ప్రభుత్వాలు మారితే ప్రజలు బలికావలసిందేనా?
posted on Jun 30, 2014 @ 9:31PM
ఇంతవరకు ప్రభుత్వాలు మారినప్పుడు కేవలం కొందరు ఉన్నతాధికారులు మాత్రమే అటు, ఇటూ బదిలీలు అయ్యేవారు. కానీ ఇప్పుడు ప్రజలు కూడా ఊహించని సమస్యలు ఎదుర్కోవలసి రావడం చాలా శోచనీయం. తెరాస ప్రభుత్వం గురుకుల ట్రస్ట్, అయ్యప్ప సొసైటీ భూములలో అక్రమంగా వెలిసిన కొన్ని భవనాలు మాత్రమే కూల్చివేసి, అవే భూములలో రాజకీయ అందదండలున్న పెద్దల భవనాల జోలికి మాత్రం వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. బహుశః ఆ కారణంగానేనేమో, మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ వక్ఫ్ భూములలో ఉన్న లగడపాటి రాజగోపాల్ కు చెందిన ల్యాంకోను సైతం విడిచిపెట్టమని చెప్పారు. అదేవిధంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన యన్.కన్వెన్షన్ కోసం ప్రభుత్వానికి చెందిన 5.55ఎకరాల ప్రభుత్వభూమిని కబ్జా చేసారంటూ జీ. హెచ్.యం.సి. అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ఈ మొత్తం భూముల బదిలీ వ్యవహారాలు గమనించినట్లయితే, వీటన్నిటి వెనుక ప్రభుత్వపాత్ర కూడా ఉందని స్పష్టమవుతోంది. అందుకే ఆ ప్రభుత్వాలను నడిపే రాజకీయ నాయకుల చుట్టూ సినీ పరిశ్రమ మరియు ఇతర సంస్థల ప్రతినిధులు తిరుగుతుండటం మనకి కనిపిస్తుంటుంది. ప్రభుత్వ భూములకు, ఆస్తులకు కేవలం ధర్మకర్తగా వ్యవహరించవలసిన ప్రభుత్వాలు, ఈ విధంగా వ్యక్తులతో, సంస్థలతో లులూచీ పడుతూ వేల కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూములను అప్పనంగా ధారాదత్తం చేసేసాయి. తద్వారా రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం కలగకపోయినా దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకోన్నట్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ ప్రభుత్వాలకు భూములు అవసరం పడినప్పుడు, ఎక్కడా ఒక్క ఎకరం కనబడకుండా పోతోంది.
తెరాస ప్రభుత్వం అటువంటి భూములను గుర్తించి వెనక్కు తీసుకొనే ప్రక్రియ మొదలుపెట్టింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా పని మొదలుపెట్టవలసి ఉంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ముందుగా బలయిపోతున్నది మధ్యతరగతి ప్రజలే. ఉన్నత స్థాయిలో జరుగుతున్న ఈ అక్రమ భూముల వ్యవహారాల గురించి తెలియక, వారు తమ జీవితకాల కష్టార్జితాన్ని వెచ్చించి వాటిలో నిర్మించిన ఇళ్ళు, ఫ్లాట్లను కొనుకొంటే, వారి నుండి ఇంతకాలం ఇంటి పన్నులు, నీటి పన్నులు, కరెంటు బిల్లులు వసూలుచేసుకొన్న జీ. హెచ్.యం.సి. అధికారులు, ఇప్పుడు ప్రభుత్వాలు మారగానే వాటిని అక్రమ కట్టడాలని పేర్కొంటూ నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం చూస్తుంటే మన వ్యవస్థలో ఎంత లోపం ఉందో స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. ప్రభుత్వాలు, రాజకీయనేతలు చేసిన తప్పిదాలను పట్టించుకోకుండా ఇంతకాలం కళ్ళు మూసుకొని కూర్చొన్న అధికారులు ఇప్పుడు అకస్మాత్తుగా మధ్యతరగతి వాసులపై ఈవిధంగా కొరడా జులిపించడం చాలా అన్యాయం. ఒక ప్రభుత్వానికి ఒప్పయినది ఇంకో ప్రభుత్వానికి తప్పయితే కావచ్చు గాక, కానీ అందుకు మధ్యతరగతి ప్రజలను నడిరోడ్డున పడేయడం మాత్రం హర్షణీయం కాదు. ఈ అక్రమాలకు బాధ్యులయిన వారిని కటినంగా శిక్షించి వారి నుండే ముక్కుపిండి డబ్బు వసూలు చేసి రోడ్డున పడిన మధ్యతరగతి ప్రజలను ప్రభుత్వాలు ఆధుకోగాలిగితే అందరూ హర్షిస్తారు.