మంత్రిగారు ఎమ్మెల్యేతో హైదరాబాద్ లో డిష్యూం డిష్యూం!
posted on Dec 31, 2015 @ 8:20PM
ఇవ్వాళ్ళ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ దీప్తిశ్రీనగర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో తెలంగాణా రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి, తెరాస ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు గొడవ పడటంతో ఆ కార్యక్రమం రసాభాసగా మారింది. శేరిలింగంపల్లి నియోజక వర్గం అభివృద్ధి విషయంలో మంత్రిని ఎమ్మెల్యే గాంధీ ప్రశ్నించడంతో ఆయన చాలా పరుషంగా జవాబు ఇచ్చారు. ప్రజలందరూ చూస్తుండగానే వారిరువురు తీవ్రంగా వాదించుకొన్నారు. ఇరువురూ ఆవేశంతో ఊగిపోతూ ఒకరినొకరు తోసుకొన్నారు. వారికి వారి అనుచరులు కూడా తోడవడంతో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. గాంధీ వైఖరిని నిరసిస్తూ మంత్రి ఆయన అనుచరులు రోడ్డు కూర్చొని నిరసన తెలపడంతో, గాంధీ ఆయన అనుచరులు కూడా రోడ్డు మీద బైటాయించి నిరసనకు తెలిపారు. చివరికి పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించేసారు.