మెదక్ మెరవాలి: స్మితా సబర్వాల్
posted on Jun 8, 2014 @ 5:41PM
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లాని దేశంలోనే ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని స్మితా సభర్వాల్ అన్నారు. మొన్నటి వరకు మెదక్ కలెక్టర్‌గా పనిచేసిన స్మితా సబర్వాల్ తెలంగాణ సీఎం అదనపు కార్యదర్శి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో స్మితా సబర్వాల్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ, మెదక్ జిల్లాలో కేవలం 8 నెలలే కలెక్టర్‌గా పనిచేసినా, ఈ ప్రాంత ప్రజలిచ్చిన సహకారం తనకు ఎల్లప్పుడు గుర్తుంటుందన్నారు. ఇదే స్ఫూర్తితో నవ తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఎంతో పుణ్యం చేస్తేకాని కలెక్టర్‌గా ప్రజలకు సేవ చేసే అవకాశం రాదని, అంతటి భాగ్యం తనకు లభించినందుకు ఎప్పుడూ గర్వంగా ఉంటుందన్నారు. కలెక్టర్‌గా ఉన్న వ్యక్తి బాధ్యతతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరిగి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ సేవలందినప్పుడే బంగారు తెలంగాణ కల సాకారమవుతుందన్నారు. అందుకు ప్రభుత్వ ఉద్యోగులంతా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల నిర్వహణలో, ప్రజాభివృద్ధి కార్యక్రమాల అమలులోనూ జిల్లా యంత్రాంగం అందించిన సహకారానికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.