పంజాబ్ లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి
posted on Jan 2, 2016 7:01AM
పంజాబ్ లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఈరోజు తెల్లవారుజామున సుమారు 3.00-3.30 గంటలకు నలుగురు ఉగ్రవాదులు దాడి చేసారు. సైనిక దుస్తులు ధరించి, సైనిక వాహనాలలో వచ్చిన ఆ నలుగురు బయట కాపలా ఉన్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరుపుతూ లోపలకి ప్రవేశించేందుకు విఫలయత్నం చేసారు. కానీ భద్రతా బలగాలు చాలా అప్రమత్తంగా ఉన్నందున వారి దాడిని సమర్ధంగా తిప్పికొట్టాయి. భద్రతదళాల కాల్పులలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఇద్దరు ఇంకా కాల్పులు జరుపుతున్నారు. వారిని భద్రతాదళాలు చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నాయి. ఈ దాడి గురించి తెలియగానే సరిహద్దు భద్రతా దళాల డి.ఐ.జి. కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్ హెలికాఫ్టర్లలో అదనపు భద్రతాబలగాలను పఠాన్ కోట్ పంపించారు.
సరిహద్దు ప్రాంతంలో గల ఈ ఎయిర్ బేస్ భారత్ కి చాలా కీలకమయిన రక్షణ స్థావరం. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు మధ్యలో ఉంది. ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడి కాబూల్ నుంచి ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసివచ్చిన తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ మెరుగుపడుతున్న సమయంలో ఇటువంటి సంఘటన జరగడం చాలా ఆందోళనకరంగా ఉంది. ఈనెల 15వ తేదీన ఇస్లామాబాద్ లో భారత్-పాక్ విదేశాంగ శాఖ ప్రధాన కార్యదర్శుల సమావేశం జరుగబోతోంది.