్తం 1335 మంది దరఖాస్తు చేసుకున్నారని రఘువీరా ప్రకటించారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ నేలమట్టమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కావాలని కోరుకునేవాళ్ళు అమాయకులే కదా మరి! ఈ అమాయకులలో ఓ మోస్తరు అమాయకుల సంఖ్య 1160. ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకుంటున్నారు. మరీ ముదిరిపోయిన అమాయకుల సంఖ్య 175. ఎందుకంటే వీళ్ళు పార్లమెంట్‌కి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ అమాయకులను కాంగ్రెస్ పార్టీ ఎలాగూ కాపాడలేదు.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకున్నవాళ్ళు అవుతారు.  

చిరు అన్నయ్యా.. బుర్ర తినకు!

      మాజీ మెగాస్టార్, అభిమానుల పాలిట దగాస్టార్ చిరంజీవికి నీ అభిమాని రాస్తున్న ఉత్తరం. ప్రజారాజ్యం పార్టీ పెట్టి, దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి, ఆ తర్వాత దగ్గరుండి రాష్ట్ర విభజన చేసి నువ్వు మా హృదయాలను ఇప్పటికే చాలాసార్లు గాయపరిచావు. నువ్వు చేసిన గాయాలు మాన్పుకునే పనిలో వున్నాం. అలాంటి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయకుండా నిన్న ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేశావ్. మమ్మల్నందర్నీ పిలిచి మాట్లాడావ్. నువ్వు కలవటం మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశావ్. అంతా అయిన తర్వాత చిరంజీవి ఫ్యాన్స్ కి కూడా ఈ ఎన్నికలలో టిక్కెట్లు ఇస్తామని రఘువీరా చేత ప్రకటింపజేశావ్? ఇదంతా చూశాక మాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు మారలేదన్నయ్యా.. నువ్వు మారతావన్న నమ్మకం కూడా నిన్నటి మీటింగ్‌తో  పోయిందన్నయ్యా. నువ్వు మామీద ప్రేమతో మీటింగ్‌కి పిలిచావని, మామీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇస్తానని అనిపించావని మేమేమీ అనుకోవడం లేదు. నీ అపరిపక్వ రాజకీయాల్లో భాగంగానే ఈ మీటింగ్ ఏర్పాటు చేశావని మాకు తెలుసన్నయ్యా. మేమందరం ఎక్కడ పవన్  కళ్యాణ్ తమ్ముడికి చేరువైపోతామోనని భయపడి నువ్వు మాతో మీటింగ్ ఏర్పాటు చేశావని మాకు తెలుసు. ఈ ఎన్నికలలో సీమాంధ్ర నుంచి కాంగ్రెస్ టిక్కెట్లు తీసుకోవడానికి మేమేమైనా పిచ్చోళ్ళలాగా కనిపిస్తున్నామా? మీ పార్టీ నుంచి సీమాంధ్రలో పోటీచేసేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టే మాకు టిక్కెట్లు ఇస్తామంటున్నారు. మా అభిమానుల్లో ఇద్దరికో ముగ్గురికో టిక్కెట్లు ఇచ్చి, ఆ నెపంతో మా అభిమానులందరి చేతా కాంగ్రెస్ పార్టీకి అరవచాకిరీ చేయించాలనేదే నీ ప్లాన్ అనేది మాకు అర్థమైపోయింది చిరు అన్నయ్యా. వద్దన్నయ్యా.. మమ్మల్ని నీ రాజకీయాల్లోకి లాగి మా బుర్రలు తినే ప్రయత్నం చేయొద్దు. నీ రాజకీయా పుణ్యమా అని రాష్ట్రంలో ఇప్పటికే మా పరువు పూర్తిగా పోయింది. ఇంకా మమ్మల్ని హింసించకు. మా మానాన మమ్మల్ని బతకనీ. నీకూ, నీ రాజకీయాలకీ ఓ దణ్ణం.

పార్టీల కళ్ళల్లో నిప్పులు!

      భారతీయ జనతాపార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య ఎన్నికల పొత్తు కుదరబోతోందన్న వార్తలు కాంగ్రెస్ దగ్గర్నుంచి సీపీఐ వరకూ అన్ని పార్టీల గుండెల్లో రైళ్ళు పరిగెత్తేలా చేస్తున్నాయి. ఈ పొత్తు కుదరకూడదు దేవుడా అని దేవుణ్ణి నమ్మని కమ్యూనిస్టులు కూడా దణ్ణాలు పెట్టేసుకుంటున్నారు. పొత్తు చెడగొట్టడానికి తమకు సాధ్యమైనట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు.   బీజేపీ, టీడీపీ మధ్య పొత్తులు, సర్దుబాట్లు,  సీట్ల సంఖ్య విషయంలో కొద్దిగా ప్రతిష్టంభన ఏర్పడటంతో ఇక పొత్తు కుదరనట్టే అని వైపీసీ ఇంటి పత్రిక, ఛానెల్ పనికట్టుకుని ప్రచారం మొదలుపెట్టేసింది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా వుండాలని సైంధవుడిలా శాయశక్తులా కృషి చేస్తున్న కిషన్‌రెడ్డి బిహేవియర్ కూడా పొత్తును ఇష్టపడని పార్టీలకు ఆయుధంలాగా దొరికింది. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదరకుండా దేవుడు కూడా ఆపలేడని స్పష్టం కావడంతో ఇప్పుడు సదరు పార్టీలన్నీ ఏడుపు మొదలుపెట్టాయి. కాంగ్రెస్ నాయకులయితే టీడీపీ, బీజేపీ పొత్తు ఏదో ఘోరమన్నట్టుగా మాట్లాడుతున్నాయి. జగన్ మీడియా ఇప్పటికీ తనవంతు కృషి చేస్తూనే వుంది. ఇక తాజాగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ కూడా అల్లాడిపోతోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ అయితే బోలెడంత వెటకారంగా మాట్లాడుతున్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దంటూ తెలుగుదేశం పార్టీకి ఒక విజ్ఞప్తి కూడా చేసేశాడు. టీడీపీ, బీజేపీ పొత్తు ఈ పార్టీల బొచ్చెలో రాయి వేసే అవకాశాలున్నాయి. అందుకే ఇంతలా ఏడుస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

జోరుమీదున్న సైకిల్!

      ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రాంతాలకతీతంగా జోరుమీద వుందని ఇప్పటికే ఎన్నో సర్వేలు స్పష్టం చేశాయి. తాజాగా జరిగిన మరో సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఓటర్లు అగ్ర తాంబూలం ఇస్తారని స్పష్టమైంది. సీఎన్ఎన్ – ఐబీఎన్ – సీఎస్‌డీఎస్ – లోక్‌నీతి సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని పెంచే విధంగా ఫలితాలు వచ్చాయి.   ఈ సర్వే ప్రధానంగా లోక్‌సభ స్థానాల మీద దృష్టిని కేంద్రీకరించింది. తెలుగుదేశం పార్టీకి అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో మంచి ఆదరణ లభించబోతున్నట్టు వెల్లడి అయింది. రెండు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీకి 13 నుంచి 19 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం వుందని సర్వే వెల్లడించింది. ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే రెండు ప్రాంతాలలో కలిసి తెలుగుదేశం పార్టీకి 29 శాతం ఓట్లు వచ్చే అవకాశం వుంది. సీమాంధ్ర ప్రాంతంలో అయితే 39 శాతం, తెలంగాణ ప్రాంతంలో 13 శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీకి దక్కనున్నాయి. తెలుగుదేశం – బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత ఇప్పటి సర్వేలో వచ్చిన సీట్లు, ఓట్ల శాతంలో భారీ పెరుగదల ఉండే అవకాశం వుండొచ్చు.

కాంగ్రెస్ దెబ్బకి రాహుల్ భవిష్యత్ ఫినిష్!

  ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలకు ఈసారి ఎన్నికలు అతిముఖ్యమయినవి. తెరాస, వైకాపాలు మొట్ట మొదటిసారిగా ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకొనేందుకు తహతలాడుతుంటే, తెదేపా ఈ ఎన్నికలలో గెలవకపోతే తన ఉనికే ప్రమాదం గనుక విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడేందుకు సిద్దం అవుతోంది. ఇక రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్, అందుకు సహకరించిన బీజేపీలు మాత్రం ఈ రేసులో అందరి కంటే వెనుకబడిపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ, బీజేపీ-తెదేపాల మద్య ఎన్నికల పొత్తులు కుదిరితే బీజేపీ కూడా బలపడే అవకాశం ఉంటుంది. కానీ, తెరాస హ్యాండివ్వడంతో తెలంగాణాలో, పార్టీ దాదాపు ఖాళీ అయిపోయిన కారణంగా సీమాంద్రాలో కూడా కాంగ్రెస్ ఘోరంగా దెబ్బ తినబోతోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేకపోయినా, కనీసం దేశంలో మిగిలిన రాష్ట్రాలలోనయినా విజవకాశాలు ఉండి ఉంటే, ఎన్నికల తరువాత ఆంధ్ర, తెలంగాణాలలో ఎన్నికయిన పార్టీలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడి ఉండేవి. కానీ, దేశంలో వివిధ రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలదే పూర్తి రాజ్యం నడుస్తోంది గనుక కాంగ్రెస్ పార్టీ ఏవో రెండు మూడు ఈశాన్య రాష్ట్రాలలో, దక్షిణాన్న కర్ణాటకలో తప్ప మరెక్కడా గెలిచే అవకాశాలు కనబడటం లేదు. కనీసం దాని మిత్రపక్షాలయినా గెలిస్తే కొంతలో కొంత ఊరట లభిస్తుంది. కానీ మోడీ మాయలో పడి వారు కూడా ఎన్డీయే కూటమికి జంపైపోతే ఇక కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలనే కల పగటికలగానే మిగిలిపోతుంది. ఇదంతా కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు.   కాంగ్రెస్ అధిష్టానం చాలా దురాలోచన చేసి దక్షిణాదిన తనకు కంచుకోట వంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్నితన హస్తాలతో తానే స్వయంగా బ్రద్దలు కొట్టుకొని, కన్నకొడుకుల వంటి స్వంత పార్టీ నేతలను కాదని, వేరెవరి చేతికో అధికారం అప్పజేప్పెందుకు  సిద్దం అయ్యింది. తత్ఫలితంగా ఈసారి కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలంత మెజార్టీ సాధిస్తే తప్ప, రాష్ట్రం నుండి ఎవరి మద్దతు దొరకదు. సోనియా గాంధీ తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని ఎలాగయినా ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఇంత రిస్క్ తీసుకొని కధ నడిపిస్తే చివరికి అదే కారణంగా రాహుల్ గాంధీ శాశ్వితంగా ప్రధాని పదవికి దూరం అయ్యేలా ఉన్నారు.   కాంగ్రెస్ నిసహ్హాయ స్థితి, రాహుల్ గాంధీ భవిష్యత్తు తలచుకొంటే పాపం జాలేస్తుంది.

తెలంగాణాలో నేటి నుంచి నామినేషన్లు

      రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణాలో తొలివిడత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు లో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఆస్తులతోపాటు విదేశాల్లోని ఆస్తులు, అప్పుల వివరాలను, పోలీసు కేసులుంటే ఆ వివరాలూ అఫిడవిట్‌లో పొందుపరచాలి. ఏ ఒక్క సమాచారం లేకపోయినా నామినేషన్లను తిరస్కరిస్తామని చెప్పారు. నామినేషన్ జారీ తేదీ నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, పదో తేదీన పరిశీలించి, 12న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తామని, అదే రోజు గుర్తులు కేటాయిస్తామని చెప్పారు.   అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్న నియోజకవర్గం పరిధిలోని పది మంది ఓటర్లు ఆయన పేరును ప్రతిపాదించాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే ఒక్కరు చాలు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ. 25వేలను డిపాజిట్టుగా చెల్లించాలి. శాసనసభకు పోటీచేసే అభ్యర్థి రూ.10 వేలను డిపాజిట్లుగా చెల్లించాలి.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో సగం చెల్లించాలి.పార్లమెంటు అభ్యర్థి రూ. 70లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేయవచ్చు. అసెంబ్లీ అభ్యర్థి రూ. 28 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.

గల్లా వెంటపడిన ఎమ్మార్ భూతం

  ఎమ్మార్ భూమూలా వ్యవహారంలో ఇంతవరకు చాలా మంది నేతలు, అధికారులు కేసులలో ఇర్రుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు తాజాగా తెదేపా కండువా కప్పుకొన్న మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి వంతు వచ్చింది. ఆమె కూడా ఎమ్మార్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దాఖలయిన ఒక ప్రవేట్ పిటిషన్నువిచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు, ఈ వ్యవహారంలో ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యుల పాత్రపై విచారణకు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ఆమెపై ఇటువంటి ఆరోపణలేవీ రాలేదు. కానీ చిత్రంగా ఆమె పార్టీ వీడగానే ఆమెపై పిటిషను పడింది. అది కూడా మామూలు కోర్టులో గాక సీబీఐ కోర్టులో పడింది. బహుశః ఆమె రాజకీయ ప్రత్యర్ధులు రాజకీయ కారణాలతోనే సరిగ్గా ఎన్నికల సమయం చూసుకొని ఆమెపై ఈ పిటిషను వేసి ఉండవచ్చును. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎన్నికలలో గెలవడం కష్టమని భావించిన ఆమె తెదేపాలోకి మారితే, ఇప్పుడు ఈ సరికొత్త ఆరోపణలు ఆమెకు ఇబ్బందికరంగా మారనున్నాయి.

చిరంజీవికి అభిమానులు మళ్ళీ గుర్తువచ్చారు

    గత ఎన్నికల దెబ్బకి ప్రజారాజ్యం పార్టీని, దాని ఆశయాలను, చివరికి తన అభిమానులను కూడా  మరిచిపోయిన చిరంజీవి అనే ఓ మెగాజీవి కాంగ్రెస్ గంగలో మునిగి పునీతులయిపోయారు. ఆ పుణ్యఫలం వలన అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ వచ్చిన ఆ జీవి మరెన్నడూ తన అభిమానులని పట్టించుకోకపోయినా, వారు మాత్రం టంచనుగా ఆయన పుట్టిన రోజు, ఆయన కొడుకు పుట్టిన రోజులని కూడా గ్యాపకం పెట్టుకొని తమ రక్తం ధార పోస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర విభజన వ్యవహారం బెడిసికొట్టిన తరువాత, తమ్ముడు పవన్ కొట్టిన దెబ్బతో మళ్ళీ ఆయన మెల్లమెల్లగా అభిమానులను గుర్తుపట్టగలుగుతున్నారిపుడు. అందుకే మళ్ళీ అందరినీ పేరుపేరునా పిలుస్తూ తమ్ముడు పెట్టే సమావేశానికి వెళ్ళవద్దని కూడా చెప్పగలిగారు.   అయితే వారిలో చాలా మంది ఆయన తమను గుర్తిస్తున్నాడని సంతోషించకపోగా, వారు కూడా ఆయనపేరు మరిచిపోయినట్లు ఆయన బస్సు యాత్రలో కనబడినప్పుడల్లా ‘పవన్ కళ్యాణ్ కి జై!’ అని అరుస్తూ తాము కన్ఫ్యూజ్ అయిపోతూ ఆయనను కూడా తెగ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇంకా వారినలాగే వదిలేస్తే ఇక శాశ్వితంగా తమ్ముడికే జై కొడుతూ తనపేరు కూడా మరిచిపోయే ప్రమాదం ఉందని, భయపడిన చిరంజీవులవారు, రఘువీరుడు, వసంత కుమారుడు వెంటరాగా ఈరోజు తన అభిమాన సంఘాలతో ఒక మీటింగ్ వేసుకొన్నారు.   చిల్లుపడిన కుండలా మారిన పార్టీలో నుండి మిగిలినవారు కూడా జారిపోకముందే అభిమానులందరికీ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పేస్తే వారు మరెవరి వెనుకపోకుండా నమ్మకంగా కాంగ్రెస్ పార్టీలోనే పడి ఉంటారని మంచి ఐడియా కూడా చేసారు. కానీ ఆ గుప్పెడు మందితో కాంగ్రెస్ పార్టీని నడపడం చాలా కష్టం గనుక వారందరి చేతికీ కాంగ్రెస్ టోపీలు ఇచ్చి వీలయినంతమంది అభిమానులకి, జనాలకి కూడా అవి పెట్టి వారిని పార్టీలోకి తోలుకురమ్మని సాక్షాత్ కేంద్రమంత్రి చిరంజీవే చేతులు పట్టుకొని అభ్యర్ధించేసరికి వాళ్ళు కూడా ఐస్ అయిపోయారుట.   ఎప్పుడూ ఎక్కడో డిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర ఆయన చేతులు కట్టుకొని వినయంగా వంగి నిలబడగా టీవీలలో చూడటమే తప్ప ఇలా తమ ముందు కూడా వినయంగా నిలబడి, ఆప్యాయంగా భుజాల మీద ఆయన అమృత హస్తాలు వేయడం ఎన్నడూ ఎరుగని అల్పసంతోషులు, ఆయన బొమ్మున్న ‘కేసీ క్రూ’ బ్యాడ్జీలు మెడలో వేసుకొని ‘జై చిరంజీవ!’ అంటూ వీరావేశంతో ఊగిపోయారుట. కేసీఆర్ రాష్ట్రాన్నే విడదీస్తే ఈ కేసీ బాబు మాత్రం కేవలం అభిమానులనే విడదీస్తే చాలు మన పనయిపోతుందని అనుకొంటున్నారుట.   కానీ లక్ష్మణుడు వంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం “పాపం! అన్నయ్యను తప్పుపట్టడానికేమీ లేదు.. ఆ సోనియమ్మే అమాయకుడైన మా అన్నయ్యను వెనక నుండి రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తోంది. అసలు ఆయనకి మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చారు గనుకా..” అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ భలే తమ్ముడు అనిపించుకొన్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయన మనసు మార్చుకోక పోతాడా? ఎన్నికలలో పోటీ చేయబోడా..అని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

రాహుల్ గుండెలో లేడీబాంబు!

      నిన్నటి వరకూ అమేథీ నియోజకవర్గంలో తనకి తిరుగు లేదని అనుకుంటున్న ‘యువరాజు’ రాహుల్ గాంధీ గుండెలో బాంబు పడింది. ఆ బాంబు కూడా మామూలు బాంబు కాదు... మాంఛి పవర్ ఫుల్ లేడీ బాంబు. ఆ లేడీ బాంబు పేరు స్మృతి ఇరానీ. ‘క్యోంకీ సాంస్ భీ కభీ బహూ..’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా బోలెడంతమంది అభిమానులను సంపాదించుకున్న స్మృతి ఇరానీకి ఉత్తరాదిలో అభిమానులు వెల్లువలా వున్నారు. అ అభిమాన వెల్లువే ఆమెను పార్లమెంట్‌కి పంపించింది. ఈ లేడీ బాంబును బీజేపీ ఈసారి రాహుల్ గాంధీ మీద ప్రయోగించాలని డిసైడ్ అయింది.   ఇప్పటి వరకూ రాజీవ్ గాంధీ మీద వున్న సానుభూతే అమేథీలో గాంధీ కుటుంబాన్ని గెలిపిస్తూ వస్తోంది. ఈసారి ఆ పప్పులు అక్కడ ఉడకవన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయిన యుపిఎ ప్రభుత్వం రాహుల్ విజయావకాశాలను సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. పులిమీద పుట్రలా ఇప్పుడు ఆ స్థానం నుంచి బీజేపీ స్మృతి ఇరానీని రంగంలోకి దించడం కాంగ్రెస్ వర్గాల్లో కలవరానికి, రాహుల్ గాంధీ గుండెల్లో బాంబు పేలడానికి కారణమైంది. స్మృతి ఇరాని కేవలం నటి మాత్రమే కాదు. మంచి వక్త. తన ప్రసంగాలతో ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సిద్ధహస్తురాలు. పరిపాలనాదక్షురాలిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఈ ఎన్నికలలో రాహుల్‌ని ఓడించడానికి ఆమె సమర్థురాలని బీజేపీ విశ్వసించింది. స్మృతి ఇరానీ రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ వర్గాలు ఎలర్ట్ అయ్యాయి. గతంలో మాదిరిగా లైట్‌గా తీసుకోకుండా అమేథీ మీద అధిక శ్రద్ధ తీసుకోవాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే కాకపోయాడు కనీసం ఎంపీగా అయినా మిగలాలని ప్రయత్నాలు ప్రారంభించాయి.

ప్రకటనల కామెడీ!

      ఈమధ్య కాలంలో తెలుగులో కామెడీ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కామెడీ సినిమాలు కూడా లేవు. టీవీ సీరియళ్ళలో కూడా కామెడీ సీరియళ్ళు కూడా తక్కువగా వున్నాయి. తెలుగు ప్రజలు హాయిగా నవ్వుకోవడానికి అవకాశాలు తక్కువగా వున్నాయి. దీన్ని అర్థం చేసుకున్న రాజకీయ పార్టీలు ప్రకటనల రూపంలో తెలుగు ప్రజలను నవ్వించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాయి.   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రాజకీయ ప్రకటనలు చూసి నవ్వడం మరచిపోయిన జనం కూడా పగలబడి నవ్వుకుంటున్నారు. ఏవేవో సమస్యల్లో వున్న జనం అక్కడే ఉన్న రాజకీయ నాయకుడుతో ‘ఆయనొస్తున్నాడు’ అని గాల్లోకి వేలు తిప్పడం, అది ఫ్యాన్ గుర్తుకు సింబాలిక్‌గా వుండటం చూసేవాళ్ళని బాగా నవ్విస్తోంది. ఆ తర్వాత వచ్చే ‘ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి.. దుమ్ము దులపండి’ అని బొంగురుగొంతు వాయిస్ ‘ఓవర్’ భలే కామెడీగా వుంటోంది. అసలు రాష్ట్రంలో దుమ్ముకు ఫ్యానే ప్రధాన కారణం అయినప్పుడు మళ్ళీ ఫ్యాన్‌కి ఓటేసి కొరివితో తల గోక్కోవడం ఎందుకని జనం అనుకుంటున్నారు. అలాగే సమైక్య సింహం ముసుగులో వున్న కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ జై సమైక్యాంధ్య పార్టీ ఇస్తున్న ప్రకటనలు కూడా నవ్వు తెప్పించేలా వున్నాయి. ‘చెప్పు గుర్తుకే మీ ఓటు’ అని ప్రకటనలో వినిపిస్తున్నప్పుడు జనం నవ్వులే నవ్వులు. అసలు పొలిటికల్ సీన్‌లో జై సమైక్యాంధ్ర పార్టీ వుందా అనే సందేహాలు చాలామందికి వస్తున్న సమయంలో ఈ ప్రకటన ‘ఓహో ఈ పార్టీ ఒకటి వుంది కదూ’ అని గుర్తు చేస్తూ ఆ రకంగా సక్సెస్ అవుతోంది.

ముషారఫ్‌కి ఉరేస్తారా? షూట్ చేస్తారా?

      పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కి ముసించింది. ఆయనగారి బతుకు ముగిపోయే సమయం ఆసన్నమైంది. పాక్ సైన్యాధ్యక్షుడి హోదాలో తిరుగుబాటు చేయడం ద్వారా పాకిస్తాన్‌ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని, దేశాధ్యక్షుడిగా నియంతలా వ్యవహరించిన ముషారఫ్ ప్రస్తుతం అనేక నేరారోపణలు ఎదుర్కొంటూ పాక్‌లో బందీగా వున్నాడు.   పాకిస్తాన్‌లో పద్ధతుల ప్రకారం ముషారఫ్ మీద ఆరోపించిన నేరాలు నిరూపణ అయితే ముందూ వెనుకా ఆలోచించకుండా చంపిపారేస్తారు. ప్రస్తుతం ముషారఫ్ గారి నేరాలన్నీ నిరూపణ అయ్యేలా వున్నాయట. ఇక కొద్ది రోజుల్లోనే ముషారఫ్‌ని రఫ్పాడించేసి పైకి పంపించడానికి అక్కడి సైన్యం సన్నాహాలు చేస్తోందట. ముషారఫ్‌ని ఉరి తీస్తారా లేక షూట్ చేసి చంపుతారా అనే డిస్కషన్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరుగుతోంది. ముషారఫ్ లాంటి సైనికుడు బుల్లెట్‌ ద్వారా చావడానికి ఇష్టపడతాడు. ఉరి వేయడం అనేది ఒక సైనికుడికి చావుకంటే బాధ కలిగించే విషయం. మనం జాలిపడతాంగానీ, మన దేశంలో ఈ అవకాశం లేదుగానీ, అక్కడ ఓ వెలుగు వెలిగిన రాజకీయ నాయకులని అవసరమైతే చట్టప్రకారం చంపేస్తారు. గతంలో జుల్ఫుకర్ అలీ భుట్టోని కూడా అలాగే చంపేశారు. ఇప్పుడు చావుకి దగ్గరైన ముషారఫ్ కూడా తక్కువోడేమీ కాదు.. ఎన్నో వేలమందిని చంపేసిన రఫ్ కేరెక్టర్ ముషారఫ్‌ది. అధికారంలో ఉన్నంతకాలం ఇండియా మీద కయ్యానికి కాలు దువ్వాడు. పాపం పండి ఇప్పుడు చావుకోసం ఎదురుచూస్తున్నాడు.

కోదండరామ్ పై కొండా మాటల దాడి

      తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరామ్ తమపైన చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఇటీవల తెరాసలో చేరిన కొండా సురేఖ అన్నారు. కోదండరామ్ తనమీద ఆగ్రహాన్ని ప్రకటించడం అన్యాయమని ఆమె ఆక్రోశిస్తున్నారు. కోదండరామ్ మీద మాటల దాడికి దిగారు. తానేదో తెలంగాణ ద్రోహి అన్నట్టు మాట్లాతున్న కోదండరామ్‌ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. గతంలో రాజకీయ జేఏసీ, దాని నాయకుడు కోదండరామ్ ఆదేశించినందువల్లే తాము తమ పదవులకు రాజీనామా చేశామని, అలాగే తెలంగాణ  విషయంలో యు టర్న్ తీసుకున్నందువల్లే వైసీపీ నుంచి వైదొలగామని,  అలాంటి త్యాగమూర్తులైన తనని, తన భర్తని ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ నాయకులు విమర్శించడం దారుణమని ఆమె వాపోతున్నారు. 

తొమ్మిది లోపు కౌంటింగ్!

      మున్సిపల్ఎన్నికల కౌంటింగ్ విషయంలో హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఈనెల 9వ తేదీ లోపు కౌంటింగ్ పూర్తి చేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకారం రేపటి నుంచి కౌంటింగ్ జరపాల్సి వుంది. అయితే ఇప్పుడే మున్సిపల్ ఫలితాలు ప్రకటిస్తే ఆ ఫలితాలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌ మీద ప్రభావం చూపే అవకాశం వుందని, అందువల్ల ఫలితాలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ విషయంలో కోర్టు తీర్పు కోసం రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. ఫలితాలు ముందుగా విడుదల చేస్తే ఓటర్లు ప్రభావితులవుతారని దాఖలైన పిటిషన్లను హై కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల ఫలితాలను ఈనెల 9 లోపు విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటింగ్‌కి సన్నాహాలు ప్రారంభించింది.

పొత్తులు సరే..నేతలు సహకరించుకొంటారా?

  తెలుగుదేశం-బీజేపీల మధ్య పొత్తులు దాదాపు ఖరారయినట్లు తాజా సమాచారం. తెలంగాణాలో ఎనిమిది లోక్ సభ, 45 అసెంబ్లీ సీట్లను బీజేపీకి కేటాయించేందుకు తెదేపా ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేస్తుండగా, అందుకు దాదాపు అంగీకరించిన బీజేపీ వీలయితే అదనంగా మరి కొన్ని స్థానలయినా సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల బహుశః ఈరోజు లేదా రేపటికల్లా పొత్తులు కధ సుఖాంతమయినట్లు ప్రకటించే అవకాశం ఉంది.   అయితే ఇంతకాలం తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖించిన కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి బీజేపీ నేతలు తేదేపాకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్ధకమే. రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరినప్పటికీ బీజేపీ నేతలు సహకరించకపోయినట్లయితే, అప్పుడు తెదేపా నేతలు కూడా అదేవిధంగా వ్యవహరించవచ్చును. అదే జరిగితే రెండు పార్టీల అభ్యర్ధులకు తీవ్ర నష్టం జరగవచ్చును. అందువల్ల తెదేపా-బీజేపీ అగ్రనేతలు పొత్తులకోసం ఎంత శ్రమించారో, తమ నేతల మధ్య సహకారం పెరిగేందుకు కూడా అంతే శ్రమించ వలసి ఉంటుంది. లేకుంటే వారి మధ్య ఉన్న ఈ విభేదాల వలన కాంగ్రెస్, తెరాసలు ప్రయోజనం పొందడం తధ్యం.

తప్పు దిద్దుకుంటున్న పవన్!

      అన్నయ్య చిరంజీవితో పోలిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి ఆలోచన కాస్త ఎక్కువే అనొచ్చు. పైకి ఆవేశంగా కనిపించినా, లోపల ఆలోచన వుందనడానికి ఆధారాలు బయటపడుతున్నాయి. మొదట పవన్ ఆలోచనని ఆవేశం డామినేట్ చేసినా, ఆ తర్వాత ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకుంటాడని అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఆవేశంగా ప్రకటించడం ఆయన చేసిన మొదటి పొరపాటు. పార్టీని ప్రకటించకుండానే తన ఆవేదనను వ్యక్తం చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించే నాయకత్వం గురించి ప్రస్తావించొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తప్పడుగులు వేశాడు. పార్టీని ప్రకటించాకగానీ, పవన్ కళ్యాణ్‌కి పార్టీ పెడితే సరికాదు.. దాన్ని నడపటం, క్షణానికో మాట మార్చే రాజకీయ నాయకులతో వేగటం కష్టమని తెలిసొచ్చింది. దాంతో  పార్టీ కార్యకలాపాలను ప్రకటించకుండానే తనలోని ఆవేశానికి విశ్రాంతి ఇచ్చాడు. ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆవేశాన్ని విరమించుకుని ఆలోచనాత్మకంగా వ్యవహరించాడు. తాను ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసి గెలిచేది లేకపోయినా, ఓట్లని చీల్చి సమర్థమైన నాయకత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం వుందని గ్రహించాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆయన చేసిన చాలా తెలివైన పని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దాంతోపాటు కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడ్డం కూడా మంచి పరిణామమని అంటున్నారు. రాజకీయాల్లో అనుభవం లేకపోయినా సరైన సమయంలో సరైన విధంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ పరిణితిని కనబరిచాడని ప్రశంసిస్తున్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఇప్పటికీ రాజకీయ అపరిపక్వతతో విలసిల్లే చిరంజీవి భవిష్యత్తులో రాజకీయ పాఠాలు నేర్చుకోదలుచుకుంటో ఎవరిదగ్గరకో వెళ్ళడం కాకుండా పవన్ కళ్యాణ్ దగ్గరే నేర్చుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.