తెలంగాణాలో దూసుకుపోతున్న తెదేపా

  తెలంగాణా ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారాలలో తెలంగాణాలో బాగా దెబ్బతిన్న తెదేపా మళ్ళీ క్రమంగా పుంజుకొని ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, తెరాసలకు ఎదురునిలిచి పోరాడగల ఆత్మస్థయిర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఒకవేళ బీజేపీతో పొత్తులు కూడా ఖరారయినట్లయితే, తెలంగాణా సాధించిన కారణంగా గెలుపు ఖాయమని భావిస్తున్న తెరాస, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా చెమటోడ్చక తప్పని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజుల క్రితం మెహబూబ్ నగర్ లో తెదేపా నిర్వహించిన ప్రజాగర్జన సభకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. అందుకే మళ్ళీ వెంటనే మరో రెండు సభలు నిర్వహించేందుకు తెదేపా సిద్దం అవుతోంది.రేపు వరంగల్లో,ఎల్లుండి కరీంనగర్ లో ప్రజాగర్జన బహిరంగ సభలు నిర్వహించేందుకు తెదేపా భారీ సన్నాహాలు చేస్తోంది.   బీజేపీతో పొత్తుల విషయం కూడా తేలిపోయిన తరువాత, ఆ పార్టీ నేతలతో కలిసి మరిన్ని సభలు నిర్వహించాలని తెదేపా భావిస్తోంది. ఒకవేళ పొత్తులు కుదరకపోయినట్లయితే, తెదేపా వెంటనే తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించి వారితో కలిసి ప్రచారం మొదలుపెట్టేందుకు సిద్దంగా ఉంది. ఏమయినప్పటికీ, తెదేపా తెలంగాణాలో ఊహించని విధంగా మళ్ళీ బలం పుంజుకొని తన ప్రత్యర్ధుల కంటే ముందు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు

  ఇటీవల వైజాగ్ లో బహిరంగ సభ నిర్వహించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అనేక విషయాలపై సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడంతో రాజకీయ నాయకుల నుండే కాక ప్రజల నుండి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఈనాడు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పార్టీ, దాని ఉద్దేశ్యాలు, వివిధ పార్టీ అధినేతల గురించి మరికొంత స్పష్టత ఇచ్చేరు.   ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేనప్పుడు పార్టీ ఎందుకు పెట్టారనే అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ “రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం నెలకొన్న విచ్చినకర పరిస్థితులను చూస్తూ కూర్చోలేకనే తాను పార్టీని పెట్టాను తప్ప ఎన్నికలలో పోటీ చేయాలనే ఏకైక లక్ష్యంతో కాదని జవాబిచ్చారు. కానీ పోటీ చేసేందుకు తగిన అభ్యర్ధుల కోసం తాను వెతికినట్లు ఆయన అంగీకరించారు. అయితే ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో తాను కూడా కొందరు అభ్యర్ధులను పోటీలోకి దింపడం వలన వ్యవస్థకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వెనుకంజ వేసినట్లు చెప్పారు. అయితే 2019 ఎన్నికల నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేసేలా తాను కృషిచేస్తానని అన్నారు. ఈలోగా రెండు రాష్ట్రాలలో అధికారం చెప్పట్టే రాజకీయ పార్టీలను ప్రజల తరపున నిలదీస్తానని తెలిపారు. అందుకోసం తాను ఇకపై సినిమాలలో నటించడం సగానికి సగం తగ్గించుకొంటానని తెలిపారు.   ఇక, పవన్ కళ్యాణ్ తన వైజాగ్ సభలో కాంగ్రెస్ నేతలను పేరుపేరునా విమర్శించినప్పటికీ, తన సోదరుడు చిరంజీవిని కానీ, జగన్మోహన్ రెడ్డిపై కానీ గట్టిగా మాట్లాడకపోవడాన్ని కూడా చాలా మంది తప్పు పట్టారు. దానికి సమాధానంగా నేను వ్యక్తిగతంగా ఎవరినీ ద్వేషించడం లేదు. వారి సిద్దాంతాలను మాత్రమే విమర్శిస్తున్నాను. కానీ ఒకవేళ నా సోదరుడు చిరంజీవి నోరు విప్పి మాట్లాడినా ఎటువంటి ప్రయోజనమూ ఉండేది కాదని చెపుతూ పవన్ అన్నయ్యను వెనుకేసుకు వచ్చారు.   వ్యక్తిగతంగా ఎవరినీ ద్వేషించను అంటూనే జగన్మోహన్ రెడ్డిని మాత్రం తీవ్రంగా విమర్శించారు. తాను ఎన్నో ఏళ్ళపాటు శ్రమిస్తే తప్ప కొద్దిపాటి ఆస్తులను కూడా సంపాదించలేకపోయానని, అయినప్పటికీ గత రెండేళ్లలో సరయిన హిట్స్ లేక ఆదాయపన్ను కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, కానీ జగన్మోహన్ రెడ్డి కొద్దిపాటి సమయంలోనే ఏవిధంగా అన్ని కోట్లు కూడబెట్టగలిగారని పవన్ ప్రశ్నించారు. ఆయనకు వ్యతిరేఖంగా ఒక గదినిండా పోగుపడిన చార్జ్ షీట్లు, ఆరోపణల పత్రాలను పెట్టుకొని ఆయన ఏవిధంగా స్వచ్చమయిన పాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. తన తండ్రి చనిపోయిన బాధ కూడా లేకుండా ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన పడిన ఆరాటాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు.   అదేవిధంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అవినీతిని ప్రజల జీవితాలలో ఒక భాగమేననే స్థాయికి తీసుకువచ్చి అందరినీ అవినీతిపరులుగా మార్చే ప్రయత్నం చేసారని ఆరోపించారు. తండ్రి అవినీతికి పాల్పడితే, కొడుకు అధికారం కోసం అర్రులు చాస్తున్నారని ఎద్దేవా చేసారు. జగన్మోహన్ రెడ్డిపై మోపబడిన నేరారోపణలు నిరూపింపబడక పోయినప్పటికీ,అవ్వన్నీ అబద్దాలని కొట్టిపారేయలేమని అందువల్ల ఆయన అధికారం ఆశించే ముందు, తన కేసులనుండి స్వచ్చంగా బయటపడి ఉంటే బాగుండేదని అన్నారు. అవినీతి ఆరోపణలు తప్ప ఎటువంటి పరిపాలనానుభవమూ లేని ఆయనకు అధికారం కట్టబెట్టడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.   మంచి పరిపాలనా దక్షుడిగా నిరూపించుకొన్న చంద్రబాబు వలననే రాష్ట్రంలో మళ్ళీ సుస్థిరత ఏర్పడుతుందని ఆయన అబిప్రాయం వ్యక్తం చేసారు. అయితే చంద్రబాబు కూడా తన హయాంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి పొరపాటు చేసారని, కానీ మళ్ళీ అవకాశమిస్తే వాటిని సవరించుకొనే ప్రయత్నం చేస్తారని తను ఆశిస్తున్నట్లు తెలిపారు. మోడీకి మద్దతు ఈయడంపై కూడా మాట్లాడుతూ గుజరాత్ లో జరిగిన అల్లర్లకు మోడీ చాలా సార్లు పశ్చాతాపం వ్యక్తం చేసారని, అలాగని ఆయన తప్పులు చేయలేదని నేనూ భావించట్లేదని,అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశానికి అటువంటి సమర్దుడయిన నాయకుడు చాలా అవసరమనే ఉద్దేశ్యంతోనే తాను ఆయనకీ మద్దతు ఇచ్చానని తెలిపారు.

సమరానికి సై అంటున్న లెజెండ్

  నటసింహం లెజెండ్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిత్రం భారీ విజయం సాధించడంతో దేవుళ్ళకు మొక్కులు, ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు తెలిపేందుకు లెజెండ్ టీం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. విశాఖపట్నం చేరుకుని సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో బావ చంద్రబాబుతో సమావేశం కానున్నానని తెలిపారు. పార్టీ నాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు బాలయ్యబాబు.   బాలకృష్ణ అసెంబ్లీ కి పోటీ చేస్తారా, పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగుతారా అనేది స్పష్టం కాకపోయినా ఎమ్మెల్యేగా పనిచేసేందుకే నందమూరి నాయకుడు మొగ్గు చూపుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. సెంటిమెంట్ ప్రకారం అయితే అంతపురం జిల్లా హిందూపురం, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గాలలో ఏదో ఒక చోటు నుంచి బాలయ్య పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. ఇవే కాకుండా కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాల అభిమానులు కూడా తమ ప్రాంతం నుంచి బాలయ్య పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఎట్టకేలకు మోడీకి అద్వానీ మద్దతు

      ఎట్టకేలకు బీజేపీ అగ్రనేత అద్వానీ తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి తన మద్దతు ప్రకటించారు. మార్పు కావాలంటే మోడీకి ఓటు వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మోదీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నుంచి ఆయనతో అద్వానీకి సుహృద్భావ సంబంధాలు లేవు. ఇటీవల అద్వానీ పోటీ చేసే స్థానం విషయంలో నెలకొన్న వివాదంతో ఆ దూరం మరింత పెరిగిందని అంతా భావించారు. అయితే సోమవారం మహారాష్ట్రలోని శెవగావ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అద్వానీ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం దేశానికి కావల్సింది నినాదాల నాయకుడు కాదు.. దృఢమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేసే నాయకుడు. అందుకే మార్పు కోసం మోదీకి ఓటేయండి అని పిలుపునిచ్చారు.

కారు జోరుకు కొండా బ్రేకులు?

  తెలంగాణలో జోరు మీదున్న కారుకు కొండా దంపతుల చేరికతో బ్రేకులు పడ్డాయి. నిన్న మొన్నటి వరకూ గులాబీ కండువాలు కప్పుకునేందుకు ఎగబడ్డ తెలుగు తమ్ముళ్ళు, కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా పునరాలోచనలో పడినట్టు సమాచారం. వైసీపీలో కీలకంగా ఉంటూ.. జగన్ పార్టీకి అనధికార తెలంగాణా ప్రతినిధిగా వ్యవహరించిన కొండా దంపతులు.. జగన్ అన్న కోసం మానుకోట రణరంగానికి ఆజ్యం పోశారు. తెలంగాణా బిడ్డలపై బందూకులు ఎక్కుపెట్టారు. గులాబీ దళపతి తీవ్ర ఆరోపణలు చేశారు. తెరాస శ్రేణులతో యుద్ధాలకు దిగారు. సీమాంధ్ర లో జరిగే సభలకు కొండా సురేఖ ప్రత్యెక అతిథిగా హాజరయ్యేవారు.   జగన్ జైలులో చేరిన నుంచీ కొండా దంపతులతో విభేదాలు మొదలయ్యాయి. పార్టీ నుంచి ఏ కారణంతో బయటకు వెళ్దామా అని ఎదురు చూసిన కొండా జంటకు జగన్ సమైక్యాంధ్ర స్టాండ్ సాకుగా దొరికింది. పార్టీకి రాజీనామా చేసేసి జగన్ పై తీవ్ర ఆరోపణలకు కూడా దిగారు మురళి, సురేఖ. ఇతర పార్టీల నుచి వలస వచ్చే వారి కోసం తెరాస గేట్లు బార్లా తెరిచింది. వలసల జాతరలో కొండా దంపతులకు గులాబీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు.   ఇక అంటే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎవరిని పార్టీలో చేర్చుకున్నా రాని వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబుకింది. టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ కొండా దంపతుల చేరికను వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ తీరును ఆయన తప్పుపట్టారు. తెలంగాణా వ్యతిరేకులను పార్టీలో చేర్చుకోవడం తప్పని వ్యాఖ్యానించారు. కొండా దంపాతులను చేర్చుకోవడంపై ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.   నిన్న మొన్నటివరకూ మొఖం కూడా చూడకుండా గులాబీ కండువాలు కప్పేసిన కేసీయార్.. ప్రస్తుతం పార్టీలో చేరికలకు ఆచి తూచి .. బాగా ఆలోచించి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని సమాచారం.

అందరిదీ ఒకటే నినాదం?

  ఎన్నికలకు పార్టీల మేనిఫెస్టోలు విడుదలయ్యాయి. రాష్ట్రం రెండుగా విడిపోయాక రాజకీయ నేతలు ఏ రోటికాడ ఆ పాట పాడుతున్నారు. మేనిఫెస్టోలు కూడా ఇరు ప్రాంతాలకు వేరు వేరుగా విడుదల చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం మేనిఫెస్టోల కంటే తెలంగాణ తెచ్చిన క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని మెజార్టీ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనే దానిపై పార్టీలు కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నాయి. పోరాడి తెచ్చుకున్నామని తెరాస, సీమాంధ్ర లో పార్టీ తుడిచి పెట్టుకుపోయినా లక్ష్య పెట్టకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణా ఇచ్చారని కాంగ్రెస్, ఉభయసభల్లో తాము మద్దతు ఇవ్వడం వల్లే బిల్లు ఆమోదం పొందిందని బీజేపీ, విభజనకు అనుకూలంగా తమ పార్టీ లేఖ ఇచ్చిందని టీడీపీ, తాము మొదటి నుంచీ తెలంగాణాకు అనుకూలమని సీపీఐ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నాయి.   సమైక్యాంద్రకు కట్టుబడి ఉన్న సీపీఎం, ఎంఐఎం తెలంగాణా అభివృద్ధి మంత్రంతో ఎన్నికలకు వెళుతున్నాయి. తెలంగాణాకు తామే పాలకులు కావాలని ఉవ్విళ్ళూరుతున్న నేతలు నవ తెలంగాణా, సామాజిక తెలంగాణా, పునర్ నిర్మాణం పేరుతో ప్రచారం మొదలు పెట్టారు. మరో వైపు కాంగ్రెస్ దళిత ముఖ్యమంత్రి కార్డు ప్రయోగించింది. టీడీపీ బీసి రామబాణంతో దూసుకెళ్తామనే ఆశతో ఉంది. బీజేపీ కూడా బీసీ మంత్రం జపిస్తోంది. అధికారం దక్కించుకునేందుకు ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు, ప్రాంతం, కులం, అభివృద్ధిని అస్త్రాలుగా ప్రయోగించాయి పార్టీలు. చివరికి ఏ మంత్రం ఫలిస్తుందో.. ఎవరిని విజయం వరిస్తుందో ...

కాంగ్రెస్ ఖజానా ఖాళీ

అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారాన్ని చలాయించిన కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా డబ్బు కొరత వచ్చి పడింది. ఎన్నికల జెండాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలను తయారు చేసుకునేందుకు పైసల్లేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ నాయకులు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ గాంధీభవన్ బొక్కసం మాత్రం ఖాళీగా దర్శనమిస్తోంది. పార్టీకి నిధులు ఇచ్చేందుకు నేతలెవరూ ముందుకు రావడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా తన చేతి చమురు ఎందుకు వదలించుకోవాలనే ఉద్దేశంతో ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ ప్రచార సామగ్రి ఇంతవరకు సిద్ధం కాలేదు. చివరకు గాంధీభవన్‌కు వచ్చే నాయకులు, మీడియాకు టీ, బిస్కెట్లు ఇచ్చేం దుకు కూడా వెనుకాడే పరిస్థితి ఏర్పడింది.   ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం కోసం కార్యకర్తలు చెల్లించిన రూ.3 కోట్లను డిపాజిట్ చేశారు. దానిపై వచ్చే వడ్డీని గాంధీభవన్ నిర్వహణకు వినియోగించేవారు. దీనికి తోడు పార్టీ అధికారంలో ఉన్నందున ప్రభుత్వాధినేత నుంచి ప్రతినెలా రూ.10 లక్షల మేరకు అనధికారికంగా సర్దుబాటు చేసేవారు. డీఎస్ నుంచి బొత్స సత్యనారాయణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత గాంధీభవన్‌ను ఆధునీకరించేందుకు బ్యాంకులో ఉన్న సొమ్మంతా ఖర్చు చేశారు. కానీ కిరణ్ వచ్చాక రూ.10 లక్షలకు బదులు రూ.5 లక్షలు ఇస్తానని ప్రతిపాదించారు. దానితో విభేదించిన బొత్స ఆ సొమ్మును కూడా తీసుకునేందుకు నిరాకరించారు. మంత్రిగా తనకున్న పలుకుబడి, ఇతర నాయకుల సహకారంతో గాంధీభవన్ ఆధునీకరణ, ఇందిరా భవన్ నిర్మాణం పూర్తి చేశారు.   టీపీసీసీ, ఏపీసీసీలుగా ఏర్పడే నాటికి గాంధీభవన్ ఖాతాలో సొమ్ము రూ.2 లక్షలకు పడిపోయింది. ప్రభుత్వమే రద్దయినందున అక్కడి నుంచీ చెల్లింపులు ఆగిపోయాయి. ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్‌లో, జిల్లాల్లో కొత్తగా కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని పొన్నాల లక్ష్మయ్య ఆదేశించారు. కానీ అందుకు అవసరమైన కంప్యూటర్, ఫోన్, టేబుల్, ఇతరత్రా సదుపాయాలకు డబ్బు లేక కంట్రోల్‌రూం నిర్వాహకులు తలపట్టుకున్నారు.   టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అబద్ధాలను, మాట తప్పిన నైజాన్ని ఎండగడుతూ ‘కేసీఆర్....వంద అబద్ధాలు’ పేరుతో బుక్‌లెట్ రూపొందించాలని పొన్నాల ఆదేశించారు. అందుకయ్యే ఖర్చులను ఎలా భరించాలో తెలియక గాంధీభవన్ సిబ్బంది బిక్కమొహం వేసుకున్నారు.

జేఏసీ- టీఆర్ఎస్ వార్ షురూ

   రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.. అప్పుడే టీఆర్ఎస్- టీ.జేఏసీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. రాజకీయాలకు అతీతంగా ఏర్పాటైన జేఏసీకి, పూర్తిస్థాయి రాజకీయాలతో మునిగి తేలుతున్న టీఆర్ఎస్ కు మధ్య మొదటినుంచే పొరపొచ్చాలున్నా, ఎప్పటికప్పుడు పరస్పర అవసరాల దృష్ట్యా సర్దుకుపోతూ వచ్చారు. ఇప్పుడు ఆ అవసరాలు తగ్గడంతో జేఏసీ నాయకులు టీఆర్ఎస్ అధినాయకత్వం మీద.. ముఖ్యంగా కేసీఆర్ మీద మండిపడుతున్నారు. ఒంటికాలిపై లేస్తున్నారు. గతంలో మహబూబ్ నగర్ ఉప ఎన్నిక సందర్భంలో కూడా జేఏసీ వర్గాలు టీఆర్ఎస్ కు సహకరించలేదన్న కథనాలు వినిపించాయి. తాజాగా కూడా మరోసారి జేఏసీ ఛైర్మన్ కోదండరాం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద మండిపడ్డారు. కొండాదంపతులను పార్టీలో చేర్చుకోవడం పార్టీ వర్గాలతో పాటు జేఏసీ వర్గాలకు కూడా సుతరామూ ఇష్టం లేదు. దీనిపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   తెలంగాణా ద్రోహులకు టిక్కెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డ శక్తులు, వ్యక్తులను తీసుకొచ్చి, పదువులు ఇచ్చి, విశ్వాసం పోగొట్టుకోవద్దని సూచించారు. ఉద్యమ ద్రోహులకు టిక్కెట్లు ఇవ్వడం సరికాదన్నారు. అలాంటి వారికి నాయకత్వం అప్పగిస్తే, టిక్కెట్లు ఇస్తే ప్రజల విశ్వాసం సన్నిగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.   టీ.జేఏసీ తెలంగాణ అజెండా... తెలంగాణా వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో అమరుల స్మారక స్థూపాలను ఏర్పాటు చేయాలి ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలి ప్రభుత్వ పథకాలను హక్కుగా అడిగే చట్టం ఉండాలి. తెలంగాణా రాష్ట్రంలో ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలి కర్ణాటక తరహాలో లోకాయుక్త ఉండాలి. జిల్లాల్లో ఐటీ కారిడార్లు ఏర్పాటు చేయాలి. 1956 నుంచి జరిగిన భూకేటాయింపులపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలి. రైతుల రుణాలు మాఫీ చేయాలి.

రోడ్డెక్కిన మేయర్ అభ్యర్థులు

  తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలలో రెండు ప్రధాన పార్టీల మేయర్ అభ్యర్థులు ఇద్దరూ రోడ్డెక్కారు. అయితే వీళ్లిద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకోలేదు.. అధికారుల మీదే మండిపడ్డారు. రెండు వేర్వేరు కారణాలతో వీళ్లు ఆందోళన చేయాల్సి వచ్చింది. 39వ వార్డులో ఓటు వేసేందుకు వెళ్లిన టీడీపీ మేయర్ అభ్యర్థి పంకం రజనీ శేషసాయికి ఓటు లేదని చెప్పడంతో ఆందోళనకు దిగారు. ఓటరు స్లిప్‌లు లేకపోవడంతో ఓటర్లు చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారని ఆమె అన్నారు. కార్పొరేషన్ సిబ్బంది స్లిప్‌లు పంపిణి చేస్తామన్నా, సగం మందికి మాత్రమే వచ్చాయని, మిగిలిన సగం మందికి స్లిప్‌ లు రాలేదని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓటర్లు 960 మంది ఆగిపోయినట్లు ఆమె తెలిపారు. ఇక్కడ ఎవరూ సహకరించడం లేదని రజనీ శేషసాయి పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తప్పును సరిచేయడంతో ఆమె మాత్రం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.   మరోవైపు, వైఎస్ఆర్ సీపీ మేయర్ అభ్యర్థిని షర్మిలారెడ్డి భర్త అనిల్ రెడ్డి ఓటు వేసేందుకు వెళ్లగా ఈలోపే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లు జరుగుతాయని తమకు అనుమానం ఉండటంతో ఆయనను ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఎంత సేపటికీ అనిల్ రెడ్డిని వదలకపోవడంతో షర్మిలారెడ్డి, ఇతర నాయకులు వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. రోడ్డుమీదే కూర్చుని చాలాసేపు ధర్నా చేశారు. అనిల్ ఉంటే ఓటింగ్ బాగా జరుగుతుందన్న దుగ్ధతో టీడీపీ నాయకుడు బుచ్చయ్య చౌదరి ఇలా చేయించారని షర్మిలారెడ్డి ఆరోపించారు.   మొత్తమ్మీద ప్రధాన పార్టీల అభ్యర్థినులు ఇద్దరూ అధికారుల వైఖరి మీద ముందుగానే మండిపడుతూ ఆందోళనలు చేశారు. వీళ్లిద్దరిలో ఎవరు మేయర్ అయినా, తర్వాతి కాలంలో రాజకీయాలు, పాలన ఎలా ఉంటాయోనని ప్రజలు చెవులు కొరుక్కోవడం కనిపించింది.

ఒక కుటుంబం.. 47 ఓట్లు!

  అసలే ఎన్నికల వేళ.. ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయని తెలిస్తే చాలు.. అభ్యర్థులంతా వారింటికి వెళ్లి, ఆ ఓట్లు సంపాదించడానికి నానా పాట్లూ పడతారు. అలాంటిది ఒకే ఇంట్లో ఏకంగా 47 ఓట్లుంటే.. నేతల ప్రయత్నాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు. బీహార్ లోని కిషన్‌గంజ్ నియోజకవర్గంలో 85 మందితో ఉన్న ఓ ఉమ్మడి కుటుంబానికి ఇదే కారణంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. పుర్నియా జిల్లాలోని జియాగచ్చి గ్రామంలో ఓ ఉమ్మడి కుటుంబం నివసిస్తోంది. 55 మంది పురుషులు, 30 మంది మహిళలు, 35 మంది చిన్నపిల్లలు ఉన్న ఆ అవిభాజ్య కుటుంబంలో 47 మందికి ఓటు హక్కు ఉంది. అంతే.. ఈ విషయం తెలుసుకున్న వివిధ పార్టీల అభ్యర్థులు వారి ఇంటికి క్యూలు కడుతున్నారు. ఆ 47 ఓట్లూ తమ ఖాతాలో వేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ‘‘ఈ లోక్‌సభ ఎన్నికల్లో మా కుటుంబం నుంచి 47 మంది ఓటు వేయనున్న నేపథ్యంలో మాకు విపరీతమైన డిమాండ్ పెరిగింది’’ అని ఆ కుటుంబ పెద్ద మహ్మద్ న జీర్ తెలిపారు.

మునిసి‘పోల్స్’లో హస్తవాసి?

  తెలంగాణాలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కొంతవరకు సానుకూల వాతావరణం కనిపించినట్లు సమాచారం. టీఆర్‌ఎస్ రెండో స్థానంలో ఉంటుందని, చాలాచోట్ల ఈ రెండు పార్టీలకు గట్టి పోటీ నడిచిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల ఎంఐఎం కూడా కొంత ప్రభావం చూపించినట్లు తెలుస్తోంది. ఈ మూడు జిల్లాలతోపాటు ఖమ్మంలోనూ కాంగ్రెస్ పట్ల కొంచెం మొగ్గు ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తున్నా... వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బాగా పోటీపడినట్లు కనిపిస్తోంది. ఒకటీరెండు చోట్ల బీజేపీ హవా కొంత కనిపించింది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో కొన్నిచోట్ల కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ కనిపించింది. మునిసిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల పట్టణాల్లో సానుకూల వాతావరణం కనిపించిందని ఆ పార్టీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని పట్టణాల్లో జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో కూడా రెబల్స్ బెడద లేకుండా చూడడంలో సఫలీకృతులయ్యారు.

టీ-జేఏసీ నేతలకు కాంగ్రెస్, తెదేపా వల

  తెరాస అధ్యక్షుడు కేసీఆర్  ఎన్నికలలో ఎలాగయినా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలనే తాపత్రయంలో ఇంతకాలం తనతో కలిసి తెలంగాణా ఉద్యమాలు చేసిన విద్యార్ధులను, జేఏసీ నేతలను పక్కనబెట్టి, గెలుపు గుర్రాల కోసం చూస్తుండటంతో వారందరూ ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొన్న జరిగిన టీ-జేఏసీ సమావేశంలో తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తమను కాదని కొండా సురేఖ వంటి తెలంగాణా ద్రోహులను పార్టీలో జేర్చుకొని టికెట్స్ కేటాయించడాన్ని వారు తీవ్రంగా తప్పు పట్టారు. ఇక తెలంగాణా ఉద్యమాలలో అందరికంటే ముందుండి పోలీసుల చేతిలో లాటీ దెబ్బలు తిని, నేటికీ కేసులు ఎదుర్కొంటున్న ఉస్మానియా జేఏసీ విద్యార్ధులను కూడా కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో వారు కూడా తమ తరపున కొందరు విద్యార్ధులను ఎన్నికలలో అభ్యర్ధులుగా నిలబెట్టబోతున్నట్లు ప్రకటించారు.   అయితే దీనినొక అవకాశంగా భావించిన టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఉడుకు రక్తం గల విద్యార్ధుల కంటే జేఏసీ నేతలనే మంచి చేసుకొన్నట్లయితే లక్షలాది ఉద్యోగుల, వారి కుటుంబాల ఓట్లు రాల్చుకోవచ్చనే ఆలోచనతో, జేఏసీ నేతలు కాంగ్రెస్ లో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని వారు గనుక పార్టీలోకి వచ్చినట్లయితే తగిన విధంగా గౌరవించి ఆదరిస్తామని చెపుతూ వారిని పార్టీలోకి ఆకర్షించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదేవిధంగా తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న వివిధ జేఏసీలలో యువకులను పార్టీలోకి ఆకర్షించి వారికి టికెట్స్ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేసారు.   ఈవిధంగా కాంగ్రెస్, తెదేపాలు జేఏసీ నేతలను తమవైపు త్రిప్పుకొనే ప్రయత్నాలు చేయడం చూసి తెరాస కూడా అప్రమత్తమయింది. టీ-యన్జీవో ఉద్యోగుల నాయకుడు శ్రీనివాసులు రెడ్డికి ఇప్పటికే టికెట్ ఖరారు చేయగా త్వరలోనే మరికొందరికి కూడా పార్టీకి బలం లేని నియోజక వర్గాలలో వారికి టికెట్స్ కేటాయించి వారి నోటనే తాము పోటీ చేయబోమని చెప్పించి నెపం తన మీద పడకుండా తెలివిగా తప్పుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీని వల్ల తెరాస నెపం తన మీద పడకుండా తప్పుకోవచ్చేమో కానీ పార్టీ పట్ల వారికేర్పడిన వ్యతిరేఖతను మాత్రం తగ్గించలేదు.

దటీజ్ రాహుల్ గాంధీ..దటీజ్ కాంగ్రెస్ పార్టీ

  కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోయినా ప్రతీసారి కాంగ్రెస్ పెద్దలు ఆత్మవిమర్శ చేసుకొంటామని నాలుగు పడికట్టు పదాలు పలుకుతుంటారు, కానీ వారు కేవలం ఆత్మా వంచన మాత్రమె చేసుకోగలరని వారు పదే పదే నిరూపిస్తుంటారు. ఎన్నిసార్లు ఓడిపోయినా తమ అలవాట్లను, ఆలోచనలను, పద్దతులను కనీసం మాట తీరుని కూడా మార్చుకోకపోవడమే కాంగ్రెస్ లక్షణంగా భావించవచ్చును.   కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని విమర్శిస్తూ అతను తన స్వలాభం కోసం అన్నదమ్ములులాగ మెలుగుతున్న ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి కూడా వెనుకాడరని ఆరోపించారు. అయితే ఎదుటవాడివైపు ఒక వ్రేలు చూపితే, మిగిలిన నాలుగు వేళ్ళు మనవైపే చూపుతాయనే అనే సంగతి బహుశః ఆయనకి మరి తెలుసో తెలియదో కానీ, తనను ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి, తన తల్లి సోనియాగాంధీ రాష్ట్ర విభజన చేసి తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టిందని అందరికీ తెలుసు. పాము తన పిల్లలను తానే తింటుదన్నట్లు, సీమాంద్రాలో తమ స్వంత పార్టీని, అక్కడి కాంగ్రెస్ నేతల భవిష్యత్తుని సర్వనాశనం చేయడంతో వారు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్లు చెల్లాచెదురయిపోవడం యువరాజవారి దృష్టికి రాలేదో వచ్చినా అది పెద్ద తప్పుగా కనబడలేదో ఆయనకే తెలియాలి.   గురువింద గింజ సామెతలాగా రాహుల్ గాంధీ తన కోసం తన తల్లి చేసిన నిర్వాకం గురించి ప్రస్తావించకపోయినా తన ప్రతీ సభలో మోడీని విమర్శించడం మానడు. మోడీ తన స్వలాభం కోసం ప్రజల జీవితాలతో చెలగాటమాడుకొంటే, రాహుల్ గాంధీ స్వలాభం కోసం సోనియా గాంధీ, తెలుగు ప్రజలందరి జీవితాలతో, తన స్వంత పార్టీ నేతల జీవితాలతో కూడా చెలగాటమాడారు. పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లుని ఆమోదింప జేసేందుకు నిస్సిగ్గుగా చేతులు కలిపిన ఈ రెండు జాతీయ పార్టీల ఎన్నికల రాజకీయాలు ఎలా ఉన్నపటికీ, వాటికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీమాంద్రాకు చేసిన ద్రోహానికి తగిన గుణపాటం చెప్పేందుకు ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ మేకపోతు గాంభీర్యం నటించడంలో కాంగ్రెస్ కు మించిన వారు ఉండరు గనుక చిరంజీవి వంటి వారు ఇంకా తమ బస్సు యాత్రకు ప్రజల నుండి అపూర్వ స్పందన వచ్చిందని చెప్పుకోగలుగుతున్నారు.

ఈవీఎంలతో దగా చేస్తారా?

  ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. అటు రాష్ట్రంలో, ఇటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మట్టి కరుచుకుని పోయే అవకాశాలు నూటికి నూరుశాతం కనిపిస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్ పార్టీని ఇంటికి, కాంగ్రెస్ అధినేతి సోనియా గాంధీని పుట్టింటికి పంపడానికి పూర్తిగా ప్రిపేర్ అయి వున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లోనూ టీడీపీ అనే అంచనాలకు రాజకీయ పరిశీలకులు వచ్చేశారు. ఈ నేపథ్యంలో అధికారం నిలుపుకోవడానికి ఎలాంటి అడ్డదారులైనా తొక్కడానికి సిద్ధమయ్యే కాంగ్రెస్ పార్టీ అనేక కుట్రలు, కుతంత్రాలకు శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయనే అనుమానాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.   కాంగ్రెస్ కుట్ర చేసి, ఓటర్లను దగా చేయడానికి అవకాశం వున్న ప్రధాన అంశం ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏ పార్టీకి ఓటు వేసినా ఆ ఓటు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడే విధంగా ఈవీఎంలను కాంగ్రెస్ పార్టీ ‘తీర్చిదిద్దే’ ప్రమాదం వుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం ఓట్లు వేసే ఈవీఎంలు శత్రు దుర్భేద్యమైన కోటలేం కాదు. కాస్తంత ఎలక్ట్రానిక్ పరిజ్ఞానం వున్న ఎవరైనా వాటితో ఫుల్లుగా ఆడుకోవచ్చు. తమకు ఇష్టమొచ్చిన విధంగా వాటిని వాడుకోవచ్చు. ఈవీఎంలను ఏరకంగానైనా పనిచేయించవచ్చన్న అభిప్రాయాలను అనేకమంది సాంకేతిక నిపుణులు వ్యక్తం చేశారు. ఈవీఎంలను నమ్మడానికి ఎంతమాత్రం వీలు లేదని వారు స్పష్టంగా చెప్పారు.   ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలను తనకు అనుకూలంగా మార్చే కుట్రకు తెరతీసే అవకాశం వుందన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏం పర్లేదు ఎన్నికల సంఘం వుంది కదా అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎన్నికల సంఘం మంచిదే. కానీ అందులో పనిచేసేవారిని నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలా ఆడిస్తే అలా ఆడే ఈవీఎంలను అస్సలు నమ్మాల్సిన అవసరం లేదు. అందువల్ల ఈవీఎంల నిర్వహణ మరింత పారదర్శకంగా, మరింత బాధ్యతాయుతంగా, మోసాలు జరగడానికి వీలు లేకుండా వుండే విధంగా ఏ చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలను ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన అవసరం వుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

దేవీప్రసాద్ అలక!

  తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసి, గొంతు నొప్పి పుట్టేలా అరిచిన పలువురు ఈసారి ఎన్నికలలో పోటీచేసి తమ అదృష్టాన్ని పరిశీలించుకోవాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి వారందరి ఫస్ట్ ఛాయిస్ టీఆర్ఎస్ పార్టీనే. ఆ పార్టీ ఇలాంటి వారిని అంతగాపట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలిసిపోతోంది. దాంతో చాలామంది ఉద్యమకారులు నిరాశకు గురవుతున్నారు. అలుగుతున్నారు. అలాంటి వారిలో ఉద్యోగ సంఘాల నాయకుడు దేవీప్రసాద్ కూడా చేరారు. తెలంగాణ ఉద్యోగులలో విభజన కుంపటి రాజేయడానికి ఉద్యోగ సంఘాల నాయకులైన శ్రీనివాస్‌రెడ్డి, దేవీప్రసాద్ శాయశక్తులా కృషి చేశారు. ఉద్యోగులలో భావోద్వేగాలు పెరగడానికి వీరిద్దరూ శక్తివంచన లేకుండా పాటుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వీరిద్దరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంది. వీరిద్దరూ కూడా టీఆర్ఎస్ దత్త పుత్రుల మాదిరిగా తమవంతు సేవలు అందించారు.   అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించిన తర్వాత మాత్రం టీఆర్ఎస్ పార్టీ శ్రీనివాసరెడ్డిని అక్కున చేర్చుకుని మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ అసెంబ్లీ టిక్కెట్‌ కూడా ఇచ్చేసింది. అప్పటి వరకూ అక్కడ పార్టీకి సేవ చేసిన ఇబ్రహీం అనే కార్యకర్తకి జెల్ల కొట్టి మరీ శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చింది. అయితే ఎన్నికలలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని, టీఆర్ఎస్ నుంచే తనకు ఆహ్వానం రావాలని కోరుకున్న దేవీప్రసాద్‌కి మాత్రం నిరాశే మిగిలింది. తన తోటి ఉద్యమకారుడు శ్రీనివాస్‌రెడ్డికి టిక్కెట్ ఇచ్చి తనను ఎంతమాత్రం పట్టించుకోకపోవడంతో దేవీప్రసాద్ టీఆర్ఎస్ మీద అలిగినట్టు కనిపిస్తోంది. టీఆర్ఎస్‌కి దత్తపుత్రుడిలా వ్యవహరించిన దేవీప్రసాద్‌ని ఇటు టీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు. మిగతా పార్టీలు కూడా దేవీ ప్రసాద్‌లో టీఆర్ఎస్ మనిషి కదా అని ఊరుకున్నాయి. దాంతో ఆయన పరిస్థితి ఇంటి కూటికి, బంతి కూటికి కూడా చెడినట్టు అయింది. దీనికి తగ్గ ప్రతీకారం తీర్చుకోవాలన్నట్టుగా దేవీ ప్రసాద్ ఈ ఎన్నికలలో ఉద్యోగ సంఘాలు ఏ పార్టీని సమర్థించవని ప్రకటించారు. ప్రస్తుతం దేవీప్రసాద్ అలక తీర్చే బాధ్యత కేసీఆర్ మీదే వుంది.

కేజ్రీ చీప్ ట్రిక్స్!

  చీప్ ట్రిక్స్ ప్రదర్శించడంలో రాజకీయ నాయకులు ఏనాడో ముదిరిపోయారు. లేటెస్ట్ గా రాజకీయాల్లో ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముదురు రాజకీయ నాయకుల కంటే మరింత ముదిరిపోయాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కడానికి ముందు.. ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిన తర్వాత కేజ్రీవాల్ ప్రదర్శించిన చీప్ ట్రిక్స్ తో ఒక పెద్ద గ్రంథం రాయొచ్చు. నిన్నగాక మొన్న కేజ్రీవాల్ ముఖం మీద ఎవరో వ్యక్తి ఇంకు చల్లాడు. ముఖం నిండా ఇంకు పెట్టుకునే కేజ్రీవాల్ ఓ మీటింగ్‌లో పాల్గొని భారీ స్థాయిలో ప్రసంగించాడు. ఇలాంటి సంఘటనలు తనను ఆపలేవని భారీ డైలాగ్స్ కొట్టాడు. మామూలుగా అయితే జనానికి క్రేజీవాల్ మీద బోలెడంత సానుభూతి పుట్టి వుండేది. అయితే కేజ్రీగారి క్రేజీ పనుల గురించి జనానికి ఇప్పటికే బాగా తెలిసిపోవడంతో ఈ సంఘటనని లైట్‌గా తీసుకున్నారు.   ఆ ఇంకు ఎవరో బయటివాళ్ళు చల్లారో, జనంలో సానుభూతి కొట్టేయడానికి కేజ్రీవాలే చల్లించుకున్నాడో ఆ కేజ్రీవాల్‌కే తెలియాలి. ఇంకు ట్రిక్ పనిచేయాలేదని అనుకున్నాడో ఏంటో గానీ లేటెస్ట్ గా కేజ్రీవాల్ మరో ట్రిక్ ప్రదర్శించాడు. పాపం కేజ్రీవాల్ ఏదో మీటింగ్‌కి ఎవరో వ్యక్తి వెనుక నుంచి ఆయన మెడమీద కొట్టాడట. అక్కడే వున్న కార్యకర్తలు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారట.   ఈ పాయింట్‌ని కేజ్రీవాల్ అర్జెంటుగా ట్విట్టర్లో పెట్టేసి సానుభూతి పొందడానికి తెగ ప్రయత్నించేశాడు. దాంతోపాటు తన మెడమీద కొట్టిన వ్యక్తి మీద తనకెలాంటి కోపం లేదని అభినవ గాంధీ గారిలా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. అయ్యా కేజ్రీవాల్ నువ్వెన్ని చీప్ ట్రిక్స్ ప్రదర్శించినా జనం నిన్ను నమ్మరు.

బీజేపీ లాగుడు ఎక్కువైంది!

  తెలుగులో ఓ సామెత వుంది.. తెగేదాకా లాగొద్దని. మరి ఇటువంటి సామెత మరి హిందీలో ఉందో లేదేమో అనిపిస్తుంది బీజేపీ వ్యవహారం చూస్తుంటే. ఒకవేళ వుంటే, బీజేపీ అగ్ర నాయకత్వం ఈ సామెతని చదివి వుంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయాన్ని తెగేదాకా లాగే ప్రయత్నం మానుకుని వుండేది. తెలుగు తెలిసిన వెంకయ్య నాయుడో, కిషన్‌రెడ్డో ఈ సామెత గురించి బీజేపీ కేంద్ర నాయకత్వానికి చెప్తే బాగుండేది. అసలు రాష్ట్రంలో బీజేపీకి ఏమైనా సీన్ వుందా? రాష్ట్రం ముక్కలు కావడానికి సపోర్ట్ ఇచ్చిన బీజేపీకి సీమాంధ్రలో అసలు సీన్ వుంటుందా? ఏదో దేశమంతటా మోడీ గాలి వీస్తోంది కాబట్టి, కాంగ్రెస్ పాలనను అంతం చేయాల్సిన చారిత్రక అవసరం వుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీకి స్నేహహస్తాన్ని చాచింది. అయితే ముద్దు చేసినప్పుడే చంకనెక్కాలని తెలియని బీజేపీ ఓవర్‌యాక్షన్‌తో ఇష్యూని తెగ లాగుతోంది. బీజేపీ ఇలా తెగేదాకా లాగితే అటు సీమాంధ్రతోపాటు ఇటు తెలంగాణలో కూడా బీజేపీ చెవిలో కమలం పెట్టుకోవాల్సి వస్తుంది.   తెలుగుదేశం బీజేపీని న్యాయంగానే సీట్లు ఆఫర్ ఇచ్చినా, తన బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకుంటున్న బీజేపీ అగ్ర నాయకత్వం కూరగాయలు బేరమాడినట్టు వ్యవహరిస్తోంది. మెట్టు దిగకుండా బెట్టు చేస్తోంది. అగ్ర నాయకత్వం జిడ్డు ధోరణి వల్ల అటు సీమాంధ్రలో, ఇటు తెలంగాణలో బీజేపీ నాయకులు దిగులు పెట్టేసుకుంటున్నారు. వాస్తవ పరిస్థితి ఏంటంటే, టీడీపీతో పొత్తు పెట్టుకోకపోతే బీజేపీ రెండు మూడు ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సిందే. ఆ విషయం తెలిసి కూడా అగ్ర నాయకత్వం చేస్తున్న నకరాలని ఎలా అర్థం చేసుకోవాలో అర్థంకాక వారందరూ డిప్రెషన్‌లో పడిపోతున్నారు. పార్టీ నాయకత్వానికి త్వరగా జ్ఞానోదయం కలిగాలని, తెలుగుదేశానికి, బీజేపీకి త్వరగా పొత్తు కుదరాలని తమ పార్టీ దైవమైన రాముడికి దణ్ణాలు పెట్టుకున్నారు. ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో ఇచ్చిపుచ్చకునే ధోరణితో వ్యవహరించకపోతే ఈసారి ఎన్నికలలో ఆ పార్టీ తూర్పు తిరిగి దణ్ణం పెట్టాల్సివస్తుందని రాజకీయ పరిశీకులు అంటున్నారు.

అక్కడ అబ్రహాం.. ఇక్కడ ఇబ్రహీం

  పాలమూరు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ప్రతి పార్టీలోనూ అసంతృప్తులు పెరిగిపోతున్నారు. పార్టీ హ్యాండిస్తే.. ఒక్క నిమిషం కూడా ఆలోచించడంలేదు ఆశావహులు. పార్టీ గోడ దూకేందుకు సిద్ధంగా ఉంటున్నారు. సీట్ల పంచాయితీ కారణంగా మహబూబ్ నగర్ జిల్లాలో జంపింగ్ జపాంగ్ ల హడావిడి జోరుగా ఉంది.   ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీ ఫారాల విషయంలో తనను పట్టించుకోలేదని ఆలంపూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయినా పార్టీ అధినేతలు పట్టించుకోకపోవడంతో టీడీపీలో చేరారు. బాబు ప్రజాగర్జన సభలో పచ్చ కండువా కప్పుకున్నారు ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం.   మరో వైపు మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు తెరాస అభ్యర్ధి పోటీ చేసి ఓడిపోయిన సయ్యద్ ఇబ్రహీం టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా.. టీజీవో నేత శ్రీనివాస్ గౌడ్ తెరాసలో చేరడంతో ఇబ్రహీంకు గులాబీ బాస్ హ్యాండిచ్చారు. దీంతో ఇబ్రహీం అనుచరులు ఆందోళనకు దిగారు. అయినా తెరాస నేతలు స్పందించలేదు. తీవ్ర మనస్తాపం చెందిన ఇబ్రహీం చలో గాంధీభవన్ యాత్ర చేపట్టారు. ఇబ్రహీం కాంగ్రెస్ లో గూటికి చేరారు. మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ అబ్రహాం.. ఇక్కడ ఇబ్రహీం తప్పనిసరి పరిస్థితుల్లో గోడ రోజుల వ్యవధిలో అనూహ్యంగా పార్టీలు మారిపోయారు.

లెజెండ్ కు "బోరు" కొట్టింది

  బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటించిన లెజెండ్ సినిమా పేరుకు తగ్గట్టే మంచి విజయాన్ని సాధించిందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సింహా తరువాత ఆ స్థాయి విజయాన్ని సాధించిన నటసింహం కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు క్రిటిక్స్. లెజెండ్ విక్టరీని ఎంజాయ్ చేస్తున్న బాలయ్యకు షేక్ పెట్ ఎమ్మార్వో చిన్న షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా బోర్ వేసినందుకు బాలకృష్ణకు రెవెన్యూ అధికారులు శనివారం రూ.10 వేల జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని బాలకృష్ణ ఇటీవల బోర్ వేయించారు. అనుమతి లేకుండా హీరో బాలకృష్ణ బోర్ వేయించినట్లు స్థానికులు కొంతమంది ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. అనుమతి లేకుండా బోర్ వేయించినట్లు తేలడంతో బాలకృష్ణకు అధికారులు రూ. 10 వేల జరిమానా విధించారు.