ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రులు ప్రమాణస్వీకారం
posted on Jun 8, 2014 @ 8:03PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావు చంద్రబాబు నాయుడి చేత ప్రమాణ స్వీకారం చేయించాల్సిందిగా గవర్నర్‌ని కోరారు. అప్పుడు నరసింహన్ చంద్రబాబు నాయుడి చేత ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం కచ్చితంగా 7 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. పదవీ ప్రమాణ స్వీకారంతోపాటు, ప్రభుత్వానికి సంబంధించిన రహస్యాల పరిరక్షణ ప్రమాణం కూడా చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానంతరం గవర్నర్ చంద్రబాబుకు కరచాలనం చేసి చంద్రబాబుకు పుష్పగుచ్ఛాన్ని అందించారు. ఆ తరువాత గవర్నర్ చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రుల చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. కె.ఇ.కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, డాక్టర్ పి.నారాయణ, పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, పీతల సుజాత, కింజరాపు అచ్చెన్నాయుడు, శిద్ధా రాఘవరావు, కిమిడి మృణాళిని, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు, పైడికొండల మాణిక్యాలరావు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయిన తర్వాత జాతీయ గీతాన్ని ఆలాపించారు.