ప్రజలకు, కార్యకర్తలకు ఈ విజయం అంకితం: చంద్రబాబు
posted on Jun 8, 2014 @ 8:55PM
తన ప్రమాణ స్వీకారోత్సవ సభకు వచ్చిన ప్రముఖులు ప్రతి ఒక్కరికీ చంద్రబాబు నాయుడు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. వారితో తనకున్న అనుబంధాన్ని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వారు అందించిన సహకారాన్ని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఈ సందర్భంగా చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌కి సొంత పార్టీ వున్నప్పటికీ, తనవల్ల ఓట్లు చీలకూడదని, రాష్ట్రంలో తాను, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావాలని ఏమీ ఆశించకుండా సహకరించారని చెప్పారు. బాలకృష్ణకూ చంద్రబాబు థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘వీరందరినీ చూస్తుంటే కొండంత ధైర్యం, ఎక్కడా లేని శక్తి నాకు వచ్చింది. ఈ ప్రమాణ స్వీకారం మీద కొంతమంది విమర్శలు చేశారు. కానీ ఈ ప్రమాణ స్వీకారం ఈరకంగా చేసింది ఆంధ్రప్రదేశ్‌కి ధైర్యం ఇవ్వడానికి, భరోసా ఇవ్వడానికి! నాకు అండగా నిలిచిన ఈ పెద్దలందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అగమ్యగోచరమైన స్థితిలో వుంది. ఎన్నో సమస్యలు వున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలుగువారికి ఈ పరిస్థితి తెచ్చింది. మనం కసిగా పనిచేద్దాం. ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఆ శక్తి తెలుగుజాతికి వుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, కేంద్రంలో మోడీ అధికారంలోకి రావాలని అందరూ కోరుకున్నారు. ఈ విజయం తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నాను. తెలుగుదేశం కార్యకర్తల మేలు మరచిపోలేను. ఈ విజయం కార్యకర్తలకూ అంకితం చేస్తున్నాను. హైదరాబాద్‌లో ప్రమాణ స్వీకారం చేయనని నేను ముందే చెప్పాను. అలాగే చేశాను. మొదటి కేబినెట్ విశాఖలో పెట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్నీ అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకున్నాను. మళ్ళీ రాజధాని కట్టే వరకూ నంబర్‌వన్ కూలీగా పనిచేస్తాను. నన్ను ఆశీర్వదించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నారు. మనకు ఇప్పుడు ఎన్నో ఇబ్బందుల్లో వున్నాం. ఎంత అప్పుంది. ఆదాయం వుంది.. జీతాలు ఎంత ఇస్తామనేది కూడా నాకు తెలియదు. వెంకయ్య నాయుడి వల్లే పోలవరం వచ్చింది. మనం కష్టపడదాం. శ్రమిద్దాం. మనకి కేంద్రం అండగా వుంటుంది. మోడీ మనతోనే వుంటారు. మనకి సహకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం మనకి న్యాయం చేస్తుందన్న నమ్మకం వుంది. ఈ సందర్భంగా యుగపురుషుడు, తెలుగు జాతి వున్నంతవరకు మరచిపోలేని మహానాయకుడు ఎన్టీఆర్ని ఈ సందర్భంగా తలచుకుంటున్నాను. దేశాభివృద్ధికి తెలుగువారు ఎంతో కృషి చేశారు.