ఆనాటి మాటలు నీటి మీద వ్రాతలేనా?
posted on Jul 2, 2014 @ 4:58PM
ఊహించినట్లే ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై గొడవలు మొదలయ్యాయి. భౌగోళికంగా తెలంగాణా ఎగువనుంది కనుక నీటి విడుదల తన కనుసన్నలలో జరగాలని భావిస్తోంది. ఆ ధోరణి దిగువనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఆందోళన కలిగిస్తోంది. నీటి కోసం తెలంగాణా ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడవలసి రావడమే కాక, ప్రతీసారి నీటి విడుదలకు కేంద్రంతో మోర పెట్టుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
పదిరోజుల క్రితం నాగార్జున సాగర్ నుండి నీటి విడుదలకి తెలంగాణా ప్రభుత్వం నిరాకరించడంతో కేంద్ర జలసంఘమే స్వయంగా కలుగజేసుకొని, రోజుకు 6000 క్యూసెక్కుల చొప్పున వారం రోజుల పాటు నీళ్ళు విడుదల చేయామని ఆదేశించావలసి వచ్చింది. అప్పుడు మాత్రమే తెలంగాణా ప్రభుత్వం అయిష్టంగా నీటిని విడుదల చేసింది. కానీ ఆ నీరు నేటికీ దిగువనున్న కృష్ణా జిల్లాకు చేరకపోవడంతో, మరొక వారం రోజులపాటు ఇదే స్థాయిలో నీళ్ళు విడుదల చేయవలసిందిగా జలసంఘం తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. మొదటిసారే నీటి విడుదలకు తీవ్ర అభ్యంతరం చెప్పిన తెలంగాణా ప్రభుత్వం, మళ్ళీ మరో మారు నీటిని విడుదల చేయమన్నపుడు సహజంగానే తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసింది. మంత్రి హరీష్ రావు దీనిపై జలసంఘానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జల బోర్డులో నిర్ణయం తీసుకోకుండా నీటిని విడుదల చేయరాదని, బోర్డు సమావేశం నిర్వహించాలని ఆయన కోరుతున్నారు.
తెలంగాణా మంత్రిగా ఆయన తన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలనుకోవడంలో తప్పు లేదు. కానీ, తెలంగాణకు ఎగువనున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కూడా ఇదే నీతిని పాటించినట్లయితే అప్పుడు తెలంగాణా పరిస్థితి ఏమిటి? అని ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పటికే మహారాష్ట్రలో బాబ్లీ డ్యాం, కర్ణాటకలో ఆల్మట్టి డ్యాంలు నిర్మింపబడి ఉన్నాయి. ఆ రెండు ప్రభుత్వాలు కూడా క్రిందకు నీటిని విడుదల చేయకుండా మొత్తం నీళ్ళు తామే వాడుకోవాలని భావిస్తే తెలంగాణా పరిస్థితి ఏమిటి?
రాష్ట్ర విభజన జరిగితే నీటి తగవులు వస్తాయని పదేపదే ఆంద్ర ప్రాంత నేతలు వాదించినప్పుడు, శత్రు దేశాలయినా చైనా, పాకిస్తాన్ దేశాలతోనే మనం నదీ జలాలను పంచుకోగాలేనిదీ, రాష్ట్రం రెండుగా విడిపోతే నీటిని పంచుకోలేమా? అని కేసీఆర్, హరీష్ రావు తదితరులు ఎదురు ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడు నీటి విడుదలకు అభ్యంతరం చెపుతున్నారు. మరి ఆనాడు వారు నీటి పంపకాలపై చెప్పిన మాటలన్నీ అబద్దాలే అనుకోవాలా?
తెరాస నేతలకు ఆంద్ర ప్రజలపై, ప్రభుత్వంపై విద్వేషం ఉంటే ఉండొచ్చు గాక. కానీ ఇప్పుడు అధికారం చేప్పట్టిన తరువాత కూడా అదే విద్వేషాన్ని కొనసాగించడం హర్షణీయం కాదు. రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలే ఉన్నారు. కానీ భౌగోళికంగా విడిపోయారు. ఒకే జాతి ప్రజల మధ్యే సరయిన సఖ్యత, అవగాహన లేకపోతే ఇక ఇరుగు పొరుగు రాష్ట్రాలు మనతో సఖ్యత ఎందుకు పాటిస్తాయి?
ప్రపంచంలో ఏ దేశమూ, దేశంలో ఏ రాష్ట్రమూ కూడా ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరిగా మనుగడ సాధించలేదనే విషయం తెలంగాణా ప్రభుత్వం గుర్తుంచుకొని పరస్పర సహకార ధోరణి అలవరచుకొంటే అందరూ హర్షిస్తారు. అలా కాకుండా ఇదేవిధంగా నిత్యం ఇరుగుపొరుగు రాష్ట్రాలతో కయ్యాలకు దిగినట్లయితే చివరికి తనే అభాసుపాలయ్యే ప్రమాదం ఉంది.