మోడీకి నాగ్ మద్దతు..అమలకు వద్దు

      ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున నరేంద్రమోదీతో అహ్మదాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఆయనతో 40 నిముషాలపాటు చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఎలాంటి రాజకీయ ఎజెండా లేదని, తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన అన్నారు. తన భార్య అమల ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నానని వస్తున్న వార్తలను నాగార్జున ఖండించారు. తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్ అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.   అభివృద్ధిలో గుజరాత్ దూసుకు వెళ్తుందని, పలు అభివృద్ధి ప్రాజెక్టులు స్వయంగా చూశానని నాగార్జున పేర్కొన్నారు. గుజరాత్‌లో 24 గంటలూ విద్యుత్ ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఎన్నో గ్రామాలకు ఇంటర్నెట్, వైపై అనుసంధానం ఉందని, మోదీ పాలన చాలా బాగుందని ఆయన కొనియాడారు. మోదీ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తున్నట్లు నాగార్జున పేర్కొన్నారు.

సినీ నటులకు రాజాకీయాలేలననగా...

  సినీ నటులు రాజకీయాలలోకి ప్రవేశించడం కొత్తేమీ కాకపోయినా ఈసారి ఎన్నికలలో చాలా మంది నటులు ఏదో ఒక రాజకీయ పార్టీ పంచన చేరుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఏదో ఒక రాజకీయ పార్టీతో అంట కాగుతుంటే మిగిలిన వారు కూడా హడావుడిగా ఏదో ఒక పార్టీ జెండా దొరకబుచ్చుకొనేందుకు పరుగులు తీస్తున్నారు. బాబు మోహన్ తెదేపాకు గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోగా, మరో హాస్యనటుడు ఆలీ త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరి, రాజమండ్రీ నుండి పోటీ చేస్తానంటున్నారు. ఇక, పవన్ కళ్యాణ్ అయితే స్వయంగా ఓ రాజకీయ పార్టీ పెట్టుకొని నరేంద్రమోడీని కలిసి ఆయనకి తన మద్దతు తెలిపివచ్చారు. ఆ వెంటనే నాగార్జున, బ్రహ్మానందం కూడా నమో నమో అంటూ బీజేపీ చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టేసారు. మోహన్ బాబు కూడా బీజేపీలో చేరవచ్చని తాజా సమాచారం. బహుశః త్వరలోనే మిగిలిన వారు కూడా ఏదో ఒక జెండా పట్టుకొని ప్రజల ముందుకు వస్తారేమో. గతంలో రాజకీయ పార్టీలు నటీ నటుల చుట్టూ తిరుగుతూ తమ పార్టీలో చేరమని లేదా కనీసం పార్టీకి ప్రచారం చేయమని కోరుతుండేవి. కానీ, అప్పుడు ఎవరూ అంత ఆసక్తి చూపేవారు కాదు. కానీ, ఇప్పుడు నటీనటులే స్వయంగా పార్టీలలో చేరుతాము, ప్రచారం చేస్తామంటూ రాజకీయనాయకుల, పార్టీల చుట్టూ తిరగడం గమనిస్తే దానివెనుక చాలా బలమయిన కారణం ఉందని అర్ధమవుతుంది.   సినీ నటులు రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నారంటే అందుకు చాలా కారణాలు ఉండవచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే రాష్ట్ర విభజనతో ఎదురయ్యే సమస్యల నుండి తమను తమ ఆస్తులను కాపాడుకోవడానికే సినీ నటులు రాజకీయ పార్టీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారని భావించవచ్చును. సినీ పరిశ్రమలో దాదాపు 75 శాతం ఆంధ్రావారి చేతిలోనే ఉంది. ఇప్పుడు విభజన తరువాత తెలుగు సినీ పరిశ్రమ అంతా తెలంగాణలోకి వెళ్లిపోయింది. తెలంగాణాలో కేసీఆర్ తమ కుటుంబమే రాజ్యం ఏలుతుందని స్వయంగా చెపుతున్నారు. గత పదేళ్ళ కాలంలో సినీ పరిశ్రమతో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏవిధంగా ఆడుకోన్నారో అందరికీ తెలుసు. అటువంటిది ఇప్పుడు శాశ్వితంగా ఆయన కనుసన్నలలోనే సినీ పరిశ్రమ నడుచుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడితే వారు ఆందోళన చెందడం సహజమే.   సినీ పరిశ్రమ అంటేనే అంతా కోట్లతో వ్యవహారం. చాలా మంది నటీనటులు కోట్లలో ఆదాయం సంపాదిస్తూ, హైదరాబాదులో స్థలాలు, స్టూడియోలు, హోటల్స్ ఇతరత్రా వ్యాపారాలు, లావాదేవీలు కలిగి ఉన్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణాలో తెరాస ప్రభుత్వం ఏర్పడి, దానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా, అయన కుటుంబ సభ్యులందరూ మంత్రులుగా బాధ్యతలు చేపడితే వారి దృష్టి మొట్టమొదటగా తమ మీదనే పడుతుందని సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆందోళన చెందడం సహజమే. ఈ సమస్య నుండి బయటపడాలంటే వారి ముందు రెండే రెండు మార్గాలున్నాయి. 1. హైదరాబాదులో ఉన్న తమ ఆస్తులన్నిటినీ అమ్ముకొని మళ్ళీ ఏ వైజాగ్ కో తరలిపోవడం. 2. రాజకీయ పార్టీల రక్షణ కవచం ఏర్పాటు చేసుకోవడం. ఇందులో మొదటిది దాదాపు అసాధ్యం కనుక బహుశః అందరూ రెండో ఆప్షన్ ఎంచుకొంటున్నారని భావించవచ్చును. లేకుంటే వారికి ఆ తరువాత కేసీఆర్ మరే ఆప్షన్స్ ఇవ్వకపోవచ్చును.

ఆయనకి ఎన్నికల కమిషన్ షాక్

      “ఇంకా ఎన్ని రోజులురా మీ ఆగడాలు…ఈ అరాచకాలు…ఆయనొస్తున్నాడు…” అంటే... ఎవరాయన? రాజకీయ నాయకుడు ప్రశ్నిస్తే ఆయన ఎవరో కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి పుత్రరత్నం జగన్ అనే విషయం రివీల్ అవుతుంది. వెంటనే ఫ్యాన్ గుర్తు కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ బొంగురు గొంతు ‘ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి.. దుమ్ము దులిపేయండి’ అని సందేశం ఇస్తూ గత కొన్ని రోజులుగా టీవీలో ప్రకటనలు హడావిడి సృష్టించాయి. అయితే సడన్ గా ఛానెళ్ళలోంచి ఈ ప్రకటన మాయమై౦ది. అయితే ఈ ప్రకటనపై ఎన్నికల కమిషన్ అభ్యంతర౦ పెట్టింది. తమ అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయకూడదని స్పష్టం చేసిందట. దాంతో వైఎస్సార్సీపీ ఎన్నికల కమిషన్‌కి ఈ ప్రకటనల ప్రసారం చేయడానికి అనుమతి కోరుతూ లేఖ రాసింది. అయితే ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనల ప్రసారానికి అంగీకరింబోనని తెలిపిందట.

దళిత ముఖ్యమంత్రికి పరిస్థితులు సూట్ అవ్వవట

  ఇప్పుడప్పుడే తెలంగాణా రాదనే భావనతోనే తెదేపా, వైకాపాలు రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ లేఖలు ఇచ్చాయి. తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా అదేవిధంగా భావించి, తెలంగాణా ఇస్తే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని, తెలంగాణా రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇస్తూ వచ్చారు. కానీ ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా తెలంగాణా ఏర్పడిపోయింది. ఈ వ్యవహారంలో తెదేపా, వైకాపాలు ఎలాగో చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డా, కేసీఆర్ మాత్రం ఇంకా బయటపడలేక పోతున్నారు. అప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీతో ఏవో గిల్లి కజ్జాలు పెట్టుకొని, కుంటి సాకులు చెప్పి ఎలాగో కాంగ్రెస్ పార్టీతో విలీనం, పొత్తుల మాటను గట్టున పెట్టేయగలిగారు. కానీ, కనబడని ఆ దళిత ముఖ్యమంత్రి మాత్రం ఆయనను నీడలా వెన్నాడుతూ వేధించుకుతింటూనే ఉన్నాడు. అందుకే అతనిని కూడా వదిలించుకోవడానికి మాటల మాంత్రికుడు కేసీఆర్ సరి కొత్త మంత్రాలు పటించడం మొదలుపెట్టారిప్పుడు.   ఆనాడు దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదన చేసినప్పటి పరిస్థితులు ఇప్పుడు ఎంతమాత్రం లేవని, అవకాశం దొరికితే తెలంగాణాను నమిలి మింగేద్దామని ‘ఆంధ్రా బూచాళ్ళు’ కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ఇంకా చాలా మంది పొంచి ఉన్నారని, అందువలన తెలంగాణాను సాధించిన తనకే వారందరి నుండి దానిని కాపాడుకొనే భాద్యత కూడా దఖలు చేసుకోవలసి వస్తోందని తెలిపారు. కనుక ప్రస్తుత పరిస్థితుల్లో దళిత ముఖ్యమంత్రి ప్రతిపాదనను కూడా పక్కన పెట్టక తప్పడం లేదని అన్నారు. అంతే గాక రాగల రెండుమూడేళ్ళు కూడా తెలంగాణకు చాలా క్లిష్టమయినవని అందువలన తన కుటుంబ సభ్యులు అందరూ కూడా బాధ్యతలు తీసుకొని తెలంగాణాను కాపాడుకొంటారని కేసీఆర్ తన మనసులో మాటని కక్కేశారు. ఎన్నికలకు వెళ్ళే లోపుగానే తెరాస తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరు కూడా ప్రకటిస్తానని ఆయన మరో కొత్త హామీ ఇచ్చారు.   ఇప్పటికే తెరాస కార్యకర్తలు, నేతలందరూ కూడా కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు. వారు మరింత గట్టిగా అడిగినట్లయితే వారి మాటను కాదనలేని సహృదయుడు కేసీఆర్. ఆ విధిలేని పరిస్థితిలో మళ్ళీ ‘ఆ బక్కోడే’ ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా స్వీకరించేందుకు అంగీకరించ్చన్న మాట!   అందువల్ల చంద్రబాబు బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినా, బీజేపీ దళితుడిని చేస్తానన్నా, జగన్మోహన్ రెడ్డి మైనార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించినా ఇక కేసీఆర్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన ఈసారి కొంచెం జాగ్రత్త పడుతూ తన కుటుంబ సభ్యులందరూ కూడా ‘బంగారి తెలంగాణా’ పునర్నిర్మాణంలో బాధ్యతలు (?) స్వీకరిస్తారని ముందే ప్రకటించేశారు. గనుక వారందరికీ కూడా లైన్ క్లియర్ అయిపోయినట్లే! రేపు వారందరూ తలో మంత్రి పదవీ పుచ్చుకొంటున్నపుడు వారెవరికీ ఎటువంటి సంజాయిషీలు ఇవ్వనవసరం లేదు కూడా. ఎందుకంటే వారందరూ పదవులు, అధికారంపై ఆరాటంతో కాక కేవలం ‘బంగారి తెలంగాణా’ను నిర్మించుకొనేందుకు మాత్రమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. కల్వకుంట్ల వారు ఎంత త్యాగాశీలులో...

నారాయణ అతితెలివి

      సీపీఐ నాయకుడు నారాయణ తనకు సంబంధం లేని పనులని భుజాన వేసుకుని లాభం పొందే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ పనేంటయ్యా అంటే, ప్రస్తుతం రాష్ట్రంలో తిట్టిన తిట్టు తిట్టుకోకుండా తెగ తిట్టుకుంటున్న కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య సయోధ్య కుదర్చడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నానని నారాయణ ప్రకటించాడు. వాళ్ళకి లేని బాధ నీకెందుకయ్యా, మధ్యలో నిన్ను రాయబారి చేయమని ఎవరైనా అడిగారా అనే ప్రశ్నకు చాలా తెలివిగా సమాధానం చెబుతున్నాడు.   ప్రజల సంక్షేమాన్ని కోరుకునే తాను కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీని కలిపే ప్రయత్నం చేస్తున్నానని అంటున్నాడు. ఈ రెండు పార్టీలు కలవటం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరిగే అవకాశం వుందని అంటున్నాడు. నారాయణ గారి బుర్రలో వున్నది తెలంగాణ ప్రజల మేలు కాదని, ఈ రెండు పార్టీలకు సయోధ్య కుదిర్చి రాజకీయంగా లాభం పొందే ఆలోచనలో ఆయన ఉన్నారన్నది ఎంత అమాయకులకైనా అర్థమైపోయే విషయం. అంచేత నారాయణ ఇలాంటి సూపర్ తెలివితేటల ప్రదర్శన మానుకుని నిజంగా జనానికి ఉపయోగపడే విషయాల గురించి ఆలోచిస్తే మంచిదని విమర్శకులు సలహా ఇస్తున్నారు.

పాపం చిరంజీవి

      ప్రస్తుతం సీమాంధ్రలో ఈ బస్సు యాత్ర చేస్తూ ప్రెస్ మీట్స్ లో చిరంజీవి మాట్లాడుతున్న విధానం చూస్తుంటే ఆయనకు వున్న రాజకీయ అపరిపక్వత స్పష్టంగా కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిని విమర్శిస్తూ చిరంజీవి మాట్లాడుతున్న మాటలు చిరంజీవి మీద చిరాకు పెంచి, కిరణ్ కుమార్ మీద అభిమానం పెంచేలా వుంటున్నాయి. రాజకీయాల్లో ఇంత దిగజారుడు తనం కూడా వుంటుందా అన్నట్టుగా చిరంజీవి ప్రసంగం సాగుతోందని విమర్శకులు అంటున్నారు. కాంగ్రెస్ గర్భంలో కలిసిపోయిన పిఆర్పీ పార్టీకి చెందిన ఓ కార్యకర్త అందరిముందు చిరంజీవిని ఛీకొడుతూ ‘పార్టీని అమ్ముకోవడానికి సిగ్గులేదా?’ అని అడిగేయడం, పిఆర్పీ ఐడెంటిటీ కార్డ్ ని ముక్కలు చేసేయడం బాబోయ్ దారుణం. ఇంత జరిగినా చిరంజీవి తుడిచేసుకుని బస్సు యాత్రలో పాల్గొనడం ఇంకా దారుణమని అంటున్నారు.

తివారీ.. ఓ మంచి డాడీ!

      రాజ్‌భవన్‌లో రాసలీలలు నడిపిన వృద్ధ జంబూకం ఎన్.డి.తివారీ గుర్తున్నాడుగా! మొన్నటి వరకూ పితృత్వం కేసులో ఇరుక్కుని కోర్టు చుట్టూ తిరిగిన తివారీ, రోహిత్ శేఖర్ అనే కుర్రోడు తన కొడుకే కాదని బల్లగుద్ది మరీ వాదించాడు. డి.ఎన్.ఎ. రిపోర్టులో సదరు పిలగాడు నీ కొడుకేనని తేలిందయ్యాబాబూ అని చెప్పినా తివారీ ఎంతమాత్రం పట్టించుకోకుండా తనకి, రోహిత్ శేఖర్‌కి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశాడు.   రోహిత్ శేఖర్ మాత్రం తక్కువవాడా.. ఎంతైనా తివారీ రక్తం పంచుకుని పుట్టినోడు కదా.. తాను కూడా పట్టు వదలకుండా ప్రయత్నాలు చేశాడు. చివరికి ఈమధ్యే తివారీ కడుపులో వున్న తండ్రి పేగు కదిలింది. రోహిత్ శేఖర్ తన కొడుకేనని బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఇంతకాలం కోర్టులో తాను చేసిన వాదనంతా తూచ్ అని మర్చిపోండని చెప్పేశాడు. ఇదంతా ఇలా వుంటే, ఇప్పుడు రోహిత్ శేఖర్‌ని రాజకీయంగా ఎదిగేలా చేయడానికి తివారీ తహతహలాడిపోతున్నాడు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ పార్లమెంట్ స్థానం నుంచి తానుగానీ, తన కొడుకు గానీ పోటీచేసే అవకాశం వుందని చెబుతున్నాడు. త్వరలో నైనిటాల్‌లో పర్యటించి అక్కడి నుంచి తాను పోటీచేయాలా? తన కొడుకు పోటీ చేయాలా? అని అక్కడి ఓటర్లనే అడిగి తెలుసుకుంటానని, ఓటర్లు చెప్పిన ప్రకారం నడుచుకుంటానని సెలవిస్తున్నాడు. అడుగు తీసి అడుగు వేయడానికి అరగంట టైమ్ తీసుకునే తివారి నైనిటాల్‌లో పర్యటించడం, ప్రజల అభిప్రాయం తెలుసుకోవడం ఇవన్నీ పులిహోర కబుర్లేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తన కొడుకుని రాజకీయంగా ప్రమోట్ చేయడానికే తివారీ ఫిక్సయ్యాడని చెబుతున్నారు. అయినా రేపోమాపో అన్నట్టున్న తివారీ పోటీ చేస్తే ఓట్లేయడానికి నైనిటాల్ ఓటర్లు అంత అమాయకులు కాదని అంటున్నారు. లేటుగా ఒప్పుకున్నా తివారీ ఒక మంచి డాడీ అని మెచ్చుకుంటున్నారు. కొడుకుమీద ఇంత ప్రేమ కారిపోతున్నవాడు ఏళ్ళకేళ్ళు వాడు నా కొడుకే కాదంటూ కోర్టు చుట్టూ ఎందుకు తిరిగాడోనని అనుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ కి మజ్లిస్ వార్నింగ్

  మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మళ్ళీ చాలా కాలం తరువాత వార్తలలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ మతతత్వ బీజేపీకి, నరేంద్ర మోడీకి మద్దతు తెలపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. నరేంద్ర మోడీ, బీజేపీల గురించి తెలిసి ఉన్నపటికీ పవన్ కళ్యాణ్ పనిగట్టుకొని గుజరాత్ వెళ్లి మోడీని కలవడం, బీజేపీకి మద్దతు తెలపడాన్ని అసదుద్దీన్ ఖండించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ మోడీకి, బీజేపీకే మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినట్లయితే, హైదరాబాదులో అతని సినిమాలను ఆడనీయమని హెచ్చరించారు. అదేవిధంగా మీడియా కూడా నరేంద్ర మోడీ జపం చేయడాన్ని ఆయన నిరసించారు. అటువంటి మతతత్వవాదికి మీడియా కూడా మద్దతు ఈయడం మానుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు.   అసదుద్దీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మజ్లీస్ పార్టీ కూడా పూర్తిగా మత ప్రాతిపాదికనే, ముస్లిం ఓటు బ్యాంకుని లక్ష్యంగా చేసుకొని ఏర్పడినదే. అటువంటప్పుడు ఆయన బీజేపీని మతతత్వ పార్టీ అని ఎద్దేవా చేయడం హాస్యాస్పదం. అదేవిధంగా కేవలం హైదరాబాద్ కే పరిమితమయి కనీసం ఉప ప్రాంతీయ పార్టీ అని కూడా చెప్పుకోలేని మజ్లిస్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న అసదుద్దీన్ జాతీయ పార్టీ అయిన బీజేపీని, ప్రాంతీయ పార్టీ అయిన జనసేనను విమర్శించడం దేనికంటే కేవలం తాను మాత్రమే బీజేపీని దానిని సమర్ధించే పార్టీలను దైర్యంగా డ్డీ కొట్టి, ముస్లిముల తరపున పోరాడగలనని చెప్పుకొని ముస్లిం ప్రజల ఓట్లు పొందడానికే. మతతత్వ బీజేపీని, దాని ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని బూచిగా ఎత్తిచూపుతూ ముస్లిం ప్రజలలో అభద్రతా భావం కలిగించడం ద్వారా వారి ఓట్లు రాల్చుకోవాలని అసదుద్దీన్ ఆలోచన. కానీ, రాజకీయంగా మంచి చైతన్యవంతులయిన ముస్లిం ప్రజలను ఇటువంటి మాటలతో బయపెట్టి ఓట్లు రాబట్టుకోవాలని అసదుద్దీన్ ప్రయత్నించడం చాలా హాస్యాస్పదం.   ప్రజల నుండి ఓట్లు రాబట్టుకొనేందుకు కేసీఆర్ తెలంగాణా సెంటిమెంట్, కిరణ్ సమైక్య సెంటిమెంటు, జగన్ తండ్రి సెంటిమెంటు వాడుకొంటునట్లే అసదుద్దీన్ ముస్లిం సెంటిమెంట్ వాడుకొనే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రయాపడుతున్నారు.

కమలనాథుల గుండెల్లో బాంబు పేల్చిన పవన్

  నిన్న కాక మొన్న వచ్చిన పవన్ కల్యాణ్.. కాకలు తీరిన రాజకీయ నాయకులకు దిమ్మతిరిగేలా చేస్తున్నాడు. ఇంకేముంది, జనసేన-బీజేపీ-టీడీపీ కలిసి పొత్తు పెట్టుకుంటాయని, దాంతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని నాయకులు ఊహల పల్లకిలో తేలిపోయారు. వాళ్ల ఆశలను ఆదిలోనే పవన్ తుస్సుమనిపించాడు. తన మద్దతు జాతీయ పార్టీకేనని, ఇంకా గట్టిగా మాట్లాడితే కేవలం మోడికి మాత్రమే పరిమితమని బాంబు పేల్చాడు. తనను దగ్గరుండి, చెయ్యి పట్టుకుని మరీ మోడీ దగ్గరకు తీసుకెళ్లిన బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజుకు ఈ మేరకు ఓ లేఖాస్త్రం సంధించారు.   ‘‘టీడీపీతో సహా ఏ ప్రాంతీయ పార్టీకీ మద్దతు ఇవ్వాలని నేను ఈరోజు వరకు నిర్ణయించుకోలేదు. లేనిపోని పుకార్లు వస్తున్న నేపథ్యంలో నేనీ విషయాన్ని స్పష్టం చేస్తున్నా. జనసేన, మోడీ మధ్య సత్సంబంధాలు పెంపొందాలని, అవి మరింత పటిష్టం కావాలని మాత్రమే ఆకాంక్షిస్తున్నా’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.   హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉన్న వీర్రాజుకు ఈ లేఖ అందిన వెంటనే ఆయన పవన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదని తెలిసింది. ఈ లేఖ ఉద్దేశమేమిటో తెలుసుకునేందుకు ఆయన పవన్ సహచరులతో మాట్లాడారు. అయితే, ఇటువంటి వ్యవహారాల్లో తమ ప్రమేయం ఉండదని, నేరుగా పవన్‌నే సంప్రదించి విషయం తెలుసుకోవాలని సూచించారు. దీంతో ఆయన ఈ లేఖను ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి ఫ్యాక్స్ చేసి, పొత్తు వ్యవహారాలను చూస్తున్న అరుణ్ జైట్లీకి అందజేయాలని కోరినట్టు తెలిసింది.

ఈ జనసేన దారేటో?

  పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ పార్టీని ప్రకటించి ఇప్పటికి పదిరోజులు అవుతున్నా మళ్ళీ ఇంతవరకు పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు చెప్పట్టలేదు. మూడు రోజుల క్రితం గుజరాత్ వెళ్లి బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీని కలిసి ఆయనకు మద్దతు తెలిపి వచ్చారు. కానీ, పవన్ కళ్యాణ్ తను కేవలం మోడీకి మాత్రమే మద్దతు ఇస్తున్నానని, బీజేపీ, తెదేపాలతో తన పార్టీ పొత్తులు పెట్టుకోబోతున్నట్లు లేదా వాటికి మద్దతు ఇస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని, తాను ఇంకా ఆ విషయంపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని ఒక లేఖ వ్రాసారని తాజా సమాచారం. అదే నిజమయితే, బీజేపీకి, దానితో ఎన్నికల పొత్తులు కుదుర్చుకోబోతున్న తెదేపాలకు మద్దతు ఇవ్వకుండా కేవలం మోడీకి మాత్రమే ఏవిధంగా మద్దతు ఈయడం సాధ్యమో ఆయనే వివరించాల్సి ఉంది.     ఈనెల 27న జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ వైజాగ్ లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు. అందుకోసం ఈరోజు నుండి పవన్ అభిమానులతో బైక్ ర్యాలీలు నిర్వహించి ప్రచారం చేయాలని భావిస్తున్నారు. అయితే ఎన్నికలకి కేవలం నెలన్నర సమయం మాత్రమే మిగిలి ఉన్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ముందుగా పార్టీ నిర్మాణం చేపట్టకుండా ఇటువంటి కార్యక్రమాలపై దృష్టి పెట్టడం చూస్తే, జనసేన పార్టీ అసలు ఎన్నికలలో పోటీ చేస్తుందా లేదా? అనే అనుమానాలు కలగడం సహజం. తను అదికారం కోసమో ముఖ్యమంత్రి పదవి కోసమో పార్టీ స్థాపించలేదని ఆయన చెప్పడం గమనిస్తే, బహుశః ఈ ఎన్నికలలో జనసేన తరపున చాలా కొద్ది మందిని మాత్రమే పోటీలో నిలుపవచ్చు లేదా తెదేపా, బీజేపీలకు మద్దతుగా ప్రచారం చేసినా చేయవచ్చును. అదే జరిగితే ఆ మాత్రం దానికి ఆయన పార్టీని పెట్టి ఇంత శ్రమ తీసుకోవడం వృధా ప్రయాసేనని చెప్పక తప్పదు. బహుశః పవన్ కళ్యాణ్ వైజాగ్ లో నిర్వహించబోయే బహిరంగ సభలో ఈ విషయమై మరింత స్పష్టత రావచ్చును.

వన్ మ్యాన్ ఆర్మీగా కిరణ్ పార్టీ

  సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీ, దానికి కొత్తగా పుట్టుకొచ్చిన మరో కొమ్మ జైసమైక్యాంద్ర పార్టీల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వెళ్ళిపోయిన వారిని లెక్కపెట్టడం కంటే ఇంకా పార్టీలో ఎంతమంది మిగిలున్నారని చూసుకోవడమే తేలికగా ఉందిపుడు. ఇక నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఒకవెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ఆయన పార్టీ పెట్టక ముందే కొంతమంది జారిపోతే, పెట్టాక మిగిలిన వారు కూడా జారిపోతున్నారు. మొన్నటి వరకు ఆయన కనుసన్నలలో నడుచుకొన్న ఏపీ యన్జీవో సంఘాల అధ్యక్షుడు అశోక్ బాబు కూడా సైకిలెక్కి చంద్రబాబుతో ఎన్నికల షికారు చేసేందుకు సిద్దంగా ఉన్నారు. చంద్రబాబు ఒక అడుగు ముందుకేస్తే, తాము రెండడుగులు ముందుకేసి సహకరిస్తామని చెప్పడం గమనిస్తే, ఆయన కూడా తేదేపాకు మద్దతు పలకడం ఇక లాంచనప్రాయమేనని స్పష్టమవుతోంది. ఒకవేళ చంద్రబాబు ఆయనకు కూడా పార్టీ టికెట్ ఇచ్చేందుకు అంగీకరిస్తే, ఆయన నేరుగా తెదేపాలో జేరిపోతారేమో కూడా.   ఇక మాజీ మంత్రి పితాని, సాయి ప్రతాప్, శైలజానాథ్ వంటి వారు కూడా వీలువెంబడి తెదేపాలో దూకేసేందుకు సిద్దంగా ఉన్నారు. నేటికీ కిరణ్ వెంట ఉన్న ఉండవల్లి, హర్ష కుమార్ వంటి మంచి బలమయిన నేతలైనా తమ జైసమైక్యంధ్ర పార్టీ తరపున మాట్లాడక పోవడంతో, జైసపా పరిస్థితి “వన్ మ్యాన్ ఆర్మీ-వన్ మ్యాన్ షో” అన్నట్లు తయారయింది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే పార్టీ బాధ్యత నెత్తికెత్తుకొని పార్టీని ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రజలు స్పందించడం లేదు. ఆయన నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనాలను సమీకరించడం కూడా చాలా కష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన భవిష్యత్తు, ఆయన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారవచ్చును. సరయిన సమయంలో సరయిన నిర్ణయం తీసుకోకపోతే అది ఏవిధంగా ‘రియాక్షన్’ చూపిస్తుందో కిరణ్ కుమార్ రెడ్డిని చూస్తే అర్ధమవుతుంది.

గద్దె దంపతులు గరం గరం?

  విజయవాడ ఎంపీ సీటు.. కనీసం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే సీటు పై కూడా కచ్చితమైన హామీ ఏదీ అధిష్ఠానం నుంచి రాకపోవడంతో గద్దె దంపతులు గరంగరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో సీనియర్ నాయకుడైన గద్దె రామ్మోహన్ భార్య అనూరాధను జడ్పీ చైర్మన్ గా బరిలోకి దించిన విషయం తెలిసిందే. అయితే, రామ్మోహన్ టికెట్ సంగతి మాత్రం ఇంతవరకు తేలలేదు. ఆయనకు విజయవాడ తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ కేటాయింపు విషయం కూడా నిర్ధారణ కాలేదు. ఇదే విషయమై అధినేత చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినా, అపాయింట్ మెంట్ దొరకలేదని సమాచారం. దీంతో పార్టీ జిల్లా వ్యవహారాల పరిశీలకుడు సుజనా చౌదరితో గద్దె దంపతులు భేటీ అయ్యారు. తూర్పు నియోజకవర్గ సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యలమంచిలి రవి టీడీపీలో చేరడంతో తమ సంగతి ఏంటని ఆయనను ప్రశ్నించారు.   అయితే ఆయన్ని బేషరతుగా మాత్రమే పార్టీలో చేర్చుకుంటున్నామని, ఎమ్మెల్యే సీటు హామీ ఏమీ ఇవ్వలేదని, అందువల్ల కంగారుపడాల్సిన పనిచేదని సుజనా చౌదరి చెప్పినట్లు సమాచారం. ఈ నెల 25లోగా తన భర్తకు తూర్పు నియోజకవర్గం సీటు ఇచ్చే విషయం తేల్చకపోతే ఆరోజు జెడ్పీ చైర్మన్ పోటీ నుంచి తప్పుకొంటానని అనూరాధ పార్టీకి అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 25 వరకు ఏదోవిధంగా నాన్చివేత ధోరణి చూపి, ఆ తర్వాత తన భర్తకు మొండిచెయ్యి చూపితే.. తాను ఏమాత్రం సహించబోనని, తొలి నుంచి తన భర్త సీటుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె సుజనాచౌదరి వద్ద తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు పార్టీ నేతలు ఆలోచనలో పడినట్లు తెలిసింది.

శైలజానాథ్ కు జేసీ షాక్!

  కాంగ్రెస్ నుంచి జై సమైక్యాంధ్ర పార్టీకి.. అక్కడి నుంచి తెలుగుదేశంలోకి మారుతున్న మాజీ మంత్రి శైలజానాథ్ కు మరో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి భారీ షాకే ఇచ్చారు! శింగనమల నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేయాలన్న శైలజానాథ్ ఆశలకు ఆదిలోనే జేసీ గండికొట్టారు. శైలజానాథ్‌పై శింగనమలలో ప్రజా వ్యతిరేకత పెల్లుబుకుతోందని.. అది అనంతపురం లోక్‌సభ అభ్యర్థి అయిన తనపై పడుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు జేసీ వివరించారు. శింగనమలలో కాకుండా శైలజానాథ్‌ను మరోప్రాంతంలో బరిలోకి దించితే తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీంతో శైలూను మడకశిర నుంచి బరిలోకి దించాలని టీడీపీ అధినేత యోచిస్తున్నట్లు సమాచారం. మంత్రిగా ఉన్న సమయంలో శైలజానాథ్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్‌గా వ్యవహరించారు. కేంద్రానికి చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే.. రాష్ట్ర విభజనను ఆపేయించే బాధ్యత తనదంటూ అనేక సందర్భాల్లో సవాలు కూడా చేశారు. విభజన ప్రక్రియ కొనసాగడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు. తనకు సన్నిహతుడైన శైలజానాథ్ కు .. పార్టీ ఉపాధ్యక్ష పదవిని కిరణ్ కట్టబెట్టారు. కానీ.. ఆ పార్టీకి రాజకీయ భవిత లేదని గ్రహించిన శైలజానాథ్, నెమ్మదిగా సైకిలెక్కాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల టీడీపీలో చేరే ముహూర్తం కోసం శైలజానాథ్ సంప్రదించగా.. కొన్నాళ్లు ఆగాలని చంద్రబాబు ఆయనకు సూచించడంలో అంతరార్థం జేసీ మోకాలడ్డటమేననే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. శైలజానాథ్‌ను మడకశిర నుంచి బరిలోకి దించితే ఎలా ఉంటుందని టీడీపీ ముఖ్య నేతలను చంద్రబాబు ఆరా తీస్తున్నారు.

సమైక్యాంధ్రలో ‘జంప్ పితాని’

      పార్టీలు మారేవాళ్ళని ఈమధ్యకాలంలో ‘జంప్ జిలాని’ అని ముద్దుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం అన్ని పార్టీల్లోనూ జంప్ జిలానీలున్నారు. అదలా వుంచితే ఇప్పుడు ‘జంప్ పితాని’ కొత్త పదం పుట్టడానికి కారణమయ్యారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. మొన్నటి వరకూ కిరణ్‌కి తోడుగా వుండి, దగ్గరుండి ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ పెట్టించిన పితాని సత్యానారాయణ్ ఇప్పుడు ప్లేటు ఫిరాయించాడు. సమైక్యాంధ్ర పార్టీకి అంత విషయం లేదని గ్రహించేశాడో ఏంటో గానీ, సడన్‌గా ‘జంప్ పితాని’లాగా మారిపోయి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవాలని డిసైడైపోయాడు. అసలే సీమాంధ్రలో ఊహించిన స్థాయిలో జనాదరణ లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్న జై సమైక్యాంధ్ర పార్టీకి మరో షాక్ ఇచ్చాడు. వెళ్ళేవాడు కూడా ఒంటరిగా వెళ్ళకుండా తనతోపాటు మాజీ మంత్రి శైలజానాథ్‌ని కూడా తెలుగుదేశం పార్టీకి తీసుకెళ్తున్నాడు. సమైక్య పోరులో మొదటి నుంచీ కిరణ్ కుమార్‌కి తోడుగా వున్న శైలజానాథ్ కూడా జంప్ జిలానీగా మారడం కిరణ్‌కి మింగుడు పడని విషయం. వీళ్ళతోపాటు ఇప్పటికే పార్టీలో ఉన్న అనేకమంది కీలక నాయకులు తెలుగుదేశం పార్టీకి జై కొట్టబోతున్నట్టు సమాచారం అందుతోంది.

దక్షిణ తెలంగాణలో దమ్ములేదట!

      తెలంగాణని ఉద్ధరించడానికే తాను, తన కుటుంబం ఈ భూమ్మీద అవతరించినట్టు ఫీలయిపోయే కేసీఆర్ అసలు సత్తా ఏంటో ఈసారి ఎన్నికలలో తేలిపోతుంది. ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ కుటుంబం కుక్కిన పేనుల్లా పడి వుండటం తప్ప మరేమీ చేయలేరన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అతి తెలివి కాకపోతే, తెలంగాణ ఇస్తే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని బాహాటంగా ప్రకటించిన కేసీఆర్ తీరా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కళ్ళు గిర్రున తిరిగేలా చేశాడు. విలీనం, పొత్తులు లేవు పొమ్మని డిసైడ్ చేశాడు. అలా డిసైడ్ చేసి తానేదో తెలివైన పని చేశానని, ఇక తెలంగాణ ఓటర్లందరూ తన పార్టీకి ఓట్లు వేసేస్తారని కేసీఆర్ అనుకుంటున్నాడు.   అయితే కేసీఆర్‌కి, ఆయన కుటుంబానికి, ఆయన పార్టీకి తెలంగాణలో అనుకున్నంత దృశ్యం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సీమాంధ్రులు, ముస్లింలు ప్రభావితం చేసే హైదరాబాద్‌లో టీఆర్ఎస్‌కి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. దక్షిణ తెలంగాణలో అయితే కేసీఆర్ పప్పులు ఉడికే అవకాశాలు కనిపించడం లేదు. ఉత్తర తెలంగాణా వాడివి మామీద నీ పెత్తనం ఏంటంట అని దక్షిణ తెలంగాణ నాయకులు విరుచుకుపడుతున్నారు. దక్షిణ తెలంగాణ అస్తిత్వాన్ని ఉత్తర తెలంగాణవాళ్ళ చేతుల్లో పెట్టడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని అంటున్నారు. ఈ విషయాన్ని మరింత సూక్ష్మంగా పరిశీలిస్తే, ఉత్తర తెలంగాణలో తెరాస ప్రభావం దాదాపు శూన్యమేనని చెప్పాలి. ఖమ్మం జిల్లా విషయానికి వస్తే అక్కడ టీఆర్ఎస్ పార్టీని పట్టించుకునేవారే వుండరు.ఇక కేసీఆర్‌కి మిగిలింది ఉత్తర తెలంగాణ. ఆ ప్రాంతంలో ఉన్న సీట్లలో కేసీఆర్ పార్టీకి కొన్ని సీట్లు వస్తే రావొచ్చేమో! ఈ మాత్రం భాగ్యానికి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నట్టు, తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యతలు తామే నిర్వహించబోతున్నట్టు కేసీఆర్ కుటుంబం చెప్పుకోవడం కామెడీగా వుందని  రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎక్కువ తెలివితేటలు ప్రదర్శించకుండా టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్టయితే  కేసీఆర్ పరువు దక్కే అవకాశాలు వుంటేవని చెబుతున్నారు. కేసీఆర్ అతి తెలివితేటలకు మూల్యం ఈ ఎన్నికలలో చెల్లించక తప్పదని అంటున్నారు.

చిరంజీవికి ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ తప్పదా

  ఇటీవల బీజేపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరి ఆ పార్టీ సీమాంధ్ర ప్రచార కమిటీ కన్వీనర్ గా నియమించబడ్డారు. ఇంతవరకు సీమాంద్రాలో కిరణ్, జగన్, చిరంజీవి, చంద్రబాబు తమ తమ పార్టీల తరపున ఏదో ఒక రూపంలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వారి మధ్య ఇప్పటికే జోరుగా మాటల యుద్ధం సాగుతోంది. మంచి వక్త, చక్కటి రాజకీయ పరిజ్ఞానం కలిగిన పురందేశ్వరి కూడా రంగంలో దిగినట్లయితే, ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చవచ్చును. కాంగ్రెస్ తరపున ఒక్క చిరంజీవి మాత్రమే కనిపిస్తుంటే, మిగిలిన పార్టీలలో అనేకమంది మంచి వక్తలు, జనాకర్షణ గల నేతలు ఉన్నారు. ఆయన తప్ప ప్రచారంలో పాల్గొంటున్న మిగిలిన వారందరూ హేమాహేమీలే. మంచి రాజకీయ పరిజ్ఞానం, పరిణతి ఉన్నవారే. చివరికి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన కంటే ఎక్కువగా ప్రజలను ఆకట్టుకోగలరు. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆయన తప్ప ప్రజలను ఆకట్టుకోగల నేతలెవరూ లేకపోవడం ఆ పార్టీకి చాలా ఇబ్బందికరమయిన అంశంగా మారబోతోంది. కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవల చాలా మంది నేతలు తెదేపాలో చేరినందున వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న చిరంజీవినే లక్ష్యంగా చేసుకొని యుద్దం ప్రకటిస్తే, చిరంజీవి తట్టుకొని నిలబడటం చాలా కష్టమవుతుంది. మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డి తనపై చిరంజీవి చేసిన విమర్శలకు బదులిస్తూ తాను గనుక నోరు తెరిచి మాట్లాడటం మొదలుపెడితే చిరంజీవి ఇంట్లోంచి అడుగు కూడా బయటపెట్టలేని పరిస్థతి వస్తుందని చెప్పడం గమనిస్తే, చిరంజీవికి ఇన్ ఫ్రంట్ ఇన్ ఫ్రంట్ దేరీజే క్రోకడైల్ ఫెస్టివల్ ఉందని అర్ధమవుతోంది.

బిజెపి ప్రచార కమిటీ కన్వీనర్‌గా పురందేశ్వరి

      బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్‌గా మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి నియమితులయ్యారు. పురంధేశ్వరిని పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా శనివారం ఉదయం బిజెపి సీమాంధ్ర అధ్యక్షుడు హరిబాబు ప్రకటించారు. ఈనెల 25 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అంగీకరించే పార్టీలతో పొత్తులు ఉంటాయని ఆయన మీడియాతో అన్నారు. కాగా, పురంధేశ్వరి సీమాంద్రలో బిజెపికి ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కూతురిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే బీజేపీ, టీడీపీ పొత్తు ఖాయం అని అంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పురంధేశ్వరిలు ఒకే వేదిక పంచుకోవాల్సి వుంటుంది.

చిరు కామెడీ స్టార్: కిరణ్ సెటైర్

      విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రి చిరంజీవి పైన సెటైర్లు వేశారు. చిరంజీవి తెరపైన మంచి నటుడే కాని రాజకీయాలలో కామెడీ స్టార్ గా మారిపోయారని అన్నారు. చిరంజీవి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్ధం కావడం లేదన్నారు. రాజకీయాలు తెలిసిన వారు విమర్శలు చేస్తే సమాధానం చెప్పవచ్చని వ్యాఖ్యానించారు. చిరంజీవి మాటలను బట్టి రాజకీయ పరిజ్ఝానం ఎంత ఉందో అర్థమవుతోందని ఆయన అన్నారు. విభజనకు తాను కారణమంటే వారి జ్ఝానానికి వదిలేస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా తాను కాంగ్రెసు అధిష్టానం వద్ద ఏనాడూ వ్యవహరించలేదని, తాను విభజనకు వ్యతిరేకమని ముఖ్యమంత్రిని కావడానికి ముందు కూడా చెప్పానని ఆయన అన్నారు.

కాబోయే కేంద్ర మంత్రి పవన్?

      పవన్ కళ్యాణ్ చూడ్డానికి ఆవేశపరుడిలా కనిపిస్తాడుగానీ, లోపల చాలా ఆలోచన వుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాజకీయాల్లో తాను వెళ్ళాల్సిన రూట్‌లో కచ్చితంగా వెళ్తున్నాడని అభినందిస్తున్నారు. రాజకీయాల విషయంలో తన అన్న చిరంజీవిలా అపరిపక్వత, ఆలోచనాలేమిని ప్రదర్శించకుండా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడని కితాబు ఇస్తున్నారు. బీజేపీకి చేరువై భవిష్యత్తులో తన అన్నలాగా కేంద్ర మంత్రి అవ్వాలన్న లక్ష్యానికి పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా చేరువవుతున్నాడని ప్రశంసిస్తున్నారు.   ‘జనసేన’ పార్టీని ప్రకటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగంలోని సారాంశాన్ని పక్కన పెడితే, చివర్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన నినాదం బీజేపీకి చేరువ కావడానికి ఉద్దేశించిందేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రసంగమంతా తెలుగులో చేసిన పవన్, చివర్లో ‘కాంగ్రెస్ హఠావో.. దేశ్ బచావో’ అని హిందీలో నినదించడం వెనుక కూడా వ్యూహం వుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలన్నది బీజేపీ విధానం. ఆ విధానాన్నే బీజేపీ అగ్ర నాయకత్వానికి అర్థమయ్యేలా హిందీలో నినదించడం ద్వారా పవన్ బీజేపీ అధిష్టానంలో మార్కులు సంపాదించేశాడు. పార్టీని ఇలా ప్రకటించాడో లేదో అలా బీజేపీ నాయకుడు, ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నుంచి పవన్ కళ్యాణ్‌కి పిలుపొచ్చింది. గుజరాత్‌కి వెళ్ళి మోడీని కలిసొచ్చిన పవన్ కళ్యాణ్ తన మద్దతు బీజేపీకి వుంటుందని, కాబోయే ప్రధానమంత్రి నరేంద్రమోడీయేనని తేల్చి చెప్పేశాడు. టోటల్‌గా ఈ మేటర్ మొత్తన్నీ పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు నరేంద్రమోడీ, పవన్ కళ్యాణ్ మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఒప్పందం కుదిరిందని భావిస్తున్నారు. ఆంధప్రదేశ్‌లో అంతంతమాత్రంగా వున్న బీజేపీకి పవన్ కళ్యాణ్ తన మద్దతు ఇచ్చి ఎక్కువ సీట్లు వచ్చేలా చేయాలి. దీనికి ప్రతిఫలంగా బీజేపీ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్‌కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేసి కేంద్ర మంత్రి పదవిని అప్పగిస్తుంది. మొత్తానికి పవన్ పెద్ద ప్లానే వేశాడు. తన అన్న చిరంజీవి జనాల్లో వున్న పరువంతా పోగొట్టుకుని, పార్టీ పెట్టి భంగపడి సంపాదించిన కేంద్రమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ చాలా ఈజీగా సంపాదించే మార్గంలో వెళ్తున్నాడని పరిశీలకులు అంటున్నారు.