కత్తి మీద సాములా మారిన వ్యవసాయ రుణాలు
posted on Jun 28, 2014 @ 10:48AM
వ్యవసాయ రుణాల మాఫీ వ్యవహారం తెరాస, తెదేపా ప్రభుత్వాలకు పెద్ద అగ్నిపరీక్షగా మారాయి. ఈ సమస్యను తెలంగాణా ప్రభుత్వం ఏవిధంగా పరిష్కరించాలని ప్రయత్నిస్తోందో ఇంకా స్పష్టం కాలేదు. కానీ ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తోనే ఉంది. ఒకసారి ఏ ప్రభుత్వానికయినా ఇటువంటి సహాయం అందిస్తే, దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా సహాయం కోసం తమపై ఒత్తిడి తెస్తాయనే భయం ఉంది. అంతే కాక ఇదొక ఆనవాయితీగా మారితే దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కూడా ఉంది. అందుకే వాటి నుండి ఇంతవరకు సానుకూల స్పందన రాలేదు.
రుణాల మాఫీకోసం నియమించబడిన కోటయ్య కమిటీ కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ను కలిసి రైతుల పరిస్థితి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వివరించిన తరువాత ఆయన రుణాలను రీ షెడ్యుల్ చేసేందుకు సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వచ్చాయి. కానీ బ్యాంకర్లు మాత్రం అటువంటి ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. వేల కోట్ల రుణాలను రీ షెడ్యూల్ చేసినప్పటికీ మళ్ళీ వెంటనే కొత్త రుణాలు మంజూరు చేయవలసి రావడమే అందుకు కారణం. పోనీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా బాగుంటే, బ్యాంకర్లు కూడా అందుకు వెనకాడేవారు కాదు. కానీ ప్రస్తుతం ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేమని చెపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భరోసాతో బ్యాంకర్లు రుణాలు రీషెడ్యూల్ మరియు కొత్త రుణాల మంజూరు చేసే సాహసం చేయలేకపోతున్నారు.
ఈ రుణాలలో అత్యధిక శాతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కనుక, ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాల రీషెడ్యూల్ మరియు కొత్త రుణాల మంజూరు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేఖిస్తోంది. ఆ బ్యాంక్ చైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాలలో రుణమాఫీ వ్యవహారం పెద్ద సమస్యగా మారిందని అన్నారు. ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలలోనే కాక యావత్ దేశంలో కూడా వర్షాభావ పరిస్థితి ఏర్పడినందున వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయక తప్పకపోవచ్చునని ఆమె అన్నారు. కానీ త్వరలో వర్షాలు కురిసినట్లయితే ఈ సంకట స్థితి నుండి బయటపడవచ్చని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు. అంటే ఒకవేళ దేశవ్యాప్తంగా రుణాలు రీ షెడ్యూల్ చేసేందుకు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ పూనుకొన్నట్లయితేనే ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు ఈ సమస్య నుండి బయటపడగలవని లేకుంటే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకోక తప్పదని అర్ధమవుతోంది.
చంద్రబాబు జూన్ 8న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు, ఈ సమస్యకు ఒక పరిష్కారం సూచించేందుకు 45రోజుల కాలపరిమితితో కోటయ్య కమిటీని నియమించారు. ఇప్పటికి 20రోజుల పుణ్యకాలం గడిచిపోయింది. కానీ కోటయ్య కమిటీ ఇంతవరకు ఎటువంటి పరిష్కారం సూచించలేకపోయింది. రాష్ట్రంలో ఈ సారి ఇంకా వర్షాలు మొదలవలేదు. మొదలయి ఉండి ఉంటే, కొత్త రుణాల కోసం చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెరిగిపోవచ్చును. రుణాల మాఫీతో బాటు కొత్త రుణాలు కూడా వెంటనే మంజూరు చేయవలసి రావడం చంద్రబాబుకి కత్తి మీద సాములా తయారయింది. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు ఏవిధంగా పరిష్కరిస్తారో వేచి చూడాలి.