సాయిరాజ్ అరెస్టుకు నిరసనగా బంద్ పాటిస్తున్న వ్యాపార సంస్థలు
posted on Aug 13, 2012 @ 9:32AM
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పిరియా సాయి రాజ్‌ను ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. సోంపేటలో ఆయన ఇంటి వద్ద ఆయనను అరెస్టు చేశారు. 2010 ఏప్రిల్ నెలలో జరిగిన థర్మల్ వ్యతిరేక ఆందోళనలో పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. ఆ సమయంలో అతను థర్మల్ పవర్ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ వేసిన టెంట్‌ను ఎమ్మెల్యే కూల్చారు. దీనిపై పోలీసులు అప్పుడు కేసు నమోదు చేశారు. ఆదివారం 12.08.12 న సాయిరాజ్ ను అరెస్టు చేసి బారువ పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి సాయిరాజ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయి రాజ్ అరెస్టుకు నిరసనగా స్వచ్చందంగా వ్యాపార సంస్థలు శ్రీకాకుళంలో బంద్ పాటిస్తున్నాయి.